all

Sunday, May 12, 2013

బంధించేది మనసే... విడిపించేదీ మనసే..దైవాలజీ

 

 
శ్రీరామకృష్ణ పరమహంస మహాయోగి. ఆయన తనను చూడవచ్చే భక్తులకు, శిష్యులకు కథల రూపంలో ఎన్నో మంచి విషయాలను చెప్పేవారు. వాటిల్లో ఈనాటికీ మనకు అత్యంత ముఖ్యమైనవి, ఉపయోగకరమైనవి ఎన్నో ఉన్నాయి.

ఒకసారి ఇద్దరు స్నేహితులు రోడ్డుమీద నడిచి వెళుతున్నారు. దారిలో ఒకచోట భాగవత పురాణ కాలక్షేపం జరుగుతోంది. వాళ్లలో ఒకడు ‘‘ఒరేయ్! పురాణం విందాం రారా!’’ అని లోపలకి వెళ్లి కూర్చుని వినసాగాడు. రెండవవాడు మాత్రం లోపలికి తొంగిచూసి అక్కడ నుండి వెళ్లిపోయాడు. వాడు నేరుగా ఒక వ్యభిచార గృహం చేరుకున్నాడు. కాని ఎక్కువసేపు అక్కడ ఉండలేకపోయాడు. ఆ పరిసరాలు, అక్కడి వారి ప్రవర్తన అతడికి విరక్తి కలిగించాయి. ‘ఛీ! ఎంత సిగ్గుచేటు! నా స్నేహితుడు పవిత్రమైన హరినామాన్ని వింటూ సత్కాలక్షేపం చేస్తుంటే, నేనేం చేస్తున్నాను?’ అని పశ్చాత్తాపపడ్డాడు.

ఇక రెండవవాడు... భాగవతం వింటూ విసుగు చెందాడు. ‘నేనెంతో బుద్ధిహీనుణ్ణి. వీడి వాగుడు వింటూ ఇక్కడ కూర్చున్నాను. అక్కడ నా మిత్రుడు కులాసాగా కాలం గడుపుతూ, ఆనందం అనుభవిస్తూ ఉండి ఉంటాడు’ అని వాపోయాడు.

కాలం తీరి వాళ్లిద్దరూ మరణించారు. యమభటులు వచ్చి, భాగవతం విన్నవాడి జీవాన్ని నరకానికి ఈడ్చుకుపోయారు. విష్ణుదూతలు వచ్చి వ్యభిచారగృహానికి వెళ్లినవాడి జీవాన్ని వైకుంఠానికి తీసుకుపోయారు!’’

ఈ కథను ప్రియనాథముఖర్జీ అనే వ్యక్తికి రామకృష్ణ గురుదేవులు చెప్పారు. ప్రియనాథ ముఖర్జీ ఇంజినీరు. కొంత ధనాన్ని నిల్వ చేసుకుని చిన్నతనంలోనే ఉద్యోగాన్ని విరమించాడు. అతడికి కలకత్తాలోను, గ్రామప్రాంతంలోనూ ఇళ్లు ఉన్నాయి. తాను సంసారంలో బందీనైపోయానని చెబుతూ తన నిరుత్సాహాన్ని గురుదేవునికి వ్యక్తపరిచాడు.

అప్పుడు రామకృష్ణులు అతడికి ఈ కథ చెప్పి, ‘అన్నింటికీ ప్రధానమైనది మనస్సు. బంధించేది మన స్సే, విముక్తి కలిగించేదీ మనస్సే! బంధింపబడేది మనస్సే, విముక్తి పొందేదీ మనస్సే! భగవంతుడు మానవునిలో చూసేది అతడి మనస్సులోని భావాన్ని, పవిత్రతను మాత్రమే గాని, అతడు ఏమి చేశాడా? ఎక్కడ ఉన్నాడా? అనే విషయాన్ని పట్టించుకోడు’ అని కూడా చెప్పారు.

ఒకరోజు రామకృష్ణులవారు తమ గదిలో ఉన్నారు. మహేంద్రనాథ గుప్త అనే వ్యక్తి కూడా అక్కడ ఉన్నాడు. గురుదేవులు మాటిమాటికీ గోడకు తగిలించి ఉన్న పటాలవైపు చూస్తున్నారు.

శ్రీరామకృష్ణులకు ఎడమవైపున సరస్వతిపటం, దాని పక్కన గౌరాంగ సత్యాంగదులు సంకీర్తన చేస్తున్న పటం, ఎదురుగా ధ్రువుడు, ప్రహ్లాదుడు, కాళికామాత పటాలు, కుడివైపున రాజరాజేశ్వరీదేవి పటం, వెనుకవైపు మునిగిపోతున్న పీటర్‌ను లేవనెత్తుతున్న జీసస్ పటం ఉన్నాయి. ఉన్నట్టుండి గురుదేవులు మహేంద్రనాథ గుప్తాతో ‘‘చూడు! సాధువులు, సన్యాసులు, సజ్జనుల చిత్రపటాలను ఇంట్లో తగిలించి ఉండటం మంచిది. నిద్రలేవగానే ఇతరుల ముఖం చూడకుండా, ముందుగా వారి ముఖాన్నే చూడటం శ్రేయస్సును కలిగిస్తుంది.

రజోగుణ స్వభావులైనవారు తమ ఇళ్లల్లో తమకు ఇష్టులైన రకరకాల వారి పటాలు తగిలించుకుంటారు. ఎటువంటివారి సాంగత్యం చేస్తే అటువంటివారి గుణాలు మనకు కలుగుతాయి. అందుకే ఇంటిలో మనం ఎటువంటి చిత్రపటాలను రోజూ చూస్తూ ఉంటామనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే వాటివల్ల కూడా సాంగత్యదోషం అంటుతుంది!’’ అని చెప్పారు.

ఆధునికయుగంలో మనం ఇళ్లలో ఉంచుకుంటున్న రకరకాల దృశ్యశ్రవణ యంత్రాలు, వాటిద్వారా మనకు లభించే హీనమైన సాంగత్యం, అది మనకు కలిగించే అత్యంత అపాయకరమైన అనర్థాలను గురించి గురుదేవులు దాదాపు నూటయాభై ఏళ్ల క్రితమే మనల్ని హెచ్చరించటం వారి దూరదృష్టికి నిదర్శనం.
 

బుద్ధుడిని చూస్తూ నిద్రలోకి...ఇంటిరియం

 

 
కంటి నిండా నిద్ర పోవడం... చాలా మందికి ఒక కల. బిజీ లైఫ్‌స్టయిల్‌లో నూటికి తొంబై మందికి సాధ్యం కాని వరం. ప్రశాంతత కొరవడితే నిద్ర దూరమవుతుంది. నిద్ర దూరమైతే చికాకులు మొదలవుతాయి. ఆ ప్రభావం పని నైపుణ్యాన్ని దెబ్బతీస్తుంది. ఒకదానికి మరొకటి ఇంటర్‌లింక్‌గా సాగే సమస్యల వలయం ఇదంతా.

‘అందమైన ఇల్లు కట్టుకోవడం సాధ్యమైంది కానీ ప్రశాంతంగా నిద్రపోవడం అసాధ్యంగా మారుతోంది’ అని ఆవేదన చెందేవాళ్లకి తథాగతుడి రూపమే సమాధానం. బుద్ధుని ప్రశాంత వదనం చూస్తే పగలంతా ఎదురైన చికాకులన్నీ తొలగిపోతాయి. తెలియని ఆధ్యాత్మిక భావంతో మనసు నిండిపోతుంది. ధ్యానమూర్తి రూపాన్ని చూస్తూ మనసు ప్రశాంతతను ఆస్వాదిస్తుంటే మనిషి నిద్రలోకి జారిపోతాడు. అందుకు దోహదం చేసేవే బుద్ధుని వాల్ హ్యాంగింగ్స్. ఇక్కడ కనిపించే వాల్ హ్యాంగింగ్‌లో చిన్న లైట్ ఉంది. బుద్ధుని పక్కనే వెలుగుతున్న కొవ్వొత్తి రూపం ఉంది. మనకు కనిపించే ఆ వెలుతురు పెయింటింగే, కానీ దాని లోపల చిన్న బల్బు అమర్చారు. అలాగే చాలా రూపాలున్న పెయింటింగ్‌లో బుద్ధుని ముఖంపై తిలకం స్థానంలో బల్బు ఉంది.

రాత్రి గదిలో లైట్లు ఆపేసి దీనిని ఆన్ చేస్తే మిణుకు మిణుకుమంటూ బెడ్‌ల్యాంప్‌గా చిరుకాంతులీనుతుంది. బెడ్‌రూమ్‌లో ల్యాంప్‌షేడ్‌కి ప్రత్యేకంగా స్థలం కేటాయించడం సాధ్యం కానప్పుడు గోడకు బెడ్‌ల్యాంప్ అమర్చుకుంటాం. అదేదో ఇలా... వాల్ హ్యాంగింగ్‌లో ఉంటే పగలంతా మంచి పెయింటింగ్‌గా గది అందాన్ని పెంచుతుంది, రాత్రి బెడ్‌ల్యాంప్‌గా పనిచేస్తుంది. బుద్ధుని రూపం అలసిన మనసుకు సాంత్వననిస్తుంది. పైగా నిద్రలేచిన వెంటనే మొదటగా బుద్ధుడిని చూస్తుంటే మనిషి ఏ రోజుకారోజు తనను తాను సంస్కరించుకుంటూ ఉంటాడు. మనసులో క్రోధం, సహోద్యోగుల మీద ఆవేశకావేశాల వంటివి పెరగకుండా ఉంటాయి. కాబట్టి మానవసంబంధాలు మెరుగుపడుతుంటాయని బౌద్ధాన్ని ఆచరించేవారి విశ్వాసం.
 

మా అడ్రస్సే అంజన!!

 

అప్పట్లో కాకినాడ గోపిని...
ఇప్పుడు అంజనాసౌమ్య నాన్నని... అంటున్నారు చింతలపూడి గోపాలకృష్ణ.
‘పాటలు పాడే అమ్మాయి ఇల్లు’ గా మా ఇంటి అడ్రస్ మారింది అంటారు సుమతి.
పెళ్లయిన ఏడేళ్లకు పుట్టిన ఈ పాపాయి ఇంట్లో అందరికీ అపురూపమే...
‘పాట...’ అనే మాట పూర్తికాకముందే‘నే పాడుతా’ అంటుంది ఈ అమ్మాయి.
ఇదంతా ప్రోత్సాహమేనా! అంటే...కాదు... వారసత్వం అంటారీ పేరెంట్స్.
పొత్తిళ్లలో పాపాయిని గాయనిగా తీర్చిదిద్దిన ఈ దంపతుల అనుభవాలే
ఈ వారం పేరెంట్రీ!


అంజనను గాయనిని చేయాలన్న ఆలోచన మీ ఇద్దరిలో ఎవరిది?

సుమతి: ఎవరిదీ కాదు, తనదే. టీవీలో చూసిన పాటలను పాడేది. మ్యూజిక్ కూడా నోటితోనే పలికించేది. అప్పటికి తన పేరు పలకడం కూడా సరిగా రాదు, ఊహ తెలియక ముందే ఇలా ఉండడంతో పాపకు సంగీతం ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపోయాం. వాళ్ల మేనత్త జానకి... వీణ, ఓకల్ డిప్లమో కోర్సు చేసింది. అంజన మీద జెనెటిక్స్ ప్రభావం ఉందనిపించేది. మా చిన్నతాత పల్లవి నరసింహనాయుడు సంగీతవిద్వాంసులు, ఆయనకది సహజంగా అబ్బిన కళ. విద్యల నరసింహనాయుడు కాస్తా పల్లవి నరసింహనాయుడుగా వ్యవహారంలోకి వచ్చారు. తాతగారి మేనమామ తిరుపతి నారాయణస్వామి నాయుడు కృతులు రాసి పాడేవారు. ఆ వారసత్వం మా తరంలో డిస్‌కంటిన్యూ అయింది. చిత్తూరు జిల్లా నాగులాపురం నుంచి తాతగారు, నాన్నగారు బట్టల వ్యాపారంతో తిరుపతి, చెన్నై వెళ్లడం, మేము ప్రొఫెషనల్ కోర్సుల వైపు దృష్టి పెట్టడంతో సంగీతం రవళికి అంతరాయం కలిగింది. ఈ తరంలో అమ్మాయికి అబ్బింది. తన పేరు పద్మాంజలి సౌమ్య. సినిమాల్లో పాటలతో అంజనాసౌమ్య అయింది.

గోపాలకృష్ణ: మా ఆవిడ జెనెటిక్స్‌లో పీజీ చేయడంతో సౌమ్య సంగీతానికి ఈజీగా రూట్స్ పట్టుకుంది. పాపకు చిన్నప్పటి నుంచి టీవీలో కనిపించే సింగర్స్‌లాగ పాడాలని ఉండేది. సౌమ్య చిన్నప్పుడు కోల్‌కతాలో ఉండేవాళ్లం. ఒకసారి ప్లాస్టిక్ మైక్ కొనిపించుకుంది. ఆ మైక్ తెచ్చి ఇంటర్వ్యూ చేయమనేది. టీవీలో అందరూ చూస్తున్నారు నాన్నా, బాగా అడుగు అనేది. తను సమాధానం చెప్పగలిగిన ప్రశ్నలనే అడుగుతూ షో పండించేవాడిని.

సౌమ్య సంగీతసాధన ఏ వయసులో మొదలైంది?

సుమతి: సిక్త్స్‌క్లాస్ నుంచి శాస్త్రీయంగా నేర్చుకుంది. ఎంబిఏ చేస్తూ కరస్పాండెన్స్‌లో కర్నాటక సంగీతంలో డిప్లమో చేసింది. తనకు హిందూస్తానీ సంగీతం నేర్చుకోవాలని కోరిక. ప్రముఖ హిందూస్తానీ గాయకులు రామ్మూర్తిగారు చెన్నైలో ఉంటారు. కాకినాడ నుంచి చెన్నై వెళ్లి మాట్లాడాం. వీకెండ్స్‌లో తీసుకెళ్లి నేర్పిద్దాం అనుకున్నాం. అప్పుడు సౌమ్య బిటెక్ ఫైనల్ ఇయర్. ల్యాబ్ వీకెండ్‌లోనే ఉండేది. అలా ఎంత ప్రయత్నించినా సాధ్యం కాలేదు. పాట పాడమడంటే నిద్రలో నుంచి లేచయినా పాడుతుంది. అంత ఇష్టం సంగీతం అంటే.

గోపాలకృష్ణ: ఇష్టమైన పనిలో ఎంత కష్టం ఉన్నా అది కష్టంగా అనిపించదు అంటారు చూడండి. అలాగే ఉండేది. ఒక్కోసారి ముప్పావు గంటలో పూర్తి కావల్సిన రికార్డింగ్‌కి నాలుగైదు గంటలవుతుంది. ఇంత కష్టపడుతోంది పిల్ల అని బాధేసేది, సౌమ్య మాత్రం లోపలికి వెళ్లేటప్పుడు ఎంత సౌమ్యంగా ఉండేదో అంతే సౌమ్యంగా బయటకు వచ్చేది. తనకు సంగీతం తప్ప ఇంకేదీ పట్టదు. అమ్మాయిలకు సహజంగా ఆభరణాల మీద ఇష్టం ఉంటుంది. పైగా సౌమ్య అన్నప్రాశన రోజు బంగారం పట్టుకుంది. కానీ ఆభరణాల మీద వ్యామోహం పెరగలేదు. అన్నింటికంటే ఆశ్చర్యం ఎక్కడంటే... పెళ్లయి అమెరికా వెళ్లిన తర్వాత ఒకసారి మాటల్లో అక్కడ మీది ఏ కారు అని అడిగితే ‘ఏమో నాన్నా! నేనంత గమనించలేదు’ అన్నది. ఆ కారులో తిరుగుతూ అక్కడి తెలుగు పిల్లలను సమీకరించి అన్నమయ్య కీర్తనలు నేర్పించడానికి ప్రయత్నాలు చేస్తోంది. కానీ అదే కారో పట్టించుకోలేదు.

తొలి సంపాదన అనుభవం ఎలా ఉంది?

సుమతి: అప్పుడు సౌమ్య నైన్త్‌క్లాస్. కాకినాడలో ప్రోగ్రామ్ ఇచ్చింది. రెమ్యునరేషన్ అందుకోవడం తప్పులా ఫీలయింది. ‘అనాథలకు, బ్లైండ్ పీపుల్‌కి సహాయం చేయాలని ఉంటుంది. అది మా నాన్న డబ్బుతో చేయడం ఇష్టం లేదు. ఇప్పుడు నా డబ్బుతో చేస్తాను’ అని చెప్పింది. అన్నట్లుగానే పుట్టినరోజు నాడు అంధపిల్లలుండే అనాథశరణాయంలో గడిపింది. తర్వాత అన్ని పుట్టినరోజులూ అంతే. తనకు ఇలాంటి భావాలున్నాయని మాకూ అప్పుడే తెలిసింది.

గోపాలకృష్ణ: ప్రతి విషయానికీ సెన్సిటివ్‌గా స్పందిస్తుంది. మొదటిసారి మెమెంటోగా మినియేచర్ కప్పు ఇచ్చిన నారం పరమేశ్‌కి ఎంత ప్రాధాన్యం ఇచ్చిందనేది ఆయన హఠాన్మరణంతో తెలిసింది. చాలా బాధపడింది. మరీ ఇంత సెన్సిటివ్‌గా ఉంటే ఎలా అని నచ్చచెబుతూ వచ్చాం. ఇప్పటికీ తనకు అనుబంధాలు పెంచుకోవడమే తెలుసు, తుంచుకోవడం తెలియదు.

తన కల గురించి చెప్పేదా?

సుమతి: బీటెక్ చదివేటప్పుడు కాలేజ్‌కి కాకినాడ నుంచి 30 కి.మీ.లు బస్సులో వెళ్లేది. బస్సులో పాటలు పెట్టేవాళ్లు. ఆ పాటలు వింటున్నప్పుడు ‘ఏదో ఒక రోజు నా పాటలను కూడా ఇలా అందరూ వినాలి’ అనుకునేది.

గోపాలకృష్ణ: సౌమ్య కోరుకున్న రోజు బిటెక్ ఫైనలియర్‌లో వచ్చింది. ఫైనలియర్‌లో ప్రాజెక్ట్ వర్క్ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు కోటి గారి నుంచి పిలుపు వచ్చింది. ‘క్లాస్‌మేట్స్’ కోసం ట్రాక్ పాడించి ఫైనల్ చేశారు. ఫస్టియర్‌లో ఒకసారి వాయిస్ టెస్ట్ చేసి ఇంకా పరిణతి రాలేదని వాయిదా వేశారు.

ప్రొఫెషన్‌లో రాణిస్తుందన్న నమ్మకం, అత్యంత సంతోషం ఎప్పుడు?

సుమతి: తనకు సంగీతం ఇష్టం, నేర్పించాం, తీసుకెళ్లమన్న చోటికి తీసుకెళ్తున్నాం. కానీ ఇంత కాంపిటీషన్‌లో ఎంత వరకు తీసుకురాగలం అని సందేహంగా ఉండేది. మాటీవీ సూపర్ సింగర్స్‌లో రకరకాల పాటలు పాడే అవకాశం వచ్చింది. అప్పుడు నమ్మకం కలిగింది. అన్నింటికంటే పెద్ద సంతోషం మా సూపర్ సింగర్స్ 7, క్వార్టర్ ఫైనల్స్‌లో సౌమ్య పాటకు చంద్రబోస్ గారిచ్చిన కాంప్లిమెంట్‌కి కళ్లు చెమర్చాయి.

గోపాలకృష్ణ: నాకు అలాంటి సంతోషాలు మూడున్నాయి. కాకినాడలో సౌమ్య హోర్డింగ్ ఈ గోడంత పెద్దది(వాళ్లింటి హాల్ గోడను చూపిస్తూ) పెట్టారు. ఎవరో చెబితే చూడడానికి వెళ్లాను. మాటలు లేకుండా అలా నిలబడి పోయాను. మరొకటి సూపర్ సింగర్స్ 4 విన్నర్ కావడం, మూడవది కోటిగారు ‘ఎంత గొప్పగా పాడిందో తెలుసా’ అని ప్రశంసించడం.

అసైన్‌మెంట్ ఒప్పుకోవడం, రెమ్యునరేషన్ విషయాలను ఎవరు చూస్తారు?

గోపాలకృష్ణ: సౌమ్యకి చెప్పిన జీవిత సూక్తి ఒక్కటే. నీ మనసు ఏది చెబితే అది చెయ్ అని. పాట అంటే నిద్రలో లేచే అమ్మాయిని ఈ పాటలే పాడు, ఇంత రెమ్యునరేషన్ అయితేనే పాడు అని పరిధి విధించడం తప్పు కదా?

సుమతి: రెమ్యునరేషన్ ఎంత అనే మాట సౌమ్య నోటి వెంట ఇప్పటి వరకు రాలేదు. కవర్ తెచ్చి దేవుడి ముందు పెడుతుంది. తర్వాత కొంత మొత్తం దేవుడి హుండీలో వేస్తుంది. ఈ విషయంలో మా జోక్యం, చర్చలు లేవు.

వివాహం నిర్ణయం ఎలా జరిగింది?

సుమతి, గోపాలకృష్ణ: వరుడి ఎంపిక నుంచి పెళ్లిచీరలు కొనడం వరకు మేము ముగ్గురం కలిసే చేశాం. పెళ్లి కుదిరిన తర్వాత కెరీర్ పుంజుకోసాగింది. పెళ్లి ముహూర్తం కొంత నిడివితో పెట్టుకుంటే బావుంటుందేమో అనుకున్నాం. అప్పుడు చాలా సింపుల్‌గా ‘ఎప్పటికైనా చేసుకోవలసిందేగా, మన అభిప్రాయాలతో కలిసే వాళ్లు అయినప్పుడు వాయిదా వేయడం దేనికి’ అన్నది. అన్నట్లుగానే పెళ్లయిన తర్వాత కూడా గాయనిగా కొనసాగడానికి ఏ ఇబ్బందులూ లేకుండా హాయిగా ఉంది సౌమ్య జీవితం.

బిడ్డ గొప్ప గాయని కావాలని సాధన చేయించే అమ్మానాన్నలుంటారు. పాటలు పాడతానంటే పాడించి విని మురిసిపోయే వాళ్లుంటారు. కూతురు సంగీతాన్ని ఇష్టపడుతుందని తెలిసి ఆమెకోసం ఆ సంగీతం చుట్టూ తమ జీవితాలను మలుచుకున్న అమ్మానాన్నలు వీళ్లు. తిరుమల వేంకటేశ్వరస్వామి, పద్మావతీదేవికి భక్తితో అంజలి ఘటిస్తూ అదే పేరును బిడ్డకు నామకరణం చేసుకున్న సుమతి... ఇదంతా ఆ దేవుని మహిమే అంటున్నారు.

-వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి

అమ్మ... నాన్న... ఒక్క అమ్మాయి!

సుమతి: ముగ్గురం ఒకరి ఎదురుగా ఒకరం ఉండడమే మాకు ఆనందమయమైన క్షణాలు. సౌమ్య ఒక ఇంటర్య్వూలో... ఉదయం అమ్మ, నాన్నలతో కలిసి కాఫీ తాగే క్షణాలు తనకు ఇష్టం అని చెప్పింది. కాఫీ టైమ్‌కి సౌమ్య నిద్ర లేవకపోతే కాఫీ తాగి మళ్లీ పడుకుందువుగాని ఇకలెమ్మని లేపేసేదాన్ని.

గోపాలకృష్ణ: సౌమ్యకు ఫ్రెండ్స్ తక్కువ. నలుగురితో ఇంటరాక్ట్ అవుతుంటే రకరకాల అభిప్రాయాలు, భావాలు తెలుస్తాయి కదా అంటే, మీరున్నారుగా అనేది. ప్రాక్టికల్ జోక్స్‌తో ఆశ్చర్యపరిచేది, మొదటిసారి జపాన్ వెళ్లినప్పుడు ‘జపాన్ ఎలా ఉంది’ అని అడిగితే ‘చీకటిగా ఉంది నాన్నా’ అన్నది. తను అక్కడ దిగింది అర్ధరాత్రి సమయంలో. అలాగే ఒకసారి వాళ్లమ్మ పుస్తకం చదువుతూ కళ్లద్దాలు తీయకుండానే నిద్రపోయింది. అమ్మేంటి కళ్లజోడు తియ్యలేదు అంటే... ‘కలలు సరిగా కనిపించడం లేదేమో నాన్నా’ అన్నది.
 

టీనేజర్స్ గదులు ఇలా ఉండాలి...ఇంటిరియం

 

 
టీనేజ్‌లోకి వచ్చిన వెంటనే తమకు ప్రత్యేకంగా ఒక గది ఉంటే బాగుంటుందని భావిస్తారు. అందువల్ల వీలైనంతవరకు వారికి ఒక ప్రత్యేక గదిని కేటాయించితే మంచిది. తమ గది అనే ఆలోచన కలగగానే వారికి ఎంతో ఆనందం కలుగుతుంది. అందువల్ల వారి అభిరుచులను అడిగి తెలుసుకోవాలి. ముఖ్యంగా గది ఏ రంగులో ఉంటే ఇష్టమో ఆ విధంగా ఉండేలా చూసుకోవాలి.

రంగులను క్రియేటివ్‌గా వేస్తే బావుంటుంది. బాక్‌గ్రౌండ్ అంతా ఒకే కలర్‌లో ఉండనవసరం లేదు. గ్రే, గ్రీన్, బ్లూ కలర్స్‌లో బాగా లైట్‌గా ఉండే షేడ్‌ని ఎంచుకుంటే బావుంటుంది. ఆ రంగులవల్ల గోడలు ప్లెజంట్‌గా అనిపిస్తాయి. టీనేజర్ బాగా ఆడుతూ పాడుతూ కులాసాగా ఉండే వ్యక్తి అయితే, సన్నీ ఎల్లో, గ్రాస్ గ్రీన్ రంగులు బావుంటాయి. అవి వారి మనస్తత్వానికి అనువుగా ఉండటం వల్ల వారు హ్యాపీగా ఉండగలుగుతారు. అంతేకాకుండా జీవితాన్ని కొత్తకోణంలోకి మలుపు తిప్పుకోగ లుగుతారు.

టీనేజర్స్ గదిలో ఉండే మంచం కొద్దిగా పెద్దదిగా ఉండాలి. అలాగే ఆ గదిలో వార్డ్‌రోబ్స్ ఎక్కువగా ఉంటే బావుంటుంది. ఒక వార్డ్‌రోబ్‌కి అద్దం బిగించితే మంచిది. తెలుపు, మెరైన్ బ్లూ, స్ప్రింగ్ గ్రీన్, గ్రే రంగులైతే ఫర్నిచర్‌కి కూడా సూట్ అవుతాయి. షెల్వ్స్‌కి ఉండే స్టాండ్‌లు లేతరంగులలో, మంచి ఆకృతిలో ఉంటే, పుస్తకాలు ఉంచడానికి అనువుగా ఉంటాయి. అలాగే చదువుకి సంబంధించినవాటిని ఉంచుకోవటానికి కూడా వీలుగా ఉంటుంది. కంప్యూటర్ తప్పనిసరి కనుక, అనువుగా ఉండేలా అమర్చుకోవాలి.

మూయడానికి అనువుగా ఉంటే డ్రా ఉన్న టేబుల్స్, కొన్ని ఓపెన్‌గా ఉన్న టేబుల్స్ ఉంటే బొమ్మలను షోగా అమర్చుకోగలుగుతారు. ఒకవేళ టీనేజర్లు స్పోర్ట్స్ అంటే ఇష్టం ఉన్నవారైతే వాటికి సంబంధించిన వస్తువులను అమర్చుకోగలుగుతారు. ఉదాహరణకి బెడ్‌కి వెనకాల ఉండే గోడకు వాల్ పేపర్‌ని బాస్కెట్‌బాల్ లేదా ఫుట్‌బాల్ థీమ్‌తో ఉన్నది అమర్చుకుంటే మనసుకి ఆహ్లాదంగా ఉంటుంది.
 

పునర్జన్మ అంటే ఏమిటి? -దైవాలజీ

 

 
దీనినే ఆంగ్లంలో రీ ఇన్ కార్నేషన్ అంటారు. అవతరించడం అంటే మళ్లీ శరీర ధారణ చేయడం. మన మనస్సు శక్తిని కలిగి ఉంటుంది. విజ్ఞాన శాస్త్రం ప్రకారం శక్తి నాశనం కాదు. అలాంటప్పుడు ఎవరైనా మరణించాక ఆ శక్తి ఏమవుతుంది?

మరణం ఒకరకంగా నిద్ర వంటిది. నిద్ర గురించి తెలిస్తే మరణం గురించి ఇట్టే అర్ధమవుతుంది. మనం నిద్రించేటప్పుడు మన చైతన్యం, ఎరుక, మనసు ముకుళించుకుని అంటే ముడుచుకుని బాహ్య అనుభవాల నుండి దూరమై, లోపలికి, ఒక శూన్యంలోకి వెళ్తాము. ఉదయం నిద్రలేవగానే, అదే శక్తి, అదే చైతన్యం విస్తరించుకుని మేలుకుంటాము. ఈ ప్రక్రియను నిశితంగా గమనిస్తే, మీరు నిద్రలేచేటపుడు మీకు వచ్చే మొదటి ఆలోచన, నిద్రపోయేముందు చివరగా మీకు వచ్చిన ఆలోచనే.

పునర్జన్మ గురించి ఒక కిటుకు ఇక్కడ మీకు దొరుకుతుంది. ఎన్నో వాసనలతో నిండిన మనసు ఈ శరీరాన్ని వదిలేస్తుంది. కాని మనస్సులో ఆ వాసనలు ఉండిపోతాయి. అనుకూల పరిస్థితుల కోసం వేచి ఉండి, ఆత్మ తిరిగి భూమి మీదికి వస్తుంది. అందువలన చివరి ఆలోచన చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. శరీరం వదిలే చివరి క్షణాల్లో మీరు సంతోషంగా ఉంటే, మరుజన్మలో మీకు మంచి శరీరం లభిస్తుంది. పునర్జన్మ అనేది మనం చేసుకునే కర్మలను అనుసరించి వస్తుంది.

మీ వాసనల తాలూకు బలీయమైన ముద్రలు మీ మరుజన్మకు ఆధారమౌతాయి. బహుశా ముందుగానే రాబోయేది ఎటువంటి జన్మ అని కూడా చెప్పగలుగుతాం. మనుమలకు, మునిమనమలకు తాతగారి పేరు పెట్టే సంప్రదాయం భారత దేశంలో, ఆసియా, ఇంగ్లండ్, ైచె నా, కొన్ని ఆఫ్రికా దేశ ప్రాంతాలలో వంశాచారంగా ఉందని మీరు విని ఉంటారు. కొన్ని దశాబ్దాలకు అవతల పుట్టిన పిల్లలు ఆ తాతగారిలా ప్రవర్తించడం గురించి మనం తరచు వింటుంటాం. తమ పిల్లల మీద, మనవళ్ల మీద ఉన్న బలీయమైన వాసనల వలన ఇటువంటి కర్మ ఉత్పన్నమవుతుంది. ప్రేమకాని, ద్వేషం కాని తిరగవేసి చూస్తే ఒకే విధమైన భావనలే అయినందువల్ల ఇలా అవుతుంది.

ప్రేమ వక్రీకరించినప్పుడు ద్వేషం అవుతుంది. ఈ రాగద్వేషాలకు అతీతమవడానికి జ్ఞానం, గ్రహింపు కలగాలి. జ్ఞానం అనేది ద్వేషానికతీతమైన నిజమైన ప్రేమ.
 

ఆరోగ్య సౌభాగ్యాల 'తులసి'

 

తులసి కలియుగ కల్పవృక్షం! ఆ చెట్టు ఉపయోగపడే విధానం వల్లే మనం అలా భావించవచ్చు. అమ్మలేని పిల్లలు, తులసమ్మ లేని ఇల్లు ఉండదని తెలిసిందే. సూర్యుడిని ఏ విధంగా ప్రత్యక్షదైవంగా భావన చేస్తామో అదే విధంగా నేలపై ఉన్న తులసిమొక్కను కూడా భావించవచ్చు. సర్వరోగనివారిణిగా భావించే తులసిని ఔషధంగానే కాకుండా పవిత్రమైన పూజాదళంగా కూడా ఉపయోగిస్తున్నాం. ప్రతి ఇంట తులసి, వేప ఉన్నట్లయితే రోగం ఆమడదూరం పారిపోతుందని, యమకింకరులు ఆ ఇంటివైపు కన్నెత్తి చూసేందుకు కూడా సాహసించరని పెద్దలు చెబుతారు.

తులసి మన దేశంలో కృష్ణతులసి, లక్ష్మీతులసి, రామతులసి, నేలతులసి, వనతులసి, మరువక తులసి, రుద్రజడ తులసి, అడవి తులసి అని ఎనిమిదిరకాలుగా లభ్యమవుతున్నట్లు పండితులు చెబుతారు. కాని ప్రపంచవ్యాప్తంగా 180 రకాలకు పైగా లభ్యం అవుతున్నాయట! తులసిని ‘ఆసిమం సాక్టం’ అని లాటిన్‌లోను, ‘బాసిల్’ అని ఆంగ్లంలోను అంటారు. తులసిలో ‘దైమాత్’ అనే రసాయనం ఉన్నందువల్ల సువాసన వెదజల్లుతుంది.

పార్థివదేహాన్ని తులసివనంలో ఉంచితే శరీరం చెడువాసన రాదని, శరీరంలో మార్పు తొందరగా రాదని శాస్త్రం చెబుతోంది. అందుకే కాబోలు అంత్యేష్టిలో తులసిని తప్పక ఉపయోగిస్తారు. తులసిలో ఉండే రసాయన పదార్థం గాలిలోని కార్బన్‌డయాక్సైడ్‌తో కలిసి చెడు ప్రభావాన్ని అరికడుతుంది. తులసికి... గాలిని పరిశుభ్రం చేసి, వ్యాధులను అరికట్టే గుణం ఉందని పరిశోధనలో తేలింది.

తులసికి ‘నిలువెత్తు బంగారం’ అనిపేరు. అంటే వేళ్ల దగ్గర నుంచి కొమ్మలు, ఆకులు, పూవులు అన్నీ మనకు ఉపయోగం. సౌందర్య సాధనంగా కూడా ఉపయోగపడుతుంది. మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది. పాణవాయువును విడుదల చేస్తుంది. అనారోగ్యం దరిచేరనీయదు. తులసిమాల స్పర్శతో శరీరం ఉత్తేజితమై, దీని నుండి వచ్చే సువాసనకు బడలిక తగ్గుతుందని చెబుతారు. తులసి ఇంట్లో ఉంటే ఆరోగ్యం చెంత ఉన్నట్లే!

- ఉషా అన్నపూర్ణ