ఇప్పటికీ స్టైల్ అన్నా గ్లామర్ అన్నా మీరు కళ్లముందు మెదులుతారు. మొదట్నుంచీ ఇలాగే ఉండేవారా?
జయసుధ: అస్సలు లేదు. చిన్నప్పుడు అబ్బాయిల్లాగే తయారై తిరుగుతుండేదాన్ని. షర్ట్స్, ట్రౌజర్స్, జీన్స్ వేసుకుని సైకిల్ మీద చక్కర్లు కొట్టేదాన్ని. నాకంటే చిన్నవాళ్లైన ఓ పదిమందిని వెంటబెట్టుకుని తిరగడం, వాళ్లందరినీ తీసుకుని క్రికెట్ చూడ్డానికి స్టేడియమ్‌కి వెళ్లిపోవడం... ఇదీ వరస!
ఆడపిల్లకుండే రిస్ట్రిక్షన్స్ ఉండేవి కాదా...?
జయసుధ: నాన్న తరఫువారంతా బ్రహ్మసమాజానికి చెందినవారు. దాంతో మా ఇంటి వాతావరణం చాలా భిన్నంగా ఉండేది. ఆడపిల్లలిలా ఉండాలి, మగపిల్లలు ఏవైనా చేయొచ్చు లాంటి మాటలు నేనేనాడూ వినలేదు.
అసలు నటి కావాలని ఎందుకనుకున్నారు?
జయసుధ: మా ఆంటీ విజయనిర్మలతో షూటింగులకు వెళ్తూండటంతో, పదకొండేళ్లు వచ్చేసరికి సినిమాల్లో నటించాలన్న కోరిక బలపడింది నాకు. నా ఆసక్తిని గమనించిన ఆంటీ నా పన్నెండో యేట ‘పండంటి కాపురం’లో అవకాశం ఇచ్చారు. అయితే అది అటు చైల్డ్ ఆర్టిస్టుగానూ ఇటు హీరోయిన్‌గానూ చేయలేని వయసు. దాంతో కెరీర్ కాస్త స్లోగా ఉండింది. లక్ష్మణరేఖ, జ్యోతి సినిమాల తర్వాత ఊహించనంత బిజీ అయిపోయాను.
అప్పట్లో నటీనటుల మధ్య రిలేషన్‌షిప్ ఎలా ఉండేది?
జయసుధ: నేను ఇండస్ట్రీకి వచ్చేసరికే రామారావు గారు, నాగేశ్వరరావు గారు సూపర్ స్టార్లు. వాళ్లకీ నాకూ మధ్య ఏజ్ గ్యాప్ చాలా ఎక్కువ. ఇంకా చెప్పాలంటే ఎన్టీయార్‌గారు మా నాన్నకంటే పెద్దవారు. దాంతో వారంటే గౌరవం, భయం, భక్తి ఉండేవి. అందుకే వాళ్లకీ మాకూ మధ్య కాస్త దూరం ఉండేది. అయితే నేను కాస్త అల్లరిపిల్లని కావడంతో అందరితోనూ కల్పించుకుని మాట్లాడేసేదాన్ని.
శోభన్‌బాబు, నేను చాలా సినిమాలు చేశాం కాబట్టి వ్యక్తిగత విషయాలు కూడా మాట్లాడుకునేంత చనువు ఉండేది మా మధ్య. కృష్ణగారితో చేయడానికి మాత్రం కాస్త ఇబ్బంది పడేదాన్ని. ఆయన మా ఆంటీ భర్త కదా... ఆ మొహమాటంతో క్లోజ్ అవ్వలేకపోయేదాన్ని. కమల్ హాసన్ టైమొచ్చేసరికి అందరం ఒకే ఈడువాళ్లం కాబట్టి సరదాగా గడిపేవాళ్లం. టీమ్ అంతా కలసి సినిమాలకు కూడా వెళ్లేవాళ్లం. ఇక హీరోయిన్లంటారా... ఒక హీరోయిన్ మరో హీరోయిన్‌తో పర్సనల్ విషయాలు చెప్పుకోవడమన్నది చాలా తక్కువ.
హీరోయిన్ల మధ్య పోటీ ఉండేదా?
జయసుధ: అప్పట్లో ఈ పోటీలు, నంబర్ గేములు లేవండీ. ఓ బీద అమ్మాయి పాత్ర చేయాలంటే జయసుధే చేయాలి. అంతే తప్ప సడెన్‌గా ఆ పాత్రను జయప్రదకి ఇవ్వరు. ఎందుకంటే తను రిచ్‌గా కనిపిస్తుంది! పేదదానిగా సూటవదు. అందుకే తనూ ఆ చాన్స్ కోసం ప్రయత్నించదు. అలాగే శ్రీదేవి కూడా. వాళ్లకు తగ్గ పాత్రలు వాళ్లకుండేవి. నా పాత్రలు నాకుండేవి.
ఇండస్ట్రీలో అమ్మాయిల్ని ఎక్స్‌ప్లాయిట్ చేస్తారన్న మాట నిజమేనంటారా?
జయసుధ: ఎక్కడైనా ఆడది అనగానే చిన్నచూపు చూస్తారు. ఇండస్ట్రీలో అయితే అమ్మాయి గౌరవం తన తల్లిదండ్రుల్ని బట్టి కూడా ఉంటుంది. పేరెంట్స్ ఆర్థిక పరిస్థితి బాలేక, ఎలాగైనా డబ్బులు సంపాదించి వాళ్లకి సాయపడాలని వచ్చే అమ్మాయిలు ఉంటారు. వాళ్లలో ఒకరో ఇద్దరో తప్ప 99 శాతం మంది పెద్ద హీరోయిన్లు అవ్వరు. ఇదంతా ఓ గేమ్. ఎంత తెలివిగా నెట్టుకు రాగలం అన్నదానిమీద భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కుటుంబం కోసం త్యాగం చేయాల్సి రావచ్చు.
కానీ ఆ త్యాగం మరీ ఎక్కువైతే ఆ అమ్మాయి జీవితం రెడ్‌లైట్ ఏరియాలో ముగిసిపోతుంది. అయితే జస్ట్ బికాజ్ యు స్లీప్ విత్ సమ్‌బడీ, నువ్వు హీరోయిన్ అయిపోతావు అంటే అది కరెక్ట్ కాదు. టాలెంట్ ఉండాలి. దానితో పాటు కాస్త అదృష్టం కూడా ఉండాలి. ఈ రెండిటినీ జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోగలిగితే తప్పకుండా ఎదుగుతాం. చాలామంది హీరోయిన్స్ అందరితోనూ నవ్వుతూ మాట్లాడతారు. క్లోజ్‌గా మూవ్ అవుతారు. అంతమాత్రాన వాళ్లది లూజ్ క్యారెక్టర్ అనడానికి వీల్లేదు. ఎంత చనువుగా ఉన్నా గీత దాటకుండా జాగ్రత్తపడేవారు చాలామందే ఉన్నారు ఇండస్ట్రీలో.
మరి వివక్ష సంగతి...?
జయసుధ: అదీ ఉంది. ఓ సినిమా హిట్ అయితే ఆ క్రెడిట్ అంతా హీరోకే వెళ్లిపోతుంది. అదెలా? హీరో వల్లే సినిమా ఆడదు కదా! ఆ విజయంలో హీరోయిన్‌కీ భాగముంటుంది కదా! నిజానికి ఈ వివక్ష ప్రపంచమంతా ఉందేమో! ఆస్కార్ అవార్డుల్ని చూసినప్పుడు కూడా ఆడవాళ్లకు కాస్త తక్కువ ప్రాముఖ్యతనిచ్చారేమోఅనిపిస్తూంటుంది నాకు. మన విషయానికొస్తే దక్షిణాది కంటే ఉత్తరాదిన హీరోయిన్లకు కాస్త ఎక్కువ ప్రాముఖ్యత, గౌరవం లభిస్తున్నాయని చెప్పొచ్చు.
ఈ వివక్షలు, సమస్యలు చూశాక ఎందుకివన్నీ, ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోదాం అని ఎప్పుడైనా అనుకున్నారా?
జయసుధ: వాటి వల్ల కాదు కానీ నటించడం మొదలుపెట్టిన మూడేళ్లకే నాకు సినిమాల మీద ఆసక్తి పోయింది. కొన్ని పాటలు, సన్నివేశాలు చేయడానికి ఇబ్బందిగా అనిపించేది. అలాగే, అవతల ఎవరున్నా గలగలా మాట్లాడేసేదాన్ని. దాంతో పెద్దలకు గౌరవం ఇవ్వడం లేదనుకునేవారు. పైగా పెద్దవాళ్లని ఒకలా, చిన్నవాళ్లని ఒకలా చూసేవారు. నైట్ షిఫ్టులంటే కూడా విసుగొచ్చేది. కాకపోతే సినిమాలు మానేస్తే మళ్లీ చదువుకోవాలి. నాకేమో చదువు నచ్చదు.
అందుకే కంటిన్యూ అయ్యాను. అయినా పెళ్లయ్యాక సినిమాలు మానాలనుకున్నాను. అదీ చేయలా. పెదబాబు పుట్టాక మానేద్దామనుకున్నా. అప్పుడూ లేదు. చిన్నోడు పుట్టాక మానేస్తానన్నాను. అదీ జరగలేదు. ఓసారి రామారావుగారు- ‘మానేసి ఏం చేస్తావ్? అలా అస్తమానం మానేస్తాను అనకూడదు. నువ్వలా అంటావు కానీ జీవితాంతం నటిస్తూనే ఉంటావు చూడు’ అన్నారు. ఆయనఅన్నట్టే జరిగింది. ఇప్పటికీ నటిస్తూనే ఉన్నాను.
అవార్డులకు ఎంత విలువిస్తారు?
జయసుధ: అవార్డులొస్తేనే గొప్ప అని కాదు గానీ, ప్రతిభకు గుర్తింపు అవసరం కదా! నేనైతే చాలా అవార్డులు అందుకున్నాను. అంబేద్కర్ యూనివర్శిటీ వాళ్లు గౌరవ డాక్టరేట్ కూడా ఇచ్చారు. మీకు పద్మశ్రీ ఇవ్వలేదేంటి అని ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు. నిజానికి నాకంటే ముందు ఇంకొందరికి ఇవ్వాలి. వాణిశ్రీ గారికి ఇంతవరకూ ఇవ్వలేదు. దాసరి నారాయణరావుగారికైతే పద్మశ్రీ కంటే గొప్ప అవార్డు ఏదైనా ఇవ్వాలి. ఓ మహిళ యాభై సినిమాలు డెరైక్ట్ చేయడం మామూలు విషయం కాదు కాబట్టి విజయ నిర్మలగారికి కూడా ఇవ్వాలి. ప్రభుత్వం ఓసారి ఇవన్నీ ఆలోచిస్తే బాగుంటుంది.
అప్పటికీ ఇప్పటికీ ఇండస్ట్రీలో వచ్చిన మార్పులేమిటి?
జయసుధ: ఇప్పటి సినిమాలు టెక్నికల్‌గా బాగుంటున్నాయి. మా కాలంలో కూడా ఉన్న ఎక్విప్‌మెంట్‌తోనే మంచి సినిమాలు చేసినవాళ్లు ఉన్నారు. అయితే కథకే ప్రాధాన్యత! ‘కలియుగ స్త్రీ’ సినిమా తీసుకోండి. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన అమ్మాయి ప్రాస్టిట్యూట్ అవుతుంది.
దానివల్ల ఆమె బిడ్డ అవకరాలతో పుడతాడు. వాణ్ని పైకి తీసుకురావడానికి ఆమె పడే తపనను అద్భుతంగా చూపించారు. అలాంటి సినిమాలు ఇప్పుడెవరు తీస్తున్నారు? ఎంతసేపూ ఇద్దరు హీరోయిన్లు, ప్రేమ, రొమాన్స్. ‘ఇది కథ కాదు’లో ఒక హీరోయిన్, ఆమెను ప్రేమించే ముగ్గురు హీరోలు. ‘ఓ భార్య కథ’లో అయితే హీరో తన భార్యను వేరెవరికో అద్దెకిస్తాడు. ఎంత బోల్డ్‌గా తీశారు! ఇలాంటివిపు్పుడు తీయరు, తీయలేరు. అంత గట్స్ ఎవరికీ లేవు.
ఫ్యాన్స్ టేస్ట్ మారిందంటున్నారు కదా?
జయసుధ: మంచి సినిమా తీస్తే ఫ్యాన్స్ ఎందుకు చూడరండీ. మహేశ్‌బాబుని ‘అతడు’లో ఇష్టపడ్డారని ఆ తర్వాతి సినిమాల్లోనూ అలాగే చూపించారు. వేరేలా చూపిస్తే జనం చూడరని ఫిక్సైపోయారు. కమర్షియల్ సినిమాల్లోనే డిఫరెంట్‌వి తీయొచ్చు కదా! ‘బొమ్మరిల్లు’ వ చ్చింది. చిన్న మెసేజ్ ఇచ్చారు కదా! అలాగే ప్రతి సినిమాలోనూ ఏదో ఒక మంచి చెప్పడానికి ఎందుకు ప్రయత్నించకూడదు! ఇంకో విషయం ఏమిటంటే ఫ్యాన్స్‌కి ఇంపార్టెన్స్ కేవలం సినిమా విషయంలోనే ఇస్తామా! ఒకప్పుడు మేము ఫ్యాన్స్‌ని బాగా రిసీవ్ చేసుకునేవాళ్లం.
ఇప్పుడసలు వాళ్లని దగ్గరకు రానిస్తున్నారా? సెక్యూరిటీ ప్రాబ్లెమ్ అంటారు. ఒకప్పుడు మేము చెట్ల కింద, గుట్టల వెనుక బట్టలు మార్చుకున్న రోజులున్నాయి. అప్పుడేం సెక్యూరిటీ ఉంది! కేవలం పోలీసులే ఉండేవారు. అలాగే హీరోయిన్ పాత్రలు. నేను చేసిన రెండు వందలకు పైగా సినిమాల్లో వంద సినిమాల వరకూ హీరోయిన్ ఓరియెంటెడే. ఇప్పుడసలు హీరోయిన్‌కి నటనకు ఆస్కారముంటోందా!
మీది సక్సెస్‌ఫుల్ మ్యారీడ్ లైఫ్. ఈ సక్సెస్‌లో మీ పార్ట్ ఎంత?
జయసుధ: మా ఇద్దరిదీ సమానమే. నా వరకు నేను నా పని చేసుకుంటూ పోతాను. మా ఆయనేం చేస్తున్నారని ఎంక్వయిరీ చేయను. ఒకరిపై ఒకరికి నమ్మకముండాలి. అర్థం చేసుకోవాలి. అలాగే సహనం కూడా చాలా అవసరం. ఇక ప్రేమ. అది లేకపోతే కాపురం చేయడం కష్టం. ఒక్కమాటైనా మాట్లాడుకోకుండా వేర్వేరు గదుల్లో పడుకునే భార్యాభర్తలు చాలామంది ఉన్నారు. అలా ఎలా ఉండగలరో అని ఆశ్చర్యమేస్తుంది నాకు.
ఓ పక్క నటిస్తూనే... భార్యగా, తల్లిగా బాధ్యతల్ని ఎలా నిర్వర్తించగలిగారు ?
జయసుధ: చాలా కష్టమయ్యేది. నేను షూటింగులకు వెళ్లిపోతే అమ్మ, మా వారు పిల్లల్ని చూసుకునేవారు. పిల్లల పట్ల నాకు చాలా కలలున్నాయి కానీ వాటిని సాకారం చేసుకునే సమయం లేకుండా పోయింది. పెద్దవాడు నీహార్‌ని డాక్టర్‌ని, చిన్నవాడు శ్రేయన్‌ని క్రికెటర్‌ని చేయాలనుకున్నాను. కానీ నేను బిజీగా ఉండటం వల్ల వాళ్ల మీద శ్రద్ధ పెట్టలేకపోయాను. ఇద్దరూ బాగానే చదువుకున్నారు కానీ నాకిష్టమైనవి చేయించలేకపోయానని ఫీలవుతుంటాను.
కూతురు ఉండివుంటే, మీలా హీరోయిన్‌ని చేసేవారా?
జయసుధ: కాదు... టెన్నిస్ ప్లేయర్‌ని చేసి ఉండేదాన్ని. నాకు చిన్నప్పట్నుంచీ స్పోర్ట్స్ అంటే మహా పిచ్చి. నేనెలాగూ అటు వెళ్లలేకపోయాను కాబట్టి నా కూతుర్ని కచ్చితంగా ప్లేయర్‌ని చేసివుండేదాన్ని.
మీకిప్పటికీ తెలుగు రాయడం రాదంటారు. నిజమేనా? మీరంతా ఇంట్లో ఏ భాషలో మాట్లాడుకుంటారు?
జయసుధ: ఇంగ్లిష్, తెలుగు... రెండూ మాట్లాడతాం. మావారు నార్త్ ఇండియన్ కాబట్టి ఆయనకు తెలుగు రాదు. నాకు, పిల్లలకి మాట్లాడటం వచ్చు కానీ రాయడం రాదు. నేను నేర్చుకోవడానికి చాలా ట్రై చేశాను. కానీ రాలేదు. (నవ్వుతూ) మా వాళ్లంటూంటారు... నా తెలుగు అక్షరాలు విరిగిపోయిన జిలేబీ ముక్కల్లా ఉంటాయని!
నటిగా సక్సెస్ అయ్యారు. భార్యగా, తల్లిగా సక్సెస్ అయ్యారు. మరి రాజకీయ నాయకురాలిగా సక్సెస్ అయ్యానని అనుకుంటున్నారా?
జయసుధ: లేదు. ఇక్కడ అనుకున్నది చేయడం అంత తేలిక కాదని తెలుసుకున్నాను. ఎందుకంటే వ్యవస్థ అలా ఉంది. మొన్నటికి మొన్న ఢిల్లీలో ఎంత ఘోరం జరిగింది! ఒక అమాయకురాలు బలయ్యింది. దానికెవర్ని బాధ్యుల్ని చేయాలి! ఎందుకు మనం అమ్మాయిలకు రక్షణ కల్పించలేకపోతున్నాం! కచ్చితంగా ఇది మన వైఫల్యమే. ఒక్కసారి వైన్ షాపుల ముందు చూడండి... ఎంత పెద్ద క్యూ ఉంటుందో! షాపును దాటి రోడ్డు మీదకు వచ్చేస్తున్నారు.
నడిరోడ్డు మీద నిలబడి తాగుతుంటారు. పోలీసులకు చెప్తే, అప్పటికప్పుడు వాళ్లను చెదరగొడతారు. మర్నాడు మళ్లీ మామూలే. ఎవరో సినీ నటుడు డ్రగ్స్‌తో దొరుకుతాడు. అంతే, పొద్దుట్నుంచి సాయంత్రం వరకూ టీవీలో అదే చూపిస్తారు. కానీ చిన్న చిన్న పిల్లలు డ్రగ్స్ అమ్ముతున్నారు. వాళ్ల గురించి ఎవరైనా పట్టించుకుంటున్నారా! ఆ పిల్లల జీవితాలను బాగుచేయడానికి ప్రయత్నిస్తున్నారా! ఈ ట్రాఫికింగ్‌ని ఆపాల్సిన బాధ్యత మనకు లేదా!
మరి ఒక పొలిటీషియన్‌గా దీనికి మీరేం చేస్తున్నారు?
జయసుధ: ఇది ఏ ఒక్కరో చేసేది కాదు. మన సమాజంలో ఉన్న సమస్యలన్నీ పేదరికం వల్లనే. దాన్ని పూర్తిగా నిర్మూలించగలిగినప్పుడు సమస్యలన్నీ పోతాయి. అలా జరగా లంటే వ్యవస్థలో లోపాలు లేకుండా చూసుకోవాలి. నా వరకూ నేను ఒక ఓల్డేజ్ హోమ్ పెట్టాలనుకుంటున్నాను. ముందు ముందు మరిన్ని చేయాలని ఉంది. ఇవి రాజకీయ నాయకురాలిగా కాదు, ఈ సమాజంలోని వ్యక్తిగా చేస్తాను. నేను ఏం చేస్తానన్నా మావారి సపోర్ట్ ఎలాగూ ఉంటుంది.
మీరు క్రిస్టియానిటీ తీసుకుంటానన్నప్పుడు కూడా మీ వారు సపోర్‌ట చేశారా? ఆయన రియాక్షన్ ఏమిటి?
జయసుధ: మా దేవుడి గదిలో అందరు దేవుళ్లూ ఉన్నారు. క్రిస్టియానిటీ తీసుకుంటాను అన్నప్పుడు - ‘అందరిలాగే ఆయన్నీ (యేసుక్రీస్తుని) పూజించు, మొత్తానికే పూర్తిగా మారిపోవడం ఎందుకు’ అన్నారు మావారు. ఆ తర్వాత ఎవరో జోస్యం చెప్పేవాళ్లనూ అడిగారట మా ఆవిడ ఇలా మారిపోతోందేంటి అని. వాళ్లు చెప్పారట- ‘తను ఆయన మనిషి, ఆయన దగ్గరకు వెళ్లనివ్వండి’ అని. ఇక అడ్డు చెప్పలేదు. పిల్లలు కూడా నా అభిప్రాయాన్ని గౌరవించారు.
క్రైస్తవురాలిగా మారాలని మీకు ఎందుకనిపించింది?
జయసుధ: ఎందుకో జీసస్ అంటే మొదట్నుంచీ ఇష్టం. చిన్నప్పుడు కొన్నాళ్లు క్రిస్టియన్ స్కూల్లో చదువుకున్నాను. కానీ అప్పుడు క్రీస్తు గురించి నాకేమీ తెలియదు. సినిమాల్లోకి వచ్చాక ఆస్తమాతో షూటింగులకు వెళ్లడం కష్టమయ్యేది. దాంతో నాగపట్నం వెళ్తే సమస్య తీరిపోతుందని ఒకరు చెప్తే వెళ్లాను. నిజంగానే నా సమస్య పోయింది. అలాగే 1985లో బ్యాంకాక్ వెళ్లినప్పుడు ప్రమాదవశాత్తూ నీటిలో పడిపోయాను.
ఈత రాకపోవడంతో నా పని అయిపోయిందనుకున్నాను. ఎప్పుడూ సాయిబాబాను తలచుకునే నేను... ఆ విపత్కర క్షణాల్లో... తెలియకుండానే యేసుక్రీస్తును తలచుకున్నాను. వెంటనే నీటిలో యేసుక్రీస్తు ముఖం కనిపించింది. ఆ తర్వాత ఏం మహిమ జరిగిందో తెలియదు. నేను ఒడ్డున పడ్డాను. కాదు, క్రీస్తే నన్ను రక్షించారనిపించింది. అప్పుడే నేను దేవుడితో చెప్పాను- యాభయ్యేళ్లు వచ్చాక నీ మార్గంలోకి వచ్చేస్తాను అని. అయితే 42 యేళ్లకే ఆయన మనిషిగా మారిపోయాను. బాప్టిజం తీసుకున్నాను.
మిమ్మల్ని చూసి మీ వాళ్లెవరూ మారలేదా?
జయసుధ: మతం అనేది నమ్మకం. ఎవరికే మతం ఇష్టమైతే దాన్ని నమ్ముతారు. నేను క్రిస్టియానిటీ తీసుకున్నాను కాబట్టి అందరినీ తీసుకొమ్మని చెప్పకూడదు కదా! నేను జీసస్‌ని విశ్వసిస్తున్నాను. మా అమ్మ సాయిబాబాను నమ్ముతుంది. మా అబ్బాయి వేరే గుడులకెళ్తుంటాడు. ఎవరి నమ్మకం వారిది! ఈ రోజు నేను జీసస్‌ను నమ్ముతున్నాను కాబట్టి, మిగిలినవాళ్ల నమ్మకాన్ని తప్పు పట్టలేను కదా! అందుకే ఎవరి అభిప్రాయాలను వారికి వదిలేస్తాను. నాతో పాటు మావారు, పిల్లలు చర్చికొస్తారు. వాళ్లతో పాటు నేను గుడికి వెళ్తాను. నా నమ్మకాల కోసం నేనెవర్నీ ఇబ్బంది పెట్టను, పెట్టలేను. ఎవరైనా తన దగ్గరకు రావాలని ప్రభువు అనుకుంటే ఆయనే వాళ్లను రప్పించుకుంటాడు.
నిజమైన క్రిస్టియన్‌కి మీరిచ్చే నిర్వచనం ఏమిటి?
జయసుధ: క్రీస్తును నమ్మినవారు, ఆయన మార్గంలో నడిచేవారు నిజమైన క్రైస్తవులు. ఆశ, స్వార్థం లేకుండా, పొరుగువారిని ప్రేమిస్తూ, క్రీస్తు చెప్పిన దారిలో నడిచేవాడే నిజమైన క్రిస్టియన్!
ఈసారి క్రిస్మస్‌ని ఎలా జరుపుకోబోతున్నారు?
జయసుధ: జలంధర్‌లో ఒక పెళ్లికి వెళ్తున్నాను. సో... క్రిస్మస్ అక్కడే చేసుకుంటాను. ఈస్టర్ కూడా నాకు బాగా ఇష్టం. యేసుక్రీస్తు జననం ఎంత గొప్పదో, ఆయన మరణించి లేవడం అన్నది అంతకంటే ఘనమైన విషయం. అసలు రిసరెక్షన్ ఉండడమే ఆయన పుట్టకలోని పరమార్థం. అందుకే క్రిస్మస్‌ని ఎంత బాగా చేస్తామో, ఈస్టర్‌ని కూడా అంతే బాగా చేయాలి. అంతేకాదు, క్రిస్మస్ అంటే కొత్తబట్టలు వేసుకుని సెలెబ్రేట్ చేసుకోవడం మాత్రమే కాదని నా ఉద్దేశం. క్రిస్మస్ అంటే గివింగ్. ప్రేమని ఇవ్వడం. మన దగ్గరున్నదాన్ని లేనివాళ్లకు పంచడం. అదే నిజమైన క్రిస్మస్.
సంభాషణ: సమీర నేలపూడి
No comments:
Post a Comment