all

Wednesday, December 26, 2012

చిన్నపిల్లలకు వీసా దరఖాస్తు విధానం ఏమిటి?

 
పాఠకుల ప్రశ్నలు










మా 10 ఏళ్ల బాబు వీసా రెన్యువల్‌కి వెళ్లాలంటే ప్రొసీజర్స్ ఏమిటి? సరైన సమాచారం మాకు ఎక్కడ లభిస్తుంది?
- సుమన నాగిరెడ్డి
మీరు అడిగిన వివరాలన్నీ హైదరాబాద్‌లోని యు.ఎస్. కాన్సులేట్ జనరల్ వెబ్‌సైట్‌లో మీకు లభిస్తాయి.(http://hyderabad. usconsulate.gov/). కాన్సల్ జనరల్ కాథరీన్ ధనాని, ఆమె నేతృత్వంలో ఇతర అమెరికన్ ఆఫీసర్లు సాధికారిక వీసా సమాచారాన్ని ప్రజలందరి వద్దకు తీసుకువెళ్లడానికి నిరంతరం చాలా చురుకుగా పనిచేస్తుంటారు. అలాగే, వీసా దరఖాస్తుదారుల సౌకర్యం కోసం యు.ఎస్. ప్రభుత్వం తలపెట్టిన అనేక నూతన చర్యలను కూడా హైదరాబాద్ కాన్సులేట్ సమర్థంగా అమలుజరుపుతోంది. వాటిలో ముఖ్యమైనది ‘ఇంటర్వ్యూ వైవర్ ప్రోగ్రాం’.

దాని ప్రకారం ఇప్పుడు 14 ఏళ్లలోపు వయసున్న పిల్లలు నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా ఇంటర్వ్యూకోసం ఇండియాలోని ఏ యు.ఎస్. కాన్సులేట్‌లోను వీసా ఇంటర్వ్యూకు వ్యక్తిగతంగా హాజరు కానవసరం లేదు. బి1/బి2,హెచ్4,ఎల్2 అన్ని నాన్-ఇమ్మిగ్రెంట్ వీసా కేటగిరీలకు ఈ మినహాయింపు వర్తిస్తుంది. (ఇంటర్వ్యూ వైవర్ ప్రోగ్రాం పూర్తి వివరాలను హైదరాబాద్ కాన్సులేట్ వెబ్ పేజిలోని ప్రెస్‌రిలీజ్‌ల విభాగంలో చూడవచ్చు.)

www.ustraveldocs.com/in వెబ్ లింక్‌లోని సూచనల ప్రకారం మీ బాబుకు ఇంటర్వ్యూ వైవర్ ప్రోగ్రాం కింద మీరు అప్లయ్ చేయవచ్చు. మీ (తల్లిదండ్రుల)వీసా కాపీలు, యు.ఎస్‌లో మీరు సందర్శించబోతున్న వారి పేర్లు, చిరునామా లాంటి వివరాలు; మీకు ఇండియాతో గల గట్టి అనుబంధాన్ని తెలిపే మీ ఇళ్లు, ఆస్తులు, ఐ.టి. డాక్యుమెంట్లు, మీ బాబు ఇక్కడ స్కూలులో చదువుతున్న ఆధారాలు లాంటి వాటి కాపీలు సమర్పించండి.

ఇంటర్వ్యూ నుంచి మినహాయించినంత మాత్రాన వీసా ఖచ్చితంగా మంజురవుతుందన్న హామీ ఏమీ లేదు. కొన్ని సందర్భాలలో అప్లయ్ చేసిన పిల్లల్ని ప్రత్యక్షంగా ఇంటర్వ్యూకి పిలిచే అవకాశం కూడా ఉంటుంది. మీ బాబు ఇప్పటికే తన ఐదేళ్ల వీసా మీద వెళ్లి వచ్చాడు కనుక తన విషయంలో సమస్య ఏమీ ఉండకపోవచ్చు.

అనేక భాషలలో టెలిఫోన్, ఇ-మెయిల్ ద్వారా అప్లికెంట్ల సందేహాలు తీర్చే ఒక సమర్థమైన కాల్ సెంటర్ వ్యవస్థ (స్టాన్లీ) కూడా ఉంది. మీ బాబు వీసా రెన్యువల్ కోసం డాక్యుమెంట్లు ఎక్కడ, ఎలా సమర్పించాలి. మళ్లీ ప్రింటెడ్ వీసాని ఎలా అందుకోవాలి తదితర సందే హాలకు హైదరాబాద్ కాన్సులేట్ వెబ్ సైట్ చూడండి. లేదా అందులో ఇచ్చిన సూచనల మేరకు కాల్ సెంటర్‌కి ఫోన్ చెయ్యండి/ఇ-మెయిల్ పంపండి.

యు.ఎస్. వీసాలకు సంబంధించి ఈ ప్రాంతంలోని వారికి హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్ మాత్రమే మీకు పూర్తి సాధికారిక సమాచారాన్ని ఇవ్వగలుగుతుంది. అలాగే యు.ఎస్. కాన్సులేట్ నుంచి మీకు వీసాలను ఇప్పించగలమని ఆన్‌లైన్‌లో గాని, ప్రత్యక్షంగా గాని ఎవరైనా మిమ్మల్ని నమ్మించాలని చూస్తే అది ఒక వీసా స్కామ్‌లో భాగం అని అర్థం చేసుకుని స్థానిక పోలీసులకు తెలియజేయమని ైెహ దరాబాద్ కాన్సులేట్ తన వైబ్ సైట్‌లో పెట్టిన హెచ్చరికని కూడా గమనించండి.

నాకు ‘స్టామరింగ్’ ప్రాబ్లం ఉంది. స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూకి యు.ఎస్.కాన్సులేట్‌కి వెళ్లబోతున్నాను. నాకు ఈ సమస్య ఉండడం వల్ల వీసా రెఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుందా?
- అనిల్ యాదవ్

మీరు ఇంటర్వ్యూకి వెళ్లగానే వీసా ఆఫీసర్‌తో విషెస్ ఎక్స్‌ఛేంజ్ చేసుకునేటప్పుడే ‘అయ్ హావ్ సమ్ స్పీచ్ డిఫికల్టీ. కైండ్లీ బేర్ విత్ మి...’ అని పొలైట్‌గా అనవచ్చు. ఒకవేళ మీరు మొదట చెప్పకపోయినా వారు ఆ తర్వాత అయినా మీ ఇబ్బందిని అర్థం చేసుకుని మీరు నింపాదిగా సమాధానం చెప్పడానికి పూర్తి సహకారం అందజేస్తారు. ఇటువంటి డిఫికల్టీస్ ఉన్నవారికి మిగతా అందరితో సమంగా అవకాశం కల్పించడానికి యు.ఎస్. ప్రభుత్వం సిన్సియర్‌గా ప్రయత్నిస్తుంది. మిగతా అప్లికెంట్లకి వీసా ఇవ్వడానికి లేదా తిరస్కరించడానికి ఏయే కారణాలు ప్రాతిపదిక అవుతాయో మీకు కూడా అవే వర్తిస్తాయి. మీకున్న ‘స్టామరింగ్’ వల్ల మాత్రమే మీకు వీసా రె ఫ్యూజ్ అయ్యే అవకాశం ఆవ గింజంత కూడా ఉండదు.

No comments: