all

Monday, June 17, 2013

జీవితాన్ని మలిచే చక్కటి ఆలోచన


 
NewsListandDetails జీవితంలో విజయానికి ఎన్నో ఉపాయాలున్నాయి. కాని మనం పనిచేయనిదే అవి పనిచేయవు. ఎప్పటిపని అప్పుడు పూర్తిచేసుకొంటే మనసు ఉత్తేజపడుతుంది. మరో కార్యానికి కార్యోన్ముఖుడిని చేస్తుంది. గమ్యాన్ని చేరుకోవడం కన్నా ఆ దిశగా కార్యసిద్ధికి ప్రయాణించడమే ముఖ్యం.

అందుబాటులో ఉన్న మంచితనంతో పొందటమే ముఖ్యం. జీవితంలోని మంచి వినండి. అనండి. చూడండి. తలంచండి. చేయండి. చేయించండి. అదే అతిగొప్ప కళ.

- మనుషుల చేత వాడబడుతున్న అతిశక్తివంతమైన మందులు మాటలు. మన నాలుక మనం చెప్పినట్లు వినకపోవడమే అన్ని అనర్థాలకు మూలం. మాటలు తెలివైన వారికి పాచికల వంటివి. తెలివిలేని వారికి డబ్బుల వంటివి. మీరు చెప్పడానికి ఏమీ లేనప్పుడు మాట్లాడకండి.

- హితమితప్రియభాషణం మనిషికి అరుదైన భూషణం. కలిసిపో మంచి మనసున్న వారితో కలిసి జీవించాలి మనసైనవారితో.

- నీవు ఎవరికైనా ఉపకారం చేస్తే దాన్ని స్మరించకండి. ఎవరైనా మీకు ఉపకారం చేస్తే దాన్ని విస్మరించబోకండి.

- జీవితంలో ఎదురయ్యే సాధారణ విషయాలను కూడా అసాధారణంగా ఆలోచించి పరిష్కరించగలిగినప్పుడు నీవు ప్రపంచాన్ని శాసించగలిగే స్థాయికి చేరుకుంటావు.

- ఉన్న వైపుకు పురోగమించడమే కాని ఉన్నదాన్ని పెంచడంలో పురోగతి ఉండదు. సాధించాలనే సత్‌సంకల్పం ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదు.

- తోటివారితో మంచిగా జీవించాలి, మీ మంచితనాన్ని తోటివారికి పంచాలి. అదే మిమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడుతుంది. మానవుడు దానవుడుగా మారడం అతని ఓటమి. మనిషి మహామనిషిగా రూపాంతరం చెందటం అతని చమత్కారం. మానవుడు మనిషిగా మారడం గెలుపు. నిన్ను చూసి నీవు మనసారా నవ్వగలిగిన రోజున నీ అభివృద్ధి ప్రారంభమవుతుంది. జీవితం అనేది రాళ్ల గని వంటిది. మంచిశిలను ఎంచుకుని శిల్పాన్ని మలిచినట్లే మన వ్యక్తిత్వాన్ని అందంగా మలుచుకోవాలి.

- పనిలో నిమగ్నమై పట్టుదలతో పనులు చేసేవారికి ఆరోగ్యం చెడిపోదు. ముసలితనం రాదు. తన వృత్తిని పవిత్రంగా, గౌరవంగా భావించే వ్యక్తి, ఒక క్షణం కూడా సోమరిగా ఉండలేడు. మనం చేయవలసిన పని మానేసి మరెవరో వచ్చి చేసిపెడతారని ఎదురు చూడడం వెర్రితనం. పనిచేసేతత్వమూ, పనిపట్ల విశ్వాసము విజయానికి మూలకారణాలు. మనం ఎలాంటి పనులు చేయాలో మనం నిర్ణయించుకొనేటట్లుగానే మనం ఎటువంటి వారమో మనం చేసే పనులు నిర్ణయిస్తాయి.

- జీవితం ఒక రంగుల వలయం. రంగుల రాట్నం. దాన్ని మలచుకునే విధానంలోనే ఫలితాలు ఆధారపడి ఉంటుంది. నీతినిజాయితీతో కష్టపడి పనిచేస్తే తప్పకుండా సంతోషకరమైన జీవితం లభిస్తుంది.

- మనం ఎంత చేయగలమో దానిని బట్టి మన విలువను నిర్ణయించుకుంటాము. బయటి వారు మనం ఎంత చేశామో దానిని బట్టి విలువ కడతారు. మీలో తప్పిదాలు ఉన్నప్పుడు వాటిని ఒప్పుకుని తక్షణమే తొలగించుకోవడానికి ఏమాత్రం భయపడకు.

- సంకల్పం, బలం ఉన్నచోట అపజయమనేది ఉండదు. స్వశక్తిని నమ్ముకొన్న వారే దేనినైనా సాధించగలరు. ఏమి చేశారన్నది కాదు ఎటువంటి ఉద్దేశంతో చేశారన్నది పరిశీలించాలి. నమ్మకంతో ప్రారంభమైన కార్యం సంశయాలతో ముగుస్తుంది. సందేహాలతో మొదలుపెట్టిన పని నమ్మకానికి దారితీస్తుంది. మనిషి జీవితాన్ని మలిచేది అతని ఆలోచనే. ఉన్నతంగా ఆలోచించే వారికి ఎన్నడూ ఒంటరితనం ఉండదు. వారికి ఆలోచనే మిత్రులు, నేస్తాలు.

- నీతికి నీవు కట్టుబడి ఉంటే అందుకుంటావు ప్రగతి మెట్లు. భీతిని వీడి ముందుకేగితే విజయమే నిన్ను వరిస్తుంది. మనిషి సాటి మనిషిని ప్రేమిస్తే సమాజం, మనిషి తోటి మనిషిని హింసిస్తే అరణ్యం.

- మంచి ప్రవర్తన, మంచి నైతిక విలువలు మనకు స్థిరమైన, శ్రేష్ఠమైన నేస్తాలు, మనిషి తన జీవనమార్గంలోని రెండు పటిష్టమైన దారులని ఏమాత్రం పట్టు సడలనివ్వకూడదు. ఆ రెండు దారులే ఆశ, నమ్మకం. మంచి సామర్థ్యం కలిగి ఉండడం గొప్ప విషయమే. కానీ ఇతరుల సామర్థ్యాన్ని గుర్తించడం అన్నది మరీ గొప్పవిషయం.

- ఎంత చదివినా ఎన్ని వ్రాసినా క్రమశిక్షణలేని జీవితం వ్యర్థం. ఎంత గొప్పవాడయినా క్యారెక్టరు లేని మనిషి బ్రతుకు శూన్యం. ఎంత సంపాదించినా ఒకనాడది వదలి వెళ్లాల్సిందే. ఎంతకాలం కలిసి ఉన్నా చివరకు విడిపోవాల్సిందే.

- ఎంతకాలం జీవించినా ఒకనాడు మృత్యువాత పడాల్సిందే. నీవెంత పైకెదిగినా ఈ జీవిత సత్యాలను అనుభవించాల్సిందే. కోపమొక్కటి నీ దరిచేరకున్న ముఖమున చిరునవు్వ వెలుగుచున్న ఎంత ధనమున్న వీటి ముందు సున్నా. ఓరిమి జీవితానికి ప్రకాశం ఉద్రేకం బ్రతుకుకు వినాశం.

- పరిశీలనతో పరిష్కరించుకోగల ఆత్మస్థయిర్యం ఉండాలి. సర్దుకుపోవడం, అవగాహనతో మెలగడం, పరులను ప్రేమించగలగడం, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం అలవచ్చుకోవాలి. మనకి జీవితంలో తారసపడే ప్రతి వ్యక్తీ ఏదో ఒక విధంగా మనకంటే గొప్పవాడై ఉంటాడు. అలాంటి వ్యక్తుల నుండీ ఎంతో కొంత నేర్చుకోగలిగితే జీవితం ధన్యమవుతుంది. - ఆర్వీఎమ్‌

No comments: