all

Monday, May 13, 2013

అమ్మానేనూ ఫ్రెండ్స్........................సింగిల్ పేరెంట్

 

 
ఎంటర్‌టైన్‌మెంట్‌కి కొత్త నిర్వచనం ఆమె...
వినోదంలో విజ్ఞానాన్ని మేళవించి కార్యక్రమాన్ని ఆద్యంతం రసవత్తరంగా ఒకే పట్టులో నడిపించే టీవీ యాంకర్. 21వ శతాబ్దపు యువతి ఇలా ఉండాలి.... మహిళ అంటే ఇలాగే ఉండాలి... అనే ప్రశంసలను అందుకుంటున్న ఝాన్సి టీనేజ్‌లోకి అడుగుపెట్టబోతున్న అమ్మాయికి తల్లి. సింగిల్ పేరెంట్‌గా రెండు బాధ్యతలను మోస్తున్న ఆమె అనుభవాలు మదర్స్ డే సందర్భంగా...


సాధికార మహిళలో తల్లి పాత్రను ప్రస్తావించినప్పుడు ఝాన్సి... తన కెరీర్ తొలి రోజులను గుర్తు చేసుకున్నారు. ఆమె తల్లి ఆలిండియా రేడియో ఉద్యోగి, తండ్రి కాంట్రాక్టర్. వారిద్దరి ప్రోగ్రెసివ్ థాట్స్‌లో పెరిగిన నేపథ్యాన్నీ గుర్తు చేసుకున్నారు. తను నమ్మే పేరెంటింగ్ వాల్యూస్‌తోపాటు తనబిడ్డ పెంపకంలో అనుసరిస్తున్న విధానాన్ని వివరించారు. ‘‘నాకెరియర్ పాత్‌లో టీవీ షోలలో సోషల్ రెస్పాన్సిబిలిటీని జోడించే అవకాశాలు వచ్చాయి. ఏ కార్యక్రమం చేసినా యాంకర్ అంటే గ్లామర్ ఒక్కటే కాదని నిరూపించడానికి ప్రయత్నించాను. ‘ఎంటర్‌టైన్‌మెంట్‌కి నువ్వు తీసుకుంటున్న అర్థం సరికాదు’ అనే విమర్శలూ వచ్చాయి. ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్‌లు నియమాలు పెట్టలేదు కాబట్టి నాకు కొత్తకోణాన్ని ఆవిష్కరించే అవకాశం వచ్చింది. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే... మనలోని స్కిల్, ప్యాషన్ మన కెరీర్ మీద ప్రభావం చూపుతాయి. పేరెంటింగ్ క్రమంలోనూ వాటిని గుర్తు పెట్టుకోవాలి. పిల్లలకు అవకాశం ఇవ్వాలి, పరిమితులు విధించి, పెద్దరికంతో ఆపకూడదు. అప్పుడే వాళ్లకు ‘నేను ఇష్టపడుతున్నది ఏది’ అనే ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది’’ అన్నారామె.

సింగిల్ పేరెంట్ బాధ్యత!

కుటుంబం సమాజంలో ఒక యూనిట్. కుటుంబంలో అమ్మ, నాన్న, పిల్లలు ఉంటారు. ఇది పాఠ్యాంశాల్లో సిలబస్. ఈ నేపథ్యంలో పాపకు కలిగే సందేహాన్ని ముందే గ్రహించానంటారు ఝాన్సీ. ‘‘ధన్య బుక్‌లో ఈ పాఠం చూసిన తర్వాత టీచర్‌తో మాది సెపరేటెడ్ ఫ్యామిలీ కాబట్టి పాఠాన్ని సున్నితంగా చెప్పమని కోరాను. ఆ టీచర్ పేరు శోభ. ఆమె పుస్తకంలో ఉన్న రెండు, మూడు రకాల కుటుంబాల గురించి చెప్పి ఊరుకోకుండా తల్లి- బిడ్డ ఉండే కుటుంబం, తండ్రి- బిడ్డ ఉండే కుటుంబం, అమ్మానాన్నలు లేకుండా పిల్లలు గ్రాండ్‌పేరెంట్స్‌తో జీవించే పిల్లలు... ఇలా సొసైటీలోని అనేక కుటుంబాలను పరిచయం చేశారు. ఆ పాఠం విన్న రోజు ధన్య ఇంటికి వచ్చి ‘మనలాగే... మా ఫ్రెండ్, వాళ్ల నాన్న ఉంటారట. వాళ్లమ్మ యూకే వెళ్లిందట’ అని చెప్పింది. పిల్లలకు ఏదయినా సానుకూలంగా రిసీవ్ చేసుకునేట్లు చెప్పాలి’’ అన్నారు.

బాధ్యత రెట్టింపు!

సింగిల్ పేరెంట్‌గా బాధ్యత రెట్టింపవుతుందని తెలుసు, పాప భవిష్యత్తు, తన కెరీర్ మీద ప్రభావం... వంటి అనేక కారణాలతో మోయడానికి సిద్ధమయ్యానంటున్నారు ఝాన్సి. ‘‘నేను పేరెంటింగ్ వాల్యూస్‌ని బాగా నమ్ముతాను. ఇంట్లో హెల్దీ ఎన్విరాన్‌మెంట్‌తో కూడిన హ్యాపీ పేరెంటింగ్ ఉండాలి. చైల్డ్ సంతోషంగా లేకపోతే ఆ ప్రభావం మానసిక వికాసం మీద తప్పకుండా ఉంటుంది. డిస్టర్బ్‌డ్ చైల్డ్‌కి ఎన్ని అవకాశాలిచ్చినా ప్రయోజనం ఉండదు. ఎన్ని పైపూతలు పూసినా లోపల సిమెంట్‌లో వచ్చిన క్రాక్స్ పెరుగుతూనే ఉంటాయి. నా నిర్ణయాన్ని చాలామంది ‘ఫ్యామిలీ సిస్టమ్ ఆఫ్ ఇండియన్ పేరెంటింగ్‌ని చాలెంజ్ చేస్తున్నావు’ అన్నారు. అయితే నా నిర్ణయం నా ఒక్కదాని కోసం కాదు. ధన్యని అన్‌హ్యాపీ సిచ్యుయేషన్‌లో పెంచడం కంటే అన్నీ నేనై పెంచడమే కరెక్ట్ అనుకున్నాను. కంప్లీట్ ఫ్యామిలీలో ఉండాల్సిన ఒక ఫిగర్ మిస్సయిన భావన ధన్యలో నాకెప్పుడూ కనిపించలేదు’’ అంటూ వైవాహికజీవితంలో తీసుకున్న నిర్ణయానికి కారణం చెప్పారామె. ఈ సమయంలో అమ్మానాన్నా చాలా సపోర్ట్‌గా నిలిచారని కృతజ్ఞతగా చెప్పారు ఝాన్సి.

ప్రశ్నలు- సమాధానాలు!

సమాజం వేసే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి చెప్పి అలవాటైందంటారు ఝాన్సి. ‘‘ప్రశ్నలు ధన్యకూ వస్తుంటాయి. ఐ స్టే విత్ మై మామ్’ అని చెప్తుంది. లక్కీగా తన స్కూల్ వాతావరణం హెల్దీ. నేను ధన్య చదువు దగ్గర కాన్షియస్‌గా ఉంటాను. ఎంతమంచి టీచరైనా అమ్మకు సమానం కాదు. అమ్మ బెటర్ టీచర్’’ అన్నారు.

వీథి చివరి వరకు నడక...!

పాప కోసం తగినంత సమయాన్ని కేటాయించడం సాధ్యమవుతోందా అన్నప్పుడు... ‘‘నాకు చాలా ఇష్టమైనది తనను స్కూల్ బస్ ఎక్కించడానికి నడిచే నడక. ఇంటి నుంచి వీథి చివర వరకు ధన్యతో కలిసి నడవడం, బస్సు వచ్చే వరకు తను చెప్పే కబుర్లు వినడం నాకు ఇష్టమైన వ్యాపకం’’ అని సంబరంగా చెప్పారు.

సన్నిహితంగా...!

ధన్యతోడిదే లోకం అన్నట్లు జీవిస్తున్నారేమో అన్న సందేహాన్ని వ్యక్తం చేసినప్పుడు... ‘‘మేమిద్దరం ఒక అంగీకారానికి వచ్చాం. పదేళ్ల వరకే నేను తనకి అమ్మని, ఆ తర్వాత ఇద్దరం ఫ్రెండ్స్. ఎలాగూ 18 ఏళ్లు వచ్చిన తర్వాత నన్ను ఫ్రెండ్‌గా అంగీకరించదు కదా! ఈ టైమ్‌ని మిస్ కాకుండా గడపాలన్నది నా కోరిక’’ అన్నారు ఝాన్సి.

ఒక సినిమాలో పల్లెటూరి మహిళ పాత్రలో ఒదిగిపోతారు. మరో షోలో ఆధునిక యువతి పాత్రను పండిస్తారు. సమాజంలో ఉన్న ప్రతి కోణాన్ని స్పృశించాలనే ప్రయత్నం కనిపిస్తుంది ఝాన్సిలో. అలాగే పిల్లల్ని సంతోషకరమై వాతావరణంలో పెంచగలగడమే సరైన పేరెంటింగ్ అని పిల్లల పెంపకంలో మరో కోణాన్ని ప్రస్తావించారు. సంస్కృతి- సంప్రదాయాలకు, ఆధునిక భావజాలానికి ప్రతీక అయిన మహిళ ఎలా ఉంటుంది? - అంటే ‘ఝాన్సిలాగే ఉంటుంది’ అనే సమాధానం చెప్పుకోవాలేమో!
 

No comments: