all

Friday, July 12, 2013

పాపకి పాలపళ్లున్నప్పుడు బాగానే ఉండేవి కానీ...

 
     
డెంటల్
మా పాపకు తొమ్మిదేళ్లు. పాలపళ్లున్నప్పుడు పళ్లెంతో చక్కగా ఉండేవి. ఇప్పుడు పళ్లు చాలా పెద్దవిగా వస్తున్నాయి. ముందుపళ్ల మధ్య సందు కూడా ఉంది. పాపకి ఎందుకిలా వచ్చింది? డెంటిస్ట్‌ని ఎప్పుడు కలవాలి, ఎటువంటి చికిత్స చేయించాలి... సలహా ఇవ్వండి. - జి.బసవరాజు, గంగవరం

పాలపళ్లు ఊడిపోయి, శాశ్వత దంతాలన్నీ రావడానికి సుమారు ఆరేడేళ్ల సమయం పడుతుంది. మొదటి పాలపన్ను ఊడిపోవడం, మొదటి శాశ్వత దంతం రావడమన్నది ఆరేళ్లు దాటిన తర్వాత మొదలవుతుంది. ఈ ప్రక్రియ పూర్తయేసరికి పిల్లలకి పదమూడేళ్లొస్తాయి. ఈ సమయంలో పళ్లు, దవడలు, వాటి ఎదుగుదల ఎన్నో ఒత్తిళ్లమధ్య జరుగుతుంది. ఎటువంటి దంతసమస్యలు రావడానికైనా, అలాగే అందమైన చిరునవ్వు ఏర్పడడానికైనా బీజాలు పడేది ఈ వయసులోనే. అందుకే ఇది అత్యంత సంక్లిష్టసమయం. తల్లిదండ్రులకు ఎన్నో రకాల అనుమానాలు, భయాలు వచ్చేది ఈ వయసులోనే. అందుకే మూడు సంవత్సరాలు దాటిన తర్వాత పిల్లలని క్రమం తప్పకుండా ఆరునెలలకొకసారి దంతవైద్యులకు చూపిస్తుండాలి.

డెంటిస్ట్ కొన్ని ఎక్స్‌రేల సాయంతో దవడ ఎముక ఎదుగుదలని, వాటిలో పళ్లు తయారవుతున్న విధానాన్ని, పళ్లు మొలిచే పద్థతులను నిశితంగా పరిశీలించి. ఏదైనా తేడా గమనించిన వెంటనే చిన్న చిన్న చికిత్సలతోనే సమస్యలు పరిష్కరించడం సాధ్యమవుతుంది. చాలాసందర్భాల్లో చికిత్స అవసరం లేకుండానే సర్దుకుపోయే సమస్యలూ ఉంటాయి. అలాంటిదే మీ పాప సమస్య కూడా. కోరపళ్లు మొలిచేటప్పుడు ముందుపళ్లపైన ఉన్న ఒత్తిడి వల్ల అవి ఎడంగా రావడంతోబాటు సందులు వచ్చినట్లు కనిపిస్తాయి. సాధారణంగా పన్నెండేళ్లు దాటిన తర్వాత అంటే కోరపళ్లు రావడం పూర్తయిన తర్వాత సందులు వాటంతట అవే మూసుకుపోతాయి. అదేవిధంగా పిల్లల్లో శాశ్వతదంతాలు వచ్చినప్పుడు వారి ముఖపరిమాణంతో పోల్చుకున్నప్పుడు పళ్లు పెద్దవిగా అనిపిస్తాయి. అదిచూసి తల్లిదండ్రులు ఆందోళన చెందుతుంటారు. అదే పిల్లలకు 20 ఏళ్లు వచ్చిన తర్వాత వారి ముఖపరిమాణం, శరీరాకృతితో పోల్చుకుంటే సరిపోయినట్లుగా అనిపిస్తాయి.

నా వయసు 60. నోట్లో చాలా పళ్లు వదులుగా ఉంటే ఈమధ్యనే పళ్లన్నీ తీయించేశాను. పళ్ల సెట్టు చేయించుకుందామనుకుంటున్నాను. ఫిక్స్‌డ్ దంతాలు అమర్చడం సాధ్యమా?- జి.శకుంతల, హైదరాబాద్

అసలు పళ్లే లేనివారికి కూడా రోజూ తీసిపెట్టుకునే పళ్లసెట్టు కాకుండా, ఫిక్స్‌డ్ దంతాలనమర్చే అవకాశం ఆధునిక దంతవైద్యంలో ఉంది. ఇంప్లాంట్స్ అనబడే చిన్నపాటి స్క్రూలను దవడలో బిగించి, వాటి సపోర్ట్‌తో కృత్రిమ దంతాలను అమర్చుతారు. ఏ వయసువారికైనా ఎంతో సులభంగా ఒకటి రెండు పళ్లు బిగించాలన్నా లేదా నోట్లో అన్ని పళ్లూ బిగించాలన్నా కూడా వాటితో సాధ్యమవుతుంది. రెగ్యులర్‌గా డెంటిస్ట్‌ను కలుస్తూ, బిగించిన కృత్రిమ దంతాలు ఎలా ఉన్నాయో కనీసం సంవత్సరానికి ఒకసారి చెకప్ చేసుకుంటుండాలి. వీటితో మామూలుగా అన్ని పదార్థాలనూ కొరకొచ్చు. నమిలి తినొచ్చు.
  

No comments: