all

Thursday, December 13, 2012

తెలివైన జవాబు

 
శోభనాద్రి అనే రైతు కొడుకూ, కోడలూ ఓ ప్రమాదంలో హఠాత్తుగా మరణించారు. దాంతో మనవలిద్దరి భారం అతనిమీద పడింది. శోభనాద్రికి చిన్న ఇల్లు తప్ప వేరే ఆస్తి లేకపోవడంతో వయసుమీదపడే కొద్దీ ఆయనకు మనమళ్ళ గురించి దిగులు ఎక్కువైంది. ఒకరోజు శోభనాద్రి ఇంటికి అతని స్నేహితుడు రంగయ్య వచ్చాడు.

అతనికి తన మనమళ్ల గురించి అంతా చెప్పి, పరిష్కార మార్గం చెప్పమన్నాడు. అందుకు సరేనన్న రంగయ్య అతని మనమళ్లని పిలిపించి వాళ్లిద్దరూ వచ్చాక వారి తెలివిని పరీక్షించాలని ఒక ప్రశ్న వేశాడు. సమాధానం చెబితే పదిరూపాయలిస్తానన్నాడు. వారు సరేనన్నారు.

‘‘దేవుడు ప్రత్యక్షమై ఒకే వరం కోరుకోమంటే ఏం కోరుకుంటారు?’’ అని అడిగాడు రంగయ్య. ‘‘నాకు ఏ లోటూ లేకుండా బతకడానికి అవసరం అయిన పొలం ఇవ్వమని అడుగుతా’’నన్నాడు పెద్దవాడు. ‘‘నేను ఏది కోరుకుంటే అది ప్రసాదించగల ఉంగరం ఇవ్వమంటాను’’ అన్నాడు రెండోవాడు. రంగయ్య ఇద్దరికీ చెరో పదిరూపాయలిచ్చి పంపేశాడు.

తర్వాత రంగయ్య స్నేహితుడితో పెద్దవాడికి ఈ ఇల్లు రాసివ్వు, ఉన్న వూళ్లో ఎలాగో బతకగల్గుతాడు. ఇక రెండోవాడు బతకనేర్చినవాడు. వాడిని నేను తీసికెళతాను అని హామీ ఇచ్చాడు. నెలరోజుల తర్వాత తిరిగి వచ్చి రెండోవాడిని రంగయ్య వెంట తీసికెళ్లాడు. శోభనాద్రి, పెద్దమనవడు చాలాకాలం సుఖంగా జీవించారు.

No comments: