all

Wednesday, December 26, 2012

రామాయణంలో అనుబంధాలు

 
నిత్య సందేశం
రాముడు, సుగ్రీవుడు అగ్నిసాక్షిగా స్నేహం చేసికొన్నారు. ఒకరి కష్టం మరొకరు తీర్చడానికి ఒప్పందం కుదుర్చుకొన్నారు. రాముని కష్టం విన్నాడు సుగ్రీవుడు. రావణుడు ఒక స్త్రీని బలవంతంగా ఆకాశమార్గంలో తీసుకొని పోతుండగా పర్వతశిఖరం పైనుండి చూశామనీ, ఆమె ‘‘రామా! లక్ష్మణా!’’ అంటూ ఆర్తనాదాలు చేసిందనీ చెప్పాడు సుగ్రీవుడు. ‘‘మమ్మల్ని పైనుండి చూసిన ఆమె తన వద్దనున్న ఆభరణాలు కొన్ని మూటకట్టి మా వద్దకు విసిరింది. వాటిని జాగ్రత్తగా దాచి ఉంచాం. వాటిని మీకు చూపిస్తాను. అవి సీతమ్మవే అయితే సీతను ఎత్తుకు వెళ్ళినదని రావణుడే అనే నిర్ణయానికి రావచ్చు. ఆమెను ఎక్కడ దాచాడో వెతికి పట్టుకోవచ్చు. నిశ్చింతగా ఉండు’’ అని నగలు చూపాడు. 

వాటిని చూసేసరికి రాముడి కళ్ళు నీళ్ళతో నిండి, ‘‘తమ్ముడూ! ఈ నగలను గుర్తించలేకపోతున్నాను. బాధతో నిండిపోయిన నా కళ్ళు ఈ నగలను చూడటానికి సహకరించడం లేదు. నువ్వే చూడు!’’ అన్నాడు. లక్ష్మణుడు ఒకటికి రెండుమార్లు పరికించాడు. సీతాదేవి కేయూరాలు, కుండలాలు ధరిస్తుందని తెలుసు. అయినా గుర్తుపట్టలేకపోయాడు. ‘‘నేను వదిన వద్దకు వచ్చినప్పుడు తల వంచుకొని నిలబడేవాడిని. స్పష్టంగా ఆమె ముఖాన్ని ఏనాడూ తేరిపార చూడలేదు. 
అందువల్ల ఆమె ఎటువంటి కుండలాలు, కేయూరాలు ధరించేదో నాకు సరిగా తెలియదు. కాని ఈ నూపురాలు మాత్రం అనుమానం లేకుండగా వదినగారివే. నిత్యం నీకూ, వదినగారికీ పాదాభివందనం చేసేవాడినిగదా! అందువల్ల మీ వివాహం అయిననాటి నుండి ఆ పాదాలపై నర్తించే నూపురాలు చూసినవాడిని. నిస్సందేహంగా ఇవి మా సీతమ్మతల్లివే’’ అంటూ బోరున విలపించాడు లక్ష్మణుడు. 

ఇదీ మన భారతీయత. ఇదీ మన ఆర్ష ధర్మం. ఇదీ మన సంస్కృతి. 
మనకు ఐదుగురు తల్లులని నీతిశాస్త్రం చెపుతోంది. 
గురుపత్నీ రాజపత్నీ జ్యేష్ఠభ్రాతుః కుటుంబినీ
పత్నీమాతా స్వమాతాచ పంచైతాః మాతరః స్మృతాః!! 
దేశాన్ని పరిపాలించే రాజుగారి భార్య, గురువుగారి భార్య, అన్నగారి భార్య, భార్య తల్లి, కన్నతల్లి ఈ ఐదుగురూ తల్లులే. అందరినీ మాతృభావనతోనే గౌరవించాలి. అలాగే తండ్రులు కూడా ఐదుగురని శాస్త్రం చెప్పింది. 
జనితాచోపనేతాచ యేన విద్యోపదిశ్యతే 
అన్నదాతా భయత్రాతా పంచైతే పితరః స్మృతాః!! అని. 

కన్నవాడు, ఉపనయనం చేసినవాడు, గురువు, అన్నం పెట్టినవాడు, ఆపదలు వచ్చినపుడు కాపాడి భయం పోగొట్టినవాడు... ఈ అయిదుగురూ తండ్రులే. తండ్రుల పట్టికలో అన్నగారి పేరు చేర్చలేదు. కాని ‘భయత్రాత’ ముందుగా అన్నగారే అవుతాడు. తల్లిదండ్రుల తరువాత తనకు కొండంత అండగా అన్నగారే కనిపిస్తాడు. ఏ తమ్ముడైనా అన్నగారి వల్లనే ఆ ఆపద నుండి బయటపడతాడు. పైగా అన్నగారి భార్య తల్లివంటిదని చెప్పాక అన్నగారు తండ్రివంటివారని వేరుగా చెప్పనక్కరలేదు. ఆ ప్రకారంగా ధర్మాన్ని అనుసరించి, అన్నగారిని తండ్రిగాను, వదినగారిని తల్లిగాను గౌరవించినవాడు లక్ష్మణుడు. అన్నదమ్ముల మధ్య అనుబంధం ఎలా ఉండాలో ఆనాడే లోకానికి తెలియజేసింది రామాయణం. 

- డా. కడిమిళ్ళ వరప్రసాద్

No comments: