all

Wednesday, December 26, 2012

అమెరికాలో ఎం.ఎస్.: అందులో ‘ప్లస్’ ఎంత, ‘మైనస్’ ఎంత?

 
డైలీ ఫీచర్
ఇండియాలో ఐఐటీలాంటి ఉన్నత సాంకేతిక సంస్థలో ఎంటెక్ చేస్తే ఎలా ఉంటుందో చూశాం. అదే మనవాళ్లు అమెరికన్ యూనివర్శిటీల్లో ఎం.ఎస్.కి వెళితే, ‘ప్లస్’ ఏమిటో, ‘మైనస్’ ఏమిటో చూద్దాం.

‘ప్లస్’లు: ఇక్కడ ఎంటెక్ కోసం ఐఐటీ ఎంట్రెన్స్ లాంటివి బాగా టఫ్‌గా ఉంటాయి. బీటెక్ ఎంత కష్టపడి చదువుతారో ఈ ఎంట్రెన్స్‌లకి కూడా అంత లేక అంతకంటే తక్కువ కాకుండానే ప్రిపరేషన్ ఉంటుంది. ఈ ఎంట్రెన్స్‌లు బాగా కఠినంగా ఉండటంతో పాటు విపరీతమైన పోటీతో కూడుకుని ఉంటాయి. వందల సీట్లకి లక్షల మంది పోటీపడతారు. 

యూఎస్‌లో ఎం.ఎస్.కి అవసరమైన జీఆర్‌ఈ, టోఫెల్ లాంటి అడ్మిషన్ టెస్టులు కూడా అంత తేలికైనవి కాకపోయినా, ఐఐటీ ఎంట్రెన్స్ అంత క్లిష్టమైనవి మాత్రం కాదు. స్టూడెంట్స్‌కి వీటిలో కొన్ని వెసులుబాట్లు కూడా (టెస్టు తేదీని ఎంచుకోవడం లాంటివి) ఉంటాయి. అమెరికన్ విద్యావ్యవస్థలో పరిశోధనలకు ప్రాధాన్యం ఎక్కువ. యూఎస్ యూనివర్శిటీల్లో రీసెర్చ్ సదుపాయాలూ ప్రపంచంలోకెల్లా అత్యుత్తమంగా ఉంటాయి. అక్కడ ఎం.ఎస్. చేయడం వల్ల ఎక్కడా లభించని పరిశోధనా వసతులతో పాటు ‘వరల్డ్ క్లాస్’ టీచర్ల పర్యవేక్షణ కూడా దొరుకుతుంది.

యూఎస్ యూనివర్శిటీలు అనేక దేశాల నుంచి వచ్చే విదేశీ విద్యార్థులతో వర్ణ కదంబంలా కనువిందు చేస్తాయి. అవి వివిధ దేశాల మేధస్సుల సంగమాలుగా కూడా అలరారుతుంటాయి. ఒకరి ఆలోచనలను ఒకరితో పంచుకోవడం ద్వారా విద్యార్థులు తమ మేధకు పదును పెట్టుకోవడానికి యూఎస్ యూనివర్శిటీలకు మించిన ప్రదేశాలు మరెక్కడా లేవు. అలాగే, ఎం.ఎస్. చదువుతుండగా అక్కడ అమెరికా సహా వివిధ దేశాలకు చెందిన విద్యార్థులు, అధ్యాపకులు; టెక్నికల్, బిజినెస్ రంగాల ప్రముఖులతో ఏర్పడే పరిచయాలు, స్నేహాలు, అనుబంధాలు విద్యార్థులకు భవిష్యత్తులో ఎన్నటికీ తరగని ఒక ‘బ్యాంక్ బ్యాలెన్స్’లా ఉపయోగపడతాయి.

అమెరికాలో చేసిన ఎం.ఎస్.కి ప్రపంచస్థాయి గుర్తింపు, విశ్వ వ్యాప్తమైన విలువ ఉంటాయి. యూఎస్ యూనివర్శిటీల నుంచి ఎం.ఎస్. చేసిన వారికి అమెరికాలోనే కాక అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఉద్యోగ, పరిశోధనావకాశాలకు రాజమార్గం ఏర్పడుతుంది. యూఎస్‌లో ఎం.ఎస్. చేస్తే అక్కడ పూర్తి ఫండింగ్‌తో పీహెచ్‌డీ ప్రోగ్రాం చేసే అవకాశాలు తేలికవుతాయి. ఎంటెక్ చేసినవారు ఇండియాలో పొందే జీతాల కంటే అమెరికాలో ఎం.ఎస్. చేసినవారు కనీసం నాలుగైదు రెట్లయినా ఎక్కువగానే శాలరీ సంపాదిస్తారు.

సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్ (స్టెమ్) ఫీల్డుల్లో యూఎస్ యూనివర్శిటీల నుంచి మాస్టర్స్, పీహెచ్‌డీ చేసిన విదేశీ విద్యార్థులకు డిగ్రీలతో పాటు ఏటా ఒక నిర్ణీతమైన సంఖ్యలో గ్రీన్‌కార్డులు ఇవ్వాలనే ప్రతిపాదనలు అమెరికన్ శాసనవ్యవస్థలో ఇటీవల ఊపందుకోవడంతో ఈ ఫీల్డుల్లో యూఎస్‌లో ఎం.ఎస్. చేసేవారికి భవిష్యత్తు బంగారంగా ఉంటుంది.

‘మైనస్’లు: అమెరికాలో ఎం.ఎస్.కి ఇండియాలో ఏ ఐఐటీ లాంటి ఉన్నత సాంకేతిక విద్యాసంస్థ నుంచో తీసుకునే ఎంటెక్ కంటే ఏమాత్రం అదనపు విలువ, ప్రయోజనం ఉండదు. ఇండియాలో ఉద్యోగ, పరిశోధనావకాశాలకు పరిశీలించేటప్పుడు ‘యూఎస్‌లో చేసిన ఎం.ఎస్. కదా’ అని ప్రత్యేక ప్రిఫరెన్స్ ఏమీ ఉండదు. యూఎస్‌లో ఎం.ఎస్. చేయడం ఖర్చుతో కూడుకుని ఉంటుంది. ఐఐటీలో ఎంటెక్ చేయడానికి అయ్యే ఖర్చుని అమెరికాలో ఎం.ఎస్. చేయడానికి అయ్యే ఖర్చుతో పోల్చడానికే వీలులేదు. యూఎస్ యూనివర్శిటీలకి అయ్యే ఖర్చులు తల్లిదండ్రుల బ్యాంక్ బ్యాలెన్స్‌లని ఆవిరిచేస్తాయి లేదా ఎదురుగా చేంతాడంత బ్యాంక్ లోన్‌ని ఎప్పుడూ చూపెడుతుంటాయి.

ఐఐటీలో ఎంటెక్ చదివేవారి మాదిరిగా యూఎస్‌లో ఎం.ఎస్. చేసేవారు ఎప్పుడూ ఇండియాలోనే ఉండటానికి, ఎప్పుడంటే అప్పుడు అయినవాళ్లని చూడటానికి వీలుండదు. అమెరికాలాంటి సుదూర దేశంలో ఎవరితోడూ ఉండని టఫ్ లైఫ్‌కి సిద్ధపడాలి.

ముందుగా చెప్పినట్టుగా ఆపిల్, బత్తాయి... రెండు రసాలూ మంచివే. ఒంటితీరుని బట్టి వాడుకోవాలి. ఇండియాలో ఎంటెక్, యూఎస్‌లో ఎం.ఎస్. - వీటిలో తమకి ఏది అనువైనదో విద్యార్థులు తమ అభిరుచిని బట్టి, ఆశయాల్ని బట్టి, తమ అభివృద్ధిని కాంక్షించే తల్లిదండ్రుల అభిప్రాయాల్ని బట్టి నిర్ణయించుకోవాలి. 

No comments: