all

Wednesday, December 26, 2012

కేక్........కేక్..........కేక్,,,,,,,,,,)

కేక్ కట్ చేస్తే... ఆనందం చప్పట్లుగా పరుచుకుంటుంది. మనసులో గూడు కట్టుకున్న
నిరాశ, నిస్పృహ, అశాంతి, అలజడులను తుంచి బయటకు విసిరేస్తుంది.ప్రేమ, దయ, శాంతి, సంతోషాలను హృదయం నిండా నింపుతుంది.కట్ చేసిన కేక్‌ను తోటివారికి పంచండి. ఆనందాల దారుల్లో జింగిల్ బెల్స్.. జింగిల్ బెల్స్... అంటూ గణగణ గంటలు మోగించండి... మెర్రీ క్రిస్టమస్... 

అవెన్ అవసరం లేకుండా కేక్‌ను కుకర్‌లోనే తయారుచేసుకోవచ్చు. ప్రెషర్ కుకర్‌లో లేదా మందపాటి అల్యూమినియం గిన్నెలో చిల్లుల స్టాండ్ ఒకటి పెట్టాలి. నీళ్లు పోయకుండా వేడిచేయాలి. దాని మీద కేక్ మిశ్రమం వేసిన గిన్నెను అమర్చాలి. ఆ పైన మూత బిగించి, వెయిట్ పెట్టకుండా సన్నని మంట మీద ముప్పావుగంట వేడి చేయాలి. ఆ వేడికి కేక్ ఉడుకుతుంది. మధ్యలో మూత తీయకూడదు. 


ప్లమ్ కేక్
కావలసినవి
మైదా - 500 గ్రా., కోడిగుడ్లు - 11 
మార్గరిన్ లేదా బటర్ - 500 గ్రా.
పంచదార (పొడి చేయాలి) - 450 గ్రా.
బేకింగ్ పౌడర్ - 10 గ్రా.
రిఫైండ్ ఆయిల్ - 100 ఎం.ఎల్
ఫ్రూట్ జామ్ మిక్స్ - 50 గ్రా.
క్యారెమల్ కలర్ - 40 గ్రా.
ప్లమ్ ఫ్రూట్స్ - 750 గ్రా.
దాల్చిన చెక్క + ఏలకుల పొడి- 10 గ్రా.
వంటసోడా- అర టీ స్పూన్
లిక్విడ్ గ్లూకోజ్ - 100 ఎం.ఎల్
తయారి 
ఒక పాత్రలో మార్గరిన్, పంచదారపొడి వేసి కలపాలి. ఎగ్‌బీటర్‌తో గుడ్లసొనను గిలకొట్టాలి. ఈ సొనను పంచదార పొడిలో వేసి, మిశ్రమం మృదువుగా అయ్యేంతవరకు బాగా గిలకొట్టాలి. మైదా, దాల్చినచెక్క, ఏలకులపొడి కలిపి జల్లించాలి. ఈ పిండిని గుడ్డు మిశ్రమంలో కొద్ది కొద్దిగా వేస్తూ బాగా కలపాలి. తర్వాత దీంట్లో ప్లమ్ ఫ్రూట్స్, గ్లూకోజ్, క్యారమెల్ కలర్ వేసి మరోసారి కలపాలి. పిండి ముద్ద బాగా మెత్తగా అయ్యాక తగినంత తీసుకొని కేక్‌ను బేక్ చేసే పాత్రలో వేసి, పాత్రంతా పరుచుకునేలా చేత్తో మృదువుగా అదమాలి. ఆ పాత్రను అవెన్‌లో పెట్టి, 180 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద 40 నుంచి 45 ని.లు బేక్ చేసి, తీయాలి. కేక్‌ను నచ్చిన అలంకరణతో వేడుకకు సిద్ధం చేసుకోవాలి.

చాకొలెట్ డోనట్స్
కావలసినవి 
మైదా - రెండు కప్పులు 
పంచదార - అర కప్పు 
బేకింగ్ పౌడర్ - టీ స్పూన్ 
దాల్చినచెక్క పొడి - చిటికెడు 
బ్లాక్ చాకొలెట్ - తగినంత 
ఉప్పు - చిటికెడు 
గుడ్డు - 1 
పాలు - అర కప్పు 
వెన్న - రెండు టీ స్పూన్లు
నూనె - వేయించడానికి తగినంత 
తయారి
మైదాలో బేకింగ్ పౌడర్, ఉప్పు కలిపి జల్లించాలి. ఇందులో దాల్చిన చెక్కపొడి, వెన్న వేసి కలిపి పక్కన ఉంచాలి. పంచదార, గిలకొట్టిన గుడ్డు మిశ్రమం, పాలు వేసి చపాతీపిండిలా కలిపాక చపాతీలా మందంగా ఒత్తుకోవాలి. డోనట్ కటర్‌తో కాని ఏదైనా మూతతో కాని గుండ్రంగా కట్ చేసుకుని, వేడినూనెలో బంగారురంగు వచ్చేవరకు వేయించి, తీయాలి. కరిగించిన బ్లాక్ చాక్లెట్ మిశ్రమాన్ని డోనట్స్ పైన రాసి, తెల్లని చాక్లెట్ మిశ్రమాన్ని కోన్‌తో డిజైన్ వేయాలి. షుగర్ బాల్స్‌తో అలంకరించాలి.

ఐసింగ్ షుగర్ కేక్
కావలసినవి
ప్లమ్‌కేక్ - 750 గ్రా., జీడిపప్పు పొడి - 500 గ్రా., పంచదార పొడి - 250 గ్రా.
పంచదార పాకం - 350 గ్రా.
మార్జిపాన్ - 100 గ్రా.
షుగర్ పేస్ట్ కోసం...
పంచదార పొడి - 500 గ్రా.
గుడ్డులోని తెల్లసొన - 75 గ్రా.
లిక్విడ్ గ్లూకోజ్ - 100 ఎం.ఎల్
(గుడ్డులోని తెల్లసొనను ఎగ్‌బీటర్‌తో నురుగు వచ్చేదాకా ఒకే దిశలో బాగా గిలకొట్టాలి. దీంట్లో పంచదార పొడి కలపాలి.)
తయారి: ప్లమ్‌కేక్ తీసుకొని కేక్ బోర్డ్ మీద పెట్టాలి. దానిపైన మిక్స్‌డ్ ఫ్రూట్‌జామ్‌ను రాయాలి. ఆపైన మార్జిపాన్‌తో కేక్ అంతా కవర్ చేయాలి. ఆ పైన షుగర్‌పేస్ట్‌ను అన్నివైపులా లేయర్‌లాగా పూయాలి. చివరగా శాంటాక్లాజ్, క్రిస్‌మస్ ట్రీ, శాటిన్ రిబ్బన్, స్టార్‌లతో నచ్చిన విధంగా అలంకరించుకోవచ్చు.


స్నో మ్యాన్
కావలసినవి
ప్లమ్ కేక్ - 600 గ్రా., కరిగించిన చాక్లెట్ - తగినంత 
బటర్- తగినంత, అలంకరణకు స్కార్ఫ్, బటన్స్, కళ్లు, టోపీ చాక్లెట్‌తో తయారుచేసినవి వాడుకోవచ్చు. ఇవి మార్కెట్లో లభిస్తాయి. 

తయారి 
ఒక పాత్రలో ప్లమ్ కేక్ వేసి, ముక్కలు చేయాలి. దీంట్లో కరిగించిన చాక్లెట్ కలిపి, ముద్ద చేయాలి. ఒక పెద్ద బాల్, మరొక చిన్న బాల్ చేయాలి. పెద్ద బాల్ మీద చిన్న బాల్‌ను ఉంచి, పైన బటర్‌ను స్నోలాగ అప్లై చేయాలి. తర్వాత చాక్లెట్ స్కార్ఫ్, బటన్స్, కళ్లు, టోపీని సెట్ చేయాలి. స్నో మ్యాన్ కేక్ క్రిస్ట్‌మస్ సందడిని రెట్టింపు చేస్తుంది.

No comments: