all

Tuesday, December 4, 2012

పావురం తెలివి!-kids story

ఒకరోజు పులి సింహంతో పోట్లాడి గెలవాలనుకుంది. అంతే! వెంటనే సింహం గుహ దగ్గరికి వెళ్లి ధైర్యంగా నిలబడి గట్టిగా అరిచింది. అది మధ్యాహ్నం కావడంతో సింహం బాగా తిని నిద్రపోతోంది. పులి గాండ్రింపులకు మేల్కొని కోపగించుకుంది. ‘‘ఎవరక్కడ?’’ అని అరిచింది. పులి మరింత గట్టిగా అరిచింది. దాంతో సింహం కోపంగా గుహలోంచి బయటికి వచ్చి పులివైపు తీక్షణంగా చూసింది.

‘‘ఎందుకలా అరుస్తున్నావు? నీకేం పనిలేదా? ఫో’’ అంది. పులి ఏమాత్రం భయపడలేదు. ‘‘ఈ ప్రాంతమంతా నాది. నన్ను వెళ్లమనడానికి నువ్వెరవు?’’ అని ప్రశ్నించింది. అదే సమయానికి ఒక పావురం వచ్చి ఏం జరిగిందని అడిగింది. అవి చెప్పింది విని ‘‘ఓస్ ఇంతేనా?’’ అంది పావురం.

వెంటనే వాటి మధ్య నిలిచి సింహాన్ని గుహలోకి వెళ్లమంది. దాని వెనకనే పావురం కూడా వెళ్లింది. లోపలికి వెళ్లిన తర్వాత సింహాన్ని తన చెవుల్లో దూది పెట్టుకోమంది. ‘‘అప్పుడు పులి ఎంత అరిచినా వినపడదు, హాయిగా నిద్ర పోవచ్చు’’నంది. సింహం సంతోషించి దూది పెట్టుకుంది. పావురం గుహలోంచి బయటికి వచ్చి పులి దగ్గరికి వెళ్లి, ‘‘ఇపుడు నీ ఇష్టం వచ్చినంత గట్టిగా అరుచుకో, సింహం నిన్నేమీ చేయలేదు’’ అంది.

పులి అలానే చేసింది. సింహానికి నిద్రాభంగం కలగలేదు. మర్నాడు సింహం బయటికి వచ్చి ఎదురుగా ఓ చెట్టుమీదికి వచ్చిన పావురానికి కృతజ్ఞతలు చెప్పింది. మధ్యాహ్నం పులి దగ్గరికి రివ్వున వెళ్లి, ‘‘నువ్వు సింహం గుహదగ్గరే అరవాలని లేదు. అదుగో ఆ గుట్టమీద ఎక్కి కూడా అరవచ్చు. అప్పుడు అడవంతా వినపడుతుంది. నీకు ఎదురులేదు’’అని బుజ్జగించింది. ‘‘ఆహా ఎంత మంచి మాట చెప్పావు మిత్రమా!’’ అని పులి ఆ గుట్టమీదకి ఎక్కింది. పావురం చక్కగా ఎగిరి వె ళ్లిపోయింది.

No comments: