all

Saturday, April 6, 2013

వేసవి అంటే ఆహ్లాదం కూడా!

 

కొన్ని వస్తువులు కొన్నాళ్లు వాడాక పాతబడిపోతాయి. వాటిని పారేద్దామంటే పర్యావరణానికి హాని కలుగుతుందేమోనని సందేహంతో ఇంట్లోనే ఉంచేసుకుంటాం. అలా ఉంచుకునేసరికి కొన్నిరోజులకి ఇంట్లో తట్టెడంత చెత్త పేరుకుని ఉంటుంది. వాటిని ఉంచలేక పారేయలేక సందిగ్థంగా ఉంటుంది మీ మనసు. అలాంటప్పుడు మెదడుకి కాస్తంత పదును పెడితే సరి. అద్భుతమైన కళాఖండాలు తయారవుతాయి.

గాజు పాత్రలు, హ్యాండ్‌బ్యాగులు, టీ కెటిల్స్, ప్లాస్టిక్ వస్తువులు ఉంటే వాటిని కళాత్మకంగా తీర్చిదిద్దుకోవచ్చు. ఇలా చేయడం వలన ఈ వేసవిని వేడిగా కాకుండా మనసుకి ఆహ్లాదం కలిగేలా చేసుకోవచ్చు. ఇందుకోసం కావలసింది కొద్దిగా మట్టి, అందమైన రాళ్లు, చిన్నచిన్న మొక్కలు ఉంటే చాలు. వాటితో పాతవస్తువులకు కొత్తరూపం తీసుకువచ్చి, ఇంటిని స్టార్ హోటల్ గా మార్చేయవచ్చు. ఒక్కసారి ప్రయత్నించి చూడండి.

1. గాజు గ్లాసులో కొద్దిగా మట్టి వేసి అందులో చిన్న ఇండోర్ ప్లాంట్‌ని అమర్చి, కొద్దిగా నీరు పోస్తే చాలు, వేళ్లతో సహా మొక్క కనిపిస్తూ ఎంతో అందంగా ఉంటుంది.

2. గాజు బౌల్‌లో సగం వరకు మాత్రమే మట్టి పోసి, పైన అందమైన రంగురంగుల గులకరాళ్లు వేసి, కలబంద లాంటి మొక్కను ఉంచితే, గాజు బౌల్‌లో మట్టి, రాళ్లతో పాటు మొక్క కూడా కనువిందు చేస్తుంది.

3. చాలాకాలంగా అటకె క్కిన టీ కెటిల్స్‌ని కిందకి దించి శుభ్రంగా కడిగి, అందులో నీళ్లు పోసి, ఆర్టిఫీషియల్ ప్లాంట్ అమర్చి, టీవీ వంటి వాటి మీద పెట్టండి. గది రూపం మారిపోతుంది.

4. ప్లాస్టిక్ బూట్లు, బకెటు, మగ్గుల వంటివి ఉంటే వాటిని ఒక్కసారి శుభ్రంగా కడిగి, ఇంకా అందంగా అనిపించకపోతే పైన రంగురంగుల కాగితాలు అంటించి, ఆ పాత్రలో ప్లాస్టిక్ పూలు కాని, ప్లాస్టిక్ మొక్కలు కాని వేసి రూమ్ కార్నర్‌లో డెకొరేట్ చేస్తే గది అందం రెట్టింపవుతుంది.

5. పాతబడిన పూలబుట్ట ఉంటే, ఒక్కసారి దాని దుమ్ము దులిపి, అందులో మట్టి వేసి, అందమైన క్రీపర్‌లాంటివి పెట్టి, గుమ్మం ముందు ఇంటి పైకప్పుకి ఉండే హుక్‌కి తగిలించండి. ఇంట్లోకి వస్తున్న వారికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ, తల మీద పూలు చల్లుతున్న భావన కలుగుతుంది.

ఇవే కాదు... మీ మనసుకి నచ్చేవిధంగా, మీ ఇంటికి సరిపోయే విధంగా పాతవస్తువులను కొత్తగా తయారుచేయండి. ఇంటిని కొత్తగా మార్చేయండి.
 

No comments: