all

Thursday, March 21, 2013

బాస్మతీ శతకం!

 

వంటలు
ఆకలికి... మెన్యూ అక్కర్లేదు.
నిజమే కానీ -సమ్‌టైమ్స్ కంటికి, పంటికి టేస్ట్ అవసరమౌతుంటుంది!
ఏదో ఇంత రైస్ ఉంది కదాని సరిపెట్టుకోవవి!
అదే రైస్ వంద రంగుల్లో కనబడాలి.
అదే రైస్ వంద రుచులుగా మారాలి.
అందుకే -బాస్మతి రైస్‌తో... ఈవారం పేజీ పట్టినన్ని పులావ్ వెరైటీస్!


చైనా టౌన్ పులావ్

కావలసినవి
బాస్మతి బియ్యం - ఒకటిన్నర కప్పు, నూనె - 3 టీ స్పూన్లు, మష్రూమ్స్ - 8 (ముక్కలు చేసుకోవాలి), ఎల్లో క్యాప్సికమ్ - 1 (పొడవుగా తరగాలి)
అల్లంతురుము - టేబుల్ స్పూన్, వెల్లుల్లి తరుగు - టేబుల్ స్పూన్, లవంగాలు - 2, పచ్చి బఠాణీ - కప్పు, ఉల్లికాడల తరుగు - అర కప్పు, సోయా సాస్ - రెండు టేబుల్ స్పూన్లు, నువ్వులనూనె - టీ స్పూను, బ్రకోలీ - కొద్దిగా, టొమాటో చక్రాలు - నాలుగైదు, బీన్స్ తరుగు - పావు కప్పు

తయారి
బాణలిలో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అల్లం వెల్లుల్లిపేస్ట్ వేసి, ఒక నిముషం పాటు కలపాలి.

మష్రూమ్స్, ఎల్లో క్యాప్సికమ్, పచ్చిబఠాణీ, ఉల్లికాడల తరుగు వేసి గోధుమరంగులోకి వచ్చి, దగ్గర పడేవరకు సుమారు పది నిముషాలు కలపాలి.

నానబెట్టిన బియ్యం, బఠాణీ, ఉల్లికాడల తరుగు, బీన్స్ తరుగు, సోయాసాస్, నువ్వులనూనె వేసి అన్నీ కలిపి ఉడికించాలి

టొమాటో చక్రాలు, కొత్తిమీరతో గార్నిష్ చేసి, వేడివేడిగా సర్వ్ చేయాలి.

ఉలవచారు పులావ్

కావలసినవి
బాస్మతి బియ్యం - కేజీ
పెరుగు - 200 గ్రా.
ఉలవచారు - 200 గ్రా.
గరంమసాలా - 20 గ్రా.
పచ్చిమిర్చి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు
నిమ్మరసం - 3 టేబుల్ స్పూన్లు
పుదీనా - రెండు కట్టలు
ఏలకులపొడి - టీ స్పూను
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 20 గ్రా.
పైనాపిల్ పేస్ట్ - 3 టేబుల్ స్పూన్లు
మిరప్పొడి - రెండు టేబుల్ స్పూన్లు
ఉల్లితరుగు - 250 గ్రా.(డీప్ ఫ్రై చేయాలి),
కొత్తిమీర - ఒక కట్ట
ఉప్పు - తగినంత
బిరియానీ ఆకులు - 3
నెయ్యి - 150 గ్రా.

తయారి
బాణలిలో నెయ్యి వేసి కాగాక అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లితరుగు, పుదీనా ఆకులు, కొత్తిమీర, పచ్చిమిర్చిపేస్ట్, పెరుగు వేసి బాగా కలపాలి.

చిన్న పాత్రలో కొద్దిగా నూనె వేసి కాగాక అందులో గరంమసాలా, ఏలకులపొడి వేసి వేయించి, నిమ్మరసం, ఉలవచారు వేసి కలపాలి.

పెద్దపాత్రలో రెండు లీటర్ల నీళ్లు పోసి మరిగించాలి.

బిరియానీ ఆకులు, పచ్చిమిర్చిపేస్ట్, ఉలవచారు మిశ్రమం, నానబెట్టి ఉంచుకున్న బియ్యం వేసి గరిటెతో కలిపి ఉడికించాలి.

అన్నం సగం ఉడికిన తర్వాత, నెయ్యి కరిగించి అన్నం మీద వేసి కలపాలి.

మూత పెట్టి సుమారు 20 నిముషాలు ఉడికించాలి.

పుదీనా ఆకులు, ఉల్లిచక్రాలతో గార్నిష్ చేసి, వేడివేడిగా సర్వ్ చేయాలి.

సిమ్లా పులావ్

కావలసినవి
బాస్మతిబియ్యం - పావు కేజీ
ఎల్లో క్యాప్సికమ్ - 1, రెడ్‌క్యాప్సికమ్ - 1
గ్రీన్ క్యాప్సికమ్ - 1, స్వీట్‌కార్న్‌గింజలు - కొద్దిగా
మిరియాలపొడి - టీ స్పూన్
ఉప్పు - తగినంత, పచ్చిబఠాణీ - కొద్దిగా
నూనె - 4 టీ స్పూన్లు
బటర్ - 2 టీ స్పూన్లు
అజినమోటో - చిటికెడు

తయారి
బియ్యాన్ని అరగంటసేపు నానబెట్టాలి.

బాణలిలో బటర్ వేసి కాగాక తరిగి ఉంచుకున్న కూరగాయముక్కలు వేసి వేయించాలి.

మిరియాలపొడి, ఉప్పు వేసి కొద్దిగా వేగిన తరువాత అజినమోటో వేసి కలపాలి.

ఉడికించిన అన్నాన్ని ఒక పెద్ద పాత్రలో వేసి దాని మీద వేయించి ఉంచుకున్న కూరముక్కలు, మిరియాలపొడి మిశ్రమం వేసి బాగా కలిపి వేడివేడిగా సర్వ్ చేయాలి.

నూర్‌మహల్ పులావ్

కావలసినవి
బాస్మతి బియ్యం - 2 కప్పులు
గరంమసాలా - టీ స్పూను
నూనె - 4 టేబుల్ స్పూన్లు
బిరియానీ ఆకు - 1
ఉప్పు - తగినంత
దాల్చినచెక్క - చిన్న ముక్క
చీజ్ - అరకప్పు, లవంగాలు - 6 క్రీమ్ - 3 స్పూన్లు
జీలకర్ర - టీ స్పూను
కుంకుమపువ్వు - కొద్దిగా
ఏలకులు - 8
పాలకూర రసం - 2 టేబుల్ స్పూన్లు
బటర్ - 2 టేబుల్ స్పూన్లు ఉల్లితరుగు - పావుకప్పు
వెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు కొత్తిమీరతరుగు - 2 టేబుల్ స్పూన్లు

తయారి
బియ్యాన్ని శుభ్రంగా కడిగి అరగంటసేపు నానబెట్టాలి.

బాణలిలో నూనె వేసి కాగాక బిరియానీ ఆకు, దాల్చినచెక్క, లవంగాలు, జీలకర్ర, ఏలకులు వేసి సన్నని మంట మీద వేయించాలి.

అల్లం వెల్లుల్లి పేస్ట్ , గరంమసాలా వేసి కొద్దిగా వేయించాలి.

నానబెట్టుకున్న బియ్యం వేసి నాలుగైదు నిముషాలు కలిపి, అందులో నీరు, ఉప్పు వేసి సన్ననిమంట మీద ఉడికించాలి.

ఒక చిన్న బౌల్‌లో చీజ్‌తురుము, క్రీమ్, ఉప్పు వేసి కలపాలి. దీనిని మూడు భాగాలుగా చేసి ఒక భాగాన్ని పాలు, కుంకుమపువ్వు ఉన్న బౌల్‌లో వేయాలి. ఒక భాగం పాలకూర రసంలో వేయాలి.

మూడవ భాగాన్ని చిన్నచిన్న ఉండలుగా చేసి నూనెలో వేయించాలి. (వీటినే నూర్ మహల్ అంటారు)

ఒక పెద్దపాత్రలో అన్నం ఉడకగానే చీజ్ బాల్స్ లేదా నూర్‌మహల్ వేసి, కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడివేడిగా సర్వ్ చేయాలి.

షత్రంజీ పులావ్

కావలసినవి
బాస్మతి బియ్యం - ఒకటిన్నర కప్పులు
ఎల్లో క్యాప్సికమ్ - ఒకటి
కుంకుమపువ్వు - కొద్దిగా
నూనె - తగినంత
ఉల్లితరుగు - పావుకప్పు
ఏలకులు - 3
బిరియానీ ఆకులు - 2
లవంగాలు - 3
దాల్చినచెక్క - చిన్న ముక్క
అల్లం తురుము - అర టీ స్పూను
సోంపు - టీ స్పూను,
నెయ్యి - 3 టీ స్పూన్లు
జీలకర్ర - టీ స్పూను
కిస్‌మిస్ - 10
జీడిపప్పు పలుకులు - 10
టొమాటో ముక్కలు - పావు కప్పు
ఉప్పు - తగినంత

తయారి
మూడు కప్పుల నీటిలో బియ్యాన్ని గంటసేపు నానబెట్టాలి.

నీరు వడకట్టాలి.

రెండు టీ స్పూన్ల నీటిలో కుంకుమపువ్వును నానబెట్టాలి.

బాణలిలో నూనె వేసి కాగాక ఉల్లితరుగు వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి.

ఒక పెద్ద పాత్రలో రెండున్నర కప్పుల నీరు, బిరియానీ ఆకు, లవంగాలు, దాల్చినచెక్క, ఏలకులు, అల్లం తురుము, ఉప్పు, సోంపు వేసి స్టౌ మీద ఉంచి మరిగాక, దింపి నీటిని వడకట్టి, పక్కన ఉంచుకోవాలి.

బాణలిలో నెయ్యి వేసి కాగాక జీలకర్ర, ఏలకులు వేసి వేగాక, నానబెట్టిన బియ్యం, వడకట్టి ఉంచుకున్న నీరు వేసి సన్నని మంట మీద ఉడికించాలి.

ఉడకడం పూర్తవుతున్న సమయంలో జీడిపప్పు పలుకులు, కిస్‌మిస్ వేసి ఐదు నిముషాలుంచి దించేయాలి.

వేయించి ఉంచుకున్న ఉల్లితరుగు, టొమాటో, కుంకుమపువ్వులతో గార్నిష్ చేయాలి.

చెఫ్: ప్రసాద్‌బాబు
కర్టెసీ: హోటల్ వన్ ప్లేస్
కూకట్‌పల్లి, హెదరాబాద్


సేకరణ: డా. వైజయంతి

ఫొటోలు: ఎస్.ఎస్.ఠాకూర్
 

మానవాళి మేలుకోసం మూలుగ నిధి

 

బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ (బీఎంటీ)
ఎముక మూలుగలోని కణాలనుంచి రక్తకణాలు తయారవుతాయి. ఆ మూలుగలోనే ఏదైనా లోపం ఏర్పడితే అది కొన్ని ప్రమాదకరమైన వ్యాధులకు దారితీస్తుంది. అలాంటప్పుడు ఆ మూలుగను మార్చగలిగితే... ఇకపై మళ్లీ ఆరోగ్యకరమైన రక్తకణాలు ఉత్పత్తి అయి వ్యాధి పూర్తిగా మానిపోతుంది. గతంలో ఇందుకోసం తప్పనిసరిగా దాత నుంచి మూలుగను సేకరించి స్వీకర్తకు ఇవ్వాల్సి ఉండేది. దీన్నే బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ (బీఎంటీ) పిలిచేవారు. అయితే ఏ ఇతర కణంగానైనా రూపొందగలిగే మూలకణాలతోనూ ఇదే చికిత్సకు ఆస్కారం ఉంది. అందుకే ఈ ప్రక్రియను స్టెమ్‌సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌గానూ అభివర్ణిస్తున్నారు. అక్యూట్ ల్యుకేమియా, అప్లాస్టిక్ అనీమియా, థలసీమియా, సికిల్‌సెల్ అనీమియా వంటి అనేక వ్యాధుల చికిత్సకు ఉపయోగపడే ‘బీఎంటీ’ ప్రక్రియపై అవగాహన కోసం ఈ సమగ్ర కథనం.

సంతోష్ చాలా అందంగా ఉంటాడు. తెలివైనవాడు కూడా. కంప్యూటర్ సైన్స్‌లో యూనివర్సిటీ ఫస్ట్ తెచ్చుకుని, ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం కోసం ఆస్ట్రేలియా వెళ్లాడు. మంచి పెళ్లి సంబంధం వచ్చింది, ఒకసారి రమ్మని పెద్దవాళ్లు చెబితే సెలవు పెట్టి వచ్చాడు. పెళ్లి కుదిరింది. ఈ హడావుడి అయ్యాక నీరసంగా ఉంది, ఆకలి కొంచెం మందగించింది అనిపించి, ఊరికే ఒకసారి డాక్టర్‌ను కలుద్దాం అనుకున్నాడు. ఏవో పరీక్షలు చేశారు. అంతే... పెద్ద బాంబ్‌షెల్! బ్లడ్ క్యాన్సర్ ఉందని ఆ పరీక్షల్లో తేలింది. దానిపేరు టీ సెల్ ఆక్యూట్ మైలాయిడ్ ల్యుకేమియా (ఏఎమ్‌ఎల్). చాలా భయంకరమైన జబ్బు అని చెప్పారు. సంతోష్, అతని కుటుంబసభ్యులు ఒక్కసారిగా అల్లకల్లోలం అయిపోయారు. డాక్టర్ వాళ్లను చాలాసేపు సముదాయించాల్సి వచ్చింది. ట్రీట్‌మెంట్ జరగాల్సిన విధానం ఏమిటో చెప్పాడు. జబ్బును పూర్తిగా నయం చేసే అవకాశం ఉంది... అయితే దానికి ముందు కీమోథెరపీ చేయాలి, ఆ తర్వాత బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ చేయాలని చెప్పారు. ‘బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్’ అంటే ఏమిటని అడిగాడు సంతోష్. ఇది సంతోష్ ఒక్కడి ప్రశ్న మాత్రమే కాదు... ఆ ప్రశ్నకు సమాధానం అనేక మందికి అవసరం. అలా అవసరమైనవారి కోసమే ఈ కథనం.

బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ లేక స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటే...

బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటే తెలుగులో ‘మూలుగ మార్పిడి’ అని చెప్పవచ్చు. మన ఎముకల మధ్యలో నల్లగా ఉండే పదార్థాన్ని మూలుగ అంటారు. ఇంగ్లిష్‌లో దీన్ని మ్యారో అని పిలుస్తారు. ఇది రక్తకణాలన్నింటినీ తయారుచేసే ఫ్యాక్టరీ. ఈ రక్తకణాల ఉత్పత్తి ఏ మూల కణాల నుంచి జరుగుతుందో దాన్ని ‘హిమటోపాయిటిక్ స్టెమ్ సెల్స్’ అంటారు. సంతోష్‌కు వచ్చిన ‘ఏఎమ్‌ఎల్’ జబ్బుతో పాటు మరికొన్ని జబ్బులు ఈ ‘మ్యారో’ స్టెమ్ సెల్స్‌లో లోపాల వల్లనే వస్తాయి. అలాంటప్పుడు రోగి మూలుగలో ఉన్న స్టెమ్ సెల్స్ అన్నింటినీ నాశనం చేసి, బాగున్న స్టెమ్‌సెల్స్‌ను బయటి నుంచి ఇవ్వగలిగితే, ఈ కొత్త స్టెమ్ సెల్స్ మూలుగలో మొలకలు వేసి, ఇకపై మంచి కణాలను మాత్రమే ఉత్పత్తి చేస్తాయి. దాంతో అతడి జబ్బు పూర్తిగా తగ్గేందుకు అవకాశం ఉంది. ఈరోజుల్లో ఈ ప్రక్రియను ‘స్టెమ్‌సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్’ అని కూడా పిలుస్తారు.

చాలా ఏళ్లపాటు బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు అవసరమైన ఎముక మూలుగను ఇతరుల ఎముక మూలుగ నుంచి మాత్రమే సేకరించేవారు. అందుకే ఈ ప్రక్రియకు ‘బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్’ అనే పేరు ప్రాచుర్యం పొందింది. అయితే ఇటీవల ఈ మూలకణాలను రక్తం నుంచి, బొడ్డుతాడు నుంచి కూడా సేకరిస్తున్నారు. అంతేగాక... ఇతరత్రా మరికొన్ని కణజాలాల (టిష్యూల) నుంచి కూడా సేకరించడం సాధ్యపడుతోంది. అందుకే గతంలోలా ఈ ప్రక్రియను బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటూ సాంప్రదాయికంగా పిలుస్తున్నప్పటికీ క్రమేణా ‘స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్’ అనే పేరు కూడా ప్రాచుర్యం పొందుతోంది.

బీఎంటీ చేసే పద్ధతి ఏమిటి?

మొన్నమొన్నటి వరకు దాతను ఆపరేషన్ థియేటర్‌కు తీసుకువెళ్లి, తుంటి ఎముకపై చిన్న ఆపరేషన్‌తో రంధ్రాలు చేసి, లోపల మ్యారో స్టెమ్ సెల్స్‌ని బయటకు తీసేవారు. ఈ రోజుల్లో టెక్నాలజీలో మార్పుల వల్ల, ఆపరేషన్ చేయాల్సిన పని లేకుండానే ఈ ప్రక్రియను చేయడం సాధ్యమవుతోంది. చేతిపైన రక్తనాళంలోకి సూదిని పంపించి, ‘ఎఫరెసిస్’ అనే యంత్రం సహాయంతో రక్తంలోంచి నేరుగా స్టెమ్‌సెల్స్‌ను తీసుకోవచ్చు. అంటే... ఇప్పుడు మూలుగ సేకరణ కేవలం ‘రక్తదానం’ చేసినంత సులభంగా సాధ్యమవుతోందన్నమాట. అలా సేకరించిన స్టెమ్‌సెల్స్‌ను ప్రత్యేకమైన ఫ్రీజర్‌లో భద్రపరచి, కీమోథెరపీ అనే మందులతో రోగిలోని రోగగ్రస్తమైన మూలుగను సమూలంగా నాశనం చేసి, భద్రపరచిన నార్మల్ స్టెమ్‌సెల్స్‌ను రోగి రక్తంలోకి ఎక్కిస్తారు. ఇవి మూలుగలో నాటుకొని కొత్త మొలకలు వచ్చి, సుమారు 2-3 వారాలలో నార్మల్ రక్త కణాలను ఉత్పత్తి చేస్తాయి.

స్టెమ్ సెల్స్ వచ్చేది ఎక్కడి నుంచి?

కొన్ని పరిస్థితుల్లో, స్టెమ్‌సెల్స్‌ను స్వయంగా రోగి శరీరం నుంచే తీసుకోవచ్చు. ‘కీమో’ ప్రక్రియతో మూలుగను నాశనం చేశాక, అతని స్టెమ్‌సెల్స్ అతనికే ఎక్కించడం జరుగుతుంది. దీన్ని ఆటోలోగస్ స్టెమ్‌సెల ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటారు. కొన్నిరకాల జబ్బులకు ఇలాగాక, ఇతర దాతల నుంచి (నార్మల్ డోనర్స్) స్టెమ్‌సెల్స్ సేకరించాల్సి ఉంటుంది. దీనిని ‘అల్లోజెనిక్ ట్రాన్స్‌ప్లాంటేషన్’ అంటారు. ఇతరులు స్టెమ్‌సెల్స్ ఇవ్వాలంటే, అవి రోగి కణాలతో మ్యాచ్ అయి తీరాలి. మ్యాచ్ అయ్యేదీ, లేనిదీ ‘హెచ్‌ఎల్‌ఏ టైపింగ్’ అనే రక్తపరీక్ష ద్వారా చెప్పవచ్చు. మ్యాచ్ అయ్యే అవకాశం తోబుట్టువులకు ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ముందు రోగి తోబుట్టువులని పరీక్షిస్తారు.

హెచ్‌ఎల్‌ఏ టైపింగ్ అంటే...

నిజానికి హెచ్‌ఎల్‌ఏ అనేది మనుషుల కణాల్లో ఉండే ఒక రకం ప్రోటీన్. దీని ఆధారంగానే ఒక కణం తనకు చెందిందేనా లేక అది బ్యాక్టీరియా లేదా ఇతర సూక్ష్మజీవాలన్న విషయాన్ని గుర్తించడం సాధ్యమవుతుంది. అందుకే ఒకవేళ ఈ హెచ్‌ఎల్‌ఏ ప్రోటీన్ వేరుగా ఉంటే స్వీకర్తకు చెందిన కణాలను... దాతకు చెందిన కణాలు తిరస్కరిస్తాయన్నమాట. అలా తిరస్కరించడం మొదలుపెడితే అది తీవ్రమైన సమస్యలకు, అత్యంత ప్రమాదకరమైన పరిస్థితికి, ఒక్కోసారి మరణానికి కూడా దారితీస్తుంది. అందుకే ఎవరినుంచి పడితే వారి నుంచి మూల కణాలను స్వీకరించడానికి వీలు కాదు.

పైన పేర్కొన్న తిరస్కరణ అనే ప్రమాదాన్ని తప్పించడం కోసమే స్వీకర్త కణాలకు దగ్గరగా ఉన్న కణాలను ఎంచుకునేందుకే ఈ హెచ్‌ఎల్‌ఏ టైపింగ్ మ్యాచ్ పరీక్ష నిర్వహిస్తారు. మనందరం మన తల్లి నుంచి ఒక సెట్ హెచ్‌ఎల్‌ఏ ప్రోటీన్లనూ, మరో సెట్‌ను తండ్రి నుంచీ ఆనువంశీకంగా పొందుతాం. అందుకే ఒకే కడుపున పుట్టిన ఇద్దరిలో ఈ హెచ్‌ఎల్‌ఏ ప్రోటీన్లు మ్యాచ్ అయ్యే అవకాశాలు ఎక్కువ. ఈ హెచ్‌ఎల్‌ఏలో ప్రధానంగా మూడు రకాలు... ఏ, బీ, డీక్యూ అనేవి రెండు సెట్‌లలో ఉంటాయి. అంటే ఈ ఆరు సెట్‌లలో ఆరూ మ్యాచ్ అయితే అది సరిగ్గా సరిపోయినట్లన్నమాట. ఒకవేళ ఈ ఆరు సెట్లలో కనీసం ఐదు సరిపోయినా అప్పుడవి దాత నుంచి స్వీకర్తకు హానిచేయని విధంగా సరిపోతాయని పరిగణించి దాత మూలకణాలను స్వీకర్తకు ఇవ్వవచ్చని నిర్ధరిస్తారు.

స్టెమ్‌సెల్స్ మ్యాచ్ దొరకకపోతే?

చాలామంది రోగులకు కుటుంబంలో హెచ్‌ఎల్‌ఏ మ్యాచ్ ఉన్న వాళ్లు దొరకరు. అలాంటప్పుడు ‘బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ రిజిస్ట్రీ’ అనబడే సంస్థలో రిజిస్టర్ చేయించుకోవచ్చు. ఈ ‘రిజిస్ట్రీ’ చేసేది ఎందుకంటే... లోకంలో తమ స్టెమ్‌సెల్స్‌ని దానం ఇవ్వడానికి ఇష్టపడే దాతల జాబితా, వారి హెచ్‌ఎల్‌ఏ తరహా (టైప్)ని కంప్యూటర్ ఫైల్‌లో మెయింటెయిన్ చేస్తారు. రోగి రిజిస్టర్ అయ్యాక, అతనికి మ్యాచ్ అయ్యే దాత ఎక్కడైనా దొరుకుతారేమో వాళ్ల డేటాబేస్‌లో వెతికి చెబుతారు. ఒకవేళ ఇలా ఒక దాత స్టెమ్ సెల్స్ దొరికితే దానిని మ్యాచ్‌డ్ అన్‌రిలేటెడ్ డోనర్ స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటారు. కానీ మన దేశంలో ఉపయోగపడే బీఎంటీ రిజిస్ట్రీస్ లేవు. ఉన్న పెద్దవల్లా అమెరికా, యూరోప్‌లో ఉన్నాయి. వాళ్ల రిజిస్ట్రీస్ మీద మన దేశస్తులకు మ్యాచ్ దొరకడం అనేది చాలా అరుదు. ఇలా చాలామందికి బీఎంటీ వల్లనే పూర్తి చికిత్స జరిగి, జబ్బు నయమయ్యే అవకాశం ఉండి కూడా, మ్యాచ్ లేకపోవడంతో చికిత్స చేయడం కుదరడం లేదు. అయితే కొద్ది ఏళ్ల క్రితం తెలుసుకున్న విషయం ఏమంటే... పిల్లలు పుట్టిన తర్వాత బయటకు వచ్చే మాయ (ప్లాసెంటా), దానితో ఉండే బొడ్డుతాడు (అంబిలికల్ కార్డ్)లో ఉన్న రక్తంలో చాలా స్టెమ్‌సెల్స్ ఉంటాయని.

ఈ స్టెమ్‌సెల్స్ పసివి కావడం వల్ల చాలామందికి మ్యాచ్ కాగలవు. లోకంలో ఎంతోమంది పిల్లలు పుడుతూనే ఉన్నారు, మామూలుగా మనకు ఏమీ తెలియకుండానే ఎంతో విలువైన ‘స్టెమ్‌సెల్స్’ను సమకూర్చే ప్లాసెంటా, అంబిలికల్ కార్డ్‌లను పారేస్తుంటాం. అలా కాకుండా అందులోంచి స్టెమ్‌సెల్స్‌ను సేకరించి, భద్రపరచగలిగితే ఎందరో రోగులకు ఉపయోగపడతాయి. ఇలా... కార్డ్ బ్లడ్ స్టెమ్‌సెల్ బ్యాంక్స్ ఇప్పటికే ఏర్పడ్డాయి. భారతదేశంలో కూడా ఇప్పటికే పెద్ద నగరాల్లో ఇవి వెలిశాయి. ఎందరో రోగులకు ఇది వరం అయ్యింది. కానీ, కేవలం ఆర్థిక ప్రయోజనాలు మాత్రమే చూసుకోకుండా, నాణ్యతను పరిగణనలోకి తీసుకుని, ప్రైవేట్ కార్డ్ బ్లడ్ బ్యాంకులు ఏర్పడాలి. పబ్లిక్ కార్డ్ బ్యాంకులు కూడా రావాలి. దీనికోసం సమగ్రమైన చట్టాలు కూడా చేయాల్సిన అవసరం ఉంది.

బీఎంటీ ఉపయోగపడే జబ్బులు ఏవి?

ఆటోలాగస్ స్టెమ్ సెల్స్ ట్రాన్స్‌ప్లాంటేషన్ లేక బీఎంటీ అనే చికిత్సను మామూలుగా మల్టిపుల్ మైలోమా, మళ్లీ మళ్లీ వచ్చిన లింఫోమా (రిలాప్స్‌డ్ లింఫోమా), టెస్టిక్యులార్ జెర్మ్‌సెల్ క్యాన్సర్లు, న్యూరోబ్లాస్టోమా తదితర క్యాన్సర్లలో చేసి, పూర్తిగా నయం అయ్యేలా చూడవచ్చు. అల్లోజెనిక్ బీఎంటీ అనే ప్రక్రియ ద్వారా అక్యూట్ ల్యుకేమియా, అప్లాస్టిక్ అనీమియా, మైలోడిప్లేసియా, థలసీమియా, సికిల్‌సెల్ అనీమియా వంటి వ్యాధులను పూర్తిగా నయం చేయవచ్చు. క్యాన్సర్‌లతో గానీ, రక్తంతో గాని సంబంధం లేని కొన్ని వ్యాధులైన... కంబైన్డ్ ఇమ్యునో డెఫీషియెన్సీ సిండ్రోమ్, గౌషర్స్ డిసీజ్ వంటివి కూడా ఈ ప్రక్రియ ద్వారా నయం చేయవచ్చు.

దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్...
బీఎంటీ చేయడం కానీ, చేయించుకోవడం గాని అంత సులభం కాదు. దీని నుంచి ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ప్రమాదం ఉంది. ముందు 3-4 వారాలలో పెద్ద ఇన్ఫెక్షన్స్ కానీ, ఇతరత్రా జబ్బులుగా కానీ సోకి అవి రోగికి ప్రమాదకరంగా పరిణమించవచ్చు. ఇది బీఎంటీ వల్ల ఎదుర్కోవాల్సిన తొలి సవాలు. ఇందులో ప్రాణాపాయానికి అవకాశాలు చాలా ఎక్కువ. ఈ సవాలును ఎదుర్కొనే క్రమంలో రోగులను ప్రత్యేకంగా రూపొందించిన యూనిట్లలో ఉంచి, చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అల్లోజెనిక్ ట్రాన్స్‌ప్లాంట్ జరిగినట్లయితే, ఇచ్చిన స్టెమ్‌సెల్స్ రోగివి కావు కాబట్టి, వాటి వల్ల రియాక్షన్ వచ్చి జీవీహెచ్‌డీ అనే జబ్బు రావచ్చు. వింతవింత రకాల ఇన్ఫెక్షన్స్, అరుదైన సమస్యలు ఎన్నో వచ్చే అవకాశం ఉంది. దీనికి బాగా తర్ఫీదు పొందిన డాక్టర్లు, నర్స్‌లు, ప్రత్యేకమైన ఇతర సిబ్బంది చాలా అవసరం. అన్ని సౌకర్యాలూ ఉండి, ప్రత్యేకంగా నిర్మితమైన బీఎంటీ యూనిట్స్, దానికి తోడు మల్టీ స్పెషాలిటీ సపోర్ట్ కూడా ఎంతో అవసరం. అనుభవం ఉన్నచోట ఎన్నో జాగ్రత్తలు తీసుకుని చేయడంతో, ఎందరో రోగులు కోలుకుని మామూలు మనుషులు అవుతున్నారు. సుమారు 3-6 వారాలలో రోగి ఇంటికి వెళ్లవచ్చు. 6-12 నెలల్లో మామూలు మనుషులుగా అన్ని పనులూ చేసుకుంటూ ఉండవచ్చు.

ఖర్చు...

ఆటోలాగస్ అయితే సుమారు 5 నుంచి 15 లక్షల రూపాయలు, అల్లోజెనిక్ అయితే సుమారు 15 నుంచి 25 లక్షల రూపాయలు ఖర్చయ్యే అవకాశం ఉంది. మన దేశంలో ఇది పెద్ద మొత్తం అనిపించవచ్చు కానీ, పాశ్చాత్య దేశాల్లో అయ్యే ఖర్చు సుమారు 75 లక్షల రూపాయల నుంచి రెండు కోట్ల వరకూ ఉంటుంది.

చివరగా... మళ్లీ మొదటికి

ఇప్పుడు చివరగా మనం మొదట తెలుసుకున్న సంతోష్ పరిస్థితి ఏమిటో కూడా కాస్త చూద్దాం. మొదట సంతోష్‌కు కీమో జరిగింది. ఆ తర్వాత సంతోష్‌కు తగిన (హెచ్‌ఎల్‌ఏ మ్యాచ్‌కు అర్హమయ్యే) మూలకణాలు దొరుకుతాయేమోనంటూ అతడి సోదరుడికి పరీక్షలు నిర్వహించారు. అవి మ్యాచ్ కావడంతో కీమో తర్వాత సంతోష్‌కు అల్లోజెనిక్ బీఎంటీ నిర్వహించారు. ఆ తర్వాత బీఎంటీ ప్రక్రియ విజయవంతంగా ముగియడంతో అంత తీవ్రమైన జబ్బు నుంచి సంతోష్‌కు విముక్తి కలిగింది. ఇప్పుడు సంతోష్ పూర్తిగా ఆరోగ్యవంతుడైన సాధారణ వ్యక్తి. ప్రస్తుతం బిడ్డను పొందే ప్రయత్నంలో ఉన్నాడు.


కార్డ్ బ్లడ్ బ్యాంక్స్...

ప్రస్తుతం మూలకణాల ప్రాధాన్యాన్ని గుర్తించడం ప్రారంభం కావడంతో తల్లి బొడ్డు తాడును నిల్వ చేసి, దాని నుంచి మూలకణాలను వేరుచేసి, వాటిని జాగ్రత్తగా దాచి భవిష్యత్తులో బిడ్డకు ఏవైనా ప్రాణాంతకమైన జబ్బు వచ్చినా లేదా మూలకణాల చికిత్స అవసరమైనా వాటిని వాడేందుకు ఉద్దేశించినవి ప్రైవేటు బ్యాంకులే. అలా అవి కేవలం ఆ బిడ్డకు మహా అయితే ఆ కుటుంబానికి మాత్రమే ఉపయోగపడగలిగే బాధ్యతలను నిర్వహించేందుకు పరిమితమవుతున్నాయి.


అయితే భవిష్యత్తులో ఎవరికి ఎలాంటి అవసరం వచ్చినా అందరికీ మూలకణాలు అందేలా విస్తృతంగా అవగాహన పెంపొందేలా కాబోయే తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించాల్సిన అవసరం ఉందిప్పుడు. ఇలా విస్తృతమైన ప్రయోజనాలు నెరవేర్చేందుకు ఉద్దేశించిన మూలకణాల బ్యాంక్ భారత్‌లో ఒక్కటి మాత్రమే ఉందంటే... భవిష్యత్తులో క్వాలిఫైడ్ డాక్టర్లు కౌన్సెలింగ్ చేసి, ఇలాంటి బ్యాంకులు మరిన్ని రూపొందడానికి ఎంత కృషి జరగాల్సి ఉందో ఊహించవచ్చు.

- నిర్వహణ: యాసీన్
 

ఐరన్ మాత్రలు - అవగాహన

 

మాత్రా-మంతీ
రక్తహీనత (అనీమియా) సమస్య తీవ్రంగా ఉన్నవారు తప్పనిసరిగా ఐరన్ టాబ్లెట్లు వాడాలి. అలాగే గర్భవతులకు ఐరన్, ఫోలిక్‌యాసిడ్, విటమిన్ బి12 మాత్రలను ఇస్తుంటారు. రక్తహీనత రోగులు ఐరన్ మాత్రలు వాడుతున్నప్పుడు కొన్ని దుష్ర్పభావాలు కనిపిస్తుంటాయి. ఉదాహరణకు కొంతమందిలో ఐరన్ మాత్రల వల్ల వికారం, వాంతులు ఉండవచ్చు. అలాంటప్పుడు మాత్రల మోతాదును గాని లేదా మాత్రలను మార్చాల్సి ఉంటుంది. ఐరన్ మాత్రల వల్ల మలం నల్లగా వస్తుంది. ఇది చాలామందిలో ఇది ఆందోళనగొలుపుతుంది. అయితే దీనికి భయపడాల్సిందేమీ ఉండదు. ఐరన్ మాత్రల వల్ల అలా జరుగుతోందని గ్రహించి నిశ్చింతగా ఉంటే చాలు.


వయాగ్రాతో మరో మేలు...!
అంగస్తంభన లోపంతో బాధపడే వారికి వయాగ్రా మంచి ఔషధంగా ప్రపంచ ప్రతీతి పొందింది. అయితే ఒక ప్రధాన ప్రయోజనం కోసం దీన్ని వాడితో పనిలోపనిగా మరో అదనపు ప్రయోజనమూ కలుగుతోందని చెబుతున్నారు డెట్రాయిట్‌లోని హెన్రీఫోర్డ్ హాస్పిటల్‌కు చెందిన పరిశోధకులు. రక్తనాళాలు విశాలమయ్యేలా చేసే వయాగ్రా ప్రభావంతో మెదడుకు కూడా రక్తప్రభావం అధికమవుతుందట. దాంతో కొన్నిసార్లు మెదడులో దెబ్బతిన్న కణాలు పునరుజ్జీవం పొందే అవకాశాలు ఎక్కువట. అయితే వయాగ్రా వాడినప్పుడు రక్తం వేగంగా పరుగెత్తేలా చేసే గుణం వల్ల తాత్కాలికంగా కళ్లకు రక్తసరఫరా చేసేందుకు ఉపయోగపడే కోరాయిడ్ పొరలకు రక్తప్రసరణ తగ్గుతుందట. దాంతో తాత్కాలికంగా కలర్‌బ్లైండ్‌నెస్ వచ్చే అవకాశాలు ఎక్కువ కాబట్టి వయాగ్రా వాడాక 12 గంటల పాటు డ్రైవింగ్ చేయకపోవడం మంచిదని సెలవిస్తున్నారు ఆ పరిశోధకులు.
 

అసాధ్యం అనే మాట ఏ ప్రయత్నమూ చేయనివారి నోటి నుంచే వస్తుంది.


అందమె ఆనందం

 

నిమ్మ, నారింజ, కమలా తొక్కలు వంటి వాటిని బాగా ఎండబెట్టి, మెత్తగా పొడి కొట్టుకుని, సున్నిపిండిలో కలుపుకుని వేసవిలో స్నానానికి వాడితే చెమట వాసన రాకుండా ఉండటంతోబాటు తాజాగా ఉన్న అనుభూతి కలుగుతుంది. ఎండబెట్టకుండా నీటితో నూరి, ముఖానికి రాసుకుంటే మొటిమలు రాకుండా ఉంటాయి.
 

రోజూ క్లెన్సింగ్ మిల్క్ వాడచ్చా?

 

గుడ్ లుకింగ్


నేను సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ని. పనిలో అలసట, బయట దుమ్ముధూళి మూలంగా ముఖం తాజాదనం కోల్పోయినట్టుగా ఉంటుంది. ‘రోజూ పడుకునేముందు క్లెన్సింగ్ మిల్క్ ఉపయోగించి, ఆ త ర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే మంచిదని, ముఖచర్మం చాలా బాగా శుభ్రపడుతుంద’ని నా స్నేహితురాలు చెబుతోంది. దీనివల్ల ముఖం మరీ డ్రై అవుతుందేమోనని నా భయం. అసలు క్లెన్సింగ్ మిల్క్‌ను ఎందుకు ఉపయోగించాలి? ఏయే సందర్భాలలో ఉపయోగించాలో చెప్పగలరు.
- శార్వరి, ఈమెయిల్


క్లెన్సింగ్‌మిల్క్ చర్మంలోని పోర్స్ వరకు వెళ్లి మలినాలను తొలగించి, శుభ్రం చేస్తుంది. దీనిని రోజూ వాడితే చర్మంలోని సహజసిద్ధమైన ఆయిల్స్ పోయి పొడిగా తయారవుతుంది. పొడిగా మారిన చర్మం త్వరగా ముడతలు పడుతుంది. దీంతో త్వరగా వయసు పైబడినట్టుగా కనిపిస్తారు. అందుకని ఎప్పుడు పడితే అప్పుడు క్లెన్సింగ్‌మిల్క్ వాడకూడదు. చర్మతత్త్వాన్ని బట్టి పదిహేను, నెలరోజులకు ఒకసారి ఉపయోగించడం మేలు.

ముఖానికి టొమాటో, బొప్పాయి, ఆరెంజ్.. వంటి పండ్లతో మసాజ్ చేసుకోవచ్చని, ఫేస్‌ప్యాక్‌లు వాడొచ్చని చెబుతుంటారు. కాని వీటివల్ల స్కిన్ డామేజ్ అవుతుందని, నాణ్యమైన బ్యూటీ ప్రొడక్ట్స్ మాత్రమే వాడాలని బ్యూటీపార్లర్ వారు అంటున్నారు. ఏది నిజం?
- సౌమ్య, వనస్థలిపురం


మీ సౌందర్యనిపుణులు చెప్పింది నిజమే. మన చర్మతత్త్వం ఎలాంటిదో తెలుసుకోకుండా రకరకాల పండ్లను మసాజ్‌లకు వాడితే చర్మం దెబ్బతినవచ్చు. పైగా ఆ పండ్లలోని రకరకాల ఆమ్లాలకు మన చర్మం ఎలా ప్రభావితం అవుతుందో కూడా తెలియదు. ఆ పండ్లలో ఉండే ఆమ్లాలు చర్మాన్ని దెబ్బతీయవచ్చు. ఉదాహరణకు చాలామంది పసుపు రాసుకుంటారు. కాని కొందరికి ఆ పసుపులోని గుణాలుపడక మొటిమ లు రావచ్చు. అంటే ఎవరి చర్మతత్త్వానికి తగ్గట్టుగా వారు ఆ ఉత్పత్తులను వాడితేనే సరైన ఫలితాలు లభిస్తాయి. మసాజ్ విషయానికి వస్తే నిపుణులు చేసే మసాజ్‌లో స్ట్రోక్స్ చర్మానికి తగ్గట్టుగా ఉంటాయి. అక్కడ వాడే నాణ్యమైన ఉత్పత్తులు మంచి ఫలితాన్ని ఇస్తాయి. తాజా పండ్లు తినడం వల్ల ఆరోగ్యం లభిస్తుంది. ఆరోగ్యం చర్మకాంతిని పెంచుతుంది. అందుకని పండ్లను మసాజ్‌లకు కాకుండా తినడానికి ఉపయోగించడం మంచిది. అంతగా అయితే కొన్నిరకాల పండ్లను మాత్రం ఆ చర్మతత్వానికి తగ్గట్టు ఫేస్ ప్యాక్ మాత్రమే వేసుకోవాలి. మసాజ్‌లు చేసుకోకూడదు.

నా వయసు 15. నా జుట్టు చాలా డల్‌గా ఉంటోంది. అక్కడక్కడ తెల్ల వెంట్రుకలు కూడా వచ్చాయి. చుండ్రు సమస్య కూడా ఉంది. ఈ సమస్య వల్ల నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ మధ్య చాలా ఇబ్బందిపడుతున్నాను.
- అభినవ్, ఈమెయిల్


చుండ్రు వల్ల ముఖంపైన, వీపు భాగంలో మొటిమలు వచ్చే అవకాశాలు ఎక్కువ. బ్యాక్టీరియా కూడా ఎక్కువ చేరుతుంది. అందుకని మీ జుట్టుకు సరిపడా మంచి నాణ్యమైన షాంపూను తలస్నానానికి వాడాలి. డల్‌గా ఉంది కదా అని నూనె రాస్తే చుండ్రు సమస్య మరీ పెరుగుతుంది. ముందుగా డెర్మటాలజిస్ట్ దగ్గరకు వెళ్లి మీ చర్మతత్త్వాన్ని పరిశీలించుకోండి. తర్వాత హెయిర్‌స్టైలిస్ట్ దగ్గరకు వెళ్లి వారు చెప్పిన సూచనలు పాటించండి.