all

Wednesday, December 26, 2012

ఐకమత్యమే బలం

 
 సందేశం...
ఈ ప్రపంచంలో చాలా జాతులు ఉన్నాయి. ఒక్కొక్క జాతి ఒక్కొక్క దేశంగా ఏర్పడింది. ఒక దేశంలో పుట్టి పెరిగిన వారంతా ఒక జాతివారు. అయినా ఎన్నో మతాలకు, సంప్రదాయాలకు చెందినవారు జాతీయభావనచే ప్రభావితులై ఒక దేశవాసులుగా మెలుగుతున్నారు. జాతీయత సంస్కృతికి మారుపేరయినది. ప్రతిజాతికీ విశిష్టమైన చరిత్ర, నాగరికత ఉంటాయి. భాషలు, రాష్ట్రాలు వేరైనా ప్రజలంతా ఐక్యతగా ఉండటాన్నే జాతీయసమైక్యత అంటారు.

నిజానికి సంస్కృతి సహజసిద్ధమైనది కాదు. అది వ్యక్తిగతమైన వారసత్వం కూడా కాదు. సంఘంలోని అధిక సంఖ్యాకుల జీవనవిధానమే సంస్కృతి. అది భూతకాలపు ప్రతిబింబం. ఆచార వ్యవహారాల ద్వారా ఒక తరం నుండి మరొక తరానికి సంక్రమిస్తుంది. సమాజ సాంఘిక, నైతిక అవసరాలను అది తీరుస్తుంది. సంస్కృతి ఒక క్రమపద్ధతికి లోబడి ఉంటుంది. దేశసౌభాగ్యం జాతీయసమైక్యత మీదనే ఆధారపడి ఉంటుంది.

గతంలో మన నాయకులు ఎన్నో త్యాగాలు చేసి స్వాతంత్య్రాన్ని సంపాదించారు. మనలో ఐక్యత లేకపోతే ఈ స్వాతంత్య్రాన్ని కాపాడుకోవడం కష్టమవుతుంది. కనుక ఇప్పటి నాయకులు కులమత భాషా తత్వాలకు అతీతంగా వ్యవహరించాలి. ఉపాధ్యాయులు విద్యార్థుల్లో జాతీయ దృక్పథాన్ని పెంపొందించాలి. చలనచిత్రాలు, టెలివిజన్ కార్యక్రమాలు మన సంస్కృతిని ప్రతిబింబించాలి.

నిజానికి మన భారతీయ సంస్కృతికి చాలా పెద్ద చరిత్ర ఉంది. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు భారతీయ సంస్కృతికి మూలాధారాలు. ఎన్నో వందల సంవత్సరాలుగా భారతీయులు సంస్కృతీ విలువల్ని కాపాడుకుంటున్నారు. రాజకీయంగా పలుమార్పులు వచ్చినా అనాదిగా భారతీయులంతా ఒకటిగానే ఉంటున్నారు. ఎన్నో మతాలవారు, కులాలవారు ఇక్కడ నివసిస్తున్నారు. అందరి మధ్యా జాతీయతా భావం బలీయంగానే ఉన్నప్పటికీ, ఈనాడు కులమత తత్వాలు దేశ సమైక్యతను కొంతవరకూ దెబ్బతీస్తున్నాయి.

కులం పేరిటా, మతం పేరిటా పోట్లాటలూ ఘర్షణలూ జరుగుతున్నాయి. దీని వలన ప్రజల ఆస్తిపాస్తులకు తీరని నష్టం వాటిల్లుతోంది. హింసాకాండ చెలరేగుతోంది. భాషా దురభిమానం, ప్రాంతీయ తత్వం దేశసమైక్యతను విచ్ఛిన్నం చేస్తున్నాయి. పొరుగు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదాలు, నదీజలాల వివాదాల్లాంటివి జాతీయతా భావాన్ని మట్టుపెడుతున్నాయి. అంతేగాక ఉద్యోగాలలో, విద్యావకాశాల విషయాలలో వివాదాలు భారతీయుల మధ్య ఐక్యతను బలహీనపరుస్తున్నాయి. 

ఈ విచ్ఛిన్నకర ధోరణులకు ప్రజలు స్వస్తి చెప్పాలి. దేశసుస్థిరతను భంగం చేసే శక్తులను రూపుమాపాలి. భారతీయులంతా ఒక్కటేనన్న భావం అందరిలోనూ కలిగించాలి. ఐకమత్యమే బలం అన్న కఠోర వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. అప్పుడే మానవజాతి అభ్యుదయానికి బంగారుబాట పడుతుంది.

- చోడిశెట్టి శ్రీనివాసరావు

No comments: