ఒక అడవి దగ్గర చిన్న గ్రామం ఉంది. ఆ గ్రామంలో ఒక రైతుకి కొంత పొలం ఉంది. ఆ పొలంలో సాయంకాలం వరకూ పనిచే సుకుని ఇంటికి వెళ్లేవాడు. ఒకరోజు అలా వస్తుండగా దారిపక్కన ఒక పులి గాండ్రించినట్టు వినిపించింది. తలతిప్పి చూశాడు. రెండు చెట్ల బోదెల మధ్య ఇరుక్కుపోయిన పులి ఒకటి బైటపడేందుకు ప్రయత్నిస్తూ అరుస్తోంది.
పులి ఏ క్షణంలోనైనా బోదె మధ్య నుంచి బయటపడి తన మీదికి లంఘించవచ్చునన్న భయం కలిగింది. దానిని చంపడం మంచిదనుకున్నాడు. పదునైన కొడవలి ఎత్తి దాని కాళ్లను నరకడానికి సిద్ధమయ్యాడు.
అటుగా వచ్చిన ఒక సన్యాసి ఇది చూసి పరుగున వచ్చాడు. ఆ పులిని చంపడంలో సాయం చేయమని రైతు సన్యాసిని అడిగాడు. తాను హింస చేయలేనని, మారణాయుధాలను పట్టుకోనని చెప్పాడు ఆ సన్యాసి.
కనీసం పులి కాళ్లయినా పట్టుకుంటే, తాను దానిని కొడవలితో చంపుతానన్నాడు రైతు. సన్యాసి పులి కాళ్లు పట్టుకున్నాడు. రైతు వెంటనే కొడవలి తీసుకున్నాడు.
అతని మనసు పులిని చంపనీయలేదు. కొడవలి అక్కడే పడేసి వెనుదిరిగాడు. సన్యాసి నివ్వెరపోయి, ‘‘అదేమిటి! చంపుతానన్నావుగదా! అలా వెళ్లిపోతావేం!’’ అని అడిగాడు. అందుకు ఆ రైతు ‘‘నిజమే! కానీ, మీ మాటలు విన్నాక, చంపడం తగదనే నిర్ణయానికి వచ్చేను. చంపాలంటే మీరు దాని కాళ్లు పట్టుకోవాలి. ఆ పాతకంలో మిమ్మల్ని భాగస్వాముల్ని చేయలేనుగదా!’’ అని ఇంటి దారిపట్టాడు.
No comments:
Post a Comment