all

Monday, June 17, 2013

పదినెలల బాబుకు విరేచనాలు... ఏం చేయాలి?

 

ఆయుర్వేదం
మా బాబు వయసు 10 నెలలు. గత మూడు వారాలుగా పలుచగా నీళ్లలాగ విరేచనాలవుతున్నాయి. పరిమాణం స్వల్పమే అయినా, రోజుకి 9-10 సార్లు అవుతున్నాయి. ఎన్ని మందులు వాడినా తగ్గడం లేదు. ఈ సమస్యకు ఆయుర్వేదంలో మందులు తెలియజేయగలరు.
- భానుమతి, జహీరాబాద్


నీళ్ల విరేచనాలను ఆయుర్వేదంలో అతిసారం అంటారు. ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చేవి ఒక వర్గంగాను, ఇతర కారణాల వల్ల వచ్చేవి ఇంకో వర్గంగాను ఆయుర్వేదంలో వివరించారు. వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్, ప్రోటోజోవల్ (ఆంత్రకృములు) మొదలైనవి సాధారణంగా కలిగే ఇన్ఫెక్షన్స్. ఇతర కారణాల్లో ముఖ్యమైనవి...

కొందరికి తల్లి పాలు పడకపోవడం

కొన్ని ఆహార పదార్థాలకు అసాత్మ్యత

కారం, పులుపు ఎక్కువగా తినడం

కొన్ని మందుల వల్ల కలిగే దుష్ర్పభావాలు

జీర్ణకోశసమస్యలు

భయం, కోపం, విచారం వంటి మానసిక ఉద్వేగాలు, పిల్లలకు దంతాలు జనిస్తున్నప్పుడు మొదలైనవి.

మీ బాబు వయసు రీత్యా ఇది ‘దంతోద్భవజన్య అతిసారం’ కావచ్చు. విరేచనాలతో బాబు వాంతులు, జ్వరం లేకపోతే పెద్దగా కంగారు పడవద్దు. పిల్లలకు ప్రతిదినం ఇచ్చే ఘనాహారం, ద్రవాహారం అదేవిధంగా ఇవ్వాలి. ముఖ్యంగా సోడియం, పొటాషియం కలిగి ఉన్న ద్రవాహారం పుష్కలంగా తాగించాలి. సహజసిద్ధమైన కొబ్బరినీళ్లు ప్రశస్తమైన ద్రవాహారమని గుర్తుంచుకోండి. పలుచని మజ్జిగ, బార్లీ నీళ్లు కూడా మంచివే. ఒక కప్పు నీళ్లలో (మరిగించి చల్లార్చినవి) ఒక చెంచా శర్కర, చిటికెడు ఉప్పు, మూడు చుక్కల నిమ్మరసం కలిపి, ఇంట్లో తయారుచేసుకుని, ఆరారా తాగిస్తే డీహైడ్రేషన్ (శోష) రాకుండా ఉంటుంది.

ఔషధం
కర్పూరరస (మాత్రలు) ఉదయం 1 - రాత్రి 1

లశునాదివటి (మాత్రలు) ఉదయం 1 - రాత్రి 1

దాడిమాష్టకచూర్ణం : ఒకటి, రెండు గ్రాములు (పిల్లలకు) తేనెతో గాని, పాలతోగాని, రోజూ మూడుపూటలా

గమనిక : ఈ మూడింటిలో ఏ ఒక్క మందైనా సరిపోతుంది.

శిశువుకు ఆరవ నెల వచ్చినప్పటి నుంచి ఈ కింది మందులు వాడితే దంతాలు జనించేటప్పుడు కలిగే అనేక సమస్యల (జ్వరం, విరేచనాలు, వాంతులు మొదలైనవి) నివారణకు చాలా ప్రయోజనం ఉంటుంది. ఇవి ఎంతకాలమైనా వాడుకోవచ్చు.

జహర్‌మొహర్ పిష్ఠి మరియు ప్రవాళపిష్ఠి (భస్మాలు): వీటిని ఒక్కొ క్క చిటికెడు తీసుకుని తేనెతో రోజూ రెండు పూటలా నాకించాలి.

అరవిందాసవ (ద్రావకం): ఒక చెంచా మందుకి ఒక చెంచా నీళ్లు కలిపి రెండు పూటలా తాగించాలి.

విరేచనాలు తగ్గటానికి సాధారణ చిట్కాలు (గృహవైద్యం)
వామును కొద్దిగా వేయిచి, నీళ్లతో మరిగించి తాగాలి. శిశువులకు : ఒక చెంచా రెండు లేదా మూడు పూటలా. పెద్దలకు: ఐదు చెంచాలు రెండు లేదా మూడుపూటలా.

జాజికాయని అరగదీసి ముద్దగా చేసి పావు చెంచా మోతాదును తేనెతో రెండుపూటలా నాకించాలి.

అతిసార నివారణకు జాగ్రత్తలు ( ముఖ్యంగా వర్షాకాలంలో)
మరిగించి చల్లార్చిన నీళ్లు తాగాలి. బయటి ఆహారం జోలికి పోవద్దు. నిల్వ ఉంచిన ఆహారం, ఫ్రిజ్‌లో ఎక్కువకాలం దాచి ఉంచిన ఆహారం తినవద్దు. తేలికగా జీర్ణమయ్యే ఆహారం మంచిది.

ఐస్‌క్రీములు, శీతలపానీనియాలు, నూడుల్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి.

ఆహారాన్ని తాజాగా వేడివేడిగా ఉన్నప్పుడే తినాలి.

ఇల్లు, పరిసరాల పరిశుభ్రత చాలా అవసరం.

పిల్లలకు పాలిచ్చే తల్లులు తమ ఆహారంలో కారం తగ్గించాలి. రోజూ వెల్లుల్లిపాయలు తినడం మంచిది.
 

No comments: