మాతృదినోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేక కథనం...
చెట్టుకు పువ్వు పూయడం సహజమే కావొచ్చు. కానీ ఏ సామాజిక గాలివానో చెట్టును ఊపేస్తే! పూసిన పువ్వు అనాధగా రాలిపడితే! దాన్ని జాగ్రత్తగా ఏరుకునే రెండు కొమ్మల్లాంటి చేతులు కావాలి. అక్కడ ఈ పువ్వు తిరిగి వికసించాలి. ‘దత్తత బంధం’ అంటే ఇదేనేమో! కడుపున పుడితేనే బిడ్డలా! ప్రేమతో ఆహ్వానించే బంధం పేగుతెంచు కున్నదానికంటే పెద్ద బంధం ఎందుకు కాకూడదు! ‘మాతృ దినోత్సవం’ సందర్భంగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఇస్తున్న దత్తతలపై ప్రత్యేక కథనం.
‘దత్తతలో బిడ్డ తల్లి గర్భంలో కాక ఆమె హృదయంలో పెరుగుతుంది.’. దత్తత దరఖాస్తు తొమ్మిదిపేజీలో కనిపించే ఈ వాక్యం చదవగానే ఎవరికైనా పెంచుకోవడంపై మక్కువ కలుగుతుంది. పిల్లలులేని ఎందరో తల్లిదండ్రుల తాత్కాలిక సమస్యకు దత్తత శాశ్వత పరిష్కారం ఇస్తోంది. అయితే దత్తత కోరుకునే చాలామందికి దానికి సంబంధించిన నియమ నిబంధనలు తెలియవు. మనకు అవసరమైనప్పుడు దత్తతిచ్చేచోటుకెళ్లి మనకి నచ్చిన బిడ్డను తెచ్చుకోవచ్చనే అపోహలో ఉన్నవారు కొందరయితే, ప్రభుత్వ ఆధ్వర్యంలో దత్తత తీసుకోడానికి ఏళ్లు గడిచిపోతాయెందుకని అడిగేవాళ్లు మరికొందరు. ఆ సందేహాల నివృత్తి కోసమే ఈ ప్రత్యేక కథనం. దత్తత ఎవరిస్తారు? మన రాష్ర్తంలో ‘మహిళా శిశు సంక్షేమ శాఖ’ మాత్రమే దత్తత ఇస్తుంది. పూర్వం స్వచ్చంద సంస్థలు కూడా పిల్లల్ని దత్తత ఇచ్చేవి. వాటిపై రకరకాల ఆరోపణలు రావడంతో ఆ పని కేవలం ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహిస్తున్నారు. పదేళ్లక్రితం హైదరాబాద్‌లో ఉన్న మహిళా శిశు సంక్షేమ కార్యాలయంలోనే దత్తత ఇచ్చే వెసులుబాటు ఉండేది. ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ‘శిశుగృహ’ ద్వారా అందుబాటులోకి వచ్చింది. అయినా, హైదరాబాద్‌లో ఉన్న ప్రధాన కార్యాలయానికే ఎక్కువ దరఖాస్తులు వస్తుండటంతో బిడ్డ ఇంటికి రావడానికి ఏడాదిన్నర పడుతోంది. అదే జిల్లాల్లో అయితే ఆర్నెళ్ల సమయం సరిపోతుంది. సమయం గురించి కచ్చితంగా చెప్పాలంటే... ఏడాదిలోపు బిడ్డయితే ఏడాదిన్నరపైనే పడుతుంది. అదే మూడేళ్లలోపు పిల్లలు కావాలంటే ఏడాది సమయం పడుతుంది. అంతకంటే పెద్ద వయసు చిన్నారులను దత్తత తీసుకోవడానికి ఆర్నెళ్లు చాలు. రెండు నెలల బిడ్డ నుంచి పన్నెండేళ్ల వయసు పిల్లలను దత్తతకు ఇస్తారు. అయితే ఇక్కడ పిల్లల వయసును బట్టి దత్తత కోసం వచ్చిన తల్లిదండ్రుల వయసుని నిర్దేశిస్తారు. పాతికేళ్ల దంపతులకు పదేళ్ల పాపని ఇవ్వడానికి నిబంధనలు ఒప్పుకోవు. యాభై ఏళ్లున్నవారికే పదేళ్ల పిల్లల్ని ఇస్తారు. కారణాలు అధికారులు కౌన్సిలింగ్‌లో వివరిస్తారు. దరఖాస్తు...కౌన్సెలింగ్ పిల్లలు లేనివారు శిశు సంక్షేమ శాఖలో దరఖాస్తు చేసుకోవాలి. బిడ్డ కావాలంటూ కోరుతూ మొదలయ్యే ఆ పద్నాలుగు పేజీల ధరఖాస్తులో ఆస్తి మొదలు తల్లిదండ్రుల ఆరోగ్య వివరాలతో సహా పూరించాలి. ఏ ఒక్క ప్రశ్నకు సమాధానం లేకపోయినా దత్తత కోరే అర్హతను కోల్పోతారు. దరఖాస్తు చేసుకున్నాక శిశు విహార్‌వారు కౌన్సెలింగ్‌కి పిలుస్తారు. పిల్లల్ని కోరుకునే తల్లిదండ్రుల ఆలోచన విధానాన్ని దృష్టిలో పెట్టుకునే అధికారులు వారికి అర్హత కల్పిస్తారు. ‘‘దత్తత ఉద్దేశం తల్లిదండ్రులకు తగిన పిల్లల్ని ఇవ్వడం కాదు, పిల్లలకు తగిన తల్లిదండ్రులను వెతకడం. దత్తత అనేది ఏ ఒక్కరి అవసరం కాదు. పిల్లలకు మంచి తల్లిదండ్రులు కావాలి. అలాగే పిల్లలకోసం ఎదురుచూసేవారికి పిల్లలు కావాలి. అయితే రకరకాల ఆలోచనలతో, అభిప్రాయాలతో వచ్చేవారు కౌన్సెలింగ్ తర్వాత వారి హృదయంలో ఉన్న ఆవేదనను బయటపెడతారు. వారి భవిష్యత్తుని ఆనందమయం చేసే బిడ్డని ఇవ్వమని అడుగుతారు. నిజానికి ఇక్కడికి వచ్చే తల్లిదండ్రుల్లో చాలామంది ఇల్లు, ఒళ్లు గుల్ల చేసుకున్నవారే’’ అంటారు శిశు సంక్షేమ శాఖ డిప్యూటీ డెరైక్టర్ శ్యామ్ సుందరి. హోమ్ స్టడీ... కౌన్సిలింగ్ అయ్యాక ఎవరైతే ముందు దరఖాస్తు పెట్టారో వారింటికి ఇద్దరు లేదా ముగ్గురు అధికారులు వెళ్లి వాస్తవాలను విచారిస్తారు. ఆస్తులకు సంబంధించిన వివరాల్లో ఏమైనా అవాస్తవాలున్నట్లు తేలితే దరఖాస్తుని పక్కన పెట్టేస్తారు. హోమ్ స్టడీ చాలా ముఖ్యమైంది. ఎందుకంటే బిడ్డ ఉండేది అక్కడే కాబట్టి. దత్తత తీసుకున్న బిడ్డకు భవిష్యత్తులో ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండాలనేది శిశు సంక్షేమ శాఖ ఉద్దేశం. అలాగే పరిసరాల వాతావరణం కూడా చాలా ముఖ్యం. దానికోసం చుట్టుపక్కలవారితో కూడా అధికారులు మాట్లాడతారు. బిడ్డకు అన్నివిధాల అది అనువైన చోటని నిర్ధారించుకున్న తర్వాతే దరఖాస్తుని అంగీకరిస్తారు. సీనియారిటీని బట్టే... బిడ్డను దత్తతకు ఇవ్వడానికి నెలలు నెలలు ఎందుకు గడిచిపోతాయి? ‘‘దరఖాస్తులు వందల సంఖ్యలో వస్తుంటాయి. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరినీ కౌన్సెలింగ్ చేసి ఎంపిక చేయాలి. దీనికోసం రెండు మూడు నెలల సమయం పడుతుంది. తర్వాత వారి ఇళ్లకు వెళ్లి విచారణ చేయాలి. దీనికి మరో మూడు నెలల సమయం పడుతుంది. ఫలాన వారికి పిల్లల్ని ఇవ్వొచ్చు...అని నిర్ధారించుకున్న తర్వాత ఎవరు ముందుగా ధరఖాస్తు చేసుకున్నారో వారిని శిశు విహార్‌కు పిలిపిస్తాం’’ అని వివరిస్తారు అసిస్టెంట్ డెరైక్టర్ విజయలక్ష్మి. మ్యాచింగ్... తల్లిదండ్రుల రంగు, పోలికలను బట్టి వారడిగిన వయసు బిడ్డని ఎంపిక చేస్తారు అధికారులు. పూర్వం ముగ్గురు పిల్లల్ని చూపించేవారు. ఈ మధ్యకాలంలో దత్తతకు పెరిగిన డిమాండ్‌ని దృష్టిలో పెట్టుకుని ఒక్కబిడ్డను మాత్రమే చూపిస్తున్నారు. నచ్చితే తీసుకోవాలి. లేదంటే వెనక్కి వెళ్లిపోవాలి. విజయలక్ష్మి ఛాంబర్ బయట బోర్డుపై ఇప్పటివరకూ దత్తత తీసుకున్న తలిదండ్రుల ఫొటోలను వారు తీసుకున్న బిడ్డ ఫోటోతో సహా పెట్టారు. వాటిని చూస్తే అధికారుల మ్యాచింగ్ కళను మెచ్చుకోకుండా ఉండలేం. నిజంగా ఆ తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డల్లానే ఉన్నారు. మెడికల్ టెస్టులు... అధికారులు చూపించిన బిడ్డ నచ్చితే, మీకిష్టమైన వైద్యుల దగ్గరికి తీసుకెళ్లి బిడ్డకు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవచ్చు. అప్పటికే అధికారులు పరీక్షలు చేయించినప్పటికీ మీ సందేహాలు తీర్చుకోడానికి మళ్లీ చేయించుకుంటే మంచిది. మీరెక్కడ పరీక్షలు చేయించదలుచుకుంటే అక్కడికి మీతో పాటు అధికారులు ఒక ఆయాని పంపుతారు. దీని గురించి ఈ మధ్యనే దత్తత తీసుకున్న సునీత, ప్రకాష్ దంపతులు... ‘‘మా ఇద్దరి రంగుకు దగ్గరగా, మా పోలికల్లో కలిసిపోయేలా ఉంది పాప. చూడ్డానికి హుషారుగా, ఆరోగ్యంగా కనిపించింది. అయినా ఎందుకైనా మంచిదని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో అన్ని రకాల పరీక్షలూ చేయించుకుని మా సందేహాలు తీర్చుకున్నాం’’ అని చెప్పారు. చట్టబద్ధంగా... ఆరోగ్య పరీక్షలు పూర్తయ్యాక బిడ్డను తీసుకెళ్లి అధికారులకు అప్పగించాలి. బిడ్డ ఆరోగ్యంగా ఉందని ధృవీకరించుకున్నాక, ‘మాకు ఆ బిడ్డ కావా’లంటూ ఒక అంగీకార పత్రాన్ని అందజేయాలి. దానిపై సంబంధిత అధికారుల సంతకాలు అయ్యాక ఓ వారం రోజుల లోపులో బిడ్డను మీకు అప్పగిస్తారు. అక్కడితో బిడ్డ మీ సొంతమైపోయినట్టు కాదు. ఇంటికి తీసుకెళ్లాక ఓ అరవైరోజులు పూర్తయ్యాక ఫ్యామిలీకోర్టులో తల్లిదండ్రుల తరపున ప్రభుత్వ న్యాయవాది పిటిషన్ వేస్తారు. అప్పుడు తల్లిదండ్రులు బిడ్డను దత్తత తీసుకోడానికి సమర్పించిన పత్రాలన్నీ పొందుపరచాలి. కోర్టు పిలిచిన తేదీ ప్రకారం బిడ్డతో సహా న్యాయమూర్తి ముందు హాజరుకావాలి. బిడ్డ పేరుని మార్చుకునే ఉద్దేశం ఉంటే అప్పుడు చెబితే కోర్టు ఆర్డర్ ఆ పేరుతో ఇస్తారు. ఆ ఆర్డరు పత్రాన్ని తీసుకెళ్లి మీ ప్రాంతంలోని మున్సిపల్ కార్యాలయంలో దరఖాస్తు చేస్తే వాళ్లు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇస్తారు. ఆ క్షణం నుండి బిడ్డ చట్టబద్ధంగా మీ సొంతమైనట్టు. బిడ్డను దత్తత తీసుకున్న రెండేళ్ల వరకూ మధ్య మధ్యలో అకస్మాత్తుగా ప్రభుత్వ అధికారులు వచ్చి బిడ్డ వివరాలు కనుక్కుంటారు. ఏదైనా ఇబ్బంది ఉందని తెలిస్తే తగిన చర్యలు తీసుకుంటారు. దత్తతలో చాలా రకాలుంటాయి. బంధువుల పిల్లల్ని, మీ దృష్టికి వచ్చిన అనాథ పిల్లల్ని పెంచుకోవడం మంచిదే కాని వారిని చట్టబద్ధంగా దత్తత చేసుకోకుండా పెంచుకోవడం మాత్రం సురక్షితం కాదు. బంధువుల బిడ్డయితే భవిష్యత్తులో వారినుంచి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. ఇక అనాథలనుకోండి...వారికి మీరేదో జీవితం ఇచ్చినట్లు ఫీలవుతూ వారిపట్ల చిన్నచూపు ఏర్పడే అవకాశం ఉంటుంది. అదే చట్టబద్ధంగా సొంతం చేసుకుంటే వారి పట్ల బాధ్యత ఏర్పడుతుంది. దానివల్ల మీ బంధం పదికాలాలపాటూ పదిలంగా ఉంటుంది. - భువనేశ్వరి సాక్షి ఫీచర్స్ ప్రతినిధి పిల్లలు ఎక్కడివారు? మహిళా శిశు సంక్షేమ శాఖ వాళ్లు దత్తత ఇస్తున్న పిల్లలందరూ అనాథలని అందరికీ తెలుసు. అయితే వాళ్లు మా దగ్గరికి వచ్చేవరకేగానీ ఆ తర్వాత కాదంటారు డిప్యుటీ డెరైక్టర్ శ్యామ్ సుందరి. ‘‘చెత్తకుప్పల్లో దొరికిన వారు కొందరు, బస్టాపులు, రైల్వేస్టేషన్‌లలో దొరికిన వారు కొందరు. ఇలా కాకుండా ఆసుపత్రిలో వదిలిన పిల్లలు కూడా మా దగ్గరికే వస్తారు. ఇలా వచ్చిన పిల్లల ఫొటోలను వివరాలతో పత్రికల్లో ప్రచురిస్తాం. వారికి సంబంధించిన వ్యక్తులు వస్తే తిరిగి ఇచ్చేస్తాం. లేదంటే శిశువిహార్‌కి అప్పగిస్తాం. ఇలాకాకుండా కొందరు తల్లులు వాళ్లే స్వయంగా మా దగ్గరికి తీసుకొస్తుంటారు. వారితో కొన్ని పత్రాలపై సంతకాలు చేయించుకొని బిడ్డను తీసుకుంటాం. అరవైరోజులలోపు ఆ తల్లి మళ్లీ వచ్చి తన బిడ్డని తీసుకెళ్లొచ్చు. ఆ సమయం దాటిపోతే ఆమెకు బిడ్డతో పూర్తిగా సంబంధం తెగిపోయినట్టే. ఏ జిల్లాలో దొరికిన వారిని ఆ జిల్లా శిశు గృహాల్లో చేర్పిస్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చినా, ఎలాంటి పరిస్థితుల్లో వచ్చినా, శిశువిహార్‌కి వచ్చాక వారికి ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటారు. చిత్రం ఏంటంటే మా దగ్గరికి వచ్చేవారంతా ఆడపిల్లలే. మగపిల్లలు చాలా తక్కువ. ఎంత తక్కువంటే నూటికి ఐదుశాతం ఉండడం కూడా కష్టమే. మరో చిత్రం ఏమిటంటే, దత్తతకు వచ్చేవారంతా కూడా ఆడపిల్ల కావాలనే కోరుకుంటున్నారు’’ అని వివరించారామె. ‘ఊయల’లో వేయండి మహిళా శిశు సంక్షేమశాఖవారు కొన్నాళ్ల క్రితం ‘ఊయల’ కార్యక్రమం పెట్టారు. స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఆసుపత్రి ఆవరణలో ఒక ఊయల పెట్టారు. పుట్టిన బిడ్డ ఇష్టం లేకపోతే చెత్తకుప్పల్లో, బస్టాపుల్లో వదలకుండా ఆ ఊయలలో పడుకోబెట్టి వెళ్లిపోవచ్చు. ఆ బిడ్డని జిల్లా శిశుగృహవారు తీసుకెళ్లిపోతారు. డబ్బుతో కనేబదులు... మాకు పెళ్లయి పదిహేనేళ్లవుతోంది. సంతానం కోసం వైద్యపరంగా కూడా చాలా ప్రయత్నాలు చేశాం. మా బంధువులు, స్నేహితులు టెస్ట్‌ట్యూబ్ బేబీలని, సరోగసి అని రకరకాల సలహాలు ఇచ్చారు. ఒక ఆసుపత్రికెళితే ట్రీట్‌మెంట్‌కి రెండు మూడు లక్షలవరకూ ఖర్చవుతుందని చెప్పారు. నాకు, నా భార్యకు ఆ సలహాలు నచ్చలేదు. అన్ని లక్షల డబ్బు ఖర్చుపెడితే పిల్లలు కలుగుతారని గ్యారెంటీ లేదు. ఈలోగా రకరకాల మందులతో ఇల్లే కాదు ఒళ్లంతా గుల్లవుతుంది. అన్నింటికన్నా దత్తత ఉత్తమం అనిపించింది. ఆరు నెలల పాపని తీసుకున్నాం. దత్తత చేసుకుని ఏడాదవుతోంది. ‘సరయు’ ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుంచీ మా జీవితంలో కొత్త వెలుగు వచ్చినట్టు ఉంది. అడాప్షన్ ఈజ్ గుడ్ ఆప్షన్! - తులసికుమార్, హైదరాబాద్ విదేశాలకు వికలాంగులు... శిశువిహార్‌కి వచ్చిన బిడ్డలందరూ ఆరోగ్యవంతులు కారు. వీరిలో చాలామంది శారీరక, మానసిక వికలాంగులు కూడా ఉన్నారు. వీరిని ఎవరూ దత్తత తీసుకోడానికి ముందుకు రారు. మన రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి విదేశీయులు కూడా పిల్లల్ని దత్తత తీసుకుంటున్నారు. ఈ వ్యవహారం కార(సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటి) ఆధ్వర్యంలో జరుగుతుంది. విదేశీయులు అనారోగ్యంగా ఉన్న పిల్లల్ని దత్తత తీసుకోడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ‘‘వారికి పిల్లలు ఉన్నా కూడా సామాజిక స్పృహతో వికలాంగులను, అనారోగ్యంతో బాధపడుతున్నవారిని దత్తత తీసుకుంటారు. ఇప్పటివరకూ మేం 66 మంది పిల్లల్ని విదేశీయులకు దత్తత ఇచ్చాం’’ అని చెప్పారు అసిస్టెంట్ డెరైక్టర్ విజయలక్ష్మి. |
No comments:
Post a Comment