all

Sunday, January 13, 2013

ఆకలేస్తే అన్నం పెడతా... చాన్సిస్తే మళ్లీ వస్తా...యానా గుప్తా

 
అజ్ఞాతవాసం
‘‘బాపూజీ జర ధీరే చలో’’ పాటను గుర్తు చేస్తే మరుక్షణం మనసులో మెదులుతుందామె. పొడుగ్గా ఉన్న అమ్మాయిలు కూడా పొగరు, వగరు నృత్యాలు అదరగొట్టేయగలరని నమ్మడం మొదలైంది ఆ పాట తర్వాతే. విదేశీ లుక్స్ స్వదేశీ వెండితెరపై హిట్స్ కొట్టగలవని నిరూపితమైంది ఆ అమ్మాయితోనే. ఎగసే సముద్రపు హోరులాంటి పాటకు తగ్గట్టుగా పోటెత్తిన ఆ అరుదైన సౌందర్య ప్రవాహం తన దిశను ఎటు మార్చుకుంది? పేరులోనే కాదు కెరీర్‌లోనూ సగం భారతీయతను మేళవించిన ఆ ఫ్యూజన్ గాళ్... కనపడకుండా కన్‌ఫ్యూజ్ చేస్తోందేం? 

యానా సింకోవా. మనకే మాత్రం సింకైనట్టు లేదు కదూ! అయితే చివరి పేరు తీసేసి గుప్తా తగిలించండి, హమ్మయ్య అనిపిస్తుంది. ఈ ఇంట్రెస్టింగ్ నేమ్‌కు సొంతదారు ఐదడుగుల ఎనిమిది అంగుళాల పొడగరి... యానాగుప్తా. చెక్ రిపబ్లిక్ పౌరురాలైన యానా, టాప్ మోడల్. ఇంగ్లిష్, గ్రీక్, హిందీ, స్పానిష్, జపనీస్... ఇలా పలు భాషల్లో ప్రవీణురాలు. పదహారేళ్లకే మోడలింగ్ కెరీర్‌ను స్టార్ట్ చేసిన యానా... మిలన్, పారిస్, వియెన్నా, మ్యూనిచ్, హ్యాంబర్గ్, టోక్యో వంటి ప్రాంతాలెన్నో తిరిగింది.

కెల్విన్ క్లెన్, విక్టోరియా సీక్రెట్, టయోటా, హోండా, సోనీతో పాటు నివ్యా, రెక్సోనా, ష్యూమురా, షిషిడో వంటి కాస్మొటిక్ కంపెనీలకూ పనిచేసింది. చదువుకునే వయసులోనే జపాన్‌లో మోడల్‌గా ఒక వెలుగు వెలిగింది. పార్క్ ఆర్కిటెక్చర్- గార్డెనింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చే శాక జపాన్‌ను వదిలిపెట్టి, ‘కొత్తదనం’ కోసం భారత్‌కు వచ్చేసింది. ఇక్కడ ఆథ్యాత్మిక పరిమళాలను అద్దుకునే క్రమంలో ‘ఓషో’ ఆశ్రమంలో కలిసిన పంజాబీ చిత్రకారుడు సత్యకామ్, గుప్తాను ప్రేమించి పెళ్లాడింది. పుణెలో నివాసం ఏర్పరచుకుంది. 

మ్యారేజ్... నాట్ ఎ డ్యామేజ్!
పెళ్లయితే సినిమా కెరీర్‌కు ఫుల్‌స్టాప్ పడినట్టే! ఇక మోడలింగ్ గురించైతే మాట్లాడడం కూడా అనవసరం. ఇలాంటి అభిప్రాయాలు బాగా ఉన్న రోజులవి. కానీ యానాగుప్తా వీటన్నింటికీ మినహాయింపు. పెళ్లయ్యాక కూడా లిమ్కా, ఎంటీవీ, లాక్మె వంటి టాప్ బ్రాండ్స్‌కు వర్క్ చేస్తూ స్టార్ మోడల్‌గా వెలిగింది. పెద్ద పెద్ద హీరోయిన్లు ఎంతోమంది పెళ్లి చేసుకుని గృహిణులుగా సెటిలైపోతుంటే, యానా మాత్రం ఓ పెద్ద సినిమాలో ఐటమ్‌సాంగ్ చేసే చాన్స్ కొట్టేసింది. 

సందీప్‌చౌతా సంగీతం, సమీర్ సాహిత్యం, సుఖ్వీందర్, సోనూల గానం... ఇన్ని ఉన్నా, యానా లేకపోతే సున్నా అన్న రేంజ్‌లో ‘దమ్’ ఐటమ్‌సాంగ్ ఆమెకు పేరు తెచ్చింది. ‘బాపూజీ జర థీరే చలో’ పాటకి జతగా యానా వేసిన స్టెప్స్‌కి థియేటర్లు విజిల్స్‌తో మార్మోగాయి. అదే ఊపులో అర్జున్ రామ్‌పాల్ సరసన ఏక్ అజ్‌నబీ, రక్త్ వంటి చిత్రాల్లో వరుసగా నర్తించింది. తెలుగులో రెండు, తమిళంలో, కన్నడంలో ఒక్కొక్కటి చొప్పున అవకాశాలు దక్కించుకుంది. చిన్నితెర ఆఫర్లు కూడా బాగానే అంది పుచ్చుకుంది. జూమ్‌టీవీలో మ్యూజికల్ కౌంట్‌డౌన్ షోకి యాంకర్‌గా పనిచేసింది. తెలుగులో మెగాస్టార్ సరసన తళుక్కున మెరిసింది. అయితే ఉన్నట్టుండి కనపడకుండా మాయమైంది. ఏమైంది? ఏం చేస్తోంది?

యానా... మళ్లీ వచ్చేనా? 
ప్రేమపెళ్లి కొంతకాలానికే పెటాకులైంది. ప్రేమించిన వ్యక్తి దూరమైన వేదనో, సరైన చాన్సులు రాని బాధో గాని, యానా గ్లామర్ రంగం నుంచి విరామాన్ని కోరుకుంది. విడాకులు తీసుకున్న ఈ 35 సంవత్సరాల ప్రౌఢకు అభిరుచిగా నేర్చుకున్న పియానో, ఫ్లూట్‌లు నేస్తాలయ్యాయి. ఆనందాన్ని, సంతోషాన్నిచ్చే డ్యాన్స్‌ను తోడు చేసుకుంది. ఇప్పటిదాకా అరకొర కార్యక్రమాల్లోనో, అడపాదడపా ఇంటర్వ్యూల్లోనో తప్ప కనిపించని ఈ క్రేజీ సుందరి... ఇప్పుడిప్పుడే తిరిగి కెరీర్ వైపు దృష్టి సారిస్తోంది. కార్టూన్స్, గేమ్స్ ఆధారిత చిత్రాలు తీసే ఇండియా గేమ్స్ అనే సంస్థతో ఇటీవలే ఒప్పందం కుదర్చుకుంది.

పూర్తి వెజిటేరియన్ అయిన యానాకి ఫిట్‌నెస్ మీద కూడా మంచి పట్టు ఉంది. ఆ పట్టుతోనే ‘హౌ టు లవ్ యువర్ బాడీ అండ్ గెట్ ది బాడీ యు లవ్’ పేరిట ఓ పుస్తకాన్ని రాస్తోంది. మన దేశం తనకి ఇచ్చిన ప్రతిదీ యానాకు నచ్చిందే. కెరీర్ నుంచి కేర్ టేకర్ దాకా. మనకూ విదేశీ గ్లామర్ రంగానికీ ఉన్న వ్యత్యాసాన్ని ప్రస్తావిస్తూ... ‘‘యూరోపియన్ డిజైనర్స్‌లో ఎక్కువమంది డ్రెస్సుల మీదే తమ దృష్టి కేంద్రీకరిస్తారు. అందుకే ర్యాంప్‌షోలు డల్‌గా అనిపిస్తాయి. 

అదే భారతదేశంలో అయితే డిజైనర్స్ చిన్నపాటి డ్రామాను, హంగామాను క్రియేట్ చేస్తారు. మోడల్స్‌ను కూడా అందులో ప్రధాన భాగం చేస్తారు’’ అంటూ ఇక్కడి గ్లామర్ రంగాన్ని ప్రశంసిస్తుందామె. భారతీయ పౌరసత్వం తీసుకోవాలని, త్వరలో తన సొంత ఇంగ్లిష్ ఆల్బమ్‌ను విడుదల చేయాలని యానా ప్లాన్ చేస్తోంది. తిరిగి సినిమాల్లోకి ప్రవేశించాలని కూడా ఆశిస్తోంది. యోగా+మెడిటేషన్+వర్కవుట్ వెరసి వన్నె తరగని ఈ సౌందపర్యరాశి కలే సాకారమైతే... మరో సూపర్ సాంగ్‌కు ఆకారం వచ్చినట్టే!
- ఎస్.సత్యబాబు

No comments: