all

Wednesday, December 26, 2012

తల్లిదండ్రుల మీదే ఆ బాధ్యత...

గృహస్థ జీవితంలో భార్య, భర్త దంపతులుగా జీవిస్తారు. వారు జీవిత భాగస్వాములుగా, వారి ఇద్దరి జీవితాలను కలిపి ఒకటిగా భావిస్తారు. అదేవిధంగా వారి జీవితాలను వారు చెరి సగంగా పంచుకోవలసినవారే. కనుక హక్కులు, బాధ్యతల విషయంలో కూడ, ఈ భాగస్వామ్యత ఉంటుంది. అలా ఉంటేనే వారు ఆదర్శదంపతులవుతారు.

అలాగే, సామాజిక జీవితంలోనూ వారు భాగస్వాములే. వారు పౌర బాధ్యతలు, హక్కులను కలిగి ఉండాలి. సామాజిక ఆచారాలు, కట్టుబాట్లు, సర్కారు శాసనాలను అనుసరించడం... వంటివాటిని విధిగా భావించాలి. ఎందుకంటే వీటిని పాటించడమన్నది పౌరబాధ్యతలలో అతి ముఖ్యమైన అంశం.

సంతానం విషయంలో వారసత్వ ఆధారితంగా పౌరహక్కులు పరోక్ష రీతిలో ఉన్నప్పటికీ, వారి భవిష్యత్తు, రక్షణతో కూడిన శ్రద్ధాపూర్వక బాధ్యతలే ముఖ్యం. మంచిపౌరులుగా వారిని తయారుచేయడమే కాక, వారి జీవితాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలి. 
ఆ విషయంలో తమ వ్యక్తిగత కోరికలు, ఆశలు, అంచనాలు, ఊహలతో కాకుండా, పిల్లల మానసిక, సహజ అవగాహనతో, వారి విద్యాబుద్ధుల విషయంలో, తల్లిదండ్రులు తమ బాధ్యతలను నెరవేర్చవలసి ఉంటుంది. 

జీవితాలు పిల్లలవే అయినప్పుడు వారి భవిష్యత్తుకు సంబంధించి తల్లిదండ్రుల కోరికలు, ఆశలకు మాత్రమే ప్రాధాన్యత వహించరాదు. ఆ మేరకు, పిల్లల వ్యక్తిగతాన్ని, వ్యక్తిత్వాన్ని తల్లిదండ్రులు అంచనా వేయగలగాలి. వారి భావిజీవితానికి అది వరంగా అన్వయం కావాలి.

సాధారణంగా పౌరధర్మానికి బాధ్యతతోపాటు వ్యక్తిత్వ ఉన్నతి అవసరం. మానసిక బానిసత్వాన్ని, అలసత్వాన్నే స్వేచ్ఛగా భ్రమపడరాదు. తగిన క్రమశిక్షణతోనే స్వేచ్ఛకు విలువ ఉంటుంది. భౌతికం, ఆధ్యాత్మికం, వేదాంతం... వీటితో పాటు శాస్త్ర సంబంధమైన మనసుకు... మూఢత్వం, మూర్ఖత్వం వంటివి కలిగే అవకాశం ఉండరాదు. విచక్షణాయుత, ఆలోచనకు అవకాశం ఉండాలి. అయినా ఆత్మవిశ్వాసం అదుపు తప్పితే అది అహంకార వృద్ధికి అవకాశాన్నిస్తుంది. 

ఆత్మపరిశీలన నశిస్తుంది. అజ్ఞాన విముక్తే స్వేచ్ఛ. జ్ఞానమే మోక్షం. ఆ మేరకు తల్లిదండ్రులు ప్రేరితులు కావాలి. వ్యక్తిగత ఆలోచనలకు, వ్యక్తిత్వ వికాసానికి వారికి వారుగా తెలుసుకునే అవకాశం పిల్లలకు ఉండాలి.

దేనినైనా ప్రశ్నించినప్పుడు దానికి కావలసిన సమాధానాన్ని, సమాచారాన్ని పొందగలగాలి. అలాగే సమస్యను ఆహ్వానించి, దానికి తగిన పరిష్కారాన్ని సాధించగలిగిన సమర్థత, స్వేచ్ఛ, మనసుకు కలిగేలా చేయాలి. స్వీకరణ, తిరస్కారం ఏదైనా ఏకపక్షం కారాదు. జ్ఞానప్రస్థాన దిశగా మానవ మనసు సాధన మార్గంలో పయనించాలి.
ఇందుకు బాల్యాన్ని ప్రాథమికదశగా తీసుకుని, పిల్లలను ఉత్తమ మార్గాన నడిపించగల సమర్థత, జవాబుదారీతనం తల్లిదండ్రులు స్వీకరించి నెరవేర్చాలి.
- శ్రీశ్రీశ్రీ గురువిశ్వస్ఫూర్తి

No comments: