all

Sunday, January 13, 2013

కాళ్లు కడగకుండా ఇంట్లోకి ఎందుకు రాకూడదు?----ఔనా ?

 
 
ఎందుకు 

ఇది చాదస్తం, మూఢాచారం కాదు, ఆరోగ్యసూచన. ఇప్పుడైతే పాదాలను పూర్తిగా కవర్ చేసే బూట్లు వాడుతున్నాం కానీ పూర్వం పాదరక్షలు ఇంత పకడ్బందీగా ఉండేవి కాదు. చాలామంది అసలు పాదరక్షలు వాడేవారు కాదు కూడ. అలాంటప్పుడు బయట నడిచినప్పుడు పాదాలకు దుమ్ము అంటుతుంది. ఆ దుమ్మును బయట వదిలించుకుని ఇంట్లోకి శుభ్రంగా రమ్మని చెప్పడమే ఈ నియమం ఉద్దేశం. అలాగే కొంతమంది కాళ్లు కడుక్కోవడం సంగతి దేవుడెరుగు, బయటకు వాడిన చెప్పులతో ఇల్లంతా తిరుగుతుంటారు. పిల్లలకు చిన్నప్పుడే చెప్పులు బయట లేదా ఇంట్లో ఒక మూల వదలడం, ఇంటికి వచ్చిన వెంటనే కాళ్లు కడుక్కోవడం ఒక నియమంగా నేర్పిస్తే పెద్దయ్యాక ఆ అలవాటు కొనసాగుతుంది. 

ఏమిటి
చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు...
ప్రమాదం జరిగిన తర్వాత నివారణ చర్యలు తీసుకున్నారని చెప్పే సందర్భం ఇది. ఇప్పుడైతే వంట చేసేటప్పుడు స్టవ్ మీద నుంచి పాత్రలను దింపడానికి హోల్డర్స్, టాంగ్స్ వంటి పరికరాలు వాడుతున్నారు. ఒక యాభై అరవై ఏళ్ల క్రితం వేడి పాత్రలను పట్టుకోవడానికి పాత వస్త్రాన్ని వాడేవారు. అంతకంటే ముందు ఆకులను వాడేవారట. బాదం ఆకులు, లేకపోతే ఇంటి పెరట్లో ఉన్న ఏదో ఒక చెట్టు ఆకులను వాడేవారు. సన్నటి ఆకులైతే రెమ్మలతో సహా విరిచి వాడేవారు. పాత్రల వేడికి చేతులు కాలకుండా కాలానుగుణంగా అందుబాటులో ఉన్న వస్తువులతో తీసుకునే రక్షణ చర్యలు ఇవన్నీ. 

అయితే... వేడి పాత్రను పట్టుకుంటున్నాం... కాలకుండా జాగ్రత్త తీసుకోవాలి అన్న స్పృహ లేకుండా పట్టుకుని, కెవ్వుమని, కాలిన చేతులను చూసుకుని... అప్పుడు ఆకుల కోసం వెతుక్కునే హైరానా మనుషులకు బుద్ధి చెప్తూ ‘చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం లాభం’ అన్నారు పెద్దవాళ్లు. అది క్రమంగా నానుడిగా మారిపోయింది. ఇప్పుడు ఈ మాట ప్రభుత్వాల అసమర్థతను ఎత్తి చూపించడానికి, చేయాల్సిన పనులను ఆలస్యంగా చేసిన సందర్భాల్లో ఎక్కువగా వినిపిస్తోంది. ఉదాహరణకు తుఫాను హెచ్చరికకు వెంటనే స్పందించి నష్టనివారణ పనులు చేయకుండా, వరదలు ముంచెత్తిన తర్వాత దాని గురించి ఆలోచించడం వంటి సందర్భాలన్నమాట. 


ఎలా
మణికట్టు, అరచేతి నొప్పి తగ్గాలంటే...
కంప్యూటర్‌పై అదేపనిగా పనిచేయడం వల్ల మీడియన్ నర్వ్ అనే నరం మణికట్టు వద్ద ఒత్తిడికి లోనై కొందరిలో అరచేతి వేళ్లలో నొప్పి వస్తుంది. ఆ నొప్పిని కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ అంటారు. ఇది కాస్త ఎక్కువే విసిగిస్తుంది కానీ, కాస్త జాగ్రత్తగా ప్రయత్నిస్తే దీన్నుంచి విముక్తి పొందవచ్చు. అందుకు ఏం చేయాలంటే...
నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటే 
చన్నీళ్లతో గాని, ఐస్‌తో గాని కాపడం పెట్టాలి. 
చన్నీళ్ల కాపడం తర్వాత వేణ్ణీళ్ల కాపడం కూడా పెట్టవచ్చు. అప్పుడు నొప్పి తీవ్రత మరింత తగ్గుతుంది. 
ఆ తర్వాత స్క్రేప్ బ్యాండ్‌తో మణికట్టు కదలకుండా కట్టు వేసి ఉంచుకోవాలి. దీనికోసం మార్కెట్‌లో దొరికే రిస్ట్ సపోర్టర్ కూడా వాడవచ్చు. 
కంప్యూటర్‌పై అదేపనిగా పని చేయడం వల్లనే ఇది వస్తుంది కాబట్టి నొప్పి తగ్గేవరకు మణికట్టుకు విశ్రాంతి ఇవ్వాలి. పై చర్యల తర్వాత కూడా నొప్పి తగ్గకపోతే ఫిజియోథెరపిస్ట్‌ను సంప్రదించాలి. 

ఎలా చేద్దాం
హోమ్ టిప్ 
బంగాళాదుంప, చిలగడ దుంపలకు మొలకలు వస్తే, వాటిని ముక్కలుగా కోసి కుండీలలో, జార్‌లలో నీళ్ళు పోసి పెంచొచ్చు. ఇండోర్ ప్లాంట్‌గా ఇంటి అందాన్ని పెంచుతాయి. 

హెల్త్ టిప్
జలుబుతో ముక్కు, ఛాతి పట్టేసినట్లుంటే... రెండు కప్పుల నీటిలో తొక్క తీసి సన్నగా తురిమిన అల్లం వేసి పది నిమిషాల సేపు నాననివ్వాలి. అల్లం సారం నీటిలోకి ఊరిన తర్వాత వడపోసి అందులో కొద్దిగా మిరియాల పొడి కలిపి తాగాలి. వేడిగా లేదా వెంటనే తాగాలనిపిస్తే నీటిలో అల్లం వేసి ఒక నిమిషం పాటు వేడి చేయవచ్చు. 

బ్యూటీ టిప్
జుట్టు పెరగాలంటే రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని కొబ్బరి నూనెతో మర్దనచేసి ఉదయం తలస్నానం చేయాలి.

No comments: