all

Tuesday, March 26, 2013

తను నాకన్నారొమాంటిక్,,,,,,cherry,,,,,,,,,,,,,,,,

 

క్వాలిటీ ఆఫ్ లైఫ్.. క్లారిటీ ఆఫ్ లైఫ్ క్వాలిటీ ఆఫ్ వర్క్.. క్లారిటీ ఆఫ్ వర్క్ రామ్‌చరణ్‌కు బాగా తెలుసు విజయం అంటే తన దృష్టిలో ఇష్టపడి పని చేయడం...
కష్టపడి పని చేయడం..!
జీవితం అంటే తన దృష్టిలో మనసుకి నచ్చింది చేయడం...
మనసులో ఉన్నది మాట్లాడేయడం..!
మెగాస్టార్ చిరంజీవి తనయునిగా, మెగాపవర్‌స్టార్‌గా చరణ్ అందరికీ తెలుసు. కానీ తనకో అదర్‌సైడ్ ఉంది. స్ట్రయిట్ ఫార్వార్డ్‌గా ఉండే చరణ్ అదర్‌సైడ్‌లోకి స్ట్రయిట్‌గా దూసుకుపోండి..


ఏంటీ... మీరీ మధ్య మీడియాక్కూడా దొరకడం లేదు?
చరణ్ : మీడియాను కాసేపు పక్కన పెట్టండి. ముందు మా ఇంట్లోవాళ్లకే నేను దొరకడంలేదు. ‘జంజీర్’ హిందీ సినిమా షూటింగంతా ముంబైలోనే జరగడంతో నేను చాలా రోజులు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. నాన్నగారు కూడా కేంద్ర మంత్రిగా దేశాలన్నీ తిరుగుతున్నారు. దాంతో మా ఇల్లు మొత్తం బోసిపోయినట్టయిపోయింది. పాపం అమ్మ, ఉపాసన ఇద్దరే ఉంటున్నారు.

పెళ్ళైన కొత్తలోనే ఇలా మీరు షూటింగ్స్ అంటూ అవుడ్డోర్‌లకు వెళ్లిపోతుంటే ఉపాసన ఫీల్ కావడం లేదా?
చరణ్ : ఫీల్ కావడం కామనే కదా. కానీ ఏం చేయలేని పరిస్థితి. ‘జంజీర్’ ముందే కమిట్ కావడం వల్ల సరిగ్గా పెళ్లి తర్వాత షెడ్యూల్స్ పడ్డాయి. మా కోసం వాళ్లని షూటింగ్ వాయిదా వేసుకోమని చెప్పలేం కదా. అందుకే ఇక చేసేదేం లేక దొరికిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం. ఆ మధ్య అయితే ఓ నెలరోజులు ముంబైలోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఉపాసన తన ఆఫీసు వదిలిపెట్టి నాతో రాలేని పరిస్థితి. వారానికోసారి తనే ముంబయ్ వచ్చి వెళ్ళేది. నేను కూడా ఒకరోజు షూటింగ్ బ్రేక్ దొరికితే వెంటనే హైదరాబాద్‌లో వాలిపోయేవాణ్ణి. అయినా నా పరిస్థితిని ఉపాసన అర్థం చేసుకుంది లేండి. సినిమావాళ్లకి ఇదంతా సహజమని, తనూ ఒకప్పుడు ఇలాంటివే ఫేస్ చేశానని మా అమ్మ తన కోడలికి చెబుతుంటుంది.

ఇంతకూ హనీమూన్‌కైనా వెళ్లారా.. లేదా?
చరణ్ : ఇటలీలోని పారగాన్‌మాల్‌లో మా ఫ్రెండ్‌కి ఓ పెద్ద ఫామ్‌హౌస్ ఉంది. హనీమూన్‌కి అక్కడకి వెళ్లాం. దాన్ని హనీమూన్ ట్రిప్ అంటే ఉపాసన అస్సలు ఒప్పుకోదు. ఎందుకంటే ఎవరైనా వారం, పదిరోజులు ట్రిప్‌కి వెళతారు. మేం కేవలం మూడంటే మూడు రోజులే ఉన్నాం. అందులో ఒకరోజు అప్ అండ్ డౌన్ జర్నీకే సరిపోయింది. అందుకే ‘జంజీర్’, ‘ఎవడు’ సినిమాలు పూర్తి కాగానే ఒక నెల బ్రేక్ తీసుకుని జూన్‌లో ఇద్దరం ఫారిన్ ట్రిప్ వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నాం.

Photo


ఉపాసనతో మీ పరిచయం, ప్రణయం, పరిణయం గురించి కొంచెం వివరంగా చెబుతారా?
చరణ్ : (నవ్వేస్తూ) మాదేమీ సినిమాటిక్ లవ్‌స్టోరీ కాదు. ఇద్దరం ఒకరికొకరు ఎనిమిదేళ్లుగా తెలుసు. బాల్య స్నేహితులమని, క్లాస్‌మేట్స్ అని మీడియాలో రాశారు. కానీ, అది నిజం కాదు. కొంతమంది కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఒకరికొకరం పరిచయమయ్యాం. చాలా తక్కువ సమయంలోనే ఇద్దరం క్లోజ్ అయిపోయాం. నా ముక్కుసూటితనం తనకు నచ్చింది. తన నిక్కచ్చితనం, ధైర్యం నన్ను ఆకట్టుకున్నాయి. తను గొప్పింటమ్మాయి అయినా ఎక్కడా గర్వం కనబడదు. అందరితోనూ ఇట్టే కలిసిపోతుంది. ఈ జనరేషన్‌లో ఇలాంటి నేచర్ చాలా తక్కువమందికి మాత్రమే ఉంటుంది. ఆ నేచర్‌కే నే పడిపోయా. ఆ తర్వాత జరిగిన కథ మీకు తెలిసిందేగా.

మీలో ఎవరు ముందు లవ్ ప్రపోజ్ చేశారు?
చరణ్ :అమ్మాయిలు అంత తొందరగా బయటపడతారా... చెప్పండి. వాళ్ల ఇబ్బందులు వాళ్లకుంటాయి. ముందు నేనే లవ్ ప్రపోజ్ చేశా. తనక్కూడా నేనంటే చాలా ఇష్టం. అందుకే వెంటనే ఓకే అంది. అయితే వాళ్లింట్లో ఏమంటారో అని కొన్నాళ్లు తటపటాయించింది.




మీ ఇంట్లో వాళ్లు ఈ లవ్ గురించి తెలిసి ఏమన్నారు?
చరణ్ : ఉపాసనకైతే ఈజీగా చెప్పేశాను కానీ, ఇంట్లో నాన్నగారికి విషయం చెప్పడానికి చాలా భయపడ్డాను. అసలు ఆయనకు ఈ విషయం ఎలా చేరవేయాలో కూడా అర్థంకాలేదు. చివరకు అమ్మను ఆశ్రయించా. తనే అన్నీ చూసుకుంది. నాన్నగారికి కూడా వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ బాగా క్లోజ్. చాలామంచి సంబంధం అని నాన్నగారు కూడా ఒప్పుకున్నారు.

మీరేమో సినిమాస్టార్. ఉపాసన బిజినెస్ ఉమెన్. ఇద్దరికీ ఎలా మ్యాచ్ కుదురుతుందని ఏమైనా సందేహపడ్డారా?
చరణ్ : మా పెళ్లికి అడ్డంకి ఏదైనా ఉంటే అదొక్కటే అనుకున్నాం. వాళ్లకు సినిమాల గురించి అస్సలు తెలీదు. మాకేమో ఆ బిజినెస్ ఫీల్డ్ కొత్త. అయినా మనసులు కలవాలి గానీ రంగాలు కలవాలంటారా. ఇన్నాళ్లూ ఉపాసన బయటి ప్రపంచానికి సరిగ్గా తెలీదు. ఇప్పుడేమో చిరంజీవిగారి కోడలిగా, చరణ్ భార్యగా ఓ స్టార్‌డమ్ వచ్చేసింది.

ఈ కొత్త హోదాను ఉపాసన ఎంజాయ్ చేస్తున్నారా?
చరణ్ : ఎంచక్కా చేస్తోంది. ఇన్నాళ్లూ ఎక్కడికైనా తనే ఒంటరిగా వెళ్లేది. షాపింగ్‌లు, రెస్టారెంట్లు అన్నీ హాయిగా వెళ్లిపోయేది. అయితే మునుపటి ఫ్రీడమ్ లేదు తనకు. అందరూ తననే చూస్తుంటారు. అభిమానులైతే మాట్లాడ్డానికి ప్రయత్నిస్తుంటారు. కొంచెం ఇబ్బంది అనిపించినా, తను ఈ పొజిషన్‌ని బాగా ఎంజాయ్ చేస్తోంది.

ఉపాసన మీ ఇంట్లో వాళ్లతో బాగానే కలిసిపోయారా?
చరణ్ : మీకోవిషయం చెప్పనా. మా అమ్మ, తను ఇప్పుడు బెస్ట్‌ఫ్రెండ్స్. అత్తాకోడళ్లలాగా అస్సలు కనబడరు. నాన్నగారికి కూడా ఉపాసన అంటే చాలా ఇష్టం. మిగతావాళ్లు నాన్నగారి దగ్గర కొంచెం భయం భయంగా ఉంటుంటారు. తనేమో చాలా చొరవగా నాన్నగారితో మాట్లాడేస్తుంది. ఆ చొరవే నాన్నగారికి నచ్చింది. ఇంట్లో అందరితో కూడా తను చనువుగా ఉంటుంది. లేవగానే ఆఫీసుకి వెళ్లిపోవాలని హడావిడి చేయకుండా, ఇంట్లో అందరితో కాసేపు గడిపి అప్పుడు ఆఫీసుకి వెళ్తుంది.

మీరు షూటింగ్స్‌తో బిజీ. తను ఆఫీసుతో బిజీ. ఇద్దరూ టైమ్ ఎలా సమన్వయం చేసుకోగలుగుతున్నారు?
చరణ్ : సాయంత్రం ఆరు దాటాక నేను షూటింగ్ చేయను. తను కూడా అంతే. ఆరు దాటగానే ఆఫీస్ క్లోజ్. సిక్స్ తర్వాత టైమ్ అంతా మా ఇద్దరికే సొంతం. ఒక్కోసారి ఆదివారాలు కూడా షూటింగ్ మానేసి తనతోనే టైమ్ స్పెండ్ చేస్తున్నాను.

ఇద్దరూ కలిసి సినిమాలకు వెళ్తుంటారా?
చరణ్ : బయటి థియేటర్స్‌కు వెళ్లి చూడం కానీ, ఇంట్లోనే హోమ్ థియేటర్‌లో చూస్తుంటాం. తను యాష్‌చోప్రా సినిమాలకు అభిమాని. తను నాకన్నా రొమాంటిక్. స్వీట్ లవ్ స్టోరీస్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లను ఆసక్తిగా చూస్తుంది. నన్ను కూడా అలాంటి రొమాంటిక్ సినిమాలు చేయమని అడుగుతోంది. యాక్షన్ తనకు అస్సలు పడదు. అయితే నాతో పెళ్లయ్యాక మాత్రం యాక్షన్ సినిమాలు చూస్తోంది.

సినిమా పరంగా మీకు ఉపాసన సలహాలిస్తుంటారా?
చరణ్ : తనకు ఈ ఫీల్డ్ గురించి అస్సలు అవగాహన లేదు. వాళ్లది కంప్లీట్‌గా బిజినెస్ ఫ్యామిలీ. బిజినెస్ మీద, మార్కెటింగ్ మీద తనకు మంచి నైపుణ్యం ఉంది.




ఇద్దరూ గుళ్లకూ గోపురాలకూ వెళుతుంటారా?
చరణ్ : అబ్బో... ఇప్పటికే చాలా వెళ్లాం. మేం ఇద్దరం ఎక్కువ కలిసి వెళ్లింది టెంపుల్స్‌కే. తిరుపతి, చిలుకూరు, వారణాసి, గురువాయూర్... ఇలా చాలా టెంపుల్స్‌ని దర్శించుకున్నాం.

ఇద్దరికీ బాగా దైవభక్తి ఎక్కువన్నమాట?
చరణ్ : నాకు కొంచెం తక్కువే కానీ, తనకు దైవభక్తి ఎక్కువ. వాళ్ల ఫ్యామిలీలో ఎప్పుడూ ఏదో ఒక పూజలు, హోమాలు చేస్తూనే ఉంటారు. వాళ్లకు నిజామాబాద్ జిల్లాలో ఓ పెద్ద కోట ఉంది. అందులో 600 ఏళ్ల క్రితం నాటి పురాతన శివాలయం ఉంది. అక్కడ శివలింగం స్వయంభువు. నీలిరంగులో ఉంటుంది. ఉపాసన ప్రతి నెలా ఆ గుడికి వెళ్లి తనే స్వయంగా శుభ్రం చేసి వస్తుంది.

మీ ఫేవరెట్ గేమ్ ఏంటి?
చరణ్ : పోలో, బ్యాడ్మింటన్ ఇష్టం. అలాగే క్రికెట్ కూడా. హైదరాబాద్ అండర్-14 టీమ్‌లో కొన్నాళ్లు ఆడాను. ఆ తర్వాత టచ్ పోయింది. సీసీఎల్ కోసం మళ్లీ ప్రాక్టీస్ మొదలుపెట్టాను.

మీరు పోలో టీమ్‌ని స్పాన్సర్ చేస్తున్నట్టున్నారు?
చరణ్ : అవును. చాలా మంచి టీమ్ మాది. ‘పోలో’ మనకంత పాపులర్ కాదు. కానీ ఎప్పటికైనా దాన్ని పాపులర్ చేయాలని ఉంది.

గుర్రపుస్వారీ నేర్చుకోవాలని ఎందుకనిపించింది?
చరణ్ : నాకు మొదటినుంచీ జంతువులన్నా, పక్షులన్నా ఇష్టం. ముఖ్యంగా గుర్రాలంటే మహాపిచ్చి. ఆరేళ్ల వయసులో చెన్నైలో గుర్రపుస్వారీ నేర్చుకోవడం మొదలుపెట్టా.

Photo: good morning fans



అందుకేనా ‘మగధీర’లో గుర్రపుస్వారీ సన్నివేశాలు బాగా పండించగలిగారు...
చరణ్ : నిజానికి ‘మగధీర’లో మొదట గుర్రం ఎపిసోడ్ లేదు. నాకు గుర్రపుస్వారీ బాగా వచ్చని తెలిసే రాజమౌళిగారు గుర్రం చుట్టూ ఓ ఎపిసోడ్ క్రియేట్ చేశారు. అది సినిమాకు చాలా పెద్ద ప్లస్సయ్యింది.

దర్శకుడు వీవీ వినాయక్ మీ పెళ్లికి ఓ గుర్రాన్ని బహుమతిగా ఇచ్చారు కదా!
చరణ్ : అది నా ఫేవరెట్ గుర్రం. నేను ఊహించని బహుమతి అది. మా ఇంట్లో మెహందీ పార్టీ జరుగుతుంటే, వినాయక్ బయట నుంచి ఫోన్ చేసి కిందికి రమ్మన్నారు. వచ్చి చూస్తే గేటు దగ్గర ఓ బ్లాక్ హార్స్. అచ్చం ‘మగధీర’ గుర్రంలానే ఉంది. నేను షాకయ్యా. చాలా బ్యూటిఫుల్ హార్స్ అది. మా ఫామ్‌హౌస్‌లో ఉంది. మా దగ్గర ఇంకా 9 గుర్రాలున్నాయి.

ఇప్పటికీ గుర్రపుస్వారీ కంటిన్యూ చేస్తున్నారా?
చరణ్ : వారానికోసారి ఫామ్‌హౌస్‌కి వెళ్లి కాసేపు గుర్రాలతో గడిపి, ఇంకాసేపు స్వారీ చేసి వస్తుంటాను.

గుర్రపుస్వారీ అంటే అందరికీ జానపదాలు గుర్తొస్తాయి. మీకేమైనా ఆసక్తి ఉందా?
చరణ్ : మంచి కథ, దర్శకుడు దొరికితే చేస్తాను. నాక్కూడా వ్యక్తిగతంగా జానపదాలంటే ఇష్టం.

ఎలాగూ సినిమాల ప్రస్తావన వచ్చింది కాబట్టి, కాసేపు మీ హిందీ సినిమా ‘జంజీర్’ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ అవకాశం మీకెలా వచ్చింది?
చరణ్ : దర్శకుడు అపూర్వ లఖియా ‘జంజీర్’ని ఎవరైనా కొత్త హీరోతో రీమేక్ చేద్దామనుకున్నాడట. ఆ సమయంలోనే నా ‘మగధీర’ చూసి బాగా ఇంప్రెసయ్యాడు. వెంటనే నన్ను అప్రోచ్ అయ్యాడు. నాకేమో ఇప్పటికిప్పుడు హిందీకి వెళ్లాలని లేదు. అది కూడా ‘జంజీర్’ లాంటి రీమేక్‌తో వెళ్లడం ఎంత వరకూ కరెక్టా అనిపించింది. అందుకే నేను ఓకే చెప్పలేదు. అయినా వాళ్లు వదిలిపెట్టలేదు. చివరకు బాగా ఆలోచించుకుని 8 నెలల తర్వాత ఓకే చెప్పా.

ప్రియాంక చోప్రా మీకన్నా సీనియర్ కదా. తనతో పని చేయడం ఎలా అనిపించింది?
చరణ్ : క్రమశిక్షణ, ఇన్‌వాల్వ్‌మెంట్ విషయంలో ప్రియాంక చాలా సూపర్. ఇద్దరం షూటింగ్‌కి ఒక గంట ముందే వచ్చేసి డైలాగ్స్ ప్రాక్టీస్ చేసేవాళ్లం.

మీకు హిందీ బాగానే వచ్చా?
చరణ్ : వచ్చుకానీ, అంత ధారాళంగా కాదు. ఆ విషయంలో ప్రియాంక చాలా హెల్ప్ చేసేది. అలాగే తెలుగు వెర్షన్ షూటింగ్ విషయంలో నేను తనకు సహకరించేవాణ్ని. ‘జంజీర్’కి నేనే డబ్బింగ్ చెప్పుకుంటున్నా కూడా.

సల్మాన్‌ఖాన్ రోజూ మీకు క్యారేజ్ పంపేవారట?
చరణ్ : పదేళ్ల క్రితం నాన్నగారితో కలిసి సల్మాన్‌ఖాన్ ‘థమ్సప్’ యాడ్ చేశారు. అప్పటినుంచీ ఆయన మా ఫ్యామిలీకి క్లోజ్ అయిపోయారు. నేను ముంబైలో ‘జంజీర్’ షూటింగ్ చేస్తున్నాననే వార్త తెలియగానే ఫోన్ చేశారు. ‘‘మా సిటీకొచ్చి నాకు ఫోన్ చేయవా?’’ అని కోప్పడ్డారు. తర్వాత రోజు లంచ్‌కి తన ఇంటి నుంచే క్యారేజ్ పంపించారు. నేను అక్కడ ఉన్నన్నాళ్లూ క్యారేజ్ వచ్చేది. నేను ఎంత వద్దన్నా వినేవారు కాదు. ముంబై శివార్లలో షూటింగ్ అయినా సరే క్యారేజ్ పంపించేసేవారు. నన్ను చాలా బాగా చూసుకున్నారాయన. అప్పుడప్పుడూ కలుసుకునేవాళ్లం. నాకు మంచి మంచి సలహాలు కూడా ఇస్తుండేవారు.

ముంబైలో మీరు ఇల్లు తీసుకోవడానికి సల్మాన్‌ఖానే సహకరించారట?
చరణ్ : ఇంకా అక్కడ నేను ఇల్లు తీసుకోలేదు. ఈ నెలలో తీసుకునే అవకాశం ఉంది. ఆ విషయంలో సల్మాన్ చాలా హెల్ప్ చేస్తున్నారు. నాకు ముంబై సెకండ్ సిటీలాంటిది. సినిమాల కోసమో, యాడ్ ఫిలిమ్స్ కోసమో నేను తరచు ముంబై వెళ్లాల్సి ఉంటుంది. హోటల్స్‌కన్నా మనకంటూ ఓ సొంత ఇల్లు ఉంటే బావుంటుందని తీసుకోబోతున్నా.

ఒకవేళ వరుసగా భారీ హిందీ ఆఫర్లు వచ్చేస్తే అక్కడే స్థిరపడిపోతారా?
చరణ్ : ఎన్ని ఆఫర్లు వచ్చినా, కచ్చితంగా ఏడాదికి రెండు తెలుగు సినిమాలు మాత్రం చేస్తా. సమయం చిక్కితే ఏడాదికో హిందీ సినిమా చేయాలనుకుంటున్నా.

జీవితాన్ని బాగా ఎంజాయ్ చేసే ఈ వయసులో ఈ స్టార్‌డమ్, ఈ బిజీ లైఫ్ ఎలా అనిపిస్తోంది?
చరణ్ : నాకిది కొత్తేమీ కాదు. నా చిన్నతనం నుంచీ నాన్నగారిని చూస్తున్నాను కదా. అందుకే నాకేం పెద్ద తేడా అనిపించడంలేదు. ఒత్తిడి కూడా లేదు. అలాగని నేను కోల్పోయింది కూడా ఏమీ లేదు. అందరిలాగా బైక్‌ల మీద తిరగలేకపోయుండొచ్చు. అలాంటి కోరికలన్నీ ఇతర ప్రాంతాలకు వెళ్లినపుడు తీర్చుకునేవాణ్ణి.

బేసిక్‌గా మీదెలాంటి పర్సనాల్టీ?
చరణ్ : నేను చాలా రిలాక్స్‌డ్ పర్సన్‌ని. దేనికీ ఎక్కువ ఎగ్జైట్ కాను. ఇమ్మీడియట్‌గా రియాక్ట్ కాను. కోపం కూడా తక్కువే. ఏ విషయంలోనైనా చాలా స్ట్రెయిట్ ఫార్వార్డ్‌గా ఉంటా. ఒకవేళ అలా లేకపోతే మాత్రం ఆ రాత్రి అస్సలు నిద్రపట్టదు. మొదట్లో నా మనసులో మాటలు చెప్పుకోలేక కొంచెం ఇబ్బందిపడేవాణ్ణి. రాన్రానూ జీవితం నేర్పిన అనుభవంతో రాటుదేలా. ఈ స్ట్రెయిట్ ఫార్వార్డ్‌నెస్సే కరెక్ట్ అనిపించింది. దానివల్ల కొంత ఇబ్బంది ఉన్నా, మనం మాత్రం ప్లెజెంట్‌గా ఉంటాం.

‘నాయక్’ ఆడియో ఫంక్షన్‌లో మీరు చాలా తీవ్రంగా రియాక్టయ్యారు. మీడియా గురించి ఎందుకంత ఘాటుగా స్పందించారు?
చరణ్ : అదేదో కోపంతోనో, ఆవేశంతోనో మాట్లాడింది కాదు. దాని వెనుక రెండేళ్ల పెయిన్ ఉంది. మా ఫ్యామిలీలో కలతలున్నాయని రెండేళ్ల నుంచి మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. కళ్యాణ్ బాబాయ్ ఆడియో ఫంక్షన్‌కి నేను వెళ్లకపోయినా, నా ఆడియో ఫంక్షన్‌కి ఆయన రాకపోయినా అదేదో ఘోరంలాగా, నేరంలాగా, ఏదో జరిగిపోయిందన్నట్టుగా మీడియాలో కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఓ అబద్ధాన్ని పదే పదే చెబితే జనం అదే నిజం అనుకుంటారు. మా విషయంలోనూ అలాంటి అపోహ రాకూడదనే నేనలా మాట్లాడాల్సి వచ్చింది. నాన్నగారు, కళ్యాణ్ బాబాయ్ అలాంటివాటికి రియాక్ట్ కావడం వేస్ట్ అంటారు. కానీ అభిమానుల మనసుల్లో ముసురుకున్న సందేహాలను తొలగించే ప్రయత్నం చేయాలి కదా. అందుకే అభిమానుల ముందు ఆ రోజు అంతలా రియాక్టయ్యా. అంతేకానీ మీడియాను తక్కువ చేయాలని కాదు. ఫంక్షన్‌కు రానంత మాత్రాన ఫ్యామిలీలో గొడవలున్నాయనుకోవడం తప్పు కదా! మాపై అలా చెడు ప్రచారం చేసేవాళ్లను ఉద్దేశించే ఆ మాట అనాల్సి వచ్చింది. .

పవన్‌కల్యాణ్‌తో మీ అనుబంధం గురించి చెప్పండి?
చరణ్ : మాది కొంచెం డిఫరెంట్ రిలేషన్. కాసేపు ఫ్రెండ్స్‌లా ఉంటాం. ఇంకాసేపు తండ్రీకొడుకుల్లా ఉంటాం. అప్పట్లో నాన్న చాలా బిజీగా ఉండేవారు. అప్పుడు నేను ఏది షేర్ చేసుకోవాలన్నా బాబాయ్‌తోనే. మేమిద్దరం ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళం. డాడీకి ఏది కన్వే చేయాలన్నా బాబాయ్ ద్వారానే చేసేవాణ్ణి.

ఇప్పటికీ తరచుగా కలుస్తుంటారా?
చరణ్ : ఎందుకు కలుసుకోం. ఈ నెలలోనే కలుసుకోలేదు ‘జంజీర్’ గురించి చెబితే చాలా మంచి నిర్ణయం తీసుకున్నావని మెచ్చుకున్నారు కూడా.

మరి నాగబాబుతో మీ సాన్నిహిత్యం?
చరణ్ : ఆయన చాలా సరదామనిషి. పైకి గంభీరంగా కనిపిస్తారు కానీ, ఆయన ఎక్కడ ఉంటే అక్కడ సందడే సందడి. ఆయనంత సరదా మనిషిని మీరెప్పుడూ చూసి ఉండరు.

మీ ఫ్యామిలీ నుంచి ఇంకా ముగ్గురు హీరోలొస్తున్నారు కదా...
చరణ్ : సాయిధరమ్ తేజ్, వరుణ్‌తేజ్, అల్లు శిరీష్ బాగా శిక్షణ పొంది వస్తున్నారు. ఎప్పటినుంచో సినిమా ఫీల్డ్‌ని అబ్జర్వ్ చేస్తూ వస్తున్నారు. ఈ మధ్య ‘రేయ్’ క్లిప్పింగ్స్ చూశా. సాయిధరమ్ తేజ్ చాలా బాగా చేశాడు. ‘ఐ విష్ హిమ్ ఆల్‌ది బెస్ట్.

మీ మేనమామ అల్లు అరవింద్ ప్రభావం మీపై ఎంతవరకూ ఉంది?
చరణ్ : మా ఇంట్లో ఏ పెద్ద నిర్ణయం తీసుకోవాలన్నా, మాలో ఎవరికి ఏ సమస్య వచ్చినా మొదట గుర్తొచ్చే వ్యక్తి ఆయనే. ఎప్పుడైనా మేం ఎమోషనల్‌గా రియాక్ట్ అవుతామేమో కానీ, ఆయన అస్సలు అలా రియాక్ట్ కారు. ఆ సమస్యను ఎలా పరిష్కరించాలన్న ఆలోచనే తప్ప, తన రియాక్షన్ బయటికి కనబడదు. మా ఫ్యామిలీలో అందరికీ ఆయనే పెద్ద అండ. ఓ న్యూట్రల్ మైండ్‌తో ఆలోచిస్తారాయన. చిన్నప్పుడు నాకేది కావాలన్నా మామ ద్వారానే రికమెండేషన్ చేయించుకునేవాణ్ణి.




మీకు బావమరిది ఉన్నారా?
చరణ్ : ఉన్నాడు. యూఎస్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు. తనకు సినిమా ఇంట్రస్ట్‌లేమీ లేవు.

అటు కేంద్రమంత్రిగా మీ నాన్నగారు బిజీ. ఇటు హిందీ, తెలుగు సినిమాలతో మీరు బిజీ. ఇద్దరూ ఒకరికొకరు మిస్ అవుతున్నట్లనిపిస్తోందా?
చరణ్ : ఎందుకుండదండీ. అయినా, ఎంత దూరాన ఉన్నా నాన్నతో రోజూ రాత్రిళ్ళు మాట్లాడుతుంటా. నా సినిమాల గురించి, నా గురించి అప్‌డేట్స్ ఇస్తుంటా.

మీ సినిమాల ఫైనల్ అవుట్‌పుట్ చిరంజీవిగారు తప్పనిసరిగా చూస్తారా?
చరణ్ : కచ్చితంగా చూస్తారు. ఆయనకన్నా బిగ్ స్కూల్ ఎవరుంటారు చెప్పండి. ఆయన చెప్పే సలహాలు కచ్చితంగా పాటిస్తాను. ఆయనకు తెలియకుండా నేను ఒక్క స్టెప్ కూడా వేయను.

చిరంజీవిగారు సుమారు రెండు దశాబ్దాలకు పైగా నంబర్‌వన్‌గా ఉన్నారు. ఇప్పుడా స్థానం కోసం హోరా హోరీ పోటీ ఉంది. దాని గురించి మీరేమంటారు?
చరణ్ : ఆయన సినిమా ఫీల్డ్‌లో లేని లోటు అయితే అందరికీ ఉంది. ఆ లోటుని ఎవరు తీరుస్తారనేది మా చేతుల్లో కూడా లేదు. ప్రేక్షకుల చేతిలోనే ఉంది. మా చేతిలో ఉన్నదల్లా కష్టపడడం, వాళ్లకు నచ్చిన సినిమాలు ఇవ్వడం.

మీకు వంట చేయడం వచ్చా?
చరణ్ : వచ్చంటే వచ్చు. రాదంటే రాదు. నాన్న బ్యాచిలర్‌గా ఉన్నప్పుడు వంట తనే చేసుకునేవారట. ఆ విషయాలన్నీ తెలిసి నేను కూడా కొన్నిసార్లు ప్రయత్నించా. అయినా అమ్మ బాగా వంట చేస్తుంది. ఇక మా ఇంట్లో వంటమాస్టర్ శీను సూపర్‌గా వండుతాడు. తన చేతివంట తిన్నాక మేం ఏం చేసినా వేస్టే.

మీ ఫేవరేట్ ఫుడ్ ఐటమ్?
చరణ్ : నాకు ఆంధ్రా వెజిటేరియన్ ఫుడ్ అంటే ఇష్టం. నాన్‌వెజ్‌పై పెద్ద ఆసక్తి లేదు. అయితే బాడీ ఫిట్‌నెస్ కోసం నాన్‌వెజ్ తినక తప్పడం లేదు. నాకు పర్టిక్యులర్‌గా బెల్లంతో చేసిన కొబ్బరి పచ్చడి అంటే చాలా ఇష్టం. ఏ ఫుడ్ ఐటమ్‌లోనైనా కొంచెం బెల్లం తగిలిస్తే ఇష్టంగా తింటా.

ఇండస్ట్రీలో మీ బెస్ట్‌ఫ్రెండ్స్ ఎవరు?
చరణ్ : రానా, శర్వానంద్... వీళ్ళిద్దరూ నేను ఇండస్ట్రీలోకి రాకముందు నుంచే ఫ్రెండ్స్. రానా, నేను స్కూల్లో బెంచ్‌మేట్స్‌మి కూడా.

మీ సమకాలిక హీరోల్లో క్లోజ్ ఎవరు?
చరణ్ : అందరూ నాకు క్లోజే.

ఎన్టీఆర్, మీరూ ‘బావా, బావా’ అని పిలుచుకుంటుంటారట?
చరణ్ : అలా ఏం లేదే! మేమిద్దరం చాలా క్లోజ్‌గా ఉంటాం. లాస్ట్ ఇయర్ దీపావళికి తను మా ఇంట్లోనే ఉన్నాడు. ఆ మధ్య వాళ్లింట్లో హోమ్ థియేటర్లో కూర్చుని ఇద్దరం ‘నాయక్’ సినిమా చూశాం. తన ‘బాద్‌షా’ ఓపెనింగ్‌కి కూడా వెళ్ళాను.


Photo


మరి బయటేమో అభిమానులు గ్రూపులుగా విడిపోయి కొట్టుకుంటుంటారు?
చరణ్ : నేను అదే వద్దని చెబుతున్నా. మేమిక్కడ బాగానే ఉంటాం. వాళ్లూ అలానే ఉండాలి. ఈ క్యాంప్‌లు, గ్రూపులు ఎందుకు?

ఈ బుధవారం మీ పుట్టినరోజు కదా.. ఇప్పటివరకూ మర్చిపోలేని పుట్టినరోజు?
చరణ్ : నా ఐదో పుట్టినరోజుని ఎప్పటికీ మర్చిపోలేను. మా ఫామ్‌హౌస్‌లో చాలా గ్రాండ్‌గా చేసారు. చాలామంది సినీ ప్రముఖులు వచ్చారు. నాకు ఊహ తెలిసాక జరిగిన పుట్టినరోజు కాబట్టి బాగా గుర్తుండిపోయింది.

మరి.. ఈ పుట్టినరోజు ప్రత్యేకత ఏంటి?
చరణ్ : పుట్టినరోజు అయ్యాక కలవండి. చెబుతాను.. బై.

సంభాషణ: పులగం చిన్నారాయణ

నా ఫేవరెట్ హీరోయిన్ శ్రీదేవి. ఆవిడలాగా డిసిప్లిన్ ఉన్న హీరోయిన్లు ఈ జనరేషన్‌లో ఎవ్వరూ లేరేమో.

ఎక్కువగా యానిమల్, డిస్కవరీ చానల్స్ చూస్తుంటాను.

ఈ మధ్య ‘మిర్చి’ చూశా. నాకు బాగా నచ్చింది. ప్రభాస్ చాలా బావున్నాడు.

రాజకీయాలపై ప్రత్యేకమైన ఆసక్తి లేదు. కానీ, అవగాహన ఉండాలి కాబట్టి తెలుసుకుంటుంటాను.

ఫేస్‌బుక్, ట్విట్టర్ ఫాలో అయ్యేది చాలా తక్కువ. ఒకప్పుడు ట్విట్టర్ ఉండేది. ఇప్పుడు అది కూడా క్యాన్సిల్ చేసేశా. ఏదైనా సరే గుప్పిట్లో ఉంటేనే ఓ క్యూరియాసిటీ ఉంటుంది. ఇలా ప్రతిక్షణం అప్‌డేట్స్ ఇస్తుంటే, వాళ్లకేం ఆసక్తి ఉంటుంది?

గాసిప్స్, రూమర్స్‌ని అస్సలు పట్టించుకోను. వాటిని ఆపలేం కూడా. ఓ యాక్టర్‌గా ఉన్నప్పుడు ఇవన్నీ కామనే. అయితే వ్యక్తిగతంగా బాధపెట్టే గాసిప్స్ రాయకూడదు.

మంచి కథ దొరికితే మల్టీస్టారర్స్ కచ్చితంగా చేస్తా.

ఆంధ్రాలో పల్లెటూళ్లని, అక్కడి కల్చర్‌ని నేను చాలా మిస్సయిపోయా. ఈసారి సంక్రాంతికి నిడదవోలు, పాలకొల్లులాంటి ఊళ్లకు వెళ్లాలనుకుంటున్నా.

సిక్స్ ప్యాక్ చేసే ఆసక్తి లేదు. అందరూ చేశారని నేనెందుకు చేయాలి?

నేను రైస్ మానను...
ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అస్సలు పాటించను. నాకేది నచ్చితే అది తినేస్తా. నేను లంచ్, డిన్నర్‌లో కూడా రైస్ తీసుకుంటా. చాలామంది రైస్ తింటే లావైపోతామని మానేస్తారు. డైనింగ్ టేబుల్ దగ్గర ఎలాంటి నిబంధనలు పెట్టుకోకూడదు. ఎంత తిన్నా ఇంకో గంట ఎక్కువ కష్టపడి జిమ్ చేసి తగ్గించేసుకోవచ్చు. ఈ మధ్య అంతా డైటింగుల పేరు చెప్పి ఫుడ్ మానేస్తున్నారు. సరైన వయసులో సరిగ్గా తినకపోవడం వల్లనే పౌష్టికాహార లోపం ఏర్పడి 30 ఏళ్లకే మోకాళ్ళ నొప్పులు, ఇతరత్రా వ్యాధులు చుట్టుముట్టేస్తున్నాయి. అందుకే అందరూ న్యూట్రిషన్ ఫుడ్‌కి ప్రాధాన్యం ఇవ్వాలి. శరీరానికి కావాల్సిన మినరల్స్ దొరికే ఫుడ్‌ని కంపల్సరీగా తినాలి.
 

Sunday, March 24, 2013

కరుణకు మరో పేరు సులక్షణ...

 

పురాణ స్త్రీ - సులక్షణ
కాశీ నగరంలో ప్రియవ్రతుడు, శుభవ్రత దంపతులు ధార్మికబద్ధమైన జీవనాన్ని సాగిస్తుంటారు. పరమశివుణ్ణి కొలుస్తూ మంచికి మారుపేరుగా మసలుతుంటారు. వారిని ఒకానొక చింత పీడిస్తుంటుంది. అది సంతానరాహిత్యం. పిల్లల కోసం గుళ్లూ గోపురాలు తిరుగుతుంటారు. అలా చాలా ఏళ్లకు వారి కడుపు పండుతుంది. లేక లేక అమ్మాయి పుడుతుంది. అందాల చిన్నారికి సులక్షణ అని పేరుపెట్టుకుంటారు. అల్లారు ముద్దుగా పెంచుకొస్తుంటారు. అయితే ఈ సంతోషం వీరికి ఎక్కువ కాలం నిలవదు.

పాప జన్మకుండలిని గణన చేసిన జోస్యులు ఆమె సంసార బంధనాలకు దూరంగా భగవంతుని సేవలోనే కాలం గడుపుతుందని చెబుతారు. దీంతో ప్రియవ్రతుడు తల్లడిల్లిపోతాడు. వంశం వృద్ధిపొందని నాడు, దౌహిత్రులే లేని నాడు తమకు గతులు చెడిపోతాయని బావురుమంటాడు. ఆ బాధతోనే అనతికాలంలో మృత్యువుఒడికి చేరుతాడు. భర్తపోయిన దుఃఖంలో శుభవ్రత కూడా కొన్నాళ్లకే కాలం చేస్తుంది. జననీ జనకులు హఠాత్తుగా దూరం కావడంతో సులక్షణ జీవితం అతలాకుతలమైపోతుంది. యుక్తవయసులో ఉన్న తనకు దేవుడు వినా వేరెవరూ దిక్కు కాజాలరని తలపోస్తుంది. ఉత్తరార్కమనే ప్రదేశానికి వెళ్లి శంకరుని కోసంతపస్సు ప్రారంభిస్తుంది.

అన్నపానాలు మాని తపమాచరిస్తున్న సులక్షణ చెంతకు ఒక మేషం వస్తుంటుంది. ధ్యానముద్రలో ఉన్న సులక్షణను కొంతసేపు తదేకంగా చూసి వెళ్లిపోతుంటుంది. ఇలా ప్రతీరోజూ ఈ మేక రావడం మామూలవుతుంది. సులక్షణ తపస్సు నానాటికీ ఉగ్రరూపం దాల్చడంతో శంకరుడు కటాక్షిస్తాడు. దర్శనమిస్తాడు. ఆమె కళ్లు తెరిచి నీలకంఠుని చూస్తుంది. ఆనంద పరవశురాలవుతుంది. భయభక్తులతో ప్రార్థనలు చేస్తుంది. ఆ సమయంలో అక్కడే ఉన్న మేకపిల్ల కూడా ఆమె కళ్లల్లో పడుతుంది. రోజూ తన ముంగిటకు మేషం వస్తోందన్న సంగతిని దివ్యదృష్టితో గ్రహించగలుగుతుంది.

సులక్షణ భక్తికి మెచ్చిన మహదేవుడు వరం కోరుకోమంటాడు. తనతో పాటుగా మేకను కూడా కరుణించాలని ఆమె విజ్ఞాపన చేస్తుంది. నోరులేని మేకకూ న్యాయం జరగాలనుకుంటున్న సులక్షణ హృదయాన్ని మెచ్చుకుంటాడు. తదుపరి జన్మలో కాశీరాజుకు కుమార్తెగా మేకపిల్ల రాచకన్యయై పుడుతుందని దీవిస్తాడు. ఆ వెంటనే పార్వతీపతి సులక్షణవైపు దృష్టి సారిస్తాడు. ఏం కావాలో చెప్పమంటాడు. ఆమె ధనకనకవస్తువాహనాలు కోరుకోదు. శాశ్వతంగా తనకు పార్వతీమాత సేవ చేసుకునే భాగ్యం కల్పిస్తే చాలంటుంది.

పార్వతీదేవికి నిత్యమూ సేవలు చేసుకునేలా సులక్షణను అనుగ్రహిస్తాడు. ఆమె వెనువెంటనే కైలాసంలో పార్వతీదేవికి అనుంగు చెలికత్తెగా మారిపోతుంది. ఆ అమ్మకు సపర్యలు చేస్తూ మహదానందాన్ని పొందుతుంటుంది. శంకరసతి సైతం సులక్షణ తీరుకు మురిసిపోతుంది. ఆమె మాట పొందిక, ఆ వినయవిధేయతలకు ముచ్చటపడుతుంది. ప్రాణసఖిగా ఆమెను చూసుకుంటుంది.

సులక్షణకు చిన్ననాటనే తల్లిదండ్రులు దూరమైపోతారు. ఎన్నో కష్టాలు ఎదురవుతాయి. కాని, చలించిపోదు. దైవాన్ని నమ్ముకుంటుంది. కంటకప్రాయమైన తపస్సును కోరి మరీ చేపడుతుంది. శివుడు ప్రత్యక్షమయ్యాక తన పక్కనే ఉన్న మేకపిల్లనూ అనుగ్రహించమంటుంది. మనిషి ఎంతటి విశాలమైన హృదయంతో మనుగడ సాగించాలో తెలుసుకోవాలంటే సులక్షణ జీవితాన్ని అర్థం చేసుకోవాలి. ప్రాణికోటిని ప్రేమించే ఆమె తత్వాన్ని ఆకళింపు చేసుకుంటే కలియుగాన ఎన్నో సమస్యలు సునాయాసంగా తొలగిపోతాయి. ప్రాణులన్నింటి ఆత్మ ఒక్కటేనని మనసావాచా నమ్మిన సులక్షణ సమత మమతలకు ప్రతిరూపం. భక్తిసామ్రాజ్యంలో ఆమె ఇప్పటికీ వెలుగుహారతులు అందుకోవడానికి హేతువిదే. బర్కరము అంటే మేక. ఒకానొక మేకపిల్ల దైవ కృపకు పాత్రమైన ప్రదేశం గనుకనే ఉత్తరార్కమనే ప్రాంతానికి అనంతరకాలంలో బర్కరీ తీర్థమన్న పేరు స్థిరపడింది.

- డా. చింతకింది శ్రీనివాసరావు
 

ఒత్తైన జుట్టు కోసం...

 

హోమియో
ప్రతి వెంట్రుక నెలకు దాదాపు సెంటీమీటరు పొడవు పెరుగుతుంది. తలపైన ఉండే వెంట్రుక మూడు నుంచి నాలుగు నెలలకొకసారి రాలడం, ఆ ప్రదేశంలో కొత్త వెంట్రుక రావడం సాధారణంగా జరుగుతుంటుంది. ఇలా జుట్టు రాలే క్రమంలో రోజూ కొన్ని వెంట్రుకలు రాలిపోవడం అన్నది చాలా సాధారణంగా జరుగుతుండే ప్రక్రియ. కొందరిలో సాధారణం కంటే ఎక్కువ జుట్టు రాలిపోవడం సమస్యగా మారుతుంది.

జుట్టు రాలడానికి కారణాలు...

జుట్టు రాలడానికి అనేక కారణాలు ఉన్నాయి. అనారోగ్యంతో బాధపడివారిలోనూ, మేజర్ శస్త్రచికిత్స జరిగినవారిలోనూ జట్టు రాలడం అన్న సమస్య రావచ్చు. అలాగే ఎక్కువ ఒత్తిడిని ఎదుర్కొంటున్నప్పుడు కూడా జుట్టు రాలవచ్చు. అలాగే హార్మోనుల మార్పు, థైరాయిడ్ సమస్య వల్ల జుట్టు రాలుతుంటే తగిన చికిత్సతో అదుపు చేయవ చ్చు. పురుషుల్లో ఆండ్రోజెన్, మహిళల్లో ఈస్ట్రోజెన్ హార్మోనుల్లో మార్పుల వల్ల కూడా జుట్టు రాలుతుంది. కొందరు మహిళల్లో బిడ్డ పుట్టిన మూడు నెలల తర్వాత జుట్టు రాలడం సాధారణం. ఆ తర్వాత హార్మోనులన్నీ సాధారణస్థితికి వచ్చాక జుట్టు రాలడం ఆగిపోయి, మామూలుగా పెరుగుతుంది. కొన్ని మందుల వాడకం, కొన్ని ఇన్ఫెక్షన్స్ (ఫంగస్), లూపస్, డయాబెటిస్ లాంటి వ్యాధుల వల్ల కూడా జుట్టు రాలవచ్చు. పైన పేర్కొన్న కారణాలను కనుగొని, చికిత్స చేస్తే జుట్టు రావచ్చు. కానీ... కొందరు పురుషుల్లో బట్టతల వల్ల శాశ్వతంగా జుట్టు రాలిపోతుం ది. స్త్రీలలోనూ కొందరికి బట్టతల వచ్చినప్పటికీ అది చాలా అరుదు.

జుట్టు రాలడం ఆపేందుకు చికిత్స...

జుట్టు రాలడానికి తగిన కారణాన్ని కనుగొని దానికి అనుగుణంగా చికిత్స చేయడం వల్ల మళ్లీ జుట్టు వచ్చేలా చేయవచ్చు. హోమియో మందుల ద్వారా ఆరోగ్యానికి ఎలాంటి హానీ చేకూర్చకుండా జుట్టు రాలడాన్ని ఆపగలవు. నేట్రమ్‌మూర్, ఫ్లోరిక్ యాసిడ్, సెపియా, తూజా, ఫాస్ఫరస్, గ్రాఫైటిస్, కార్బోవెజ్ వంటివి మంచి ప్రభావాన్ని చూపుతాయి. అయితే జుట్టు రాలుతున్న వ్యక్తి రుగ్మతలు, స్వరూప-స్వభావాలు, ప్రవర్తన వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని వీటిని నిర్ణయించాల్సి ఉంటుంది. ఉదాహరణకు నేట్రమ్‌మూర్ అనే మందు... పాలిచ్చే తల్లుల్లో జుట్టు రాలడాన్ని ఆపుతుంది. రక్తహీనత, కళ్ల చుట్టూ నల్లటి వలయాలు లేదా నీలపు మచ్చలు ఉన్న అమ్మాయిలకు బాగా పనిచేస్తుంది.
 
పుత్రుడు పుట్టగానే తండ్రికి సంతోషము కలుగదు.
తన కొడుకు గొప్పవాడై ప్రజలు అతనిని పొగుడుతున్నపుడు ఆ తండ్రికి నిజమైన పుత్రోత్సాహం కలుగుతుందన్నాడు సుమతీ శతకకారుడు.
 

వేసవి చిక్కులు వేయి చిట్కాలు............

 

వేసవి వచ్చేసింది. తనతోపాటు వడగాలులు, దాహం, నీరసం, అలసట... తీసుకొస్తుంది. వీటివల్ల చిరాకుతో మరింత నీరసం. రోజంతా సూర్యుడు నిప్పులు కురిపిస్తాడు. ఆ ఎండలకు ఒకటే ఉక్కపోత. పగలు ఎక్కువ, రాత్రి సమయం తక్కువగా ఉంటుంది. ఇన్నిటి మధ్యన వేసవిలో మాత్రమే వచ్చే మధుర ఫలం మామిడి, చల్లని లేత కొబ్బరిలాంటి తాటిముంజలు, తీయని పుచ్చకాయలు, నోరూరించే ఐస్‌ఫ్రూటులు, ఐస్‌క్రీములు, లస్సీ, ఫలూదా, పుదీనా పానీ లాంటివి వుండనే వున్నాయి. వీటి సాయంతో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే మండు వేసవిని కూడా చల్లని వెన్నెలా ఆస్వాదించొచ్చు.
వేసవి వచ్చిందంటే చాలు! నోరు ఊరక పిడచకట్టుకుపోతుంటుంది. చల్లగా ఏదైనా తాగితే బాగుండనిపిస్తుంది. బయట కన్పించే శీతలపానీయాలు దాహాన్ని మరింత పెంచుతాయి. సరిగ్గా ఇలాంటి సమయంలోనే కొంచెం తెలివిగా ఆలోచించాలి. ఏది పడితే అది తాగేయకుండా ఏది ఆరోగ్యమో, ఏది అనారోగ్య హేతువో ఆలోచించాలి.
నీరు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. పిల్లలకు మజ్జిగ, కొబ్బరి నీళ్లు, గ్లూకోజ్‌ నీళ్లు, నిమ్మరసం, ఎండు ఖర్జూరం నానబెట్టిన నీళ్లు, సగ్గుబియ్యం కాచిన నీరు, గ్లాసుడు నీళ్లలో చిటికెడు ఉప్పు, ఓ స్పూన్‌ పంచదార కలిపి ఒ.ఆర్‌.ఎస్‌ ద్రావణంలా కలిపి ఇస్తే మంచిది. వీటికి తోడు తాజా పండ్లు, పుచ్చముక్కలు, చెరుకు రసం ఉండనే ఉన్నాయి.


నోరూరిస్తూ ఆకర్షించే కూల్‌డ్రింకులు తాత్కాలికంగా దాహాన్ని తీరుస్తాయి తప్పితే మరెందుకూ ఉపయోగపడవు. తాగిన కొద్ది సేపటికే మళ్లీ దాహం వేస్తుంది. వాటికి బదులు తాజా పండ్లు, పళ్ల రసాలు, కొబ్బరినీళ్లు, మజ్జిగ, నిమ్మకాయ రసం లాంటివి ఆరోగ్యానికి మంచిది. పుచ్చకాయ, కర్బూజా, బొప్పాయి ముక్కలు తింటే కడుపు నిండుతుంది. దాహార్తిని అరికట్టువచ్చు. రాగి-బార్లీ జావ ఆరోగ్యానికి ఎంతో మంచిది. చేయడం కూడా తేలిక. అందులో పంచదార కానీ, తీపి ఇష్టం లేనివాళ్లు మజ్జిగ, ఉప్పు కలుపుకుని గానీ తాగితే చలువ చేస్తుంది. సగ్గుబియ్యం జావ కూడా శరీర వేడిని తగ్గిస్తుంది. ఈకాలంలో జంక్‌ఫుడ్‌, మసాలాలు, స్వీట్లు, కొవ్వు పదార్థాలు ఎక్కువ తినకపోవడమే మంచిది.
కాఫీ, టీ వంటి వేడిగా ఉండే ద్రవాలను తీసుకోవడం వల్ల బయటి వాతావరణ వేడికి తోడు వీటి వేడి వల్ల మరింత చెమట పట్టి చిరాకు తెప్పిస్తాయి. అందువల్ల వీటికి దూరంగా ఉంటేనే మంచింది. వాటికి బదులుగా చల్లటి లస్సీ, నిమ్మరసం తీసుకుంటే ఆరోగ్యం కూడా. వేసవిలో అందరూ ఇష్టంగా తాగే పానీయం నిమ్మరసం. పల్చగా చేసిన మజ్జిగలో కొద్దిగా నిమ్మరసం, ఉప్పు, పంచదార కలుపుకుని తాగితే వేసవిలో ఉండే అధిక దాహార్తి తగ్గి శరీరానికి కావలసిన లవణాలు లభిస్తాయి. అందులోనే అల్లం, పచ్చిమిర్చి ముద్ద కూడా కొద్దిగా వేసుకుంటే మజ్జిగ మరింత రుచిగా వుంటాయి.


వేసవిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పిల్లల గురించి. స్కూళ్లకు సెలవులు కావడంతో వీరిని వడదెబ్బ బారిన పడకుండా రక్షించుకోవడం చాలా ముఖ్యం. కష్టం కూడా. ఎండాకాలంలో దుమ్ము, ధూళి, కాలుష్యం వంటి అనారోగ్య పరిసరాలు పిలలకి ఎక్కువ హాని కలిగిస్తాయి. వేసవిలో నిర్ణీత ఆహార నియమాలు పాటించాలి. చాక్లెట్లు, స్వీట్ల వంటి తీపి పదార్థాలు తింటున్నప్పుడు బాగానే ఉంటాయి కానీ అతిగా దాహం వేస్తుంది. ఆకలి మందగిస్తుంది. దాంతో నీళ్లతోనే కడుపు నింపుకుంటారు. అందులోనూ పిల్లలు మరీ చల్లటి నీళ్లు తాగుతుంటారు. ఇది పళ్లకు హానిచేస్తుంది. పైగా అంత చల్లటి నీళ్లు రుచిని కోల్పోతాయి. కుండలోనీళ్లు రుచిగాను, చల్లగా ఉంటాయి. ఆరోగ్యానికి కూడా మంచిది. స్టీలు బిందెకు మందపాటి టవల్‌ చుట్టి ఆరారా తడిపి చూడండి. ఆ నీళ్లు కూడా చల్లగా బావుంటాయి. ఎండు ఖర్జూరాలను రాత్రిపూట నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే వాటిని నలిపి, ఆ నీళ్లలో పటిక బెల్లం వేసి చిన్నపిల్లలకు ఇస్తే చలువ చేస్తుంది.
చిన్నారులు...చిరు వ్యాపకాలు...
పిల్లలను ఎండలో తిరగకుండా నీడపట్టున ఉంచడం పెద్ద ప్రహసనమే అవుతుంది. సెలవుల్లో వాళ్లకు ఏదో ఒక వ్యాపకం ఉండాలి. ఖాళీగా ఇంట్లో ఉన్నారంటే టీవీ చూస్తూనే ఉంటారు. అది అంత మంచిది కాదు. అందుకని వాళ్లకి ఇష్టమైన పనినే హాబీగా అలవాటు చేస్తే మంచి కాలక్షేపం. వాటిలో బొమ్మలు వేయడం, సంగీత సాధన, కథల పుస్తకాలు చదవడం, ఫొటోలు తీయడం లాంటివి ఎన్నో. వీటికి తోడు సమ్మర్‌ క్యాంపులు కూడా ఉన్నాయి. ఇంకా ఇంట్లో చిన్న చిన్న పనులు చెప్పి చేయిస్తుంటే వారికీ ఇంటి పనుల బాధ్యత తెలుస్తుంది. సాయంత్రం చల్లబడ్డ తర్వాతే బయటికి ఆడుకోవడానికి పంపించాలి. లేదంటే ఎండదెబ్బకి పిల్లలు తోటకూర కాడల్లా వాలిపోతారు. వేసవిలో పిల్లలు అమితంగా ఇష్టపడేది నీళ్లలో ఆడడం. చల్లగా ఉంటుందని ఎక్కువ సేపు నీళ్లలో ఉండడానికి ఇష్టపడతారు. మధ్యాహ్న సమయంలో అస్సలు నీళ్ల దగ్గరికి వెళ్లనివ్వకూడదు. ఉదయం, సాయంకాలాలు మాత్రమే స్విమ్మింగ్‌ కి అనుమతివ్వాలి. లేదంటే నీళ్లలో ఉన్నంతసేపు బాగానే ఉంటుంది కానీ తర్వాత వాతావరణ వేడికి వడదెబ్బ బారినపడే ప్రమాదముంది.
పిల్లలెప్పుడూ మనతోటే ఉంటారు. వాళ్లమీద ప్రేమకొద్దీ ఏది కావాలంటే అది కొనిస్తుంటాం. నిముషాల్లో అమర్చిపెడుతుంటాం. వాళ్లకిష్టంలేనివి జరిగాయంటే భరించలేరు. అలాంటప్పుడు నలుగురితో సర్దుకుపోవడమెలాగో పిల్లలకి ఎలా తెలుస్తుంది? అందుకే కొన్ని రోజులు అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యల దగ్గరికి పంపించడానికి వేసవి సెలవులు మంచి సమయం. ఏదో ఒక పండుగకు అందరం వెళ్తుంటాం. కానీ అప్పుడు హడావుడిగా ఓ రెండు మూడ్రోజులే ఉంటాం. కానీ ఇప్పుడలా కాదు. వాళ్లకి సమయం ఎక్కువగా ఉండేది వేసవిలోనే. ఓ పది రోజులు పెద్ద వాళ్ల దగ్గర ఉంచితే పిల్లలకు పెద్దలకు మధ్య అనుబంధం మరింత బలపడుతుంది. అందరితో కలివిడిగా ఉండడమెలాగో తెలుస్తుంది.
రాత్రి వెన్నెల్లో నాలుగు స్థంభాలాట ఆడుతూ అమ్మమ్మో, నానమ్మో భోజనానికి పిలుస్తున్నా పట్టించుకోకుండా ఆటల్లో మునిగిపోవడం, రాత్రిపూట డాబామీద వరుసగా చాపలేసుకుని (వీలయితే రాత్రి భోజనం కూడా అక్కడే) ఆకాశంలో నక్షత్రాలను చూస్తూ, వాటిని లెక్కపెట్టే ప్రయత్నం చేస్తూ... పెద్దవాళ్లు చెప్పే రాజుల కథలు వింటూ నిద్రలోకి జారుకోవడం... ఇవన్నీ కాదంటే... సంవత్సరాంత పరీక్షలు అయిపోగానే పిల్లలకు వేసవి శిక్షణా తరగతులు మొదలవుతుంటాయి. 45 రోజులు నుంచి రెండు నెలల వరకు ఇవి జరుగుతుంటాయి. ఎక్కువ సమయం కాకపోయినా రోజులో గంటో రెండు గంటలో ఉంటుంటాయి. స్కూలుకు వెళ్లే రోజుల్లో నేర్చుకోడానికి వీలవనివి సమ్మర్‌ స్పెషల్‌ క్లాసుల్లో నేర్చుకోవచ్చు. సంగీతం, నాట్యం, ఏదైనా వాయిద్య పరికరాలు, కరాటే, స్విమ్మింగ్‌, డ్రాయింగ్‌, పెయింటింగ్‌ వంటివి నేర్చుకోడానికి మంచి అవకాశం లభిస్తుంది.



విహారాల వేళ
మన దేశంలో ఎన్నో చూడచక్కని ప్రదేశాలున్నాయి. అభిరుచి, సమయ పాలన, ఆర్థిక స్ధోమతకు తగ్గట్టు దగ్గర్లోనో, దూరంగానో ఏదో ఒక ప్రదేశానికి ప్రయాణమవుతాం. కొత్త ప్రదేశానికి వెళ్తున్నామంటే అక్కడి ప్రకృతి అందాన్ని, ఆనందాన్ని ఆస్వాదించడమొక్కటే కాదు. అందుకు తగిన జాగ్రత్తలు కూడా అవసరం. అదీ వేసవి కాలంలో అంటే మరీ జాగ్రత్తగా ఉండాలి. వెళ్లేది వేసవిలో కాబట్టి అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకోవాలి. పైగా కొత్త ప్రదేశాలు కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చాలా ముఖ్యం. మంచినీళ్లు, ఆహారం విషయంలో అప్రమత్తత అవసరం. కొత్త ప్రదేశంలో లభించే వంటకాలను రుచి చూడడం వరకే సరిపెట్టాలి. రుచిగా ఉన్నాయి కదాని ఎక్కువ తిన్నా తర్వాత ఇబ్బందులు పడాల్సొస్తుంది. అవసరమైన మందులు దగ్గర పెట్టుకోవాలి. వయసులో పెద్దవాళ్లుంటే వాళ్లకు అవసరమైన మందులూ, ఇతర జాగ్రత్తలు తప్పనిసరి.
కాటన్‌ బట్టలకే పెద్ద పీట
వేసవి అంటే చాలు మనసు చల్లగా ఉండే కాటన్‌ దుస్తులమీదకి పోతుంది. నిన్న మొన్నటి వరకు హాయిగా అనిపించిన సిల్కు, షిఫాన్‌ దుస్తులు ఒక్కసారిగా చిరాకు తెప్పిస్తాయి. చల్లగా, మెత్తగా, హాయిగా ఉండే కాటన్‌ దుస్తులు సౌకర్యంగా ఉంటాయి. కాటన్‌లోనూ మంగళగిరి, కంచి, వెంకటగిరి, ఉప్పాడ, చీరాల గద్వాల్‌, కోటా... ఇలా బోలెడు రకాలున్నాయి. ఫ్యాషన్‌ ప్రియులకు కూడా కాటన్‌లో ఎన్నో రకాలున్నాయి. ఇంతకముందులా కాకుండా ఎన్నో డిజైన్లు, ప్రింట్లు. చూడ్డానికి సిల్కు వాటిలా ఉన్నా బోలెడు వెరైటీలు. పిల్లలు, పెద్దలు, ఆడ మగా తేడా లేకుండా అందరికీ నచ్చే, అందరూ మెచ్చేలా తయారవుతున్నాయి. కాటన్‌లో ఎన్ని రంగులు, డిజైన్లు వచ్చినా లేత రంగులకున్న ప్రాధాన్యత ముదురు రంగులకు ఉండదు. కాస్త శ్రద్ధ పెట్టామంటే చాలా రోజులు మన్నుతాయి కూడా. ఉద్యోగులైతే... ఒక్కసారి గంజిపెట్టి ఇస్త్రీ చేయిస్తే నాలుగైదు సార్లు ధరించొచ్చు. ఎప్పటికీ కొత్తవాటిలాగే కనిపిస్తాయి.
వేసవి ఫలాలు...
వేసవిలో మాత్రమే ఎక్కువగా దొరికే పండ్లు మామిడి, పుచ్చ. పండ్లలో రారాజు మామిడి. వేసవిలో ఎక్కువగా వచ్చేవి ఈ పండ్లే. కంటికి ఆకర్షణీయంగా కనిపించడమే కాదు, రుచిలోకూడా దీనికి సాటి మరోటిలేదు. పండ్లుగా తినడమేకాదు, ఎన్నో రుచికరమైన పదార్థాలు కూడా చేసుకోవచ్చు. మామిడి పండ్ల గుజ్జుతో ఐస్‌క్రీములు, కేకులు, ఫ్రూట్‌ సలాడ్‌... ఇలా ఒకటేమిటి. ఎన్నో రకాలు. వీటికి తోడు మామిడికాయతో చేసే పచ్చళ్లు మరెన్నో. మాగాయ, ఆవకాయ, ముక్కల పచ్చడి... ఇలా బోలెడు రకాలు. అందులోనూ పచ్చడి కలిపిన బేసిన్‌లోనే కాస్త అన్నం కలిపితే నాకో ముద్దంటే నాకో ముద్దంటూ ఇంట్లో అందరూ పోటీపడి తినడం భలేగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో ముద్దపప్పు, కాస్త నెయ్యి, కొత్త ఆవకాయ ముక్క కలుపుకుని తింటే ఆ రుచి ఎప్పటికీ మర్చిపోలేం. వేసవి ఆరంభంలోనే పండుమిరపకాయ, టమాటా , ఉసిరి పచ్చళ్లు పెట్టకోవడం మొదలవుతుంది.



పైకి ముదురాకుపచ్చలో, చారలు చారలుగా కనిపించినా కోయగానే ఆకట్టుకునే ఎరుపు రంగుతో తియ్యగా నోరూరిస్తుంది పుచ్చకాయ. ఎంతటి మండుటెండలోనైనా సరే పుచ్చకాయ ముక్కలు నాలుగు తింటే కడుపులో చల్లగా, హాయిగా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది. శరీరానికి కావలసిన పోషకపదార్థాలను అందిస్తుంది. గుండె పనితీరు, రక్త ప్రసరణను మెరుగుపరచడంతో పాటు డయాబెటిస్‌తో బాధ పడేవారికి మేలు చేస్తుంది. మరో విషయం... చర్మ సంరక్షణకి దీని గుజ్జు భలేగా పనిచేస్తుంది. ఇందులోని గింజలు కూడా ఉపయోగపడేవే. వీటిని వేయించి స్నాక్స్‌లా తింటారు. అంతే కాక... పొద్దు తిరుగుడు గింజలకులాగే వీటి గింజల్నుండి కూడా నూనె తీస్తారు. పుచ్చకాయలోని ఎర్రని పదార్థాన్ని తిన్న తర్వాత మిగిలిన దాన్ని పడేస్తాం. కానీ దేశాల వాళ్లు ఇందులోని తెల్లటి పదార్థాన్ని ముక్కలు కోసి నిల్వ పచ్చళ్లు కూడా పెడతారట. రుచిగా ఉండి దాహాన్ని తీర్చడమే కాకుండా, అనేక వ్యాధుల నివారణకీ ఉపయోగపడుతుంది.



తాటిముంజెలు వేసవిలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. లేత కొబ్బరిలా ఉండే తాటి ముంజెలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొబ్బరిబోండాలు కాస్త రేటు ఎక్కువ అనిపించినా తర్వాత హాస్పటల్‌, మందుల ఖర్చుతో పోల్చుకుంటే వీటికి పెట్టే ఖర్చు తక్కువే. కొబ్బరి నీళ్లలో అనేక పోషకాలు ఉన్నాయి. అధిక ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. మూత్ర విసర్జన సాఫీగా అయి కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు దరి చేరవు. కొబ్బరి నీళ్లలో గ్లూకోజ్‌ కలుపుకుని తాగితే వేసవి బడలిక, నీరసం చాలా త్వరగా తగ్గిపోతుంది.


వాతవరణంలో ఉష్ణోగ్రత ఎక్కువగా వుండడం వల్ల ఒంట్లోని నీరంతా త్వరగా ఆవిరయిపోతుంది. ఫలితంగా నీరసం, నిస్సత్తువ. అందుకే ఈ కాలంలో ఎక్కడికి వెళ్లాలన్నా నీళ్ల బాటిల్‌ వెంట ఉంచుకోవాలి. దాహం అయినప్పుడే తాగుదామని కాకుండా ఆరారా గొంతు తడుపుకుంటుండాలి. వీలును బట్టి పుచ్చకాయ ముక్కలు, మజ్జిగ, కొబ్బరిబోండాం, కీరాదోస ముక్కలు తీసుకుంటుండాలి. వీటి వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. ఎండాకాలం శీతలపానీయాల జోలికి వెళ్లకపోవడమే ఉత్తమం. ఇవి తాగినప్పుడు దాహం తీరినట్లు అనిపిస్తుంది. డ్రింకుల్లో ఉండే పంచదార వల్ల తర్వాత కొద్ది సేపటికే మళ్లీ దాహం వేస్తుంది. వాటిలో ఆరోగ్యానికి ఉపయోగపడే పదార్థాలేవీ ఉండవు. పైగా వాటిలోని రసాయనాల వల్ల వచ్చే నష్టమే ఎక్కువ.
చర్మం కోసం...
చర్మం నల్లబడడం, దద్దుర్లు రావడం, చర్మం మృదుత్వం కోల్పోవడం లాంటివి సాధారణంగా ఎండాకాలంలో ఎదురయ్యే సమస్యలు. ఉదయం తొమ్మిది పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎండలో తిరగకపోవడమే మంచిది. తప్పనిసరైతే గొడుగు వేసుకునో, స్కార్ఫ్‌ కట్టుకునో బయటికి వెళ్లాలి.
వేసవిలో ఎక్కువగా ఇబ్బంది పెట్టేది చెమట. తద్వారా వచ్చే దుర్వాసన. అయితే ఇది అందరికీ వర్తిస్తుందని చెప్పలేం కానీ కొంతమందిని తీవ్రంగా బాధించే విషయం. చెమట దుర్వాసననుండి తప్పించుకోవాలంటే కొన్ని చిట్కాలు వున్నాయి. రోజూ రెండుసార్లు సాన్నం చేయడం తప్పనిసరి. కొంతమందికి వేడి నీళ్లతో సాన్నం చేస్తేగానీ చేసినట్లు ఉండదు. మరీ వేడినీళ్లతో చేయడం వల్ల ఆవిరిగా ఉండి వెంటనే చెమటపడుతుంది. అలా కాకుండా చన్నీళ్లు, చల్లని నీళ్లతో చేయలేకపోతే గోరు వెచ్చటి నీళ్లతో చేయాలి. కాస్త పౌడర్‌ అద్దుకుంటే చమటని నివారిస్తుంది.


మరో సమస్య మొటిమలు. వీటికి కాలానితో పని లేకపోయినా వేసవి కాలంలో ఉక్కపోతకి చర్మం జిడ్డు పట్టినట్లయి మొటిమలు రావడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. వీటికోసం ఒక టీ స్పూన్‌ కొత్తిమీర రసం, ఒక స్పూన్‌ పుదీనా రసంలో చిటికెడు పసుపు కలిపి ముఖానికి పట్టిస్తే మొటిమలు రావు.


ఎండలో బయటికి వెళ్లాల్సొస్తే సన్‌స్క్రీన్‌ లోషన్‌ రాసుకోవాలి. వీలయినన్ని సార్లు ముఖాన్ని చల్లటి నీళ్లలో కడగాలి. అలాగని ప్రతి సారీ సబ్బు ఉపయోగించకూడదు. ఎక్కువసార్లు సబ్బు వాడడం వల్ల చర్మం పొడిబారుతుంది.
కళ్లకు రక్షణ తప్పనిసరి. కళ్లచుట్టూ ఉండే చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. ఎండ వేడిమికి ఎక్కువసేపు ఉంటే కళ్లు తొందరగా అలసిపోతాయి. ఎక్కువ సేపు ఎండలో వుంటే కళ్లు మసకబారడం, చీకట్లు కమ్మినట్లవడం, కళ్లచుట్టూ నల్లటి వలయాలు ఏర్పడడం చూస్తుంటాం. ఇలాంటి వాటి బారిన పడకుండా ఉండాలంటే కళ్లకు నేరుగా ఎండ తగలకుండా చూసుకోవాలి. వీలయినంత వరకు గొడుగు ఉపయోగించడం, ముఖానికి ఎండ వేడిమి తగలకుండా స్కార్ఫ్‌ కట్టుకోవడం, టోపీలు పెట్టుకోవడం కూడా చేయొచ్చు. ఇప్పుడు మార్కెట్లోకి రకరకాల టోపీలు వస్తున్నాయి. ముద్దగా ఉండే తెల్ల నందివర్ధనం పువ్వు, బచ్చటి ఆకులు కళ్లమీద పెట్టుకోవడం వల్ల కళ్ల మంటలు తగ్గుతాయి. కీరదోసకాయను చక్రాల్లా కోసి కళ్లమీద పెట్టుకుంటే కళ్ల మంటలు తగ్గి కొంత ఉపశమనం కలుగుతుంది. కీరదోస కళ్లకే కాదు చర్మానికీ మంచిదే. కీరదోస గుజ్జును చర్మానికి రాసుకుంటే చర్మం మెరుపు వస్తుంది.
ఈ కాలంలో బయటికెళ్లేవారు ముఖ్యంగా బైకుల మీద వెళ్లేవారు చలువ కళ్లద్దాలు పెట్టుకోవడం మర్చిపోకూడదు. అలాగే సూర్యకిరణాలు నేరుగా చర్మం మీద పడకుండా చేతులకు గ్లౌజులు వేసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. కాళ్లకు సాక్సులు, బూట్లు వేసుకోవడం వల్ల గాలి తగలక చెమటపట్టి ఎలర్జీ వచ్చే అవకాశం ఉంది. అందుకే వేసవి కాలం వరకు వాటికి వీలయినంత దూరంగా ఉండి చెప్పులు వేసుకోవడమే శ్రేయస్కరం.
వేసవిలోనూ వ్యాయామం
వేసవిలో ఎండలకు అలసటగా, బద్దకంగా ఉంటుంది. అయినా శరీరానికి తగినంత వ్యాయామం అవసరం. రోజులో కనీసం అరగంట వ్యాయామానికి కేటాయిస్తే మంచిది. అధిక శ్రమతో కూడిన వ్యాయామాలు అవసరం లేదు. శరీరానికి కొద్దిగా చెమట పట్టేలా వేగంగా నడకయినా సరే. ఉదయమో, సాయంత్రమో ఎండ లేనప్పుడు కొద్ది సమయాన్ని కేటాయిస్తే చాలు. జాగింగ్‌, వాకింగ్‌, సైకిల్‌ తొక్కడం, స్కిప్పింగ్‌ వంటివి తేలికగా చేసుకోవచ్చు.
ఇలా చిన్ని చిన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు! వేసవి కాలం హాయిగా గడిచిపోతుంది.


హిమక్రీముల హవా!
ఎండాకాలం వస్తుందంటేనే చల్ల చల్లని ఐసులు, నోట్లో వేసుకోగానే కరిగిపోయే ఐస్‌క్రీములు గుర్తొస్తాయి. ఒకప్పుడు వేసవి రావడం ఆలస్యం... సైకిల్‌ మీద ఐసు పెట్టెతో గంట కొట్టుకుంటూ వచ్చేవాడు ఐసులమ్మే అబ్బాయి. వీధిలోని పిల్లలంతా గ్లాసో, గిన్నో పట్టుకుని ఐస్‌ బండి చుట్టూ చేరిపోయేవారు. అప్పుడు పుల్లైస్‌, పాలైస్‌ మాత్రమే ఉండేవి. ఇప్పుడు కాలంతో సంబంధం లేకుండా ఎప్పుడు కావాలంటే అప్పుడు రకరకాల ఐస్‌ఫ్రూట్లు, ఐస్‌క్రీములు అందుబాటులో ఉంటున్నాయి. వీటిలో ఏన్నో రంగులు, మరెన్నో ఫ్లేవర్లతో నోరూరిస్తుంటాయి. స్ట్రాబెరీ, చాకొలెట్‌, ఆరంజ్‌, యాపిల్‌, పైనాపిల్‌, మామిడి, ద్రాక్షా, పుచ్చ... ఇలా ఒకటేమిటి! వంద రకాల రుచులు. వీటిలోనే పాలమీగడలాంటి కుల్ఫీది ప్రత్యేక స్థానం. వీటితో చిక్కులు కూడా వుంటాయి కనుక జాగ్రత్త పడుతుండాలి.
ఇది మల్లెల వేళయనీ...
వేసవిలోనే దొరికేవి మల్లెలు. తెల్లటి మల్లెపూలను చూస్తేనే మనసుకు హాయిగా ఉంటుంది. మంచి సువాసనలిస్తూ హాయిగొలుపుతాయి. ఇవి ఆరోగ్యానికి కూడా మంచిదే. చలువ చేస్తుంది. ఎండాకాలంలో అధిక వేడికి తరచూ తలనొప్పితో బాధపడేవారు చాలామంది ఉంటారు. ఈ పూలని పట్చటి క్లాత్‌లో చుట్టి మాడుకు కట్టుకుంటే తలనొప్పి తగ్గి మాడు చల్లగా ఉంటుంది. ఇక పూలజడలంటే ఇష్టపడని మగువలు ఉండనే వుండరు. ఇప్పటి పిల్లల్ని పూలు పెట్టుకోమంటే ఏదో కొత్త విషయాన్ని విన్నట్లుగా చూస్తుంటారు కానీ ఇంతకు ముందు ఆలా కాదు. మల్లెపూల సీజన్‌ వచ్చిందంటే చాలు... కనీసం ఒక్కసారైనా పూలజడ వేయించుకోవాల్సిందే. మల్లెపూలకు మధ్యలో కనకాంబరాలు, మరువం చేర్చి జడ కుడితే ఆ ఆందమే వేరు. ఆ జడల్లో కూడా ఒంకుల జడ, పుల్లలకు పూలను గుచ్చి కుట్టించుకునేది... ఇలా ఎన్ని రకాలో. ఈ సరదా పిల్లలకే కాదు కాస్త పెద్దవాళ్లు కూడా ముడి చుట్టుకునేవారు.


ఇల్లు చల్లగా...
వేసవి మొదలు కాకముందే ఎండలుమండిపోతున్నాయి. గాలి రాకపోకలకు కిటికీలెంత ప్రధానమైనవో తెలియంది కాదు. కూలర్లు, ఏసీలు ఉన్నా ప్రస్తుత కాలంలో కరెంటు కోతలే ఎక్కువ. ఎప్పుడు కరెంటు ఉంటుందో, ఎప్పుడు పోతుందో చెప్పడం కష్టం. అందుకే వాటి మీద ఆధారపడితే వేడిగాలికి, ఉక్కకు బెంబేలెత్తాల్సిందే. వేడిగాలిని నివారించాలంటే కిటికీలకు, గుమ్మాలకు వట్టివేళ్ల చాపలు కట్టి మధ్యమధ్యలో తడుపుతుంటే గదంతా చల్లగా ఉంటుంది. వట్టివేళ్లు మంచి వాసన కూడా వస్తాయి. వేడిని పెంచేవి ఎక్కువగా విద్యుత్‌ పరికరాలే. ఇంట్లో టీవీ, ఫ్రిజ్‌, వాషింగ్‌ మెషీన్లు వంటి వాటినుండి కూడా వేడి ఉత్పత్తవుతుంది. ఉదయం సాయంత్రం కొద్దిసేపు కిటికీ తలుపులు, గుమ్మం తలుపులు తీసి ఉంచాలి. పై కప్పు నుండి అధిక వేడిని నివారించే ధర్మాకోల్‌ షీట్లు, వేడిని నిరోధించే సున్నం వంటివి ఏర్పాటు చేసుకుంటే కొంత వరకు ఉపశమనం పొందొచ్చు. అన్నిటికంటే ముఖ్యమైనది పచ్చదనం. మొక్కలను ఎక్కువగా పెంచితే చల్లటి స్వచ్ఛమైన గాలి. ఆరోగ్యకరమైన వాతావరణం ఎప్పటికీ మన సొంతమవుతాయి.

అంజూర్‌... జీ

 

అంజూర ఫలం, అత్తిపండు, ఫిగ్‌, సీమ మేడిపండు... ఎలా పిలిచినా పలుకుతుంది.
అయితే, దీన్నెవరూ పెద్దగా పట్టించుకోరు. కారణం - దీని రంగు వెంటనే కంట్లోపడదు.
ఇక రుచి విషయానికొస్తే తీపి, పులుపు, వగరు కలిసిన అదోరకం రుచి. ఈమధ్య డ్రైఫ్రూట్‌ లడ్డూలో దీన్ని విరివిగా వాడుతున్నారు. అవును!
డ్రై ఫ్రూట్స్‌ షాపులో దారానికి ఎక్కించి చుట్టలా కనిపిస్తుందే! అదే అంజూర్‌! ఆ... ఇప్పుడు అర్థమైంది కదా!
ఎన్నయినా చెప్పండి! అంజూర్‌ కొనడం మా వల్ల కాదు అంటారా? అంజూర్‌ ఎందుకు కొనాలంటే ఇందులో బోలెడన్ని పోషకాలు ఉన్నాయి కనుక! అవి తింటే మనకే మంచి జరుగుతుంది కనుక!



అంజూర్‌లో కొవ్వు, పిండిపదార్థాలు, సోడియం వంటివి తక్కువ.
ఖనిజాలు, పీచు, విటమిన్లు అంజూర్‌లో సమృద్ధిగా లభిస్తాయి.
పాలు, పాల ఉత్పత్తులు ఇష్టపడనివారు వీటిని తీసుకుంటే శరీరానికి కావలసిన క్యాల్షియం, ఐరన్‌ అందుతాయి. అందుకే రక్తహీనతతో బాధపడేవారికి అంజూర్‌ తినమని వైద్యులు సలహా ఇస్తుంటారు.
కడుపులో మంట, అజీర్తి, పేగుపూత లాంటివి తలెత్తకుండా అంజూర్‌ కాపాడుతుంది.
ఇందులోని పొటాషియం గుండెకు సమస్యలు రానివ్వదు.
రక్త ప్రసరణ సక్రమంగా జరగడానికి తోడ్పడుతుంది.

మెరిసే మురిపెం - ముత్యం


























 

ముత్యాలంటేనే మగువలకు ఓ మంచి ఫీలింగ్‌. ముత్యాల నునుపు, నిగారింపు మదిని ఇట్టే ఆకట్టుకుంటాయి. ధరిస్తే ఎక్మడ లేని అందాన్నీ తీసుకొచ్చి మనస్సును మురిపిస్తాయి. ముత్యాలు ధరించినప్పుడు వచ్చే అందమే వేరు!

హుందాతనం, సౌందర్యం మేళవించిన ముత్యాలు తమ వద్ద వుండాలని ప్రతి మహిళా కోరుకుంటుంది. ఎన్నాళ్లు వాడినా వన్నె తగ్గనివి ముత్యాలు. ఉంగరం, గొలుసు, దిద్దులు, జుంకాలు, గాజులు... ఇలా ముత్యాలను ఎలాగైనా పొదగొచ్చు. స్వాతికార్తెలో వాన చినుకు ముత్యపు చిప్పలో పడినంతనే ముత్యం రూపు దాల్చుతుందంటారు. కవి హృదయాలు అలా సెలవిచ్చాయి కానీ, ఇసుక రేణువు ముత్యపు చిప్పలో చేరినా ముత్యం అవ్వాల్సిందే!




తనకు అడ్డొచ్చే రాయి, రప్పను తొలగించే క్రమంలో ముత్యపు చిప్ప అలా చేసినా మనకో విలువైన ముత్యాన్ని ఇస్తోంది. బ్రతుకు సార్థకత అంటే అదీ! ఒకరు కనిపెట్టిన మార్గాన్ని మానవులు ఇట్టే అల్లుకుపోతారు. కనుక ఈ ట్రిక్‌ను అనుసరించి ఆర్టిఫిషియల్‌ ముత్యాలు కోకొల్లలుగా తయారై మగువల మనస్సులను మురిపిస్తున్నాయి.
పలు రూపాల్లో మదిని ఆకట్టుకునే ముత్యాలు పదికాలాల పాటూ మన వద్ద అట్టేపెట్టుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదు. మనం కొనుక్కున్న ఆభరణాలు, వస్త్రాలు ఏవైనా సరే సరైన రీతిలో వాడుకున్నప్పుడే కదా సరదా, సంతృప్తి!


ఒక మెత్తని వస్త్రంలో ముత్యాలను చుట్టి భద్రపరచాలి. అది కాటన్‌, సిల్క్‌ ఏదైనా కావచ్చు. మృదువుగా ఉండాలి. అంతేతప్ప, ప్లాస్టిక్‌ బ్యాగ్‌లో ఉంచకూడదు. వేడిసోకే ప్రాంతాల్లో ముత్యాలను దాచకూడదు.
ముత్యాలను శుభ్రం చేయాలన్నా మెత్తని వస్త్రాన్నే ఉపయోగించాలి. బజార్లో దొరికే నగల క్లీనర్లను వాడకూడదు.
పూర్తిగా ముస్తాబైన తరువాతనే ముత్యాలను ధరించాలి. పెర్‌ఫ్యూమ్‌లు ముత్యాలపై స్ప్రే చేయకూడదు. రసాయనాలు ముత్యాల్లోని మెరుపును పోగొడతాయి.
ముత్యాలను గుచ్చిన సిల్క్‌ దారం సరిగ్గా ఉందో, లేదో రెండేళ్లకోసారి జ్యూయలరీ షాపులో చెక్‌ చేయించుకుంటే మంచిది.
ముత్యాల నగలను మిగతా నగలతో కలిపి ఉంచకూడదు. ఆ ఆభరణాలు ముత్యాలకు తగిలి, గీరుకుని గీతలు పడితే ముత్యాలు పాడవుతాయి. సున్నితంగా చూసుకుంటేనే ఇవి కలకాలం మన్నుతాయి.
ముత్యాలను ఎంపిక చేసుకునే సమయంలో పంటికి రాసుకుని చూస్తే అసలైనవి శబ్దం చేస్తాయి.
స్విమ్మింగ్‌ చేసే సమయంలో, నీళ్లలో తడిసే సమయంలో ముత్యాలను ఒంటి మీద ధరించకూడదు. ముత్యాలు సిల్క్‌ దారంతో గుచ్చుతారు. కనుక ఆ దారాలు పాడై హారం తెగిపోయే ప్రమాదం ఎంతైనా ఉంది.




















మరక మాయం!


ఎంతో ముచ్చటపడి కొన్న దుస్తులపై ఏదైనా చిన్న మరకపడితే చాలు! అందమంతా పాడైపోతుంది. అదీ సరిగ్గా కనిపించే చోట పడితే ప్రాణం ఉసూరుమంటుంది. పైగా ఆ మరకలు పోకుంటే మరింత బాధ కలుగుతుంది. మనమే దుస్తులపై మరకలు చేసుకుంటే ఇక పిల్లల సంగతి చెప్పాలా? వర్ణనాతీతం కదూ! స్కూలు నుండి వచ్చిన పిల్లల అవతారమే కాదు, దుస్తుల రూపమూ మారిపోతుంది. మరి అలాగని వారిని ఆటలకు దూరం చేయడమూ న్యాయం కాదు. అందుకే మరక మాయం చేసే మార్గాలు కనుగొని పాటించడమే ఉత్తమం.
సాస్‌ లేకుండా పిల్లలు స్నాక్స్‌ తినరు. సరిగ్గా, అప్పుడే సాస్‌ దుస్తులపైనో, దుప్పట్ల మీదో పడుతుంది. సాస్‌ మరకలు పడితే ఆ దుస్తులను గ్లిజరిన్‌తో రుద్ది సబ్బునీటిలో ఉతకాలి.
ఫర్నిచర్‌పై ఏమైనా స్టిక్కర్లు అంటుకుంటే వెజిటబుల్‌ ఆయిల్‌ తో రుద్ది చూడండి.
నూనె మరకలు మనకే ఎక్కువగా అవు తుంటాయి. అలాంటప్పుడు వెంటనే ఆ మరకపై టాల్కమ్‌ పౌడర్‌ను జల్లాలి. ఆపై సబ్బుతో ఉతికేయాలి.
టీ, కాఫీలు అప్పటికప్పుడు కడిగేసుకోవాలి.
రక్తం మరకలు పడినచోట ఉప్పు చల్లి, తరువాత ఒంటికి రాసుకునే సబ్బుతో అయితే త్వరగా పోతాయి.

దెబ్బకు దెబ్బ... kids story

 



ఆదిత్యపురి రాజ్యాన్ని ఆర్యదేవుడు, అమరేంద్రపురి రాజ్యాన్ని ఆనందదేవుడు పరిపాలిస్తుండేవారు. ఇవి రెండూ ఇరుగుపొరుగు రాజ్యాలు. ఆదిత్యపురి రాజ్యం పెద్దది. అమరేంద్రపురి రాజ్యం చిన్నది.

రెండు రాజ్యాల మధ్య ఒక నది, నది మీద వంతెన ఉండేవి. రెండు రాజ్యాల మధ్య రాకపోకలతో వంతెన కొంతకాలానికి కూలిపోవడానికి సిద్ధమైంది.

‘‘వంతెన బాగుచేయించడం ఇరు రాజ్యాల బాధ్యత. మీరు కొంత ఖర్చు భరించాలి ’’ అని ఆనందదేవుడు ఆర్యదేవుడికి వర్తమానం పంపాడు.

ఇందుకు ఆర్యదేవుడు తిరస్కరించి ‘‘మీ రాజ్యం నుండి వ్యాపారం కోసం మా రాజ్యానికి వస్తున్నారు. మేము అటువైపు రావడం లేదు. కాబట్టి ఖర్చు మీరే భరించండి’’ అని ప్రత్యుత్తరం పంపించాడు.

తమది చిన్న రాజ్యం కాబట్టి తాము అంత ఖర్చు భరించలేమని ప్రాధేయపడ్డా ఫలితం లేకపోవడంతో ఆనందదేవుడికి ఏమి చేయాలో తోచక దీర్ఘాలోచనలో పడ్డాడు.వంతెన మీదుగా వెళ్లలేకపోవడంతో అమరేంద్రపురిలో వ్యాపారులు పలు ఇబ్బందులు పడ్డారు.ఆనందదేవునికి ఒక ఆలోచన వచ్చింది. చిన్న రాజ్యమే అయినా నది తమ వైపు నుంచి ఆదిత్యపురి వైపు పారుతోంది.

ఇటువైపు నీరు అటు వైపు వెళ్లకుండా అడ్డుకట్ట వేయమని ఆనందదేవుడు ప్రజలను ఆదేశించాడు. దాంతో ఆదిత్యపురికి నీరు ఆగిపోయింది. రాజు సహా ప్రజలంతా నీళ్లు లేక ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది.

ఆర్యదేవునికి జ్ఞానోదయమైంది. తన ఖర్చుతోనే వంతెన పునర్నిర్మించాడు. ఇరు రాజ్యాల మధ్య సఖ్యత నెలకొంది.


నీతి: కలసి ఉంటే కలదు సుఖం.