all

Wednesday, December 26, 2012

హెచ్-4 మీద వెళ్లే ‘స్పౌజ్’ అమెరికాలో ఉద్యోగం చేయవచ్చా?

 
హెచ్-1 మీద యూఎస్‌లో ఉన్న నా భర్త దగ్గరకు నేను, నా పిల్లలతో వెళ్లబోతున్నాను. నేనక్కడికి వెళ్లిన తర్వాత ఆన్‌లైన్ ట్యూషన్ల ద్వారా ఆదాయం సంపాదించాలనుకుంటున్నాను. అక్కడ అలా వర్క్ చేయవచ్చా?
- ప్రణీత

అనేక దేశాల నుంచి వెళ్లినవారు అక్కడ అవకాశాల కోసం ప్రయత్నిస్తుంటారు కనుక అందరూ ఒక నిర్ణీత ప్రాతిపదిక మీద మాత్రమే కొన్ని ఉమ్మడి ప్రయోజనాలు పొందేందుకు వీలుగా అమెరికాలో కొన్ని నిబంధనలు అమలులోకి తెచ్చారు. అవే ఇమ్మిగ్రేషన్ రూల్స్. వాటి ప్రకారం యూఎస్‌లో తాత్కాలిక ఉద్యోగం మీద (హెచ్-1) ఉండేవారి జీవిత భాగస్వామి (స్పౌజ్) లేదా వారి సంతానం డిపెండెంట్ (హెచ్-4) వీసా మీద వెళ్లి అక్కడ ఎటువంటి ఆదాయం సంపాదించడానికి వీలులేదు.

వారే కాదు... విజిటర్, బిజినెస్ వీసాల మీద వెళ్లినవారు, ఎఫ్-1 విద్యార్థుల డిపెండెంట్లు కూడా అమెరికాలో వర్క్ చేయడం కుదరదు. అది ఒకచోట ఉద్యోగం చేయడమైనా, బేబీ సిట్టింగ్ అయినా, రెస్టారెంట్‌లో పనిచేయడం అయినా, లేక ఆన్‌లైన్‌లో ట్యూషన్లు చెప్పడమైనా, లేక ఒక వెబ్‌సైట్ పెట్టుకుని దాని ద్వారా కొంత డబ్బు గడించడమైనా, లేక ఇంట్లోనే కూర్చుని సలహాలు చెప్పడం ద్వారా ఆదాయం పొందడమే అయినా లెక్క ప్రకారం అలాంటివన్నీ వీరికి నిషిద్ధమే.

దీనికి సంబంధించిన ఇమ్మిగ్రేషన్ రూల్స్ అక్కడ ఎంత స్ట్రిక్ట్‌గా ఉంటాయో లోగడ ఒక సందర్భంలో చెప్పాను. యూఎస్ పర్మనెంట్ రెసిడెంట్ అయిన ఒకాయనకు అక్కడ ఒక బిజినెస్ ఉంటే అక్కడికి ఇండియా నుంచి విజిటర్‌గా వెళ్లే ఆయన కుమారుడు గాని, హెచ్-4 మీద వెళ్లే ఆయన కుమార్తె గాని కనీసం (శాలరీ తీసుకోకుండా కూడా) ఆయన షాపులో కూర్చుని ఉచిత సహాయం అందించడానికి నిబంధనలు ఒప్పుకోవు (వీరి ఉచిత సహాయం వల్ల ఆ షాపులో ఒకరికి రావలసిన ఉపాధి రాకుండా పోతుంది కనుక). 

యూఎస్ ఇమ్మిగ్రేషన్ నిబంధనలన్నీ బాగా సున్నితమైనవీ, వివిధ దేశాల వారందరి ఉమ్మడి ప్రయోజనానికి ఉద్దేశించినవీ కనుక వీటి పట్ల విస్తృత అవగాహన, పరిణత సంయమనం ఎంతైనా అవసరం. ఈ వీసా క్యాటగిరీల వారు రూల్స్‌ని పట్టించుకోకుండా అమెరికాలో ఏదో ఒక పనిచేసి ఒక్క డాలర్ సంపాదించినా, దొరికినప్పుడు మాత్రం వారిని దేశం నుంచి పంపించి వేసే ప్రమాదం కూడా ఉంటుంది.

అయితే హెచ్-4 మీద వెళ్లినవారు అక్కడ యూనివర్సిటీలో చదువకోవడానికి లేదా అమెరికాలో తాత్కాలిక ఉద్యోగం చూసుకుని హెచ్-1కి మారడానికి ఇమ్మిగ్రేషన్ నిబంధనలు అంగీకరిస్తాయి. మీరు హెచ్-4 మీద ఉండి ఆన్‌లైన్‌లో ట్యూషన్లు చెప్పే అవకాశం లేకపోయినా మీకు తగిన అర్హతలు ఉంటే అక్కడే ఉద్యోగం సంపాదించుకుని హెచ్-1కి మారి ఆదాయం పొందే అవకాశాన్ని యూఎస్ ఇమ్మిగ్రేషన్ చట్టాలు కల్పిస్తున్నాయి. విదేశీయులు సంపాదించుకోవడం పైన అమెరికా ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం ఉండదు. అయితే ఆ సంపాదన ఇమ్మిగ్రేషన్ నిబంధనలకు లోబడి మాత్రమే ఉండాలి. వివరాలకు యు.ఎస్.సి.ఐ.ఎస్. వెబ్‌సైట్‌ని గూగుల్ సెర్చ్ చెయ్యండి.

కాగా, యూఎస్ ఇమ్మిగ్రేషన్ రిఫార్మ్స్‌లో భాగంగా హెచ్-4లకు అమెరికా నుంచి ఒక శుభవార్త నిశ్శబ్దంగా ప్రాణం పోసుకుంటోంది. తాము పనిచేస్తున్న కంపెనీల ద్వారా ఇప్పటికే గ్రీన్‌కార్డులకు దరఖాస్తు చేసుకుని అక్కడ పర్మనెంట్ రెసిడెంట్ అయ్యే ప్రాసెస్‌ని ప్రారంభించిన హెచ్-1లకు గ్రీన్‌కార్డు వచ్చేలోగా వారి స్పౌజ్‌కి ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్‌ని ఇచ్చే ప్రతిపాదనలు ఊపందుకున్నాయి. 

దీనికి మద్దతుగా అమెరికన్ కాంగ్రెస్‌కి సంతకాలు సమర్పించే కార్యక్రమం కూడా నడుస్తోంది. శాస్త్ర, సాంకేతికరంగాల్లో అసాధారణ ప్రతిభావంతులైన విదేశీయులను అమెరికా అభ్యున్నతి కోసం అక్కడే అట్టిపెట్టుకునేందుకు వారికి ఒక ప్రోత్సాహకంగా హెచ్-1 స్పౌజ్‌కి ఈ ప్రత్యేక సదుపాయం కల్పించే ప్రతిపాదనను చురుకుగా పరిశీలిస్తున్నారు. 

ఇలా ఉండగా, కంపెనీ ట్రాన్స్‌ఫర్ (ఎల్) వీసాల డిపెండెంట్లలో స్పౌజ్ (ఎల్-2)కి మాత్రం యు.ఎస్.సి.ఐ.ఎస్. నుంచి ‘ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్’ పొందడం ద్వారా అక్కడ పనిచేసే అవకాశం లభిస్తోంది. వారికి ‘ఇ.ఎ.డి.’ రెండేళ్ల కాలపరిమితితో లభించవచ్చు. ఎల్-2 స్టేటస్ కొనసాగినంత కాలం కూడా ఈ ఆథరైజేషన్‌ని పొడిగించుకోవచ్చు. యు.ఎస్.సి.ఐ.ఎస్. దీనిని ‘ఓపెన్ మార్కెట్ ఎంప్లాయ్‌మెంట్’గా అభివర్ణిస్తుంది. ఈ క్యాటగిరీలో ‘ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్’ ద్వారా ఎటువంటి జాబ్ అయినా చేయవచ్చు.

మీ విషయంలో మీ భర్త హెచ్-1 మీద కాక ఎల్-1 మీద వెళ్లి ఉంటే మీకు ఎంప్లాయ్‌మెంట్ ఆథరైజేషన్ అవకాశం ఉండి ఉండేది. హెచ్-1 మీద ఉన్నవాళ్లు ఎల్-1కి మారడానికి కూడా యూఎస్ చట్టాలు అంగీకరిస్తున్నా స్క్రూటినీ చాలా నిశితంగా ఉంటుంది. హెచ్-1 ఫీజులను, ప్రాసెస్‌ని తప్పించుకోవడానికి కొన్ని ఇండియన్ కంపెనీలు తమ ఉద్యోగాలకి ఎల్-1లు ఎక్కువగా ఇస్తున్నాయనే భావన అమెరికన్ యంత్రాంగంలో ఉన్నట్టు అనిపిస్తుంది. భర్త హెచ్-1 నుంచి ఎల్-1కి మారితే భార్య అమెరికాలో యు.ఎస్.సి.ఐ.ఎస్. ద్వారా హెచ్-4 నుంచి ఎల్-4కి మారడానికి కూడా పెద్ద సమస్య ఏమీ ఉండదు. నిబంధనలన్నీ కూలంకషంగా పరిశీలించి మీకు అనువైన మార్గాన్ని ఎంచుకోండి. బెస్ట్ విషెస్.

No comments: