‘ఏ మాయ చేసావె’లో జెస్సీలా...
సమంత ఒక మామూలు అమ్మాయి!
ఇప్పుడు స్టార్‌డమ్ వచ్చింది.
అయినా మామూలు అమ్మాయే!
లైఫ్ అంటుంది...
అప్స్ అండ్ డౌన్స్ అంటుంది...
ఏదీ శాశ్వతం కాదంటుంది...
ఏంటీ పిల్ల?
బుగ్గపై చిన్న పింపుల్ వస్తేనే...
జీవితం తలకిందులైనట్లు ఒకప్పుడు
బాధపడిన సమంతలో... సడెన్‌గా...
విశ్వమంత పరిణతి ఎక్కడది?
ఏ దేశపు ఫిలాసఫర్‌ది?
చెరగని ఆ చిరునవ్వు ఏ రంగు పువ్వుది?
ఫీచర్స్ ఎడిటర్ ఇందిర పరిమితో సమంత ‘అదర్‌సైడ్’లో!
ఇందిర: మీ ఫ్యామిలీ - చిన్నతనం గురించి..సమంత: నాన్న తెలుగువారు, అమ్మ మలయాళీ... నేను పుట్టి పెరిగింది మాత్రం చెన్నైలో! నాన్నవాళ్ల ఫ్యామిలీస్ తరాలుగా చెన్నైలో సెటిలవడంతో ఆయనకు తెలుగు రాదు. నేను కూడా ఫస్ట్ టైం ఆంధ్రాలోకి అడుగుపెట్టింది .. ఒక సినిమా ఆడిషన్ కోసం! నేను ఇప్పుడు కాస్తంత తెలుగు మాట్లాడుతున్నానంటే అది నా స్టాఫ్ వల్లే!
ఇందిర: స్టూడెంట్ డేస్ గురించి...సమంత: చదువంతా చెన్నైలోని గర్ల్స్ స్కూల్, కాలేజీల్లోనే జరిగింది! బి.కాం దాకా చదివాను. దాని తర్వాత ఎం.బి.ఏకని ఆస్ట్రేలియా వెళ్లి చదువుకోవాలనుకున్నాను. చిన్నప్పటినుంచీ మంచి స్టూడెంట్‌ని అవడంతో అందరూ అదే అనుకున్నారు... ఎవరూ ఊహించలేదు... ఈ ఫీల్డ్‌లోకి వస్తానని!
ఇందిర: అసలు ఈ ఫీల్డ్‌లోకి ఎలా వచ్చారు..?సమంత: ఫ్రెండ్స్‌తోపాటు ఓసారి బర్త్‌డే పార్టీకని వెళ్లినప్పుడు ఎవరో ప్రెస్ ఫోటోగ్రాఫర్ మా ఫొటో తీసి, పేపర్లో వేశారు. అది చూసిన చెన్నైలోని ఒక ప్రముఖ ఫొటోగ్రాఫర్ వెంకట్రామన్ నన్ను అప్రోచ్ అయ్యి, నాకు ఫోటో షూట్ చేసి, నాయుడు హాల్ అనే బట్టల షాపుకి మోడలింగ్ చేసే అవకాశం ఇప్పించారు. అసలు ఈ మోడలింగ్‌లవీ నాకేమీ ఇంట్రస్ట్ అనిపించకపోయినా, కేవలం పాకెట్ మనీకోసం చేయడం మొదలెట్టాను. ఆ తర్వాత దాదాపు 100 యాడ్స్ దాకా మోడలింగ్ చేశాను. అవి చూసిన రవివర్మన్ అనే ఓ తమిళ సినిమాటోగ్రాఫర్ నాకు సినిమాల్లో మొదట అవకాశం ఇచ్చారు. కానీ, ఆ సినిమా కంటే ముందు గౌతమ్ మీనన్ డెరైక్ట్ చేసిన ‘ఏం మాయ చేసావె’ రిలీజైంది.
ఇందిర: గౌతమ్ మీనన్ తీసిన రెండు త్రిభాషా చిత్రాల్లో (కొన్నిట్లో గెస్ట్ రోల్స్ అయినా) నటించారు. అంటే... ఆరు సినిమాలకు లెక్క! ఇదికాక ఆయన, ఏఆర్ రెహమాన్ కలిసి చేసిన ఒక మ్యూజిక్ వీడియోలో నటించారు. సో, ఆయన్ని మీ గాడ్‌ఫాదర్ అనుకోవచ్చా..! ఆయన దగ్గర పనిచేయడం, మీపై ఆయన ఇన్‌ఫ్లుయెన్స్...సమంత: ఏ హీరోయిన్ అయితే ఫస్ట్ గౌతమ్ మీనన్‌తో పనిచేస్తారో ఆ హీరోయిన్ లైఫ్ సెటిల్! ఎందుకంటే ఆయన హీరోయిన్‌లని అందంగా చూపించడమే కాదు, ఆ పాత్రలకు పెద్దపీట వేస్తారు. ఆయన ఒక స్త్రీ పాత్ర గురించి రాసినప్పుడు తన తల్లిని, భార్యను, చెల్లిని, స్నేహితురాలిని ఇన్‌స్పిరేషన్ కింద తీసుకుని, వాటిని తీర్చిదిద్దుతారు. అందువల్ల ఆ క్యారెక్టర్ చాలా అందంగా, సహజంగా ఉంటుంది. చూసేవాళ్లు చాలా తొందరగా కనెక్టయిపోతారు.
ఇందిర: ఒక్క గౌతమ్ మీనన్‌నే కాదు... ఇప్పటిదాకా చేసినవన్నీ పెద్ద డెరైక్టర్ల దగ్గరే! ఐ థింక్ యు ఆర్ వెరీ లక్కీ...సమంత: నిజమే! నాకన్నా ఎంతోమంది అందమైన హీరోయిన్లు ఉన్నారు. నాకన్నా... అత్యంత టాలెంట్ ఉన్న హీరోయిన్స్ ఉన్నారు. అయినా, ఈరోజు పెద్దపెద్ద డెరైక్టర్లందరూ నాకు మంచిమంచి అవకాశాలిస్తున్నారంటే... నేను లక్కీనే, కాదనను! కానీ, అలా అని నేను లైఫ్‌లో ఏదీ టేకెన్ ఫర్ గ్రాంటెడ్‌గా తీసుకోను. ఒకవైపు ప్రతి సినిమా మొదటి సినిమా అన్నట్టుగా చాలా కష్ట్టపడతాను... మరోవైపు వచ్చిన ప్రతి మంచి అవకాశాన్నీ పూర్తిగా సద్వినియోగపరచుకుంటాను. ఉదాహరణకు - నాకు ‘ఈగ’లో చేసే అవకాశం వచ్చినప్పుడే మరో పెద్ద సినిమా చేసే అవకాశం కూడా వచ్చింది. దీనికన్నా డబుల్ రెమ్యునరేషన్‌తో! అయినా ‘ఈగ’ లాంటి సినిమాలో నటించే అవకాశం మళ్లీమళ్లీ రాదని, అది ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదని రెండోదాన్ని కాదన్నాను. సో, లక్ అనేది కూడా ఒక్కోసారి మన చేతుల్లో ఉంటుంది!
ఇందిర: సినిమాకు సంబంధించిన నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు? మీ కెరియర్‌లో తల్లిదండ్రుల జోక్యం ఎంతవరకు ఉంటుంది?సమంత: నాకు 25 ఏళ్లు... నా నిర్ణయాలను నేను సొంతంగా తీసుకోగలను... నాకు ఆ తెలివి ఉంది. అందుకే నా కెరీర్‌లో ప్రతీ నిర్ణయం నేనే తీసుకున్నాను... తీసుకుంటాను కూడా! అంతేకాదు, మా తల్లిదండ్రులది కూడా జోక్యం చేసుకునే మెంటాలిటీ కాదు. వాళ్లకు నాపై ఎంత కాన్ఫిడెన్స్ అంటే... వాళ్లు షూటింగ్ లొకేషన్‌లకు కూడా నాతోపాటు ఏరోజూ రాలేదు, రారు. నాకో విషయం అర్థమే కాదు... హీరోయిన్లు అమ్మలను తోడుగా షూటింగ్‌లకు ఎందుకు తీసుకెళ్తారు? అసలు ఆ అవసరమేముంది? మీరు మీ జాబ్‌కి మమ్మీ డాడీలను తీసుకెళ్తారా? సో హీరోయిన్లు మాత్రం ఎందుకు తీసుకెళ్లాలి? నాకు తెలిసి సినిమా ఇండస్ట్రీలో ఉన్నంత ప్రొఫెషనలిజం ఇంకెక్కడా ఉండదు.... ప్రత్యేకించి తెలుగు సినిమా ఇండస్ట్రీ! నేను ఓ మహిళను కాబట్టి, హీరోయిన్ను కాబట్టి నన్ను అందరూ ప్రత్యేకంగా చూస్తారనో, ఒకలా చూస్తారనో ఎప్పుడూ అనిపించలేదు.
ఇందిర: ఓసారి ఎక్కడో జనం మీదపడి... ఏదో గొడవ అయినట్టుంది?సమంత: యా, తిరుపతిలో ఓ షాప్ ఓపెనింగ్‌కు వెళ్లినప్పుడు... జనం విపరీతంగా రావడం, తగ్గట్టు బౌన్సర్లు ముగ్గురే ఉండడంతో గందరగోళం జరిగింది. నేను వాళ్లను తోసుకుపోయే క్రమంలో చెయ్యి విదిలించాను. దాన్ని అందరూ వేరేగా అర్థం చేసుకుని... నేనేదో కొట్టానని ప్రచారం చేశారు. కానీ, నేమ్, ఫేమ్‌తోపాటు ఇవన్నీ తప్పవని వదిలేయాలి!
ఇందిర: హీరోయిన్లు మామూలుగా పెళ్లి విషయాన్ని తొందరగా బయటపెట్టరు. కానీ, మీరు మాత్రం ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఎవరినో ఇష్టపడ్డారని, రిలేషన్‌షిప్‌లో ఉన్నారని చెప్పారు...సమంత: రిలేషన్‌షిప్‌లో ఉన్నా, ‘అయామ్ సింగిల్... రెడీ టు మింగిల్’ అని చెప్పడం నా వల్ల కాదు! నేనూ మనిషినే... నాకూ ఇష్టాయిష్టాలుంటాయి; నాకూ లైఫ్ ఉంటుంది... నాకూ బాయ్‌ఫ్రెండ్ ఉంటాడు (నవ్వుతూ) అయినా, ఉన్నది ఒక్కడే కదా... అది చెప్పుకోవడానికి ఎందుకు సిగ్గుపడాలి... ఎందుకు అబద్ధాలాడాలి? సినిమాల్లో ఎలాగూ నటిస్తాం.. బయట కూడా నటించడం ఎందుకు?
ఇందిర: మీ చేతికున్న ఉంగరం చూస్తే ఎంగేజ్‌మెంట్ కూడా అయిపోయినట్టనిపిస్తోంది...సమంత: (నవ్వుతూ) అయ్యో, ఇది ఎంగేజ్‌మెంట్ రింగ్ కాదు! ‘ఏ మాయ చేసావె’ సినిమాకి వచ్చిన మొదటి రిమన్యూరేషన్‌తో (బర్త్‌స్టోన్ డైమండ్‌తో) చేయించుకున్న ఉంగరం! ఇది నాకు అత్యంత లక్కీ ఉంగరం. ఎప్పటికీ తీయను!
ఇందిర: తన గురించి....సమంత: అచ్చు నాలానే చాలా సాదాసీదాగా ఉంటాడు. అంతేకాదు, చాలా తెలివైనవాడు కూడా! తన దగ్గర నుంచి ప్రతిరోజూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటూనే ఉంటాను. తనవల్ల రోజురోజుకీ బెటర్ పర్సన్‌ని అవుతున్నాను! అయామ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద మ్యాన్ అయామ్ విత్!
ఇందిర: ఇంతకీ అతనితో ఎన్నాళ్ల పరిచయం..సమంత: చాలారోజుల నుంచి. (తెలుగువాడా?) కాదు. (తమిళా?) (పకపకా నవ్వుతూ) ఇది టూమచ్... ఇంక ఇంతకన్నా చెప్పను! (ఫైనల్ క్లూ... ఇండస్ట్రీ వ్యక్తా?) కొన్నాళ్లు వెయిట్ చేస్తే మీకే తెలుస్తుంది. (పోనీ, పెళ్లెప్పుడు?) ఇప్పుడప్పుడే చేసుకోను... కనీసం మూడేళ్ల దాకా!
ఇందిర: ఏ హీరోనైనా చూసి ‘ఇలాంటి భర్త కావాలి’ అని అనుకున్న సందర్భాలున్నాయా? మీ బాయ్‌ఫ్రెండ్ దానికి మ్యాచ్ అయ్యారా?సమంత: నేనూ ఒక యాక్టర్ని కాబట్టి నాకు బాగా తెలుసు... అవన్నీ సినిమాలకే పరిమితం అని! (నవ్వుతూ) ఇప్పుడు నన్నే తీసుకోండి... సినిమాల్లో ఎంత స్వీట్‌గా, ముద్దుగా ఉంటాను... బయట కూడా అలా ఉంటాను అనుకుంటే ఎలా? వాళ్లూ అంతే..! అందుకే నాకు అలాంటి ఊహలుండవు. ప్రాక్టికల్‌గా ఉంటాను.
ఇందిర: మీ సినిమాలకు మీరే డబ్బింగ్ చెప్పుకుంటారని అప్పట్లో టాక్ వచ్చింది...సమంత: తెలుగు ఇప్పుడిప్పుడు బాగానే మాట్లాడుతున్నాను. కానీ, ఇంకా డబ్బింగ్ చెప్పేంత లేదు. (నవ్వుతూ) అయినా నేను తెలుగు డబ్బింగ్ చెప్తే చిన్మయి ఫ్యాన్స్ బాధపడతారు.
ఇందిర: చిన్మయి డబ్బింగ్ మీ సక్సెస్‌కి బాగా హెల్పయిందనుకుంటా?సమంత: బాగానా..? నా సక్సెస్‌లో 50% సక్సెస్ ఆమెకే ఇవ్వాలి! ఆమె నా బెటర్‌హాఫ్! నా స్క్రీన్ ప్రెజెన్స్‌కి తను ఎంత ఉపయోగపడిందో నాకు తెలుసు. అందుకే, అదే విషయాన్ని నేనందరికీ నా ట్వీట్స్ ద్వారా చాలాసార్లు తెలియజేశాను! డబ్బింగ్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను... నేను తమిళ్ సినిమా ‘నేన్ వాడు వసంతం’లో డబ్బింగ్ చెప్పాక... డబ్బింగ్ అంటే చిన్నపని కాదని, యాక్టింగ్ కంటే పెద్దపని అని, కష్టమైన పని అని తెలుసుకున్నాను. మేము అందరం కలిసి 60 రోజులపాటు ట్రావెల్ చేసి, తీసిన సినిమాని, వాళ్లు కేవలం మూడు రోజుల్లో, మొత్తం సినిమాని, అదీ... ఒక గదిలో కూర్చుని, పక్కన సహనటులు ఎవరూ లేకుండా, అంతా ఊహించుకుంటూ, పాత్రలో లీనమై, డైలాగ్‌లు అంత బాగా చెప్పడం... అదీ లిప్ సింక్ అయ్యేలా చూసుకుంటూ... ఓ మైగాడ్! వాళ్ల మీద నాకు ఎంత గౌరవం పెరిగిందో చెప్పలేను. వాళ్లందరికీ పెద్ద నమస్కారం పెట్టాలనిపించింది.
ఇందిర: రెండు మూడు సినిమాల్లో హీరోలతో లిప్‌లాక్ సీన్స్ చేశారు.. సమంత: ఇబ్బందిగానే ఎందుకనిపించలేదు... కొంచెం షైగానే అనిపించింది కానీ, రెండు సినిమాల్లోనే చేశాను. ‘ఏం మాయ చేసావె’లో ఆ సీన్ గురించి చెప్పినప్పుడు మొదట చాలా ఇబ్బందిగా అనిపించినా, గౌతమ్ మీనన్ చాలా ఈస్థటిక్‌గా షూట్ చేయడంతో అంత ఇబ్బంది అనిపించలేదు. ‘దూకుడు’లో చేసినదాన్ని మీరు కిస్సింగ్ అనడానికి లేదు. ఏదో ఇద్దరి తలలు కొట్టుకున్నట్టుగా ఉండింది. (నవ్వుతూ) అయినా ఇకనుంచి నేను అలాంటి సీన్లు చేయదలచుకోవడం లేదు. ఇలాగే చేస్తూ పోతే నేను ‘సౌత్ సిమ్రాన్ హష్మి’ అయిపోతాను!
ఇందిర: ఆ మధ్యకాలం మీరు ఓ మూడు నెలలు మాయమైతే... జనాలు రకరకాలుగా అనుకున్నారు. అసలేం జరిగింది?సమంత: ఒక్కోసారి శరీరంలో ఇమ్యూనిటీ తగ్గినప్పుడు మంచి బ్యాక్టీరియా కూడా చెడుగా మారి, ఒకదానితర్వాత ఒక ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. అంతేకాదు, ఒకసారి వాడిన మందుకు బాడీ ఇమ్యూన్ అయిపోయి, మరోసారి అదే మందు పనిచేయని పరిస్థితి ఏర్పడుతుంది. అదే నాకూ జరిగింది. రకరకాల మందులు వాడడం, అవేవీ పనిచేయకపోవడంతో, రెండు నెలల్లోనే నా పరిస్థితి చాలా సీరియస్ అయింది.
ఇందిర: ఆ టైంలో మీలో వచ్చిన ఆలోచనలు... మార్పులు...సమంత: బతుకుతానని అయితే అనుకోలేదు... ఎందుకంటే, ఆ టైంలో ఏ మందూ పనిచేస్తున్నట్టు అనిపించలేదు. అంతేకాదు, డెత్ అనే థాట్ రావడంతో ప్రపంచమంతా ఒక్కసారిగా భిన్నంగా కనిపించడం మొదలైంది. అప్పటిదాకా టాప్‌లో స్మూత్‌గా నడుసున్నట్టనిపించిన నాకు, సడెన్ బ్రేక్ పడ్డట్టయింది. మంచి సక్సెస్, చేతిలో అద్భుతమైన సినిమాలు, అన్నీ ఉండగా ఇలా జరగడం... నా ఆలోచనా క్రమాన్ని చాలా మార్చింది. శంకర్ సినిమా వదులుకున్నాను. మణిరత్నం సినిమా కాదనుకున్నాను. తెలుగులో కూడా దిల్‌రాజు గారితో సహా అందరికీ చెప్పేశాను... నాకోసం ఆగవద్దు... వేరేవాళ్లను తీసుకోండి అని! అన్నీ చేతిలో ఉన్న దగ్గర నుంచి, రెండు నెలల్లో ఏమీ లేని స్థితికి వచ్చినట్టు అనిపించింది. అప్పుడే అనిపించింది - జీవితంలో ఏదీ శాశ్వతం కాదని!
ఇందిర: ప్రత్యూష ఫౌండేషన్‌కి చేయూతనివ్వడానికి అదే కారణమా?సమంత: నేను మొదటినుంచి జనరస్ పర్సన్‌నే! అయితే, అప్పటిదాకా కేవలం ఫ్యామిలీ వాళ్లను, నా దగ్గర వాళ్లను, నా దగ్గర పనిచేసే వాళ్లను మాత్రమే చూసుకున్నాను. బయటవాళ్లకు పెద్దగా సాయం చేయలేదు. ఆ ఆలోచన నాకు సాయం చేసిన వాళ్లను చూశాకే కలిగింది. ‘ఇంతమంది నాకు సాయం చేస్తున్నారు... నేను ఇప్పటిదాకా ఎంతమందికి సాయం చేశాను?’ అని! ‘ప్రపంచంలో ఎన్నెన్ని సమస్యలు ఉన్నాయి... ప్రజలు డబ్బులేక, తిండిలేక, చదువులేక, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా డబ్బులేక బాధపడుతుంటే... ఇక్కడ నేను ఒక చిన్న పింపుల్ వస్తేనో, టాన్ అయ్యాననో బయటికి వెళ్లడానికి ఇష్టపడేదాన్ని కాదు... ఎంత తక్కువగా ఆలోచించాను’ అని అనిపించింది. అంతేకాదు, కేవలం అద్దంలో కనిపించిన సమంతానే ప్రపంచంగా అనుకుంటూ అంత స్వార్థంగా, ఏమీ పట్టనట్టుగా ఇన్నాళ్లు ఎలా బతికానా? అని కూడా అనుకున్నాను. ట్రూ సఫరింగ్, ట్రూ పెయిన్ మొదటిసారి ఫీలయింది అప్పుడే! నా బాధని చూడలేని మా అమ్మ కళ్లను చూసి అనిపించింది... ఈ కష్టం ఇంకే తల్లీ అనుభవించ కూడదని! అందుకే, నాకు చేతనైనంత సాయం చేయాలనుకున్నాను. హిమోఫీలియా, తలసీమియా లాంటి జబ్బులతో నిత్యం బాధపడే పిల్లలకు సాయం చేయాలని నిర్ణయించుకుని, ప్రత్యూష ఫౌండేషన్‌తో కలిసి పనిచేయడం మొదలెట్టాను. డబ్బు డొనేట్ చేయడం, వ్యాధిపట్ల అవేర్‌నెస్ పెంచడం దగ్గర నుంచి మెడికల్ క్యాంపులు నిర్వహించడం దాకా ఎంత సాయం చేయగలిగితే అంత సాయం చేస్తున్నాను. మనం చేస్తున్న కాస్త సాయానికి ఒక పిల్లో పిల్లవాడికో నయమవుతుంటే... వాళ్లను చూస్తున్నప్పుడు నాకు కలిగే ఆనందం... ఏ బ్లాక్‌బస్టర్ సినిమా ఇవ్వదు.
ఇందిర: ఈ రెండు నెలల సమయంలో ఇంతటి మార్పా?సమంత: ఇతరులకు సాయం చేసే విషయంలోనే కాదు... ఫిలసాఫికల్‌గా కూడా నాలో ఎంత మార్పు వచ్చిందో నాకు తెలుసు. ఇంతకుముందు చిన్నచిన్నవాటికి అప్సెట్ అయిపోయేదాన్ని. ఇప్పుడు,పెద్దగా దేనికీ తొణకను. జీవితంలో ఈ అప్స్ అండ్ డౌన్స్ వస్తూనే ఉంటాయని, ఆ డౌన్ తర్వాత ఇప్పుడు అప్‌లో ఉన్నానని, మళ్లీ నాకు డౌన్ తధ్యమని, ఈ సర్కిల్ ఆఫ్ లైఫ్‌లో అప్స్ అండ్ డౌన్స్ తప్పవని, అన్నిటినీ సమతుల్యంగా తీసుకోవడం మొదలెట్టాను. అయితే వీటన్నిటిలో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే... ఈ అప్స్ డౌన్స్ మధ్యలో నిన్ను నువ్వు ఎట్లా నియంత్రించుకున్నావు, ఎంత నిలకడగా ఉన్నావు, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నావు, ఉన్నంతలో ఎలా ఉన్నావు, నీ ప్రవర్తన ఎలా ఉంది... ఇవన్నీ హ్యాండిల్ చేసిన తీరుకు నువ్వు గర్వపడుతున్నావా లేదా అనేది చాలా ముఖ్యం అనిపిస్తుంది. అసలు నాలో ఈ మార్పు తేవడానికే దేవుడు ఇలా చేశాడేమో అని అనిపిస్తుంది.
ఇందిర: వెనక్కి తిరిగి చూసుకుంటే లైఫ్ ఎలా అనిపిస్తోంది?సమంత: నన్ను నేను ప్రతిరోజూ ప్రశ్నించుకుంటూనే ఉంటాను... ఆశ్చర్యపోతూనే ఉంటాను... అసలు నేనిక్కడకి ఎలా వచ్చానా అని... ఇదంతా ఎలా జరిగిందని!
బ్యాక్ టు బ్యాక్ ఐదు సినిమాలు... అన్నీ అంతపెద్ద హిట్ అవడం... ఒక్కసారిగా కిందపడ్డం... మళ్లీ ఈరోజు నేను ఈ స్థితిలో ఉండడం... అంతా కలలాగా అనిపిస్తుంది. నేను కూడా నా జీవితానికి ఇంత మంచి స్క్రిప్ట్ రాసుకోలేకపోయేదాన్నేమో... దేవుడు అంత బాగా రాశాడు. దిసీజ్ టు గుడ్ టు బి ట్రూ!
పర్సనల్ బైట్స్...అమ్మ - నా వెన్నెముక. నాలో కొంచెం ఏదైనా మంచి ఉంది అనుకుంటే... అది ఆవిడ వల్ల వచ్చిందే! తనంత సహృదయురాలిని నేనింతవరకు చూడలేదు!
పెద్దన్న - చాలా ఫ్రాంక్‌గా, స్ట్రిక్ట్‌గా ఉంటాడు. కాంప్లిమెంట్‌లు అస్సలు ఇవ్వడు. అలాంటిది తమిళ్ ‘ఈగ’ చూసిన తర్వాత ‘అయామ్ ప్రౌడ్ ఆఫ్ యు’ అన్నాడు.
చిన్నన్న - నేనంటే ఇష్టం... నేనేది చేసినా మురిపెం. నన్నెప్పుడూ మెచ్చుకుంటూనే ఉంటాడు.
ఫ్యాన్స్ - ఆ పదానికి అర్థం ఇప్పటికీ తెలీలేదు కానీ, నన్ను మొదటిరోజు నుంచీ అభిమానించే వారు కొందరున్నారని మాత్రం తెలుసు. వాళ్లలో కొందరితో నేను రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటాను... అప్పుడప్పుడూ వాళ్లతోపాటు కాఫీ షాప్‌లకు కూడా వెళ్తుంటాను. వాళ్లకి నేనంతే ఎంత అభిమానమంటే.... బ్లాగ్‌ల్లో ఎక్కడైనా నా గురించి చెడుగా రాస్తే, వెంటనే తీసేస్తూ ఉంటారు. కానీ, నాతో మాత్రం వాళ్ల అభిప్రాయాల్ని నిర్మొహమాటంగా చెప్తూ ఉంటారు. నేను చేసే స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు కూడా వాళ్లు తోడుగా ఉంటారు.
ఫ్రెండ్స్ - నా చిన్నప్పటి ఫ్రెండ్స్ చాలామంది బాంబేలో సెటిలయ్యారు. వాళ్లకి ఇక్కడ నా స్టార్‌డమ్ గురించి పెద్దగా తెలీదు. కానీ ఎప్పుడైనా పేపర్‌లో సడెన్‌గా నా ఫోటో చూస్తే ‘ఏంటి? నువ్వు అంత పెద్ద యాక్ట్రెస్సా సౌత్‌లో?’ అంటారు. ‘అయ్యో అంతలేదు’ అని నవ్వేస్తాను. వాళ్లతో వర్క్ గురించి పెద్దగా మాట్లాడను. ఎక్కువశాతం పర్సనల్ విషయాలే మాట్లాడతాను.
స్టాఫ్ - వాళ్లు లేనిదే నేను లేను. వాళ్లు నాకు ఫ్యామిలీ మెంబర్స్‌తో సమానం.
డెరైక్టర్లు - నా అదృష్టం... నాకు దొరికిన డెరైక్టర్లందరూ నన్ను చాలా అభిమానిస్తారు... ప్రొటెక్టివ్‌గా చూసుకుంటారు. (నవ్వుతూ) నేనెప్పుడైనా గ్లామరస్‌గా కనిపిస్తానన్నా, వాళ్లే ముందు ఒప్పుకోరు!
హైదరాబాద్ - పుట్టిన పెరిగింది చెన్నైలో అయినా, నాకు హైదరాబాద్ అంటేనే ఇష్టం. ఆ విషయం ఓపెన్‌గా అందరికీ చెప్తూంటా. ఇక్కడ అపార్ట్‌మెంట్ కూడా కొనుక్కున్నాను. ఇక్కడే సెటిలయిపోదామనుకుంటున్నాను!
స్టార్ బైట్స్...నాగచైతన్య - ఇండస్ట్రీలో నాకు మొదటినుంచి ఉన్న ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్ తనే! ఇప్పుడు నేను తనతో ఇంకో సినిమా కూడా చేయబోతున్నాను... ఎదురుచూస్తున్నాను!
జూనియర్ ఎన్టీఆర్ - తనకున్న టాలెంట్, తనలోని ఎనర్జీ, తను డైలాగ్‌లు చెప్పే తీరు నేనింతవరకు ఎవ్వరిలోనూ చూడలేదు... ఇకముందు చూస్తానని కూడా అనుకోను. అతనితోపాటు సేమ్ ఫ్రేమ్‌లో నించోవడం... అసాధ్యం! తన సినిమా సంగతి వదిలేయండి... తన సినిమా మేకింగ్ విడియో బయటకు రిలీజ్ చేసినా, అది సినిమా కంటే పెద్ద హిట్ అవుతుంది!
మహేష్ - ‘దూకుడు’ సినిమా మొదటిరోజున తను నాతో - ‘ప్రతి సినిమాని మొదటి సినిమా అనుకుని చెయ్యి’ అన్నాడు. థ్యాంక్స్ టు హిమ్... అదే నేను ఇప్పటికీ, ఎప్పటికీ ఫాలో అయ్యే మంత్ర!
నానీ - తనను చూస్తే నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. ఈరోజు తను ఈ స్థాయిలో ఉన్నాడంటే అది కేవలం తన స్వయంకృషి వల్లే! సినిమా పట్ల తనకున్న పాషన్, తనకున్న దూకుడుతనం తనని ఎంతోదూరం తీసుకెళ్తుందని నాకు గొప్ప నమ్మకం!
సిద్దార్ధ - నందినీరెడ్డి సినిమా షూటింగ్ మొదలయ్యే వరకూ ఎప్పుడూ అనుకోలేదు... తను ఈరోజున నాకు ఇంత క్లోజ్ అవుతాడని! నేను తనతోనే కాదు, వాళ్ల అమ్మతో, నాన్నతో, చెల్లితో కూడా చాలా క్లోజ్! అంతటి స్వీట్ ఫ్యామిలీని ఇప్పటిదాకా చూడలేదు. ఇక సిద్దార్ధ గురించి చెప్పాలంటే - తనంత తెలివైనవాణ్ణి, ప్రపంచంలో ఎన్నో విషయాల పట్ల అంతటి అవగాహన ఉన్నవాణ్ణి చూడలేదు.
క్విక్ బైట్స్...ఖాళీ సమయాల్లో - ఫ్రెండ్స్‌తో గడుపుతాను. సినిమాలు విపరీతంగా చూస్తుంటాను. కానీ ఈమధ్యకాలం ఏమాత్రం టైమున్నా ప్రత్యూష ఫౌండేషన్‌కి వెళ్తున్నాను.
హీరోయిన్ కాకపోయి ఉంటే - ఆస్ట్రేలియాలో ఎంబిఏ చేసి, అక్కడే పనిచేస్తూ ఉండేదాన్ని.
జాతకాల మీద నమ్మకం - ఒకప్పుడు ఉండేది కాదుకానీ, ఈ మద్య నమ్ముతున్నాను. దానికి కారణం... నేను బాగా సిక్‌గా ఉన్నప్పుడు ఓ జ్యోతిష్యుడు నాతో - ‘ఆగస్టు 15కల్లా వర్క్‌కి వెళ్లిపోతావు’ అన్నాడు. అప్పుడు నమ్మలేదు. కానీ, నన్ను ఆశ్చర్యానికి గురిచేసిన విషయమేంటంటే... కరెక్ట్‌గా నేను ఆగస్టు 15 నాడే షూటింగ్‌కి మళ్లీ వెళ్లిపోయాను. ఆరోజే అతనికి కాల్‌చేసి అడిగాను - ‘అంత కరెక్ట్‌గా ఎలా చెప్పగలిగారు?’ అని! ‘నక్షత్ర బలాన్ని బట్టి చెప్పగలిగాను’ అన్నాడు. అప్పటినుంచి ఆస్ట్రాలజీ చాలా ఇంట్రస్టింగ్‌గా అనిపిస్తోంది.
కాలం వెనక్కి తిరిగొస్తే - గతంలో నేను చేసిన ప్రతి పనీ గర్వించదగ్గవి కాదు. వాటిలో కొన్ని ఖచ్చితంగా ‘మళ్లీ చేయను’ అనేవి ఉన్నాయి. అవి పక్కన పెడితే, పోయినదాన్ని మళ్లీ దక్కించుకోవాలనుకుంటున్నాను... మణిరత్నం సినిమాలో నటించాలని ఉంది.
మీలో మీకు నచ్చేవి - నేను చాలా చాలా కష్టపడతాను. అది అందరికీ తెలుసు. అంతేకాదు, ఏ విషయాన్నైనా తొందరగా గ్రహిస్తాను.
మీలో మీకు నచ్చనివి - ఆత్మ విమర్శ ఎక్కువ... ఎంత ఎక్కువంటే, నన్ను నేను హర్ట్ చేసుకునేంత! దగ్గర వాళ్లను కూడా బాగా విమర్శిస్తూంటాను. ఇక ఫిజికల్‌గా అంటే... నా నవ్వు... నా కళ్లు బాగుంటాయనిపిస్తుంది!
సమ్మప్ సమంత ఇన్ త్రీ వర్డ్స్ - రియల్, హార్డ్ వర్కింగ్ అండ్ వెరీ లవింగ్.
No comments:
Post a Comment