all

Thursday, July 11, 2013

ఉ సిరి సంపదలు

పుల్లని ఉసిరి మెల్లగా మన చెవుల్లో చెబుతుంది... తన గురించి...
జాగ్రత్తగా వినండి. అయినా...  జగమెరిగిన రుచికి పరిచయమేల...?
ఉసిరిలో సిరి ఉంది... అది ఆరోగ్య సిరి... అది ఆహ్లాద సిరి...  వాహ్... అనిపించే కమ్మదనాల సిరి.
ఇన్ని సిరులున్న ఉసిరి రుచులను ఆస్వాదిద్దాం...  ఉసిరి మరోసారి అంటూ మళ్లీ మళ్లీ తిందాం.

ఉసిరి - ఆవ బద్దలు


కావలసినవి:
ఉసిరికాయలు - కేజీ
ఆవపిండి - 50 గ్రా.
బెల్లం - అరకిలో
కారం - 50 గ్రా.
పసుపు - 10 గ్రా.
ఉప్పు - 50 గ్రా.

పోపు కోసం:

ఎండుమిర్చి, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, ఇంగువ, జీలకర్ర (తగినంత)

తయారి:

ఉసిరికాయల్ని ముక్కలుగా తరిగి, గింజలు వేరుచేయాలి. ఒక గిన్నెలో ఉసిరికాయ ముక్కలు, పసుపు, ఉప్పు, కొద్దిగా నీరు వేసి సన్నని మంటమీద ఉడికించాలి. వేరే పాత్రలో బెల్లం, కొద్దిగా నీరుపోసి స్టౌ మీద ఉంచి లేతపాకం వచ్చేవరకు కలుపుతుండాలి. పాకం వచ్చిన తరవాత ఉసిరిముక్కలు వేసి బాగా కలిపి దించేయాలి. ఇందులో కారం, ఆవపిండి, పసుపు వేసి మరోమారు బాగా కలిపి పక్కన ఉంచుకోవాలి. ఒక బాణలిలో కొద్దిగా నూనె వేసి అందులో పోపు సామాను వేసి వేయించి దానిని ఉసిరి ముక్కలలో వేసి కలపాలి.

ఉసిరి - కొబ్బరి పచ్చడి


కావలసినవి:
ఉసిరికాయలు- పావు కేజీ, కొబ్బరికాయ- ఒకటి,
పచ్చిమిర్చి - 10, చింతపండు గుజ్జు- 50 గ్రా.,
ఉప్పు- తగినంత

పోపు కోసం:

నూనె - రెండు టీ స్పూన్లు, ఇంగువ - తగినంత
జీలకర్ర - టీ స్పూను, మినప్పప్పు - టీ స్పూను
శనగపప్పు - టీ స్పూను, ఎండుమిర్చి - 10
ఆవాలు - టీ స్పూను, కరివేపాకు - రెండు రెబ్బలు
పసుపు- తగినంత, ఉప్పు - తగినంత.

తయారి:

ఉసిరికాయలను తరిగి గింజలు వేరుచేసి పక్కన ఉంచుకోవాలి. బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక అందులో ఈ ముక్కలు వేసి కొద్దిగా వేయించి పక్కన ఉంచుకోవాలి. బాణలిలో నూనె వేసి కాగాక పోపు సామాను వేసి వేయించి పక్కన ఉంచుకోవాలి. కొబ్బరికాయ ముక్కలు తరిగి ఉంచుకోవాలి. మిక్సీలో ముందుగా ఉసిరికాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేయాలి. అవి మెత్తగా అయిన తరవాత అందులో కొబ్బరిముక్కలు, చింతపండు గుజ్జు, పసుపు వేసి మరోమారు గ్రైండ్ చేయాలి. చివరగా పోపు కూడా వేసి ఒక్క తిప్పు తిప్పి తీసేయాలి. ఇది అన్నంలోకి బావుంటుంది.

ఉసిరి తొక్కు


కావలసినవి:
ఉసిరికాయలు - కేజీ, ఉప్పు - 100గ్రా, పచ్చిమిర్చి - 200గ్రా.

పోపుకోసం:

నూనె - రెండు టీ స్పూన్లు, శనగపప్పు - టీ స్పూను
జీలకర్ర - అర టీ స్పూను, మినప్పప్పు - టీ స్పూను
ఆవాలు - టీ స్పూను, ఎండుమిర్చి - 4, ఇంగువ - కొద్దిగా

తయారి:

ఉసిరికాయలు బాగా కడిగి రెండురోజులపాటు ఆరిన తరువాత వాటిని చెక్కాముక్కగా దంచి, గింజలు వేరుచేసి, గట్టి మూత ఉండే సీసా వంటి దానిలో మూడు రోజుల పాటు ఊరబెట్టాలి. మూడవనాడు ఈ ముక్కలకు ఉప్పు, పచ్చిమిర్చి కలిపి దంచి ముద్ద చేసి గాలి దూరని గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. కావలసినప్పుడల్లా ఈ మిశ్రమాన్ని తగినంత బయటకు తీసి కొద్దిగా నూనెతో పోపు పెట్టుకోవాలి.

ఉసిరిపాకం


కావలసినవి:
ఉసిరికాయలు- కేజీ, పంచదార- అర కేజీ, ఏలకుల పొడి- తగినంత

తయారి:

ఉసిరికాయల్ని ముక్కలుగా తరిగి, గింజలు వేరుచేయాలి. మందపాటి గిన్నెలో అరలీటరు నీరు, చక్కెర వేసి స్టౌ మీద ఉంచి, ముదురుపాకం వచ్చేవరకు కలపాలి. తరవాత ఈ పాకంలో ఉసిరిముక్కలు వేసి కలియబెట్టాలి. చివరగా ఏలకుల పొడి చల్లి బాగా కలిపి దించి, చల్లారిన తరువాత గాలి చొరని సీసాలోకి మార్చుకోవాలి.

ఉసిరికాయ పప్పు


కావలసినవి:
ఉసిరికాయలు - పావు కేజీ
కందిపప్పు- పావుకేజీ, పచ్చిమిర్చి - 6 (నిలువుగా కట్ చేయాలి), ఉప్పు, చింతపండుగుజ్జు, పసుపు, నూనె - తగినంత

పోపుకోసం:

కరివేపాకు - రెండు రెమ్మలు
జీలకర్ర - టీ స్పూను, ఆవాలు - టీ స్పూను
మెంతులు - అర టీ స్పూను, ఇంగువ - తగినంత
ఎండుమిర్చి - 8

తయారి:

ఉసిరికాయల్ని చిన్నచిన్న ముక్కలుగా తరిగి గింజలు తీశాక, అందులో తగినంత నీరు, ఉప్పు, పసుపు వేసి ఉడకబెట్టాలి. కందిపప్పును శుభ్రంగా కడిగి కుకర్‌లో మెత్తగా ఉడికించుకోవాలి. స్టౌ మీద బాణలిలో నూనె కాగాక అందులో కరివేపాకు సహా పోపు సామాన్లన్నీ వేసి వేయించాలి. బాగా వేగిన తరవాత దానికి చింతపండు గుజ్జు చేర్చాలి. కొద్దిగా దగ్గరపడ్డాక, ఉడికించిన పప్పు, ఉసిరిముక్కలు వేసి కలపాలి. కొద్దిసేపు ఉడికిన తరువాత కొత్తిమీర చల్లి దించేయాలి. కావలసినవారు వెల్లుల్లి రెబ్బలు వేయించి వేసుకోవచ్చు.

ఉసిరి ఊరగాయ


కావలసినవి:
ఉసిరికాయలు- కేజీ
ఆవపిండి- పావు కేజీ
మెత్తటి ఉప్పు- పావు కేజీ
కారం-పావు కేజీ
నూనె- కేజీ
చింతపండు గుజ్జు- 100గ్రా.
వెల్లుల్లి ముద్ద - 100గ్రా.
పసుపు - తగినంత

తయారి:
ఉసిరికాయలను శుభ్రంగా కడిగి పొడిగుడ్డతో తుడిచి, ఆరబెట్టి పక్కన ఉంచుకోవాలి. బాణలిలో కొద్దిగా నూనె పోసి కాగిన తరవాత అందులో ఉసిరికాయలు వేసి దోరగా వేయించి, స్టౌ మీది నుంచి దించి పక్కన ఉంచుకోవాలి. కాయలు బాగా చల్లారాక అందులో ఉప్పు, ఆవపిండి, పసుపు, కారం వేసి పై నుంచి కిందకు బాగా కలపాలి. తరవాత మిగిలిన నూనె, చింతపండుగుజ్జు, వెల్లుల్లి ముద్ద వేసి కలియబెట్టాలి. మూడు రోజులపాటు కదలకుండా ఊరనివ్వాలి. ఆ తరవాత వేడివేడి అన్నంలో, వెన్నతో పాటుగా కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది.

చెఫ్: చీమకుర్తి శ్రీలత,
శ్రీశివానంద స్వదేశీ ఫుడ్స్, విశాఖపట్నం

సేకరణ: చింతకింది శ్రీనివాసరావు
ఫొటోలు: ఎ. శరత్‌కుమార్


నాటుకోడి రుచులు


కోడి కూయకపోతే తెల్లారొచ్చేమోగానీ, కోడికూర లేకపోతే కొందరికి నిజంగానే తెల్లారదు.
ఆపూట ఈపూట ఏపూటైనా కోఢే! 
ఇది బోనాల సీజన్. దావత్‌ల సీజన్.
అమ్మ చల్లగా చూడాల్సిన వేళ... అతిథులకు వేడివేడిగా నాటుకోడి వండిపెట్టండి.


నాటు కోడి తందూరి

కావలసినవి:
నాటు కోడి ఖీమా - 250 గ్రా.
ఉల్లిపాయ తరుగు - 2 టీ స్పూన్లు
పచ్చిమిర్చి - టీ స్పూన్
కారం - అర టీ స్పూన్
చీజ్ - టీ స్పూన్
కొత్తిమీర - 2 టీ స్పూన్లు
ఉప్పు - తగినంత
గరం మసాలా (ఏలకులు+లవంగాలు+దాల్చిన చెక్క చిన్న ముక్క కలిపి గ్రైండ్ చేయాలి) - అర టీ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్
ఫుడ్ కలర్ - చిటికెడు
తయారి:
కడాయిలో కొద్దిగా నూనె వేసి, కాగాక అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయలను వేసి వేయించుకోవాలి. ఖీమాలో పచ్చిమిర్చి ఉల్లిపాయల మిశ్రమం, చీజ్ తరుగు, కొత్తిమీర, గరం మసాలా, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. తర్వాత ఖీమా మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలు చేసి, పుల్లలకు గుచ్చాలి. కాలుతున్న బొగ్గుల మీద వీటిని కాల్చాలి. తర్వాత పుల్లలను తీసేయాలి. నాటుకోడి తందూరీని వేడి వేడిగా తింటే రుచిగా ఉంటుంది. నచ్చిన చట్నీతో కూడా వీటిని సర్వ్ చేసుకోవచ్చు.

నాటు కోడి పాలక్ వేపుడు

కావలసినవి:
కోడి మాంసం - కేజీ
ఉల్లిపాయలు - 4; పచ్చిమిర్చి - 6
ఎండుమిర్చి - 8; పాలకూర - 150 గ్రా.
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్
గరం మసాలా (దాల్చిన చెక్క - చిన్న ముక్క, లవంగాలు - 5, ఏలకులు - 3 కలిపి పొడి చేయాలి) - అర టీ స్పూన్
పసుపు - అర టీ స్పూన్; పుదీనా - 5 రెమ్మలు
ఉప్పు - సరిపడినంత; కరివేపాకు - రెండు రెమ్మలు
తయారి:
కోడి మాంసం కావలసిన పరిమాణంలో కట్ చేసి ఉంచుకోవాలి.

ఉల్లిపాయలను, పచ్చిమిర్చిని సన్నగా తరగాలి.


కోడి మాంసానికి పసుపు, మసాలా పట్టించి స్టౌ మీద పెట్టి కొద్ది సేపు ఉడికించాలి. ఐదు నిమిషాల తర్వాత కొద్దిగా నీళ్లు పోసి మరికాసేపు ఉడికించాలి.


మరో స్టౌ మీద కడాయి పెట్టి, నూనె పోసి, కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లిపేస్ట్, కరివేపాకు, పుదీనా, పాలకూర వేసి వేగాక, ఉప్పు కలిపి, ఉడికిన కోడిమాంసాన్ని వేసి వే యించాలి.


దించే ముందు ధనియాల పొడి, కొత్తిమీర చల్లాలి.


నాటు కోడి మామిడికాయ కుర్మా

కావలసినవి:
కోడి మాంసం - కేజీ; ఉల్లిపాయలు - 4
వెల్లుల్లి రెబ్బలు (కచ్చాపచ్చాగా దంచాలి) - 5
గసగసాలు - 3 టీ స్పూన్లు
పచ్చికొబ్బరి - కప్పు
పుల్లని పెరుగు - కప్పు
ఉప్పు, కారం - తగినంత
జీడిపప్పు - 50 గ్రా.
పచ్చిమిర్చి - 8
అల్లం - 25 గ్రా.
పసుపు - అర టీ స్పూన్
ధనియాలు - 2 టీ స్పూన్లు
గరం మసాలా - అర టీ స్పూన్ (ఏలకులు - 2 , లవంగాలు - 6, దాల్చిన చెక్క కలిపి తయారుచేసుకోవాలి)
కొత్తిమీర తరుగు -3 టీ స్పూన్లు
మైదా - 4 టీ స్పూన్లు
నూనె - 100 గ్రా.
మామిడికాయ - 3 ముక్కలు
తయారి:
కోడి మాంసం కావలసిన పరిమాణంలో ముక్కలు కోసి, శుభ్రపరుచుకోవాలి. ఉల్లిపాయలను, పచ్చిమిర్చిని తరగాలి.

ముక్కలకు కారం, పసుపు మసాలా, పెరుగు కలిపి పదినిమిషాలు ఉంచాలి.


కడాయిలో నూనె పోసి, కాగాక ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలను వేయించాలి. తర్వాత మ్యారినేట్ చేసిన కోడి ముక్కలను వేసి, కలిపి, వేగనివ్వాలి. ఉప్పు కలిపి, మామిడికాయ ముక్కలు, కొబ్బరి వేసి, కొద్దిగా నీరు పోసి ఉడికించాలి.


ముక్క ఉడికిన తర్వాత ధనియాలపొడి, కొత్తిమీర చల్లి దించాలి.


నాటు కోడి 65

కావలసినవి:
నాటుకోడి మాంసం - 250 గ్రా.; గుడ్డు - 1; కార్న్ ఫ్లోర్ - 5 టీ స్పూన్లు; మైదా - 3 టీ స్పూన్లు; నూనె - 200 గ్రా.; పంచదార - చిటికెడు; మిరియాల పొడి - అర టీ స్పూన్; పచ్చిమిర్చి తరుగు - టీ స్పూన్; కరివేపాకు - 2 రెమ్మలు; ఎండుమిర్చి - 4; పెరుగు - ఒక కప్పు; ఉప్పు - తగినంత; అల్లం, వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్; చిల్లీసాస్ - టీ స్పూన్; టొమాటో సాస్ - టీ స్పూన్
తయారి:
నాటు కోడి ముక్కలను ఒక్క గిన్నెలోకి తీసుకొని, దానిలో కార్న్‌ఫ్లోర్, మైదా, గుడ్డుసొన వేసి కలపాలి. కడాయిలో నూనె పోసి, కాగాక, కలిపి పెట్టిన కోడి ముక్కలను రెండు వైపులా వేయించి తీయాలి.

మరొక కడాయిలో కొద్దిగా నూనె వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి. తర్వాత కరివేపాకు, ఎండుమిర్చిని సగానికి విరిచి వేయాలి. వేగిన తర్వాత పెరుగు, చల్లీసాస్, టొమాటో సాస్, మిరియాలపొడి వేసి కలపాలి.


మంట తీసేసి పై మిశ్రమంలో వేయించిన కోడి ముక్కలను వేసి కలపాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.


నాటుకోడి జీడిపప్పు

కావలసినవి:
నాటు కోడి - 1 కేజీ
జీడిపప్పు - 100 గ్రా.; నూనె - 100 గ్రా.
పచ్చిమిర్చి - 50 గ్రా.; టొమాటోలు - పావు కేజీ; ఉల్లిపాయలు - 100 గ్రా.
అల్లం, వెల్లుల్లిపేస్ట్ - 50 గ్రా.; పసుపు - చిటికెడు; ఉప్పు - తగినంత; ధనియాలపొడి - 2 టీ స్పూన్లు; ఏలకుల పొడి -చిటికెడు; కొత్తిమీర - 2 టీ స్పూన్లు
తయారి:
కోడి ముక్కలకు కారం, పసుపు, ధనియాలపొడి పట్టించాలి జీడిపప్పులో కొద్దిగా నీళ్లు పోసి, ఉడికించి, చల్లారిన తర్వాత ముద్ద చేయాలి. స్టౌ మీద గిన్నె పెట్టి, నూనె వేడిచేయాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆ తర్వాత టొమాటో ముక్కలు, కోడి మాంసం వేసి, ఉడికించాలి. ముక్క కొద్దిగా ఉడికిన తర్వాత జీడిపప్పు ముద్ద వేసి, కొద్దిగా నీరు పోసి కలిపి ఉడికించాలి. దించేముందు కొత్తిమీర, టొమాటో ముక్కలతో గార్నిష్ చేసుకోవాలి.

చెఫ్: ప్రఫుల్
కర్టెసీ: ప్యాపిరస్ రిసార్ట్స్,తిమ్మాపూర్, మహబూబ్‌నగర్

 

తమిళ వంటల రుచులు


తమిళ వంటలు అనగానే మనకు ఠక్కున గుర్తుకువచ్చేవి ఇడ్లీ సాంబార్.
అంతేనా... ! ఇంకాస్త వెరైటీ డిషెస్ టేస్ట్ చేయలేమా!
అనుకునేవారికి బోలెడన్ని వెరైటీలు తమిళుల ఇంట పసందుగా కనిపిస్తాయి.
శాకాహారంలో ఇంపైనవి మాంసాహారంతో మజా మజా కలిగించేవి ఎన్నో ఉన్నాయి.
తమిళుల వంటల గురించి తెలుసుకుంటే స్వయంగా వారింటికి వెళ్లివచ్చినంత సంబరం కలుగుతుంది.
ఎందుకు ఆలశ్యం... ఈ తమిళ వంటలతో మీ ఇంట రుచుల పంట పండించడానికి సిద్ధం కండి.


నిల కుళంబు (దుంపలకూర)

కావలసినవి:
బంగాళదుంపలు - 150 గ్రా.
కంద - 100 గ్రా. చేమదుంపలు - 100 గ్రా.
చిలగడదుంప - 100 గ్రా.
పెండలం - 100 గ్రా.
కరివేపాకు - రెమ్మ
బెల్లం - 50 గ్రా.
కొత్తిమీర తరుగు - అర కప్పు
ధనియాల పొడి - 50 గ్రా.
కారం - 50 గ్రా.
పసుపు - 10 గ్రా.
టొమాటో - 150 గ్రా.
అల్లం - 25 గ్రా.
వెల్లుల్లి - 50 గ్రా.
ఎండుమిర్చి - 4
గరంమసాలా - టీ స్పూన్
సాంబార్ ఉల్లిపాయలు - 150 గ్రా.
ఆవాలు - టీ స్పూన్
నువ్వులనూనె - 100 మి.లీ.
ఉప్పు - తగినంత
గ్రేవీ కోసం:
కొబ్బరి - 500 గ్రా.
సాంబార్ ఉల్లిపాయలు - 150 గ్రా.
చింతపండు - 200 గ్రా.
పచ్చిమిర్చి - 50 గ్రా.
కొత్తిమీర - 50 గ్రా.
తయారి:
పాన్‌లో నూనె వేసి ఉల్లిపాయలు, కొబ్బరి, ధనియాలు, పచ్చిమిర్చి, పసుపు వేసి వేయించాలి. చల్లారిన తర్వాత పేస్ట్ చేయాలి. దుంపముక్కలలో పసుపు, ఉప్పు, చింతపండు గుజ్జు వేసి ఉడికించాలి. మరొక కడాయిలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఉల్లిపాయలు వేగాక కరివేపాకు, టొమాటో ముక్కలు, ధనియాలపొడి, కారం, పసుపు వేసి ఉడికించాలి. దీంట్లో పేస్ట్ చేసిన మిశ్రమం వేసి, కొద్దిగా నీళ్లు కలిపి మరో పది నిమిషాలు ఉడికించాలి. ఉడికించిన దుంప ముక్కలను పై మిశ్రమంలో కలిపి, బెల్లం వేయాలి. చివరగా గుండుమిర్చి, కొత్తిమీర, కరివేపాకుతో గార్నిష్ చేయాలి.

వెత్తలై ఎళ్లు సాదం (తమలపాకు నువ్వుల అన్నం)

కావలసినవి:
తమలపాకులు - 100 గ్రా; మినప్పప్పు - 25 గ్రా.
శనగపప్పు - 25 గ్రా; చిన్న ఉల్లిపాయలు (సాంబార్‌లో వేసేవి) - 150 గ్రా; ఎండుమిర్చి - 10 గ్రా; పచ్చిమిర్చి - 50 గ్రా; నువ్వులు - 15 గ్రా; చింతపండు - 50 గ్రా; కరివేపాకు - 2 రెమ్మలు; కొత్తిమీర తరుగు - 50 గ్రా; సోనామసూరి బియ్యం - 500 గ్రా; ఆవాలు - 10 గ్రా; నువ్వులనూనె - 100 మి.లీ.
ఉప్పు - రుచికి తగినంత; కారం - 20 గ్రా.
పొడి కోసం: జీలకర్ర - 20 గ్రా; ఇంగువ-చిటికెడు; మినప్పప్పు-25 గ్రా.
శనగపప్పు - 25 గ్రా; ఎండుమిర్చి - 10 గ్రా; కరివేపాకు - రెమ్మ
తయారి:
స్టౌ మీద కడాయి పెట్టి, వేడయ్యాక మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర వేసి వేయించాలి. తర్వాత ఇంగువ కలిపి, పొడి చేయాలి. బియ్యం కడిగి, నీళ్లు పోసి అరగంట సేపు నానబెట్టాలి. తర్వాత అన్నం వండి పక్కన ఉంచాలి. కడాయిలో కొద్దిగా నూనె వేసి, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేయించాలి. తర్వాత సాంబార్ ఉల్లిపాయలు వేసి మూడు నిమిషాలు ఉంచాలి. ఉల్లిపాయలు ఉడికిన తర్వాత కారం, చింతపండు గుజ్జు, ఉప్పు, తమలపాకుల తరుగు వేసి పది నిమిషాలు ఉడికించాలి. తర్వాత అన్నం, మినప్పప్పు పొడి వేసి కలపాలి. చివరగా కొత్తిమీర, వేయించిన నువ్వులు, కరివేపాకుతో గార్నిష్ చేసి, వేడి వేడిగా సర్వ్ చేయాలి.

చెట్టినాడ్ కోళి మసాలా (కోడి మసాలా)

కావలసినవి:
ఉల్లిపాయలు - 50 గ్రా; టొమాటో - 60 గ్రా.
పచ్చిమిర్చి - 5; కరివేపాకు - 2 రెమ్మలు
కారం - టీ స్పూన్; ధనియాలపొడి - టీ స్పూన్
నూనె - 200 మి.లీ.; సోంపు - టీ స్పూన్
అల్లంవెల్లుల్లి పేస్ట్ - 25 గ్రా; నిమ్మకాయలు - 2
కోడిమాంసం - 500 గ్రా. ఉప్పు: తగినంత
చెట్టినాడ్ మసాలా: మరాఠీ మొగ్గ - 5 గ్రా.
బిర్యానీ ఆకు - 5 గ్రా; లవంగాలు - 5 గ్రా; జాజికాయ - 1
దాల్చినచెక్క - 5 గ్రా; నల్లమిరియాలు - 10 గ్రా.
నల్ల ఏలకులు - 5 గ్రా; పచ్చ ఏలకులు - 5 గ్రా.
ధనియాలు - 20 గ్రా; రోజ్ పెటల్ - 5 గ్రా; జీలకర్ర - 20 గ్రా.
సోంపు - 10 గ్రా; కరివేపాకు (ఎండినది) - 20 గ్రా.
ఎండుమిర్చి - 25 గ్రా; కొబ్బరి తురుము - 10 గ్రా.
తయారి:
స్టౌ పై పాన్ పెట్టి, చెట్టినాడ్ మసాలా దినుసులన్నీ వేసి, వేయించుకోవాలి. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. మరొక పాన్‌లో నూనె వేసి, సోంపు, త రిగిన ఉల్లిపాయలు వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించుకోవాలి. టొమాటో ముక్కలు వేసి ఉడికించాక ఇతర దినుసులు, ఉప్పు కలపాలి. అందులో చికెన్, చెట్టినాడ్ మసాలా కలిపి ఉడికించాలి. చివరగా కొబ్బరి, కొత్తిమీర, వేయించిన కరివేపాకు వేసి కలిపి దించాలి.

కరి మీన్ కుళంబు (చేప మటన్ పులుసు)

కావల్సినవి:
చేపలు - 500 గ్రా.
మటన్ (బోన్‌లెస్) - 500 గ్రా.
కొత్తిమీర తరుగు - కప్పు
పసుపు - 10 గ్రా.
టొమాటో - 250 గ్రా.
బిర్యానీ ఆకు - 1
కరివేపాకు - రెమ్మ
గరం మసాలా - 5 గ్రా.
ఉప్పు - రుచికి తగినంత
నూనె - 150 ఎం.ఎల్.
సాంబార్
ఉల్లిపాయలు - 250 గ్రా.
పేస్ట్ కోసం...
పచ్చిమిర్చి - 10 గ్రా.
ఎండుకొబ్బరి - 500 గ్రా.
మిరియాలు - 50 గ్రా.
చింతపండు - 50 గ్రా.
ధనియాలపొడి - 25 గ్రా.
అల్లం పేస్ట్ - 25 గ్రా.
వెల్లుల్లిపేస్ట్ - 50 గ్రా.
నూనె - 50 ఎం.ఎల్
సాంబార్
ఉల్లిపాయలు - 250 గ్రా.
తయారి:
స్టౌ పై పాన్ పెట్టి, 50 ఎం.ఎల్ నూనె పోసి, వేడయ్యాక పచ్చిమిర్చి, మిరియాలు, అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, ఉల్లిపాయలు వేసి ఉడికించాలి. తర్వాత ధనియాలపొడి, పసుపు, చింతపండుగుజ్జు వేయాలి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని పేస్ట్ చేయాలి. మరొక మందపు గిన్నెను స్టౌ మీద పెట్టి 150 ఎం.ఎల్ నూనె పోసి, ఉల్లిపాయలు, తమలపాకు, కరివేపాకు, మటన్, పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు, ఉప్పు వేసి ఐదు నిమిషాలు ఉడికించాలి. అడుగు మాడకుండా కొద్దిగా నీళ్లు పోయాలి. మటన్ ఉడికిన తర్వాత పేస్ట్ చేసిన మిశ్రమం, చింతపండు గుజ్జు వేసి, కలిపి, ఉడికించాలి. వాసన ఘుమఘుమలాడుతుండగా చేపముక్కలు వేసి, నాలుగు నిమిషాలు ఉంచి, గరం మసాలా, కొత్తిమీర చల్లి దించాలి.

చెఫ్: జి. సోమ సుందరం

చిరు చిరు వెలుగుల్లో... స్వీటు రుచులు

 

     

ముసురుకున్న చీకట్లను తరిమేసే బ్రైట్‌నెస్ చిన్నారుల సొంతం.
తోకటపాసుల్లా పేలినా... చిచ్చుబుడ్డిల్లా ఎగిసినా
తారాజువ్వల్లా ఎగిరినా .... భూచక్రాల్లా తిరిగినా
కాకరొత్తుల్లా వెన్నెలను విరజిమ్మినావారి సంతోషాల సంబరానికి అంబరమే హద్దు.
దీపావళి వెలుగులను రాశులుగా మదినిండా నింపుకోవాలంటే చిన్నారుల కేరింతలతో జత కట్టాలి.
ఆ దివ్వెల వెలుగుకు ఈ దివ్వమైన రుచులు తోడైతే ...

హా... ఆహా! ఈ దీపావళి ఎంత స్వీటుగా ఉంటుంది!!

చెర్రీ కట్టీ


కావలసినవి:
పాలు - లీటరు; జీడిపప్పు - కేజీ; పంచదార - కేజీ; నెయ్యి - 150 గ్రా; ఏలకులు - 10 గ్రా; చెర్రీ వాటర్ (మార్కెట్లో లభిస్తుంది) - 25 ఎం.ఎల్; చెర్రీ పండ్లు - అలంకరణకు తగినన్ని; కుంకుమపువ్వు - చిటికెడు.

తయారి:

జీడిపప్పును పాలలో లేదా నీథళ్లలో నానబెట్టాలి. తర్వాత జీడిపప్పును గ్రైండ్ చే సి, పంచదార కలిపి సన్నని మంటమీద కుక్ చేయాలి. దీంట్లో నెయ్యి, ఏలకుల పొడి, చెర్రీ వాటర్, కుంకుమపువ్వు వేసి, కలిపి, మరికాసేపు ఉడికించాలి. మిశ్రమం బాగా చిక్కబడ్డాక, దించి చల్లారనివ్వాలి. ప్లేట్‌కి అడుగు భాగాన నెయ్యి రాసి, దాని మీద చిక్కబడిన మిశ్రమం వేసి, పల్చగా పరచాలి. పొడిగా అయ్యాక, డైమండ్ షేప్‌లో కట్ చేయాలి. చెర్రీ, వేయించిన జీడిపప్పులతో అలంకరించాలి.

కారా బిస్కెట్లు


కావలసినవి:
మైదా - ఒకటిన్నర కప్పు; నెయ్యి లేదా బటర్ - 2 టేబుల్ స్పూన్లు; వంటసోడా లేదా బేకింగ్‌సోడా - చిటికెడు; కారం - టీ స్పూన్; ఇంగువ - పావు టీ స్పూన్; ఉప్పు - తగినంత; నూనె - వేయించడానికి తగినంత

తయారి:

బేసిన్‌లో మైదా, వంటసోడా, నెయ్యి, కారం, ఇంగువ, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి, ముద్దలా కలపాలి. పైన మూత పెట్టి, పావు గంట ఉంచాలి. పిండిముద్దను కావలసిన పరిమాణంలో తీసుకొని, చపాతీలా ఒత్తుకోవాలి. కావలసిన షేప్‌లో కట్ చేయాలి. స్టౌ మీద కడాయి పెట్టి, నూనె కాగిన తర్వాత కట్ చేసినవాటిని అందులో వేసి, రెండువైపులా కాల్చి, తీయాలి. టిష్యూ పేపర్‌లో వేస్తే, అదనపు నూనె పీల్చుకుంటుంది. ఈ కారా బిస్కెట్లను డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు.

నోట్:
కారం బదులు మిరియాల పొడి, జీలకర్ర పొడి... ఈ బిస్కెట్లకు రకరకాల ఫ్లేవర్లు జత చేయవచ్చు.

పిస్తా బర్ఫీ


కావలసినవి:
పాలు - 2 లీటర్లు; పంచదార - 400 గ్రా.; నెయ్యి - 150 గ్రా.; కుంకుమపువ్వు - చిటికెడు; ఏలకుల పొడి - టీ స్పూన్; పిస్తా పొడి - 200 గ్రా; పిస్తాపప్పు తరుగు - 50 గ్రా.

తయారి:

పాలను బాగా మరిగించాలి. అందులో పంచదార కలిపి, పేస్ట్ అయ్యేంతవరకు పాలను మరిగిస్తూనే ఉండాలి. అందులో నెయ్యి, కుంకుమపువ్వు, ఏలకుల పొడి వేసి కలపాలి. బర్భీ మౌల్డ్‌కి కొద్దిగా నెయ్యి రాసి, ఈ మిశ్రమాన్ని అందులో సెట్ చేయాలి లేదా మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్‌లోకి తీసుకొని, కావలసిన షేప్‌లో కట్ చేసుకోవాలి. తర్వాత పిస్తాపప్పు పొడి, పిస్తా తరుగుతో గార్నిష్ చేసుకోవాలి.

డ్రై ఫ్రూట్ బర్ఫీ


కావలసినవి:
పాలు - 2 లీటర్లు; పంచదార - 400 గ్రా; నెయ్యి - 150 గ్రా; ఏలకుల పొడి - టీ స్పూన్; రోజ్ వాటర్ - 20 ఎం.ఎల్; బాదంపప్పు - 25 గ్రా; జీడిపప్పు - 25 గ్రా; కిస్‌మిస్ - 25 గ్రా; వాల్‌నట్స్ - 25 గ్రా; పిస్తాపప్పు - 25 గ్రా.

తయారి:

పాలను మరిగించి, అందులో పంచదార కలిపి మిశ్రమం చిక్కబడే వరకు గరిటెతో కలపాలి. నెయ్యి, ఏలకులపొడి జత చేసిన తర్వాత రోజ్ వాటర్, డ్రై ఫ్రూట్స్ పలుకులు కలపాలి. ప్లేట్‌కి నెయ్యి రాసి, ఈ మిశ్రమాన్ని వేసి, పల్చగా పరవాలి. ఆరిన తర్వాత కావలసిన షేప్‌లో కట్ చేసుకోవాలి. కిస్‌మిస్, పిస్తాపప్పు పలుకులతో గార్నిష్ చేసుకోవాలి.

కప్ కేక్స్


కావలసినవి:
అన్‌సాల్టెడ్ బటర్ - కేజీ; ఐసింగ్ షుగర్ - కేజీ; గుడ్లు - 20; మైదా - కేజీ; బేకింగ్ పౌడర్ - 20 గ్రా.; వెనిలా ఎసెన్స్ - 10 ఎం.ఎల్

తయారి:

ఒక గిన్నెలో అన్‌సాల్టెడ్ బటర్, ఐసింగ్ షుగర్ వేసి క్రీమ్ అయ్యేవరకు బాగా కలపాలి. దీంట్లో ఒక దాని తర్వాత ఒకటి గుడ్డులోని సొన వేస్తూ, కలపాలి. తర్వాత బేకింగ్ పౌడర్ కలిపి మైదాను జల్లించి ఆ పిండిని నెమ్మదిగా పోస్తూ బాగా కలపాలి. ఉండలు లేకుండా బాగా కలిశాక చివరగా వెనిలా ఎసెన్స్ జత చేయాలి. బేక్ చేయడానికి రకరకాల షేప్‌లున్న గిన్నెలను తీసుకొని, అందులో ఈ పిండి మిశ్రమం నింపి, 180 డిగ్రీ సెంటిగ్రేడ్‌లో ఇరవై నిమిషాలు బేక్ చేయాలి.

నోట్: కప్ కేక్‌లలో రకరకాల ఫ్లేవర్స్ కలుపుకోవచ్చు.


చాక్లెట్ ఆల్మండ్ కేక్


కావలసినవి:

మైదా - కేజీ; ఉప్పు - 20 గ్రా.; బటర్ - 200 గ్రా.; పాల పొడి - 20 గ్రా.; తేనె - 225 గ్రా.; బ్రెడ్ ఇంప్రూవర్ (మార్కెట్లో లభిస్తుంది) - 10 గ్రా.; ఈస్ట్ (మార్కెట్లో లభిస్తుంది) - 20 గ్రా; గుడ్లు - 5; పాలు లేదా నీళ్లు - 350 ఎం.ఎల్

తయారి:

ఒక గిన్నెలో మైదా, ఉప్పు, పాల పొడి, బ్రెడ్ ఇంప్రూవర్, బటర్, పాలు, గుడ్డు సొన, ఈస్ట్, తేనె వేసి కలపాలి. పిండి ముద్దగా అయ్యాక పైన మరొక గిన్నె మూత పెట్టి ఫ్రిజ్‌లో 30 నిమిషాల తరవాత పిండి బయటకు తీయాలి. కావలసినంత పరిమాణం పిండి తీసుకొని, డో షేప్ చేయాలి. రూమ్ టెంపరేచర్‌లోకి వచ్చేంతవరకు ఉంచాలి. స్టౌ మీద కడాయి పెట్టి, నూనె పోసి, వేడయ్యాక సిద్ధం చేసుకున్న డోన ట్స్‌ను వేసి రెండు వైపులా డీప్ ఫ్రై చేయాలి. ఫ్రై చేస్తున్నంతసేపూ సన్నని మంట ఉండేలా చూడాలి. బయటకు తీసి, చల్లారిన తర్వాత షుగర్ ఫ్రీ చాక్లెట్ తురుము, పిస్తాపప్పుతో అలంకరించాలి.

చాక్లెట్ ఆల్మండ్ కేక్


కావలసినవి:

బటర్ - 1100 గ్రా. (ఒక కిలో + 100 గ్రా.); ఆల్మండ్ పౌడర్ - 600 గ్రా.; ఐసింగ్ షుగర్ - 600 గ్రా.; పంచదార - 900 గ్రా.; గుడ్లు - 24; మైదా - 700 గ్రా; బేకింగ్ పౌడర్ - 10 గ్రా; కోకో పౌడర్- 150 గ్రా.

తయారి:

ఒక గిన్నెలో గుడ్డు సొన, పంచదార వేసి బాగా గిలకొట్టాలి. మైదా, ఆల్మండ్ పౌడర్, ఐసింగ్ షుగర్, కోకో పౌడర్, బేకింగ్ పౌడర్ కలపాలి. ఈ పిండిని గుడ్డు మిశ్రమంలో వేసి బాగా కలపాలి. బటర్‌ను కరిగించి కేక్ చేసే గిన్నెల(మౌల్డ్)లో కొద్ది కొద్దిగా వేసి, చుట్టూ రాయాలి. పిండి మిశ్రమాన్ని కేక్ మౌల్డ్‌లో పోసి బేక్ చేసి, బయటకు తీయాలి. చల్లారిన తర్వాత చాక్లెట్, బాదంపప్పు పలుకులను కేక్ పైన అలంకరించాలి.

ఫిల్లింగ్ కోసం..
ఫ్రెష్ క్రీమ్ - 500 గ్రా; చాక్లెట్ - 500 గ్రా; బటర్ - 100 గ్రా.

తయారి:
క్రీమ్‌ని ఒక గిన్నెలో వేసి మరిగించాలి, దాంట్లో చాక్లెట్ వేసి కలపాలి. చాక్లెట్ కరిగిన తర్వాత, బటర్ వేసి కలపాలి.

కర్టెసీ: శ్రీహరి మలిరెడ్డి
వెంకటకృష్ణరాయపురం, కాకినాడ



ఫొటోలు:ఎస్.ఎస్.ఠాకూర్

భోజనంలో పచ్చడి ..... ఢీ

    
పచ్చడి లేని భోజనం... చేవ చచ్చిన జీవితం సేమ్ టు సేమ్. మనిషన్నాక కాస్త ఉప్పూకారం తగలాలి. చింతకాయ... మిరపకాయ కలిపి నూరిన కారం నషాళానికి అంటాలి. సిట్యుయేషన్‌ను ఢీ కొట్టాలంటే పచ్చడికి మించిన ఉత్ప్రేరకం లేదు. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్... దేనిలోనైనా సరే పచ్చడే విన్నర్. తెలుగువారు కోరుకునే పచ్చళ్లు ఇవి. లొట్టలకు తెరిచే వాకిళ్లు ఇవి.

కొబ్బరి పచ్చడి


కావలసినవి
పచ్చికొబ్బరి తురుము - కప్పు, పచ్చిమిర్చి - 2 (కట్ చేయాలి), పుట్నాలపప్పు - టేబుల్ స్పూన్ (వేయించాలి), పెరుగు - అర కప్పు, ఉప్పు - తగినంత

పోపుకోసం...

జీలకర్ర - పావు టీ స్పూన్, ఆవాలు - టీ స్పూన్, మినప్పప్పు - టేబుల్ స్పూన్, ఎండుమిర్చి - 2, కరివేపాకు - రెమ్మ, నూనె - 2 టేబుల్ స్పూన్లు

తయారి

పుట్నాలపప్పును గ్రైండ్ చేసి, అందులో కొబ్బరి తురుము, పెరుగు, తగినంత ఉప్పు వేసి, పేస్ట్‌లా చేయాలి. (పలచగా ఉండటానికి తగినన్ని నీళ్లు కలుపుకోవచ్చు) . స్టౌ మీద పాన్ పెట్టి, నూనె కాగాక ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, మినప్పప్పు వేసి, వేయించాలి. ఈ పోపును కొబ్బరి మిశ్రమంలో కలపాలి. ఇలా తయారుచేసుకున్న కొబ్బరి పచ్చడి ఇడ్లీ, దోసె, ఊతప్పంలలోకి రుచిగా ఉంటుంది.

పెసరపప్పు పచ్చడి


కావలసినవి:
పెసరపప్పు - కప్పు
ఎండుమిర్చి - 7
పచ్చిమిర్చి - 4
జీలకర్ర - అర టీ స్పూన్
ఇంగువ - చిటికెడు
ఉప్పు - తగినంత

పోపుకోసం...
నూనె - టీ స్పూన్
ఆవాలు - టీ స్పూన్
శనగపప్పు - టీ స్పూన్
మినప్పప్పు - టీ స్పూన్

తయారి

తగినన్ని నీళ్లు పోసి పెసరపప్పును మూడు గంటల సేపు నానబెట్టాలి. నీళ్లను వడకట్టి ఉప్పు కలిపి గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా అవడానికి కొద్దిగా నీళ్లు కలుపుకోవచ్చు. దీంట్లో జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి మళ్లీ ఒకసారి గ్రైండ్ చేయాలి. స్టౌ పై కడాయి పెట్టి, నూనె కాగాక ఇంగువ, శనగపప్పు, మినప్పప్పు వేసి కొద్దిగా వేగాక, ఆవాలు వేసి చిటపట మనిపించి దించేయాలి. ఈ పోపును పెసరపప్పు పచ్చడిలో కలపాలి.

టొమాటో పచ్చడి


కావలసినవి:
టొమాటోలు - 4 (ముక్కలు చేయాలి) వెల్లుల్లి రెబ్బలు - 8, ఉల్లికాడలు (తెల్లని భాగం మాత్రమే తరగాలి) - పావు కప్పు ఉల్లికాడలు (పచ్చని భాగం తరగాలి) - 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి - 2 (నీళ్లలో నానబెట్టాలి), కొత్తిమీర తరుగు - టేబుల్ స్పూన్, ఉప్పు - రుచికి తగినంత

పోపుకోసం...

నూనె - టీ స్పూన్, ఆవాలు, జీలకర్ర - అర టీ స్పూన్ చొప్పున, ఎండుమిర్చి - 2,
మినప్పప్పు - టీ స్పూన్,
కరివేపాకు - రెమ్మ

తయారి:

నీళ్లలో నుంచి తీసిన ఎండుమిర్చిని సన్నగా తరగాలి. స్టౌ మీద కడాయి పెట్టి, నూనె వేసి, వేడయ్యాక తెల్ల ఉల్లికాడలు, పచ్చ ఉల్లికాడలు, వెల్లుల్లి రెబ్బలు వేసి సన్నని మంట మీద ఐదు నిమిషాలు వేయించాలి. దీంట్లో ఎండుమిర్చి, ఉప్పు వేసి కలపాలి. ఆ తర్వాత టొమాటో ముక్కలు వేసి 10 నిమిషాలు ఉడికించాలి. గరిటెతో టొమాటోలను బాగా చిదమాలి. చల్లారిన తర్వాత, మెత్తగా నూరుకోవాలి. స్టౌ మీద పాన్ పెట్టి, నూనె కాగాక ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, మినప్పప్పు వేసి, వేయించాలి. ఈ పోపును టొమాటో పచ్చడిలో కలపాలి.

పుదీనా - కొత్తిమీర పచ్చడి


కావలసినవి:
పుదీనా - కట్ట
కొత్తిమీర - కట్ట
వెల్లుల్లి రెబ్బలు - 5
అల్లం - చిన్నముక్క
పచ్చిమిర్చి - 2
పంచదార - టీ స్పూన్
ఉప్పు - అర టీ స్పూన్
నిమ్మరసం - 2 టీ స్పూన్లు

తయారి:

కొత్తిమీరను కట్‌చేసి పక్కన ఉంచుకోవాలి. పుదీనా ఆకులను వేరు చేసి పెట్టుకోవాలి. రెండింటినీ నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. కొత్తిమీర, పుదీనా, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, పంచదార, ఉప్పు కలిపి మెత్తగా నూరుకుని, నిమ్మరసం కలపాలి. స్టౌ మీద పాన్ పెట్టి, నూనె కాగాక ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, మినప్పప్పు వేసి వేయించాలి. ఈ పోపును పుదీనా, కొత్తిమీర మిశ్రమంలో కలపాలి. (ఈ పచ్చడిని పలచగా కావాలంటే కొద్దిగా నీళ్లు కలుపుకోవచ్చు) ఈ పచ్చడి ఇడ్లీ, దోసె, వడలలోకి రుచిగా ఉంటుంది.

చింతపండు పచ్చడి


కావలసినవి:
చింతపండు - 200 గ్రా.
బెల్లం - 300 గ్రా. (తరగాలి)
జీలకర్ర పొడి - 2 టీ స్పూన్లు
ఉప్పు - తగినంత
నల్ల ఉప్పు - టీ స్పూన్
గరం మసాలా - టీ స్పూన్

తయారి:

ఒక గిన్నెలో ఐదు కప్పుల నీళ్లు పోసి, అందులో చింతపండు వేసి, స్టౌ మీద పెట్టి సన్నని మంట మీద పది నిమిషాలు ఉడికించాలి. దాంట్లో బెల్లం, కారం, జీలకర్రపొడి, ఉప్పు, గరంమసాలా వేసి కలపాలి. బెల్లం పూర్తిగా కరిగి, చిక్కటి మిశ్రమంలా అయ్యేవరకు ఉంచి, దించాలి. చల్లారిన తర్వాత సర్వ్ చేయాలి.

ఆత్మీయత, అభిమానం... ఇలా కూడా ఉండొచ్చు

.
ఆత్మీయత ఇలా కూడా ఉండొచ్చు.
ప్లేటు నిండా రోటీలు, పక్కనే మటన్ ఖీమా!
అభిమానం ఇలా కూడా ఉండొచ్చు.
ప్లేటు నిండా పూరీలు, పక్కనే పనీర్ చిల్లీ ఫ్రై!
ఆత్మీయత, అభిమానం... రెండూ కలిస్తే?
ఒక కప్పు ఖుబానీ కా మీఠా.
ఒక గ్లాసు గ్రేప్ మిల్క్ షేక్.
గెస్ట్‌లు ఎవరైనా వస్తున్నారా మీ ఇంటికి?
ఈ ఐటమ్స్ తినిపించండి చాలు.
మీ కడుపు నిండిపోతుంది.
అతిథి దేవోభవ అని కదా అంటారు.
హోస్టు దేవోభవ అనకుండా వెళ్లలేరు.
క్యాలీఫ్లవర్ ఫ్రై

కావలసినవి: ఉల్లిపాయ - 1
క్యాలీఫ్లవర్ - ఒక పువ్వు
కొబ్బరితురుము - మూడు టేబుల్ స్పూన్లు
కొబ్బరినూనె - రెండు టేబుల్ స్పూన్లు
ఇంగువ - పావు టీ స్పూను
పసుపు - కొద్దిగా; కారం - టీ స్పూను
పచ్చిమిర్చి - 3; ఉప్పు - తగినంత

పోపుకోసం

ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను
తయారి

- స్టౌ మీద బాణలి ఉంచి అందులో కొద్దిగా నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి.
- ఉల్లితరుగు, కరివేపాకు వేసి వేయించాలి.
- తరిగి ఉంచుకున్న క్యాలీఫ్లవర్ వేసి వేయించాలి.
- కొద్దిగా ఇంగువ, పసుపు, కొబ్బరినూనె, కారం, పచ్చిమిర్చి తరుగు వేసి వేయించాలి.
- అన్నీ బాగా కలిపి మెత్తగా అయ్యే వరకు కలుపుతుండాలి.
- కొబ్బరి నూనె వేసి ఒక్కసారి కలిపి దించేయాలి.
గ్రేప్ మిల్క్ షేక్

కావలసినవి: నల్లద్రాక్షలు - కప్పు (నీటిలో శుభ్రంగా కడగాలి)
పంచదార - అర కప్పు; నీళ్లు - కప్పు; కాచి చల్లార్చిన పాలు - 250 మి.లీ.; వెనీలా లేదా ఏదైనా ఐస్‌క్రీమ్ - రెండు స్కూపులు (వాడకపోయినా పరవాలేదు)
తయారి
- పంచదార, ద్రాక్ష పళ్లను వేరువేరు గిన్నెలలో వేసి, అర కప్పు చొప్పున నీరు పోయాలి.
- {దాక్షలు వేసిన గిన్నెను స్టౌ మీద ఉంచి మెత్తగా అయ్యేవరకు ఉడికించి చల్లార్చాలి.
- నీరు, పంచదార వేసిన పాత్రను స్టౌ మీద ఉంచి తీగపాకం వచ్చే వరకు కలపాలి.
- {దాక్షలను మెత్తగా అయ్యేవరకు మిక్సీ పట్టి, పంచదారపాకంలో వేసి, మరో 5 నిముషాలు సన్నని మంట మీద ఉడికించి దించి చల్లార్చాలి.
- సర్వ్ చేయడానికి ముందుగా ద్రాక్షరసంలో పాలు వేసి బాగా కలపాలి.
- గాజుగ్లాసులలో పోసి పైన వెనీలా కాని వేరేదైనా ఐస్‌క్రీమ్ వేసి వెంటనే సర్వ్ చేయాలి.
పనీర్ చిల్లీ ఫ్రై

కావలసినవి:
పనీర్ - 250 గ్రా.; చిల్లీ గార్లిక్ సాస్ - కొద్దిగా
క్యాప్సికమ్ తరుగు - అరకప్పు
రెడ్ క్యాప్సికమ్ తరుగు - అర కప్పు
ఉల్లి తరుగు - కప్పు; సోయాసాస్ - కొద్దిగా
అజినమోటో (చైనా సాల్ట్) - కొద్దిగా
ఉల్లికాడల తరుగు - కొద్దిగా
తయారి:
- పనీర్‌ను పెద్దపెద్ద ముక్కలుగా తరగాలి.
- బాణలిలో నెయ్యి లేదా నూనె వేసి స్టౌ మీద ఉంచి కాగాక పనీర్ ముక్కలు వేసి లేత గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి.
- క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు వేసి రెండు నిముషాలు వేయించాలి.
- సోయాసాస్, అజినమోటో, చిల్లీ గార్లిక్ సాస్, ఉప్పు వేసి కలపాలి.
- చివరగా పనీర్ వేసి కలపాలి.
- ఒక టూత్‌పిక్‌కి పనీర్, ఉల్లికాడలు, క్యాప్సికమ్, ఉల్లిపాయ ముక్కలు గుచ్చి సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది.


హైదరాబాదీ ఖీమా
మటన్ ఖీమా - 500 గ్రా.
లివర్ (చిన్నముక్కలుగా) - 200 గ్రా.
టొమాటో తరుగు - 450 గ్రా.
అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూను
కారం - రుచికి తగినంత
పసుపు - పావు టీ స్పూను
ఉల్లితరుగు - 50 గ్రా.
గరంమసాలా - అర టీ స్పూను
ఏలకులు - 2; లవంగాలు - 1
షాజీరా - పావు టీ స్పూను
నూనె - టేబుల్ స్పూను; పెరుగు - 50 మి.లీ.
ఉప్పు - తగినంత; కొత్తిమీర - ఒక కట్ట
తయారి

- పెరుగులో అర టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరప్పొడి, ఉప్పు వేయాలి.

- మెత్తగా చేసిన మీట్, లివర్ పీస్‌లను శుభ్రం చేసి పెరుగులో నానబెట్టాలి.
- బాణలిలో నూనె పోసి కాగాక ఏలకులు, లవంగాలు, జీలకర్ర, షాజీరా వేసి వేయించాలి.
- ఉల్లితరుగు వేసి వేగాక, అర టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం వేసి వేయించాలి.
- ఖీమా వేసి 5 నిముషాలు ఉడికించాక, టొమాటో తరుగు వేసి రెండు నిముషాలయ్యాక లివర్ పీస్‌లు వేసి వేయించాలి.
- నూనె పైకి తేలాక, గరంమసాలా, ఉప్పు వేసి కలపాలి.
- పోపు వేయించి కలపాలి. కొత్తిమీరతో గార్నిష్‌చేయాలి.
కర్టెసీ:
డా. స్వజన్
అసిస్టెంట్ ప్రొఫెసర్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్
ఆఫ్ టూరిజమ్ అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్, భువనేశ్వర్

కడై వంటలు



అవే వంటలు ... అవే రుచులు...
పాత్రలు వేరు... రూపం వేరు...
అనుకుంటున్నారా!
కాదు కాదు... కానే కాదు...
మీ మనసుకి నచ్చే
కడై చోలే, కడై దాల్ తడ్కా, కడై పనీర్, మష్రూమ్ మసాలా, పాలక్ కార్న్, కడై వెజ్ వండండికడైలోకి చేర్చండి... అందంగా అలంకరించండి అతిథులను ఆహ్వానించండి... ఆప్యాయంగా వడ్డించండి
.

కడై పనీర్


కావలసినవి
పనీర్- 100 గ్రా. (ముక్కలుగా కట్ చేయాలి)
క్యాప్సికమ్ ముక్కలు - పావు కప్పు
ఉల్లి తరుగు - పావు కప్పు
ఉల్లిముక్కలు - అర కప్పు (పెద్దవిగా తరగాలి)
టొమాటో తరుగు - అర కప్పు
పసుపు - చిటికెడు, మిరప్పొడి - టీ స్పూను
కొత్తిమీర - కట్ట, పచ్చిమిర్చి - 5
మిరియాలపొడి - అర టీ స్పూను
గరంమసాలా - అర టీ స్పూను
ఉప్పు - తగినంత, నల్ల ఉప్పు - చిటికెడు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూను
షాజీరా - పావు టీ స్పూను
డ్రై ఫ్రూట్ గ్రేవీ కోసం
పల్లీలు - 10 గ్రా.
జీడిపప్పు - నాలుగైదు పలుకులు
కర్బూజా గింజలు - 10 గ్రా.
బాదంపప్పు - 10 గ్రా., నూనె - 5 గ్రా.
(డ్రైఫ్రూట్స్‌ని వేయించి చల్లారాక కొద్దిగా నీరు కలిపి మిక్సీలో వేసి పేస్ట్‌లా చేసుకోవాలి)

తయారి

బాణలిలో నూనె కాగాక, షాజీరా, ఎండుమిర్చి, ఉల్లి తరుగు వేసి దోరగా వే గాక, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి.

టొమాటో తరుగు, మిగిలిన సరుకులను వేసి మరోమారు వేయించి, నూనె పైకి తేలుతున్నప్పుడు ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసి కలపాలి.


బాగా వేగిన తరవాత పనీర్ ముక్కలు, డ్రై ఫ్రూట్ గ్రేవీ పేస్ట్ వేసి కలిపి, ఐదు నిముషాలు ఉడికించాలి.


కడాయిలోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్‌చేసి సర్వ్ చేయాలి.


కడై చోలే


కావలసినవి
కాబూలీ శన గలు - 250 గ్రా.
ఉల్లి తరుగు - 50 గ్రా.
టొమాటో తరుగు - 75 గ్రా.
పచ్చిమిర్చి - నాలుగు
అల్లం వెల్లుల్లి పేస్ట్ - అర టీ స్పూను
పుదీనా తరుగు - అరకప్పు
కొత్తిమీర తరుగు - కొద్దిగా
బిరియానీ ఆకులు - మూడు
పసుపు - చిటికెడు, నూనె - 25 గ్రా.
మిరప్పొడి, చోలేమసాలా, ఆమ్‌చూర్ పౌడర్ - అర టీ స్పూను చొప్పున
గరంమసాలా - పావు టీ స్పూను
ఉప్పు - తగినంత

తయారి

శనగలను ముందురోజు రాత్రి నానబెట్టి, మరుసటి రోజు నీరంతా తీసేసి కుకర్‌లో సుమారు అరగంటసేపు ఉడికించాలి.

బాణలిలో కాగాక బిరియానీ ఆకు, గరం మసాలా వేసి వేగాక, ఉల్లి తరుగు వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి.


అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రెండు నిముషాలు వేగాక, టొమాటో తరుగు, మిగతా పదార్థాలు వేసి దోరగా వేయించాలి.


ఉడికించుకున్న శనగలలో పావు కప్పు శనగలను మెత్తగా చేసి పై మిశ్రమంలో కలపాలి.


మూడు నాలుగు నిముషాల తరవాత నీరు లేకుండా శనగలు, ఉప్పు బాణలిలో వేసి కలిపి, కడాయిలోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.


మష్రూమ్ మసాలా


కావలసినవి
మష్రూమ్ - 10
నూనె - 25 గ్రా.
ఉల్లి తరుగు - 30 గ్రా.
(పొడవుగా తరగాలి)
టొమాటోలు - 50 గ్రా.
అల్లం వెల్లుల్లి పేస్ట్ - టేబుల్ స్పూను
జీడిపప్పు - 25 గ్రా.
పాలు - 50 మి.లీ.
తాజా క్రీమ్ - 20 గ్రా.
బాదంపప్పు- 20 గ్రా.
బిరియానీ ఆకు - 4
లవంగాలు - 4, ఏలకులు - 4
దాల్చినచెక్క - చిన్న ముక్క
షాజీరా - టీస్పూను
చిరోంజీ - 20 గ్రా.
కర్బూజా గింజలు - 20 గ్రా.
పసుపు - చిటికెడు
మిరప్పొడి - టీ స్పూను
ఉప్పు - తగినంత
పచ్చిమిర్చి - 4, కొత్తిమీర - కట్ట

తయారి

టొమాటో, జీడిపప్పు, బాదంపప్పు, పాలు, షాజీరా, లవంగాలు, ఏలకులు, దాల్చిన చెక్క, ఉప్పు, మిరప్పొడి, పసుపు, పచ్చిమిర్చి, చిరోంజీ, అన్నిటినీ మిక్సీలో వేసి పేస్ట్‌లా చేయాలి.

బాణలిలో నూనె కాగాక, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించాలి.


బిరియానీ ఆకులు, పచ్చిమిర్చి తరుగు, ఉల్లి తరుగు వేసి గోధుమరంగులోకి వచ్చాక, మష్రూమ్స్ వేసి మెత్తబడే వరకు వేయించాలి.


ముందుగా తయారుచేసి ఉంచుకున్న మసాలా పేస్ట్‌ని ఇందులో వేసి , ఉడకడం ప్రారంభమయ్యాక స్టౌని సిమ్‌లో ఉంచి సుమారు పది నిముషాలు ఉడికించాలి.


కడైలోకి తీసుకుని క్రీమ్, కొత్తిమీరలతో గార్నిష్ చేయాలి.


కడై వెజ్


కావలసినవి
బీన్స్ తరుగు - 20 గ్రా., క్యారట్ తరుగు - 20 గ్రా.
క్యాలీఫ్లవర్ తరుగు - 20 గ్రా., బఠాణీ - 20 గ్రా.
బంగాళదుంప ముక్కలు - అర కప్పు
(వీటిని కొద్ది నూనెలో వేయించి పక్కన ఉంచుకోవాలి)
పనీర్ ముక్కలు - 100 గ్రా.
క్యాప్సికమ్ ముక్కలు - 40 గ్రా.
ఉల్లిపాయ - 30 గ్రా. (పెద్ద ముక్కలుగా తరగాలి)
ఉల్లితరుగు - 20 గ్రా.
టొమాటో తరుగు - 40 గ్రా., పసుపు - చిటికెడు
మిరప్పొడి - 20 గ్రా., కొత్తిమీర తరుగు - కొద్దిగా
పచ్చిమిర్చి - 5, మిరియాలపొడి - 5 గ్రా.
గరంమసాలా - 5 గ్రా., ఉప్పు - తగినంత
నల్ల ఉప్పు - కొద్దిగా, అల్లంవెల్లుల్లి పేస్ట్ - టీ స్పూను, షాజీరా - 3 గ్రా.
డ్రై ఫ్రూట్ గ్రేవీ కోసం
పల్లీలు - 10 గ్రా., జీడిపప్పు - 4 -5 పలుకులు
కర్బూజా గింజలు - 10 గ్రా., బాదంపప్పు - 10 గ్రా.
నూనె - 5 గ్రా.
(వీటిని వేయించి, చల్లారాక కొద్దిగా నీరు కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి)

తయారి

బాణలిలో నూనె కాగాక షాజీరా, ఎండుమిర్చి, ఉల్లితరుగు వేసి వేయించాలి.

అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక, టొమాటో ముక్కలు, మిగిలిన పదార్థాలను వేసి నూనె పైకి తేలే వరకు వేయించాలి.


పెద్దగా తరిగిన ఉల్లితరుగు, క్యాప్సికమ్ తరుగు వేసి ఉడికించాలి.


కూరముక్కలు, డ్రై ఫ్రూట్ గ్రేవీ పేస్ట్ వేసి ఉడికించాలి.


కడాయిలోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.


కడై దాల్ తడ్కా


కావలసినవి
కందిపప్పు - 100 గ్రా.
నూనె - 25 గ్రా.
నెయ్యి - 10 గ్రా.
ఆవాలు - టీ స్పూను
జీలకర్ర - టీ స్పూను
ఎండుమిర్చి - 4
పసుపు - చిటికెడు
మిరప్పొడి - అర టీ స్పూను
ఉప్పు - తగినంత
పచ్చిమిర్చి - 4
కొత్తిమీర - కొత్తిగా
కరివేపాకు - రెండు రెమ్మలు
ఇంగువ - కొద్దిగా
అల్లం తరుగు - కొద్దిగా
వెల్లుల్లి తరుగు - కొద్దిగా
టొమాటో తరుగు - పావు కప్పు

తయారి

కడాయిలో నూనె వేసి కాగాక ఇంగువ, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అల్లం తరుగు వేసి దోరగా వేయించాలి

టొమాటో, పసుపు, మిరప్పొడి వేసి మరోమారు వేయించాలి.


కరివేపాకు, కొత్తిమీర, ఉడికించిన కందిపప్పు వేసి అన్నీ బాగా కలిసేలా రెండు నిముషాలు ఉడికించాలి


బాణలిలో నెయ్యి వేసి కాగాక మిరప్పొడి వేసి కొద్దిగా వేయించి, అందు లో పప్పు వేసి కలిపి వేడివేడిగా చపాతీలతో సర్వ్ చేయాలి.


పాలక్ కార్న్

కావలసినవి
ఉడికించిన కార్న్ - 50 గ్రా.
ఉడికించిన పాలకూర - 250 గ్రా.
పచ్చిమిర్చి - 10
ఉల్లితరుగు - 10 గ్రా.
క్రీమ్ - టేబుల్ స్పూను
అల్లంతరుగు - 10 గ్రా.
వెల్లుల్లి తరుగు - 10 గ్రా.
మిరప్పొడి - 10 గ్రా.
ఉప్పు - తగినంత
పసుపు - చిటికెడు, నూనె - 25 గ్రా.
గరంమసాలా పొడి - 5 గ్రా.

తయారి

ఒక గిన్నెలో పాలకూర తరుగు, పచ్చిమిర్చి తరుగు, కొద్దిగా ఉప్పు వేసి ఉడికించి, చల్లారాక మిక్సీలో వేసి పేస్ట్ చేయాలి.

బాణలిలో నూనె వేసి కాగాక అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు వేసి కొద్దిగా వేగాక ఉల్లితరుగు వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి.


పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, గరంమసాలా వేసి కలిపి, ఉడికించిన కార్న్, పాలకూర వేసి నాలుగైదు నిముషాలు ఉడికించాలి.


కడాయిలోకి తీసుకుని క్రీమ్, కొత్తిమీరలతో గార్నిష్‌చేసి సర్వ్ చేయాలి.


కర్టెసీ: సీమా కుక్రేజా
హిమానీ దర్బార్ ధాబా,అమీర్‌పేట, హైదరాబాద్
సేకరణ: డా.వైజయంతి

పనీర్ .....పనీర్ ....పనీర్


చికెన్ సిక్స్‌టీ ఫైవ్ కావాలి... లోపల చికెన్ ఉండకూడదు!
మటన్ బాల్స్ కావాలి... లోపల మటన్ తగలకూడదు!
బేబీ కార్న్ కనిపించాలి... చుట్టూ జున్నులాంటిదుండాలి!
స్వీట్‌కార్న్ కనిపించాలి... స్మూత్‌గా పన్ను దిగుతుండాలి!
ఔర్ కుచ్?
టచింగ్‌గా రెండు ఉల్లిపాయలు... మనసు నచ్చింగ్‌గా... అల్లం వెల్లుల్లి గుబాళింపులు!
ఓహో... అలాగా!
అయితే... ఈ మంత్రం జపించండి.


పనీర్ 65


కావలసినవి
పనీర్ - 100 గ్రా. (ముక్కలుగా కట్ చేయాలి); మైదా - 20 గ్రా.; కార్న్‌ఫ్లోర్ - 20 గ్రా.; అల్లం పేస్ట్ - టీ స్పూను; కారం - టీ స్పూను; పసుపు - అర టీ స్పూను; గరంమసాలా - టీ స్పూను; నూనె - వేయించడానికి తగినంత; ఉల్లితరుగు - పావు కప్పు ఉప్పు - తగినంత, కొత్తిమీర - కొద్దిగా
తయారి:
స్టౌ మీద బాణలి ఉంచి అందులో నూనె వేసి కాగాక పనీర్ ముక్కలు, కార్న్‌ఫ్లోర్, మైదా, అల్లం పేస్ట్ వేసి కలపాలి

ఉప్పు, కారం, పసుపు, గరంమసాలా, కొద్దిగా నీరు వేసి బాగా వేయించాలి


చిన్నబాణలిలో కొద్దిగా నూనె వేసి స్టౌ మీద ఉంచి, కాగాక పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు ఉల్లితరుగు వేసి బాగా వేయించాలి.


తయారుచేసి ఉంచుకున్న పనీర్ 65ను వీటితో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.

పనీర్ బాల్స్

కావలసినవి:
పనీర్ - 20 గ్రా. (తురమాలి); అల్లం పేస్ట్ - టీ స్పూను;
కొత్తిమీర - కొద్దిగా; కారం - టీ స్పూను; పసుపు - చిటికెడు;
గరంమసాలా - టీ స్పూను; మైదా - 10 గ్రా; కార్న్‌ఫ్లోర్ - 10 గ్రా;
ఉప్పు - తగినంత; నూనె - డీప్ ఫ్రైకి సరిపడా.
తయారి:
పైన చెప్పిన పదార్థాలలో నూనె తప్పించి మిగిలిన పదార్థాలను ఒక గిన్నెలో వేసి బాగా కలిపి గుండ్రంగా బాల్స్‌గా చేసి ఒక ప్లేట్‌లో ఉంచాలి

స్టౌ మీద బాణలి ఉంచి నూనె పోసి కాగాక, వీటిని ఒక్కొక్కటిగా వేసి బంగారురంగు వచ్చేవరకు వేయించి తీసి, పేపర్ ప్లేట్‌లో ఉంచాలి.


పచ్చిమిర్చి, ఉల్లిచక్రాలతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.

పనీర్ బేబీకార్న్

కావలసినవి:
పనీర్ - 50 గ్రా.; బేబీకార్న్ - 50 గ్రా.; పసుపు - తగినంత; కారం - 2 టీ స్పూన్లు; ఉప్పు - తగినంత; నూనె - తగినంత; జీడిపప్పు పొడి - 20 గ్రా.; తర్బూజా గింజల పేస్ట్ - 20 గ్రా.; అజినమోటో - అర టీ స్పూన్; బటర్ - 10 గ్రా; అల్లం వెల్లుల్లి పేస్ట్ - 50 గ్రా; ఉల్లితరుగు - పావు కప్పు; టొమాటో తరుగు - పావు కప్పు; గరంమసాలా - టీ స్పూను; జీడిపప్పు - గార్నిషింగ్ కోసం.
తయారి:
పనీర్‌ను డైమండ్ ఆకారంలో కట్ చేయాలి

బేబీకార్న్‌ని గుండ్రంగా తరగాలి స్టౌ మీద బాణలి ఉంచి మూడు టీ స్పూన్ల నూనె వేసి కాచాలి ముందుగా తరిగి పెట్టుకున్న పనీర్, బేబీకార్న్ ముక్కలను వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి వేరే బాణలిలో నూనె వేసి కాగాక ఉల్లితరుగు వేసి వేయించాలి అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ప్యూరీని వేసి బాగా కలిపి 5 నిముషాలు ఉడికించాలి


గరంమసాలా, అజినమోటో, ఉప్పు వేసి కలపాలి జీడిపప్పు తురుము, తర్బూజాగింజల పేస్ట్, కొద్దిగా నీరు, కారం, పసుపు వేసి ఉడుకుతుండగా, ముందుగా వేయించి ఉంచుకున్న పనీర్ ముక్కలు, బేబీకార్న్‌ముక్కలు వేసి కలపాలి పనీర్ తురుముతో గార్నిష్ చేయాలి.

పనీర్ స్వీట్‌కార్న్ మటర్

కావలసినవి:
పనీర్ - 100 గ్రా;
స్వీట్‌కార్న్‌గింజలు - 50 గ్రా;
బఠాణీ - 50 గ్రా;
పచ్చిమిర్చి పేస్ట్ - 2 టీ స్పూన్లు;
ఉప్పు - తగినంత;
ఉల్లితరుగు - 50 గ్రా;
టొమాటో ప్యూరీ - 50 గ్రా;
పుదీనా - అర కప్పు;
జీడిపప్పు + తర్బూజా గింజల పేస్ట్ - రెండు టీ స్పూన్లు కొత్తిమీర - అర కప్పు పసుపు - కొద్దిగా
నూనె - తగినంత
తయారి:
స్టౌ మీద బాణలి ఉంచి, మూడు టీ స్పూన్ల నూనె పోసి కాగాక, గరంమసాలా, ఉల్లితరుగు వేసి వేయించాలి

అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక, టొమాటో ప్యూరీ వేసి నూనె పైకి తేలేంతవరకు వేయించాలి


పనీర్, స్వీట్‌కార్న్ గింజలు, బఠాణీ వేసి ఉడికించి, రోటీలతో వేడివేడిగా సర్వ్ చేయాలి.

పనీర్ దో ప్యాజా

కావలసినవి:
పనీర్ - 100 గ్రా; కారం: 2 టీ స్పూన్లు; పసుపు - చిటికెడు; ఉప్పు- తగినంత; జీడిపప్పు- 20గ్రా. (పొడి చేయాలి); తర్బూజా గింజల పేస్ట్- 20 గ్రా; అజినమోటో - అర టీ స్పూను; బటర్ - 10 గ్రా; అల్లంవెల్లుల్లి పేస్ట్ - 25 గ్రా; ఉల్లితరుగు - పావుకప్పు; టొమాటోలు - 4; గరంమసాలా - టీ స్పూను; నూనె - తగినంత.
గార్నిషింగ్ కోసం:
సన్నగా తరిగిన జీడిపప్పు - కొద్దిగా; కరివేపాకు - రెండురెమ్మలు; క్యాప్సికమ్ తరుగు - పావు కప్పు; బెంగళూరు టొమాటో ముక్కలు - పావు కప్పు; ఉల్లిపాయలు - 2 (పొరలుగా తీయాలి) పైన చెప్పిన పదార్థాలను నూనెలో వేయించుకోవాలి.
తయారి:
ముందుగా పనీర్‌ను డైమండ్ ఆకారంలో కట్ చేయాలి

స్టౌ మీద బాణలి ఉంచి నూనె పోసి కాగాక పనీరు ముక్కలను వేసి బంగారురంగు వచ్చేవరకు వేయించాలి


తరిగి పెట్టుకున్న ఉల్లిపాయముక్కలు, కరివేపాకు జతచేసి వేయించాలి


అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ప్యూరీని వేసి బాగా కలిపి 5 నిముషాలు ఉడికించాలి


గరంమసాలా పొడి, అజినమోటో, తగినంత ఉప్పు వేసి కలపాలి


జీడిపప్పు పొడి, తర్బూజాగింజల పేస్ట్, కొద్దిగా నీరు పోసి బాగా కలిపి, కొద్దిగా ఉడుకుతుండగా పసుపు, కారం వేసి కలపాలి


ముందుగా వేయించి ఉంచుకున్న పనీరు ముక్కలను ఈ మిశ్రమంలో వేసి కలపాలి


గార్నిషింగ్ కోసం వేయించి ఉంచుకున్న వాటితో అందంగా అలంకరించాలి.

పనీర్ అంగా

కావలసినవి:
పనీర్ - 100 గ్రా; కారం - 2 టీ స్పూన్లు; పసుపు - తగినంత; ఉప్పు - తగినంత; జీడిపప్పు పొడి - 10 గ్రా; తర్బూజాగింజలు - 10 గ్రా; అజినమోటో - అర టీ స్పూన్; బటర్ - 10 గ్రా; అల్లం వెల్లుల్లి పేస్ట్ - 100 గ్రా; ఉల్లిపాయలు - 2; టొమాటోలు - 4; గరంమసాలా - టీ స్పూన్; మిరియాలు - 10 గింజలు; ఎండుమిర్చి - 10; కొబ్బరిపొడి - రెండు టీ స్పూన్లు, క్యాప్సికమ్ ముక్కలు - కొద్దిగా.
తయారి:
ముందుగా ఉల్లిపాయలు, టొమాటోలను చిన్నముక్కలుగా చేసి ఉంచుకోవాలి

ఎండుకొబ్బరి, జీడిపప్పుపొడి, తర్బూజాగింజలు, కొద్దిగా నీరు కలిపి మిక్సీలో వేసి మెత్తటి పేస్ట్‌లా చేసుకోవాలి


స్టౌ వెలిగించి బాణలిలో నూనె వేసి కాగిన తరవాత ఉల్లితరుగు వేసి బంగారురంగు వచ్చేవరకు వేయించాలి


టొమాటోముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి


కారం, పసుపు, తగినంత ఉప్పు వేసి కలిపి 5 నిముషాలు ఉడికించాలి


ముందుగా తయారుచేసి ఉంచుకున్న ఎండుకొబ్బరి, జీడిపప్పు పొడి, తర్బూజా గింజల పేస్ట్, కొద్దిగా నీరు పోసి రెండు మూడు నిముషాలు ఉడికించి దింపేముందు కారం, గరంమసాలా వేయాలి


చివరగా మిరియాలు, ఎండుమిర్చి, పనీర్‌ముక్కలు వేసి కలిపి కొద్దిగా ఉడికించి, క్యాప్సికమ్ + టొమాటో ముక్కలతో గార్నిష్ చేసి వేడివేడిగా సర్వ్ చేయాలి.


చెఫ్: ఎ.వేణుమాధవ్