తినడానికి, తాగడానికి, నివసించడానికి కావలసిన ఏర్పాట్లన్నీ చేసినట్లుగానే, మానవులు జీవితం గడపడానికీ దైవం సన్మార్గాన్ని చూపించాడు. మానవ మనుగడకు అవసరమైన సమస్త ఏర్పాట్లలో ఏ ఒక్కదాన్నీ మానవుడు సమకూర్చుకోలేడు. సమస్తమూ దైవప్రసాదితమే.
మాతృగర్భంలో మానవ బీజం పడింది మొదలు, భూమిపై పడే వరకు ఏ దశలో ఎలాంటి ఏర్పాటు కావాలో అడక్కుండానే అన్నీ సమకూర్చాడు. తరువాత కూడా శిశు దశ మొదలు వృద్ధాప్యం వరకూ వివిధ దశల్లో మానవుడి కోసం దైవం చేసిన ఏర్పాట్లను గమనిస్తే, ఆయన పట్ల కృతజ్ఞతతో శిరస్సు వినమ్రంగా వంగిపోతుంది. కాని మానవుడు కేవలం బాహ్యస్థితిని చూసి ఇవన్నీ తానే సమకూర్చుకున్నానని భ్రమ పడతాడు.
ణకాలం వాయువు స్తంభిస్తే గుడ్లు తేలేసే మానవుడు, తన నిస్సహాయతను అంగీకరించి దేవుని సార్వభౌమత్వాన్ని గుర్తించడంలోనే అతని బుద్ధికుశలత దాగి ఉంది. దేవుని భూమిపై మానవుడు సర్వాధికారి ఎంత మాత్రం కాదు. కేవలం ఆయన ప్రతినిధి మాత్రమే. దైవ నిర్ణయాలను అమలుపరచడం, ఆచరించడం, పాటించడంలోనే అతని ప్రాతినిధ్య ఔన్నత్యం ఆధారపడి ఉంది. ఎందుకంటే దైవప్రసాదితమైన ఏ వస్తువుకూ మానవుడు యజమాని కాడు. కనుక ఏ వస్తువుపైనా మానవుడి పెత్తనం, అధికారం చెల్లదు.
తనది కాని వస్తువుపై ఎవరికైనా ఎలాంటి హక్కూ, అధికారమూ ఉండవు. ఒకవేళ అధికారం ప్రదర్శిస్తే గనక తగిన శిక్ష అనుభవిస్తాడు. కాని దైవం మానవుడికి కొన్ని వస్తువులపై అధికారాన్ని ఇచ్చాడు.
ఒక పరిమితి మేరకు స్వేచ్ఛను, స్వయం నిర్ణయాధికారాన్ని ప్రసాదించాడు. మనిషి ఈ స్వేచ్ఛను, స్వయం నిర్ణయాధికారాన్ని సద్వినియోగం చేసుకుంటే ఏ గొడవా లేదు. కాని స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ, ఇష్టానుసారం విశృంఖలతకు పాల్పడితే మానవుడికి చిక్కులు తప్పవు. ఈనాడు మానవుడు దైవాభీష్టాన్ని కాదని, అంతా తానేనన్న భ్రమలో, అహంకారంలో పడబట్టే ఇన్ని కష్టాలు, నష్టాలు చవిచూస్తున్నాడు. తాను కేవలం నిమిత్తమాత్రుడినని భావించి, దైవాదేశాల వెలుగులో నడుస్తూ, జీవితాన్ని దైవానికి సమర్పించినట్లయితే చిక్కులూ, అశాంతీ ఉండేవి కావు.
కనుక మానవుడు ముందుగా ‘నేను’ అన్న భ్రమ నుండి బయటపడాలి. తాను కేవలం దేవుని ప్రతినిధిని మాత్రమేనని, ఆయన ఆజ్ఞాపాలనే తన జీవితలక్ష్యమని అంగీకరించాలి. సృష్టి సమస్తాన్నీ తనకు అమానతుగా అప్పగించాడని, దాన్ని తన స్వంతంగా భావించి దుర్వినియోగం చేస్తే శిక్షిస్తాడనీ, నమ్మిక కలిగి ఉండాలి. అమానతును నిజాయితీగా నిర్వర్తిస్తే దైవానుగ్రహం లభిస్తుందని, ఆశ కలిగి ఉండాలి. అప్పుడే జీవితం సఫలమవుతుంది. జీవితానికి సార్థకతా సిద్ధిస్తుంది.
No comments:
Post a Comment