all

Tuesday, December 4, 2012

గురువాక్యం శిరోధార్యం-నిత్య సందేశం

రామునివల్ల ఉత్తమగతి పొందిన కబంధుడు తాను పొందిన సాయానికి కృతజ్ఞత చూపిస్తూ ‘‘రామా! సుగ్రీవుని వద్దకు వెడితే నీకు ఉపకారం జరుగుతుంది. దారిలో మతంగ ముని ఆశ్రమం ఉంటుంది. అక్కడకు తప్పకుండా వెళ్ళు. అక్కడ నీకోసం శబరి ఎదురు చూస్తోంది, ఆమెకు నీ దర్శనభాగ్యాన్ని కలిగించు. ఆమె చేసే సేవలను అందుకుని ఆమెను తరింపజెయ్యి. నీకు మంచి జరుగుతుంది’’ అని చెప్పి అదృశ్యమైపోయాడు.

పంపా సరస్సు సమీపంలో ఉన్న మతంగ మహర్షికి శిష్యురాలు శబరి. గురువును సేవించడమే తన జీవితానికి ధన్యత్వంగా భావిస్తూ, సేవ చేసింది. కొంతకాలం తరువాత మతంగుడు యోగం ద్వారా తన భౌతిక శరీరాన్ని విడిచి, పుణ్యలోకాలకు వెళ్ళాలనుకొన్నాడు. తనను కూడా తీసుకుపొమ్మంది శబరి. ‘‘నువ్వు ఇంకా కొంతకాలం ఈలోకంలోనే ఉండాలి. దైవసేవ చేసుకుంటూ కాలం గడుపుతూ ఉండు. శ్రీరామచంద్రుడు తన తమ్ముడైన లక్ష్మణునితో కలిసి ఒకనాడు ఇక్కడికి వస్తారు. ఆయనను సేవించు. ఆ పుణ్యం వల్ల నీకు మోక్షం లభిస్తుంది’’ అని చెప్పి, గురువు సిద్ధిని పొందాడు. రాముడు ఎవరో తనకు తెలీదు. ఎందుకు వస్తాడో తెలీదు. తనకు ఏ సంబంధమూ లేని వ్యక్తికోసం తాను ఎందుకు ఎదురు చూడాలని అడగలేదు. గురువు వాక్యం శిరోధార్యం అనుకుని, అలాగే ఎదురుచూస్తోంది.

క్రమక్రమంగా వయసు మీదపడుతోంది. శరీరానికి పటుత్వం తప్పుతోంది. వార్ధక్యం బాధిస్తోంది. జరాదుఃఖాన్ని భరిస్తోంది. తలచుకుంటే గురుసేవ వలన తనకు లభించిన యోగవిద్య ద్వారా శరీరాన్ని విడిచిపెట్టగలదు శబరి. కాని గురువుగారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. పోనీ ఇంతకాలానికి వస్తాడని ఒక స్పష్టమైన సమయాన్నైనా గురువుగారు చెప్పలేదు. చెప్పమని శబరి అడుగనూ లేదు. గురువు చెప్పింది వినడమే తప్ప, ఎదురుప్రశ్నలు వేసే అలవాటు, తిరస్కరించే నైజం లేదు. అందుకని రాముని రాకకోసం ఎదురు చూస్తోంది.

శబరి చూపులు ఫలించాయి. రాముడు రానే వచ్చాడు. అవధి లేని ఆనందంతో గబగబ ఎదురేగింది. సాదరంగా ఆహ్వానించింది. పాద్యం, అర్ఘ్యం ఇచ్చింది. కూర్చోవడానికి ఆసనాన్ని సిద్ధం చేసింది. ఆ అడవిలో దొరికే మధురమైన ఆహారాన్ని తెచ్చి ఇచ్చింది. ఆయన రాక వల్ల తనకు విముక్తి కలిగిందని కాకుండా గురువాజ్ఞను పాటించేందుకు ఇన్నాళ్ళకు అవకాశం దొరికిందని ఆనందపడి, కుశలప్రశ్నలు వేసింది. ఆమె చేసిన సపర్యలన్నీ ఆనందంగా స్వీకరించాడు రాముడు. ఆ తరువాత సోదరులు ఇద్దరూ చూస్తుండగానే ఆమె మోక్షాన్ని పొందింది.

రాముడు తన గురువులైన వశిష్ఠ విశ్వామిత్రులను ఏనాడూ తిరస్కరించలేదు. అందువల్లే మరొక గురుభక్తురాలికి మోక్షాన్ని అనుగ్రహించగలిగాడు. ఆయుర్వేదశాస్త్రాన్ని క్షుణ్ణంగా అభ్యసించిన ఇందీవరాక్షుడు, అవసరం తీరగానే తన గురువైన బ్రహ్మమిత్రుని దూషించాడు. ఫలితంగా విద్య నిరుపయోగమైపోవడమే కాకుండా బ్రహ్మరాక్షస జన్మను పొందాడు. అందువల్ల గురువాక్యం శిరోధార్యం. గురుద్రోహం, గురుతిరస్కరణం, గురుద్రవ్యాపహరణం మహాపాతకం.

- డా. కడిమిళ్ళ వరప్రసాద్

No comments: