all

Tuesday, January 15, 2013

నాటు కోడి పాలక్ వేపుడు


కావలసినవి: కోడి మాంసం - కేజీ
ఉల్లిపాయలు - 4; పచ్చిమిర్చి - 6
ఎండుమిర్చి - 8; పాలకూర - 150 గ్రా.
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్
గరం మసాలా (దాల్చిన చెక్క - చిన్న ముక్క, లవంగాలు - 5, ఏలకులు - 3 కలిపి పొడి చేయాలి) - అర టీ స్పూన్
పసుపు - అర టీ స్పూన్; పుదీనా - 5 రెమ్మలు
ఉప్పు - సరిపడినంత; కరివేపాకు - రెండు రెమ్మలు

తయారి: కోడి మాంసం కావలసిన పరిమాణంలో కట్ చేసి ఉంచుకోవాలి. ఉల్లిపాయలను, పచ్చిమిర్చిని సన్నగా తరగాలి. కోడి మాంసానికి పసుపు, మసాలా పట్టించి స్టౌ మీద పెట్టి కొద్ది సేపు ఉడికించాలి. ఐదు నిమిషాల తర్వాత కొద్దిగా నీళ్లు పోసి మరికాసేపు ఉడికించాలి.

మరో స్టౌ మీద కడాయి పెట్టి, నూనె పోసి, కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లిపేస్ట్, కరివేపాకు, పుదీనా, పాలకూర వేసి వేగాక, ఉప్పు కలిపి, ఉడికిన కోడిమాంసాన్ని వేసి వే యించాలి. దించే ముందు ధనియాల పొడి, కొత్తిమీర చల్లాలి.

నాటు కోడి తందూరి


కోడి ముందా గుడ్డు ముందా?
కోడే ముందు!
విందులో చికెన్‌ను ముందు వడ్డించుకుంటాముగానీ గుడ్డును కాదు కదా?
కోడి కూయకపోతే తెల్లారొచ్చేమోగానీ, కోడికూర లేకపోతే కొందరికి నిజంగానే తెల్లారదు.
ఆపూట ఈపూట ఏపూటైనా కోఢే!
ఇది బోనాల సీజన్. దావత్‌ల సీజన్.
అమ్మ చల్లగా చూడాల్సిన వేళ... అతిథులకు వేడివేడిగా నాటుకోడి వండిపెట్టండి.
..................
కావలసినవి:
నాటు కోడి ఖీమా - 250 గ్రా.
ఉల్లిపాయ తరుగు - 2 టీ స్పూన్లు
పచ్చిమిర్చి - టీ స్పూన్
కారం - అర టీ స్పూన్
చీజ్ - టీ స్పూన్
కొత్తిమీర - 2 టీ స్పూన్లు
ఉప్పు - తగినంత
గరం మసాలా (ఏలకులు+లవంగాలు+దాల్చిన చెక్క చిన్న ముక్క కలిపి గ్రైండ్ చేయాలి) - అర టీ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్
ఫుడ్ కలర్ - చిటికెడు

తయారి : కడాయిలో కొద్దిగా నూనె వేసి, కాగాక అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయలను వేసి వేయించుకోవాలి. ఖీమాలో పచ్చిమిర్చి ఉల్లిపాయల మిశ్రమం, చీజ్ తరుగు, కొత్తిమీర, గరం మసాలా, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. తర్వాత ఖీమా మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలు చేసి, పుల్లలకు గుచ్చాలి. కాలుతున్న బొగ్గుల మీద వీటిని కాల్చాలి. తర్వాత పుల్లలను తీసేయాలి. నాటుకోడి తందూరీని వేడి వేడిగా తింటే రుచిగా ఉంటుంది. నచ్చిన చట్నీతో కూడా వీటిని సర్వ్ చేసుకోవచ్చు.
 

ముసలితనంలో ముడతలు ఎందుకు వస్తాయి?



కొలాజెన్ అనే పదార్థం చర్మానికి పటుత్వం అందిస్తుంది. అలాగే సాగే గుణాన్ని ఎలాస్టిన్ అందిస్తుంది. మన చర్మాన్ని ఎప్పుడూ తేమగా ఉంచేలా చేసే వాటిని గైకోనమైనోగ్జికాన్స్ (గాగ్) అని పిలుస్తారు. ఇరవై సంవత్సరాల వయసు దాటినప్పటి నుంచి మన శరీరంలో కొలాజెన్ ఉత్పత్తి తగ్గుతుంటుంది.

దీంతో చర్మంలో మార్పులు రావడం మొదలవు తుంది. అలాగే ఎలాస్టిన్ ఉత్పత్తి తగ్గడం గాగ్ తయారీ కూడా తగ్గుతుండటంతో చర్మం పటుత్వం తగ్గుతుంది. అందుకే వయసు మీదపడుతున్న కొద్దీ చర్మానికి సాగే గుణం తగ్గుతుంది. దీనితో మన శరీరం ముడతలు పడుతుంటుంది.

పిల్లి ఎలుక వైరం (kids story)


హోం > వివరాలు
Book Online Bus Tickets at AbhiBus.com

మృగరాజైన సింహం ఒకసారి జంతువులకు పరుగుపోటీ నిర్వహించాలనుకుంది. విజేతగా నిలిచిన మొదటి పన్నెండు జంతువులకు ఘనసత్కారం ఉంటుందని, రాజ్యంలో ప్రత్యేకతలు కల్పిస్తామని ప్రకటించింది.

బద్దకస్తులైన ఎలుక, పిల్లి ఎద్దు దగ్గరకి వెళ్లి ‘‘మామా! మేము మర్చిపోతామేమో. మమ్మల్ని పిలు’’ అని చెప్పాయి. తీరా పోటీ సమయం రానే వచ్చింది. అప్పుడు ఎద్దు... పిల్లిని, ఎలుకను పిలవడానికి వెళ్లింది కానీ అవి గాఢనిద్రలో ఉండడంతో ఎద్దు ఎంత ప్రయత్నించినా వాటిని లేపలేకపోయింది. కొద్దిక్షణాల్లో పోటీ ప్రారంభం కానుంది. వాటిని వదిలి వెళ్లడం ఇష్టంలేక పిల్లిని, ఎలుకను తన వీపుమీద ఎక్కించుకుని పోటీకి బయల్దేరింది ఎద్దు.

పోటీలో భాగంగా ఎద్దు సరిగ్గా ఒక చెరువు వద్దకు రాగానే ఎలుకకు మెలకువ వచ్చింది. పందెం సంగతి గుర్తుకొచ్చింది. తనతోపాటు నిద్రిస్తున్న పిల్లిని ఒక్క తోపు తోసింది.

ఎద్దు నీటిని దాటే సమయానికి ఎలుక ఒక్కసారిగా ఎద్దు ముందుకి దూకింది. తానే గెలిచానని అరిచింది. అప్పటికి ఎద్దు ఇంకా రెండడుగులు వెనకే ఉంది. పులి మూడోస్థానంలో నిలిచింది. అందుకే చైనా జ్యోతిషపటంలో మొదటి మూడుస్థానాల్లో ఎలుక, ఎద్దు, పులి బొమ్మలు ఉంటాయి. అలా ఎలుక మోసం చేసింది గనుకనే పిల్లులు నిత్యం ఎలుకకి ప్రాణసంకటం అయ్యాయి.

తల్లి పాఠం! (kids story)


భీమయ్యగారి తోటలోని చెట్లమీద ఒక పక్షి గూడుకట్టుకుని అందులో పిల్లల్ని పెట్టింది. భీమయ్య ఒకరోజు కొడుకులతో కలిసి తోటకు వచ్చి ‘‘అయ్యో! చెట్లన్నీ ఎండిపోయాయిరా! రేపు మన బంధువులను తీసుకువచ్చి ఈ చెట్లు కొట్టేసి కొత్తమొక్కలు నాటుదాం’’ అన్నాడు. పిల్లలకు ఆహారం తేవడానికి బయటకు వెళ్లిన తల్లి పక్షి తిరిగి రాగానే పిల్లలు ‘‘అమ్మా! ఈ రోజు తోట యజమాని భీమయ్య, కొడుకులు వచ్చారు.

బంధువులను తెచ్చి రేపు ఈ చెట్లు కొట్టేస్తారట’’ అని చెప్పాయి. తల్లి పక్షి విని ఊరుకుంది. మర్నాడు భీమయ్య కొడుకులతో కలిసివచ్చి ‘‘రేపు కూలివాళ్లను తెచ్చి ఈ చెట్లను కొట్టించేద్దాం!’’ అన్నాడు. తల్లి తిరిగి రాగానే పిల్లపక్షులు ఇదే విషయం చెప్పాయి. తల్లి విని ఊరుకుంది. మూడోరోజు భీమయ్య కొడుకులతో వచ్చి ‘‘రేపు స్నేహితులతో వచ్చి చెట్లు కొట్టేద్దాం!’’ అన్నాడు. ఎప్పటిలాగానే తల్లి పక్షి విని ఊరుకుంది. నాలుగోరోజు మళ్లీ భీమయ్య, కొడుకులతో కలిసి వచ్చి ‘‘లాభం లేదురా! రేపు మనమే వచ్చి చెట్లుకొట్టేద్దాం!’’ అన్నాడు.

తల్లి పక్షి తిరిగి రాగానే పిల్ల పక్షులు ఆ విషయం చెప్పాయి. వెంటనే తల్లి పక్షి పిల్లలను తీసుకుని వేరేచోటికి వెళ్లి అక్కడ చెట్టు మీద గూడు కట్టుకుని పిల్లల్ని అందులో పెట్టింది. అప్పుడు పిల్ల పక్షులు ‘‘అమ్మా! మొదటి రోజు, రెండోరోజు, మూడోరోజు విని ఊరుకుని ఇప్పుడు తీసుకు వచ్చేశావేం’’ అని అడిగాయి. అందుకు తల్లిపక్షి ‘‘బంధువుల మీద, స్నేహితుల మీద, కూలీల మీద ఆధారపడితే వెంటనే పనులు కావు. ఎవరి పని వాళ్లే చేసుకోవాలనుకుంటే వెంటనే అయిపోతాయి’’ అని చెప్పింది.

నీతి: ఇతరుల మీద ఆధారపడక ఎవరి పనులు వాళ్లే చేసుకుంటే ఆ పనులు తప్పక అవుతాయి.

ఆస్తిపంపకం (kids story)


ముకుందాపురంలో వరహాలయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి ఇద్దరు కొడుకులు గోపయ్య, రామయ్య. ఇద్దరూ సోమరిపోతులే. కొడుకుల విషయంలో వరహాలయ్యకు దిగులు పట్టుకుంది. తన తదనంతరం వాళ్లు సంపాదన చేతకాక అష్టకష్టాలు పడతారు. అందువల్ల తాను బతికి ఉండగానే వీళ్లను ఒక దారిలో పెట్టాలి అనుకున్నాడు.

గోపయ్య, రామయ్యలను పిలిచి, ‘‘నేను వృద్ధుడిని అయిపోయాను. ఇంతకాలం నేను సంపాదించిన డబ్బు అంతా అటక మీద ఉన్న ఆ రెండు కొయ్యపెట్టెలలో దాచి వుంచాను. మీరిద్దరూ చెరొకపెట్టెలో ఉన్న డబ్బు తీసుకుని హాయిగా జీవించండి. కానీ అంతకంటే ముందు మీరిద్దరూ చెరొక వెయ్యి వరహాలు సంపాదించి ఈ రెండు కుండలలో వేయాలి. లేకుంటే ఆ పెట్టెలు రెండూ మాయం అయిపోతాయి.

అంతేకాదు, కుండలు నిండక ముందే పెట్టెలు తెరిస్తే మీ తలలు పగిలిపోతాయి. ఇది మన కుల దైవం ఇచ్చిన శాపం’’ అని చెప్పాడు.

ముందు వెయ్యివరహాలు సంపాదిస్తే ఆ తరువాత హాయిగా పెట్టెల్లో ఉన్న డబ్బు తింటూ కూర్చోవచ్చు అని రామయ్య, గోపయ్య ఆ రోజు నుంచి కష్టపడి పని చేసి వెయ్యి వరహాలు సంపాదించారు. ఈలోగా వరహాలయ్య కన్నుమూశాడు. వెయ్యి వరహాలు సంపాదించి కుండల్లో నింపగానే రామయ్య, గోపయ్య అటుక మీద ఉన్న పెట్టెలు కిందకి దించి తెరచి చూడగా అవి ఖాళీగా ఉన్నాయి. అందులో ఉన్న చీటీలో... మీరు ఇలాగే కష్టపడి సంపాదిస్తే ఈ పెట్టెలు కూడా నింపవచ్చు. ఇదే నేను మీకు పంచే ఆస్తి’’ అని ఉంది. తండ్రి మనసు గ్రహించిన కొడుకులిద్దరూ కష్టపడి సంపాదిస్తూ హాయిగా జీవించసాగారు.
 

శేషాచలం అతి తెలివి (kids story)


శివుడు అనే విద్యార్థికి ఒకరోజు సాయంత్రం పాఠశాలలో ఉంగరం దొరికింది. శివుడు ఆ ఉంగరాన్ని భద్రంగా తనతో తీసుకువెళ్ళి మరుసటి రోజు ఉదయం ప్రార్థన చేసే సమయంలో గురువు గారికి ఇచ్చాడు. ఉంగరం పోగొట్టుకున్న విద్యార్థికి దాన్ని అందజేశారు. అందరూ శివుడిని ఎంతగానో మెచ్చుకున్నారు.

ఇది చూసి శేషాచలం అనే విద్యార్థికి అసూయ కలిగింది. ఎలాగైనా తాను కూడా శివుడిలాగే అభినందనలు అందుకోవాలనే ఉద్దేశంతో పిల్లలంతా ఆటల్లో నిమగ్నమై ఉన్న తరుణంలో ఒక అబ్బాయి పర్సు కొట్టేసి తన సంచిలో దాచుకుని, మరుసటి రోజు ఉదయాన్నే గురువుగారికి దాన్ని అందచేశాడు. గురువుగారు అతడిని మెచ్చుకుని అందరి చేత చప్పట్లు కొట్టించి అభినందనలు అందచేశారు. దాంతో శేషాచలానికి మళ్లీ మళ్లీ ఇలాంటి అభినందనలు అందుకోవాలనే దురాశ కలిగింది.

శేషాచలం రెండు రోజుల తరువాత మరొక అబ్బాయి పెన్నుల పెట్టె కాజేసి తనకు దొరికిందని గురువుగారికి అందచేశాడు. దాంతో అతనికి తరచు వస్తువులు ఎలా దొరుకుతున్నాయో అర్థం కాక విద్యార్థులు కొందరు మాటు వేసి చూడసాగారు. శేషాచలం మరొక అబ్బాయి పుస్తకాలు దొంగిలించబోతుండగా అందరూ కలిసి పట్టుకుని గురువుగారికి అప్పగించారు.

అందరిముందూ చప్పట్లతో అభినందనలు అందుకోవడానికి శేషాచలం అలా చేస్తున్నాడని తెలుసుకున్న గురువుగారు అతడిని మందలించి, ఇక ముందు అలా చేయకూడదని హితవు పలికాడు. శేషాచలం తన తప్పును గ్రహించాడు.

వారధులు,సారథులు యువజనులే!


సందర్భం - నేషనల్ యూత్ డే
పరిపూర్ణమైన సమాజం
పరిపూర్ణమైన వ్యక్తిత్వం వల్లనే సాధ్యమౌతుంది.
పరిపూర్ణం అంటే -
ఆధ్యాత్మిక చింతన ఉన్నదీ, ఆధిక్య భావన లేనిదీ,
ఇంకా... మనిషిని సాటిమనిషిగా గౌరవించాలన్న స్పృహ కలిగినదీ!
అసలు ఇలాంటి ఒక సమాజాన్ని నిర్మించుకోగలమా?
ఎందుకు నిర్మించుకోలేం? అంటున్నారు సద్గురు జగ్గీ వాసుదేవ్.
యువతను మళ్లించవలసిన మార్గానికి మళ్లిస్తే ... కనీసం
సాంస్కృతిక సారథులుగా, వారథులుగా వారిని తీర్చిదిద్దితే...
వ్యవస్థను అన్నివిధాలా ప్రక్షాళన చెయ్యొచ్చని బోధిస్తున్నారు.
యువజన దినోత్సవం సందర్భంగా...
‘సాక్షి’ ఫ్యామిలీకి సద్గురు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలోని విశేషాంశాలివి ... 


వ్యవస్థను మార్చండి... కానీ ముందుగా మరో వ్యవస్థను తయారుచేయండి..!

మూడు నాలుగు వందల సంవత్సరాల క్రితం బ్రిటిషువాళ్లు మన దేశానికి వచ్చినప్పుడు పెద్దపెద్ద స్కూళ్లు, కాలేజీలు, యూనివర్శిటీలు లేవు. అలాగని నిరక్షరాస్యతా లేదు. రామాయణం, గీత, భారతం అందరూ పారాయణ చేస్తుండేవారు. తక్కినవన్నీ చదవలేకపోయేవారు కాని, ఇవి మాత్రం చదవగలిగేవారు. అయితే క్రమేణా మన దేశం అత్యున్నతమైన మేధావుల్ని, అద్భుతమైన గ ణితశాస్త్రజ్ఞుల్ని, గొప్ప ఖగోళ శాస్త్రజ్ఞుల్ని తయారుచేసింది.

ఇదంతా ఒకెత్తయితే, నా ఉద్దేశంలో ఒక పరిపూర్ణమైన వ్యక్తిని తయారుచేయడమే విద్య! అంతకుమించిన గొప్ప విద్య మరేం ఉంటుంది? అయితే, ఇప్పుడు ప్రమాణాలు పూర్తిగా మారిపోయాయి. మనం గొప్ప విద్యావ్యవస్థను రూపొందించగలుగుతున్నాం కాని, గొప్ప మనుషుల్ని మాత్రం తయారుచేయలేకపోతున్నాం.

ఇక గ్రామీణ భారతదేశంలోని విద్యావకాశాల పరిస్థితి గురించి అయితే మాట్లాడక్కర్లేదు... దయనీయం! అక్కడ యువతకు మౌలికమైన విద్యావకాశాలు లేకపోవడంతోపాటు, విద్యాసంస్థలకు వెళ్లడానికి సరయిన రవాణా సౌకర్యాలు కూడా లేవు. పోనీ అని స్కూల్‌కి వెళ్లినా అక్కడ పాఠాలు చెప్పడానికి టీచర్లు ఉండరు... ఒకవేళ టీచర్లు ఉన్నా అక్కడ ఎటువంటి బోధనా పరికరాలు ఉండవు. అలా, చదువే సరిగా లేకపోతే ఇక భవిష్యత్తు ఏముంటుంది?

వాస్తవానికి విద్య నేర్పడమే మన ప్రధాన కర్తవ్యం. అయితే దాని కంటె ముందు వారికి సరైన పోషకాహారం చాలా అవసరం. గ్రామాలలో నివసించే యువతలో 60 శాతం మందికి పైగా శరీర దారుఢ్యం లేకుండా అస్థిపంజరాల్లా ఉంటున్నారు. శారీరక ఎదుగుదల లేకపోతే మానసిక ఎదుగుదల కూడా సరిగా ఉండదు. అందువల్ల వారు చదువు గురించి పెద్దగా ఆలోచించలేకపోతారు.

గ్రామీణ యువత వంశపారంపర్యంగా వచ్చే వృత్తులలోనే ఉండిపోతారు. ఒక రైతు కొడుకు రైతులాగ, వడ్రంగి కొడుకు వడ్రంగిలాగ చిన్నప్పటినుంచీ అదే నేర్చుకుంటాడు. అది అతనికి చదువుకునే పాఠశాల లాంటిది. అదే అతను నేర్చుకునే విద్యా విధానం. అయితే దాన్ని మనం ఛైల్డ్ లేబర్ అని లేబుల్ చేసి, ఆ వ్యవస్థ తప్పు అని భావించి, దాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నాం. ఏం, మనకు మంచి రైతులు అవసరం లేదా? వ్యవసాయం ఉపయోగకరమైన నైపుణ్యం కాదా? అది మన దేశానికి అవసరం లేదా? దానికి అవసరమైన వ్యవస్థను మనం తయారు చేసుకోవాలి, అది పొలం దగ్గరే తయారుచేయాలి. మనకు కావలసిందల్లా ఒక ఉపాధ్యాయుడు మాత్రమే. సగం రోజు పాఠం చెబితే సరిపోతుంది. మిగతా సగం రోజు ఆ పిల్లలు వాళ్ల తండ్రుల దగ్గర వృత్తివిద్య నేర్చుకోవచ్చు. వాళ్లల్లో కొందరు ముందుముందు తరాల్లో అగ్రికల్చర్ ఎంఎసి చేసి తిరిగి వ్యవసాయంలోకి వెళ్లవచ్చు.

మన దేశంలో 400 మిలియన్లకు పైగా 15 - 18 సంవత్సరాల వయసు గల యువత ఉంది. అయితే, మన యువతకి నైపుణ్యాలు నేర్పించడానికి అవసరమైన సదుపాయం మన దగ్గర లేదు. అది లేకపోతే మన దేశాన్ని మనం చంపుకున్నట్టే. ఇప్పుడు మనకి రెండే దారులున్నాయి. దేశానికి అవసరమైన నైపుణ్యమైనా పెంచుకోవాలి లేదా దేశాన్ని చంపుకోవాలి. నైపుణ్యాన్ని పెంచుకునేందుకు అవసరమైన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మనకు లేదనే విషయాన్ని తప్పనిసరిగా గుర్తించాలి. ఇక్కడి సంగతి నాకు సరిగా తెలియదు గాని, తమిళనాడులో మాత్రం విద్యార్థుల్ని 9వ తరగతి వరకు ఫెయిల్ చేయకూడదని గవర్నమెంట్ రూల్ ఉంది. అలాచేస్తే మధ్యలోనే చదువు ఆపేస్తారని వారి భావన! మేము చాలామందిని పరీక్షించి చూశాం. 8, 9 తరగతులకు వచ్చిన పిల్లలు కూడా 4 + 5 అంటే 45 అని రాస్తున్నారు. పేరుకి 9, 10 తరగతులు చదువుతున్నారు కానీ, వాళ్లు ఇంగ్లీషు మాత్రమే కాదు, మాతృభాషలో కూడా ఒక్క వాక్యాన్ని రాయలేరు. ప్యాంటు, షర్టులు వేసుకుని అదే పెద్దఘనకార్యంగా, ఏదో విజయం సాధించినట్టుగా భావిస్తున్నారు.

ఆ విద్యార్థిని రెండోక్లాస్‌లోనే ఫెయిల్ చేసుంటే, కనీసం తన తండ్రి దగ్గర వృత్తివిద్యను నేర్చుకుని, మంచి రైతేనా అయి ఉండేవాడు. వాళ్లు స్కూళ్లల్లో ఉన్నందువల్ల జరిగే నష్టం ఏంటంటే... వాళ్లకు తిరిగి పొలాలలో పనిచేసే శారీరక దృఢత్వం ఉండట్లేదు. పొలంలో పనిచేయడం ఒక్కరోజులో వచ్చే విద్యకాదు. దానికి ఎన్నో సంత్సరాల కృషి, సాధన ఉండాలి. ఆ పిల్లవాడికి వడ్రంగి పనికాని, నేతపని కాని చేసే నైపుణ్యం గాని, శారీరక దృఢత్వం కాని రెండూ పోతున్నాయి. 14 -15 సంవత్సరాలు వచ్చినా వారికి ఎందులోనూ నైపుణ్యమూ రావట్లేదు. కానీ, దురదృష్టం ఏంటంటే... ఇవన్నీ లేకపోయినా, ఏదో చేసేయగలమన్న అభిజాత్యం మాత్రం వారిలో వృద్ధి పొందుతోంది. ఇలాంటి నిబంధనలు విధించి కోట్లాదిమంది పిల్లలకి మరో మార్గం లేకుండా తయారుచేస్తున్నాం. ఒక జనాకర్షక చట్టం చేసి ఉన్న వ్యవస్థను నాశనం చేస్తున్నాం. ఈ చట్టాలు చేసేవాళ్లెవ్వరూ గ్రామాలకు వెళ్లి ఉండరు.

అందుకే, ఆ వ్యవస్థను మార్చేముందు మనం మరో కొత్తవ్యవస్థను తయారుచేసుకోవాలి. ఏ పని చేయాలనుకున్నా దానికి ముందు నడిచేకాళ్లు ఇవ్వాలి. చట్టాలను ప్రవేశపెట్టే ముందు, వాటివల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ముందుగానే ఆలోచన చేసి, ఆ తరవాతే ప్రవేశపెట్టాలి. ఏ ఆలోచనైనా సరే అది ఆకాశంలో ఉండి నేల మీదకు చేరలేకపోతే, అది మంచిదైనప్పటికీ నిరుపయోగమే!

మహిళలను పూజించనక్కర్లేదు... సమానంగా చూస్తే చాలు..!

నా ఉద్దేశంలో స్త్రీని పనిగట్టుకుని పూజించనవసరం లేదు... సమానంగా చూస్తే చాలు. కానీ, దురదృష్టవశాత్తూ స్త్రీ ఒక విలాస వస్తువు, వినిమయ వస్తువు అనే ధోరణి ఈ పురుషాధిక్య సమాజంలో ఉంది. మగపిల్లలు శారీరకంగా ఎదుగుతున్న క్రమంలో పారంపర్యంగా సంక్రమించే ఈ ధోరణి వారిపై దుష్ర్పభావం చూపి, స్త్రీని పొందడం తమ హక్కు అనే భావన వారిలో కలిగిస్తుంది. ఢిల్లీ గ్యాంగ్ రేప్ సంఘటనను కూడా ఇదే కోణం లోంచి చూడాలి. స్త్రీని ఒక అవయవాల సమాహారంలా కాకుండా వ్యక్తిత్వం ఉన్న సాటి మనిషిగా చూడగల స్పృహను మగపిల్లల్లో కలిగించే సంస్కారయుతమైన పెంపకం బాల్యం నుంచే ఉండాలి. నేరానికి శిక్షలు ఎలాగూ ఉంటాయి. అసలు నేరమే జరగని సమాజాన్ని నిర్మించుకుంటే శిక్షల అవసరం ఏముంటుంది?

ఆధ్యాత్మిక చింతనను గ్రోలండి... మత్తుపదార్థాలను కాదు..!

మనం చాలా పనికిరాని పనులు చేస్తున్నాం. ఆల్కహాల్ ప్రకటనలు దేశీయచానళ్లలో వచ్చేందుకు అనుమతిస్తాం... కానీ, తాగితే మంచిది కాదని అదే ప్రకటనలో వేస్తాం! అవి పట్టించుకోరు కానీ, ప్రకటన చూసిన యువకులు మేమెందుకు తాగకూడదని అడుగుతారు. యువత అంటే సమాధానాలను తరచి చూసే తరం. వారి ప్రశ్నకు సమాధానం లేనప్పుడు వారు తాగుతారు. యువత అంటే జీవితాన్ని వెతుకుతున్నవారు. వారింకా జీవితంలో స్థిరపడలేదు. ఇంకా అన్వేషణలోనూ, అనుభవించడానికి కావలసిన మార్గాలలోనూ ఉన్నారు. మనం మన యువత అంతరంగ బలం కోసం, మనోబలం కోసం ఎటువంటి ప్రయత్నమూ చేయట్లేదు, మరో మార్గమూ చూపించట్లేదు. అందుకే, సహజంగానే వారు తాత్కాలిక సుఖసంతోషాలు కలిగించేవాటి కోసం చూస్తున్నారు. ‘సంపాదించు సంపాదించు’ అంటే వారికి అర్థం కాదు. గొప్ప మార్గంలో జీవితాన్ని అనుభవించే పద్ధతిని వారికి మనమే నేర్పించాలి. ఒక ఆధ్యాత్మిక మార్గం చూపించాలి. ఏ మనిషికైనా ఆధ్యాత్మిక బీజం సరిగా ఉంటే ఇంక మిగతావి ఎలా ఉన్నా పరవాలేదు. మనం పిల్లలకి ఆ బీజం నాటగలిగితే ఇంక వేరే చేయాల్సింది లేదు. అప్పుడు వాళ్లు తమ మార్గాన్ని ఎలాగైనా తెలుసుకోగలుగుతారు. వారిని ఎవరూ ఆపలేరు.

ఆధ్యాత్మిక మార్గం అంటే మతపరమైన నీతినియమాలు కావు. వాళ్ల ఆత్మలతో వాళ్లు ఉండగలగడం. వాళ్ల జీవితాన్ని అత్యున్నతమైన స్థాయిలో అనుభవించడం. ఆ స్థాయిలో ఉన్నప్పుడు ఎవరికైనా తాగాల్సిన అవసరం ఏముంటుంది? కానీ, వాళ్లు తాగాలి... మత్తు పదార్థాన్ని కాదు... ఆధ్యాత్మిక చింతనను! అయితే ఒకరోజులో మొత్తం యువతనంతా మార్చడం సాధ్యం కాదు... దానికి సమయం పడుతుంది!

ఆధ్యాత్మిక బీజం వేయలేకపోతే... సాంస్కృతిక బీజాన్నైనా వేయండి..!

యువతకు ఆధ్యాత్మిక బీజం వేయలేకపోతే కనీసం సాంస్కృతిక బీజమైనా వేయగలగాలి. అది అత్యుత్తమమైన పరిష్కారం అనను కానీ, ఈ పరిస్థితుల్లో ఇంతకుమించిన ప్రత్యామ్నాయం లేదని మాత్రం చెప్పగలను. కొందరు అనవచ్చు... అలా చేయడం ప్రపంచాన్ని విడగొట్టినట్టు అవుతుందని! అది కొంతవరకు నిజం. ఎందుకంటే, ఎవరికైనా అత్యుత్తమమైన జీవనం అంటే... యూనివర్సల్‌గా ఫీలవ్వడం! అలా కాని పక్షాన సాంస్కృతికంగానైనా ఫీలవ్వాలి. అది ఒక విధమైన సమతుల్యాన్ని ఇస్తుంది. మన భారతీయ సంస్కృతి, సాంప్రదాయం, విలువలు కొంతవరకైనా పరిరక్షింపబడతాయి. అదే వివేకానందుడు కూడా ప్రయత్నించింది.

పాశ్చాత్య దేశాల్లో... తల్లిదండ్రులకి కూడా స్వేచ్ఛాజీవితం కావాలి. సాయంత్రం పూట పిల్లలను వదిలి మద్యం సేవించి పబ్‌లకి, క్లబ్‌లకి వెళ్తారు. కానీ, మనవాళ్లు అలా కాదు... మన పిల్లల పరీక్షలైతే మనం వాళ్లతో పాటు కూర్చుంటాం. ఇంకెవ్వరూ అలా చేయరు. అందుకే, మీరు చూడండి... ఎక్కడికెళ్లినా మిగతా దేశాల వారితో పోలిస్తే మన వాళ్లు చాలా బాగా అభివృద్ధి చెందుతున్నారు. మన భారతీయ విద్యార్థులు కూడా ఎక్కడున్నా, వారి సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించి పనిచేస్తున్నారు. దానికి ఏకైక కారణం... మనవాళ్లకు ఇంటినుంచి లభించే సహకారం! మనకు తప్పించి ఇంకెవ్వరికీ అలాంటి అనుకూల వాతావరణం లేదు. అయితే, మన యువత దాని ఫలితాన్ని అనుభవిస్తోంది కానీ దాని కోసం పనిచేయడం లేదు. ఈ వ్యవస్థను పూర్తిగా అర్థం చేసుకుని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే మనదేశ కుటుంబ వ్యవస్థ కూడా త్వరలోనే పాశ్చాత్య దేశాల మాదిరి తయారవుతుంది. అలా జరగకుండా చూడడం మన యువత చేతుల్లోనే ఉంది!

కూర్పు: డా.వైజయంతి

సద్గురు జగ్గి వాసుదేవ్ ఆధ్యాత్మిక యోగి. ‘ఇషా’ ఫౌండేషన్ వ్యవస్థాపకులు. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా యోగా కార్యక్రమాలను నిర్వహిస్తుంటుంది. అలాగే పలు సామాజిక సేవ, ఆభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటుంది. కర్నాటకలోని మైసూరులో జన్మించిన సద్గురు వాసుదేవ్ ప్రసంగాలు మంత్రముగ్ధులను చేస్తాయి. పర్యావరణ పరిరక్షణకు ఆయన నెలకొల్పిన ‘ప్రాజెక్ట్ గ్రీన్‌హ్యాండ్స్’ కు ప్రతిష్ఠాత్మకమైన ఇందిరాగాంధి పర్యావరణ పురస్కారం లభించింది. కోయంబత్తూరులోని ఆశ్రమ ప్రాంగణంలో ఆయన నెలకొల్పిన ధ్యానలింగ యోగాలయం వేలాది భక్తులకు సాంత్వన చేకూరుస్తోంది. 
 

భోగి ఎంతో భాగ్యం!


‘‘ఇంద, ఈ పొంగలి తిని, హాయిగా ఆడుకో బుజ్జీ, ఇవ్వాళ్టికి ఇదే మీకు టిఫిన్... అన్నట్టు బాబిగాడేడే, పొద్దుటినుంచి కనపడలేదు’’ మనవరాలు సుష్మ చేతికి ఘుమఘుమలాడే పొంగలి వేసిన బాదం ఆకు ఇస్తూ అడిగింది అనసూయమ్మ.

‘‘తమ్ముడు పొద్దున్నే పక్కఅపార్ట్‌మెంట్‌లోని వాళ్లంతా కలిసి భోగిమంటలు వేస్తుంటే అక్కడికెళ్లాడు నానమ్మా’’ అని చెబుతుండగానే బాబిగాడు హడావిడిగా లోపలికొచ్చి ఏదో పనున్నట్టు నేరుగా స్టోర్‌రూమ్ తలుపు తీసి అందులో పడేసిన కర్రముక్కలు, విరిగిపోయిన పడక్కుర్చీ బద్దీలు, ఇంకా పనికిరాని వస్తువులు కొన్ని తీసి ఓ పాత సంచిలో వేసుకుని గిరుక్కున బయటికొచ్చి, వచ్చినంత వేగంగా తుర్రున వెళ్లిపోయాడు.

బాబిగాడి చేష్టలన్నింటినీ గమనిస్తున్న నానమ్మ ముసిముసి నవ్వులు నవ్వుకుంది. అది చూసిన సుష్మ ‘‘నానమ్మా! భోగిమంటలంటే ఏంటి? అవి ఎందుకు వేస్తారు? పొద్దున్నే ఈ పొంగలి ఏమిటి? సాయంత్రం తమ్ముడికి బోగిపళ్లు పోస్తానంటున్నావు... ఇదంతా ఏమిటసలు?’’ అనడిగింది. అనసూయమ్మ మనవరాలిని దగ్గరకు తీసుకుని ప్రేమగా బుగ్గలు పుణికి ‘‘నా తల్లే! చాలా మంచి ప్రశ్నే వేశావు... ఇంగ్లీషు చదువుల మూలంగా ఈ కాలం పిల్లలకు ఇటువంటి విషయాలు తెలియకుండా పోతున్నాయి. మీ బోటివాళ్లు ఆసక్తిగా అడగాలే కాని, నా లాంటివాళ్లు ఓపిగ్గా చెబుతారు’’ అంటూ మనవరాలితో ఉత్సాహంగా తనకు తెలిసిన విషయాలను చెప్పసాగింది విశ్రాంత తెలుగు పండితురాలు అనసూయమ్మ.

ప్రస్తుత కాలంలో మనం పాటిస్తున్న ఆచారాలు, చేసుకుంటున్న పండుగలు, అనుసరిస్తున్న ఆచార వ్యవహారాలు, కుటుంబ కట్టుబాట్లు నేటివిధంగా రూపొందడానికి ఆధారం సౌరకుటుంబమే. ఒకవిధంగా చెప్పాలంటే ఈ అనంత విశ్వంలో జరిగే అన్ని ప్రధాన సంఘటనలకు సూర్యచంద్ర గమనాలు, నక్షత్ర రాశుల కదలికలే మూలం. ఉదాహరణకు సూర్యుడు నెలకు ఒక నక్షత్రరాశిలో సంచరిస్తూ ఉంటాడు. దానిని బట్టి ఆ నెలను ఆ రాశి పేరుతో పిలుస్తారు. దానినే ‘సంక్రమణం’ అంటారు. అలాగే చంద్రుడు పున్నమినాడు చరించే నక్షత్రాన్ని బట్టే మాసాలకు పేర్లు వచ్చాయి. ఉదాహరణకు పున్నమి చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉన్న మాసానికి పుష్యమాసమని, మఖానక్షత్రంలో ఉంటే మాఘమాసమనీ అంటారు. అదేవిధంగా సూర్యుడు ధనూరాశి నుంచి మకరరాశిలోకి ప్రవేశించటమే మకర సంక్రమణం. అదే మహాపర్వదినం. నీకు తెలుసుకదా, తెలుగువారు అన్ని పండుగలూ చాంద్రమానం ప్రకార మే జరుపుకుంటారు. అయితే ఒక్క సంక్రాంతి పండుగను మాత్రం సౌరమానం ఆధారంగా జరుపుకోవడం మొదటినుంచి వస్తున్న ఆనవాయితీ.

తెలుగువారికి సంక్రాంతి పెద్దపండుగ. దీనిని భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమగా నాలుగు రోజులు జరుపుకుంటారు. అందుకే కదా, మీకు స్కూళ్లకు అన్నేసి రోజులు సెలవులిచ్చేది! సరే, ఇందాక భోగిమంటల గురించి అడిగావు కదూ, ఆ విషయానికే వస్తున్నాను...అసలు ‘భోగి’ అన్న పేరులోనే భోగభాగ్యాలు ఉట్టిపడుతుంటాయి కదూ! అటు కుర్రకారు, ఇటు నడికారు, వారిని ఉత్సాహపరుస్తూ మాబోటి మూడుకాళ్ల వాళ్లు కలిసి చేసే సందడే భోగిమంటలు. పనికిరాని, వాడకంలో లేని పాతవస్తువులన్నింటినీ మంటలలో వేయడం ఈ పండుగ సంప్రదాయం. ఒకవిధంగా చెప్పాలంటే మనలోని పాత ఆలోచనలను, పాతదనాన్ని మంటలలో వేసి తగులబెట్టెయ్యడమే ఈ భోగిమంటల ఉద్దేశ్యాలలో ఒకటి. కలిగిన వాళ్లు కొత్తబట్టలు వేసుకోవడం భోగితోనే మొదలవుతుంది. మహాభక్తురాలైన గోదాదేవి శ్రీ రంగనాథుని పాణిగ్రహణం చేసింది భోగినాడే! ఇందుకు గుర్తుగా శ్రీవైష్ణవులు భోగినాడు అంగరంగవైభవంగా గోదారంగనాథుల కల్యాణం చేస్తుంటారు.

సంక్రాంతి మూడురోజుల పండుగ. మొదటిరోజు భోగి. రెండవరోజు సంక్రాంతి, మూడవరోజు కనుమ. భోగినాడు పాత కలప, కొయ్య వస్తువులు, విరిగిన చెక్కసామగ్రి, పిడకలు తదితరాలను వేసి భోగిమంటలు వేయడం ఆచారం. కొన్ని చోట్ల ఊరు ఊరంతా కలసి ఒకేచోట పెద్దఎత్తున భోగిమంటలు వేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే భోగినాడు వేసే మంటల వల్ల వాతావరణంలోని క్రిమికీటకాలు, రానున్న కాలంలో సంభవించబోయే అరిష్టాలు నశిస్తాయంటారు. భోగిమంటలు వేసిన తర్వాత మాడుకు నువ్వులనూనె అంటుకుని కుంకుడురసంతో రుద్దుకుని వేడినీటితో తలస్నానం చేయాలి.

తర్వాత పిడకల దాలి మీద ఎర్రగా కాచిన పాలు, కొత్తబియ్యం, బెల్లం కలిపి పులగం లేదా పొంగలి వండి, సూర్యునికి, ఇంద్రునికి నైవేద్యం పెట్టి, ప్రసాదంగా స్వీకరించాలి’’ అదే ఇందాక నేను పెట్టింది. అంటూ వివరించింది అనసూమయ్మ. నానమ్మ చెప్పినట్లుగా సాయంత్రం ‘మా తమ్ముడికి భోగిపళ్లు పోస్తున్నాం, మా ఇంటికి తప్పకుండా రండి’ అంటూ కుంకుమ భరిణ పట్టుకుని చుట్టుపక్కల తెలిసిన వాళ్లందరి ఇళ్లకీ వెళ్లి బొట్టుపెట్టి చెప్పి వచ్చింది సుష్మ. ఇంతలో సాయంత్రం రానే వచ్చింది. కొత్తబట్టలు తొడుక్కున్న బాబిగాడిని కుర్చీలో కూర్చోబెట్టి, బొట్టుపెట్టి, హారతి ఇచ్చింది నానమ్మ. రేగుపళ్లు, చిల్లర పైసలు, చెరుకుముక్కలు, బంతిపూల రెక్కలు కలిపి తమ్ముడి తలచుట్టూ తిప్పి మూడుసార్లు వాడి తలపై పోసింది అమ్మ. పేరంటానికి వచ్చిన వాళ్లందరూ కూడా అలానే చేశారు.

అందరి కాళ్లకూ పసుపు పూయటం, నుదుట కుంకుమ బొట్టుపెట్టి, అరిశ, సెనగలు, పండ్లు, తమలపాకులు పెట్టిన కవర్ చేతికిస్తున్న సుష్మ తన తలమీదినుంచి జారిన రేగుపండ్లను ఒక్కొక్కటి ఏరి నోట్లో వేసుకుని చప్పరిస్తున్న బాబిగాణ్ని వారించబోతున్న సుష్మను అమ్మ వచ్చి‘‘సుష్మా! లే! ఏమిటలా కూర్చునే నిద్రపోతున్నావ్?’’ అని ఒక్క కుదుపు కుదపడంతో మెలకువ వచ్చేసింది. నానమ్మ చెప్పినదంతా ఆసక్తిగా వింటూనే తను కలకనింది కాబోలుననుకుంటూ సిగ్గుపడి లేచింది సుష్మ. తను కలలో చూసినట్లుగా సాయంత్రం పేరంటానికి కొత్తబట్టలు కట్టుకుని ముస్తాబు మొదలుపెట్టింది. 

కాలీఫ్లవర్‌తో క్యాన్సర్ దూరం (మంచి కూర)



మీకు క్యాన్సర్‌ను నిరోధించుకోవాలని ఉందా...? అయితే కాలీఫ్లవర్‌ను మీ రెగ్యులర్ డైట్‌లో భాగం చేసుకోండి. ఎందుకంటే... ఇందులో ఉండే సల్ఫోరాఫేన్, ఇండోల్-3-కార్బినాల్ అనే రెండు ప్రధాన పోషకాలు క్యాన్సర్‌ను నిరోధిస్తాయి. ఈ క్యాన్సర్ నిరోధం కూడా ఒక చర్యలో కాకుండా... రెండు రకాలుగా జరుగుతుంది. మొదటిది... ఈ పోషకాలు క్యాన్సర్ వచ్చేందుకు దోహదపడే కారకాలను నిరోధిస్తాయి.

రెండోది శరీరంలోని విషపదార్థాల (టాక్సిన్స్)ను, క్యాన్సర్‌కు కారణమయ్యే పదార్థాల (కార్సినోజెన్స్)ను తొలగించడానికి దోహదపడే ఎంజైములను ఎక్కువగా స్రవింపజేస్తాయి. పైగా కార్సినోజెన్స్‌ను కణంలోకి ప్రవేశించకముందే వాటిని ఎదుర్కొంటాయి. కాబట్టి క్యాన్సర్‌నుంచి రక్షణ పొందాలని భావించే అందరూ కాలీఫ్లవర్‌ను తమ భోజనంలో ఎక్కువగా ఉండేలా చూసుకోవడం మంచిదంటున్నారు ఆహార నిపుణులు. కాలీఫ్లవర్ ఎక్కువగా తినేవారిలో రొమ్ము, ప్రోస్టేట్ క్యాన్సర్‌లు తక్కువ.

నారింజతో గుండెకు మేలు (మంచి పండు)



నారింజలో కొవ్వులూ, కొలెస్ట్రాల్ ఏమాత్రం ఉండవు. పైగా వ్యాధి నిరోధకతను కలిగించే విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. (వంద గ్రాముల బరువున్న పండులో 53.2 మి.గ్రా. విటమిన్ సి లభ్యమవుతుంది.) కాబట్టి ఇది గుండెకు ఎంతో మేలు చేస్తుంది. దీనికితోడు ఇందులో పీచు (డయటరీ ఫైబర్) పదార్థమైన పెక్టిన్ చాలా ఎక్కువ. ఈ పెక్టిన్ త్వరగా కడుపు నిండేలా చేయడం, కడుపును శుభ్రపరచడం, ఉదయాన్నే విరేచనం సాఫీగా జరిగేలా చూడటంతో పాటు బరువు పెరగకుండా చేస్తుంది. పైగా పెద్దపేగులో క్యాన్సర్‌ను నిరోధించే గుణం కూడా నారింజకు ఉంది. నారింజలో పొటాషియమ్, క్యాల్షియమ్ కూడా ఉన్నందున ఇవి రక్తపోటును నియంత్రణలో ఉంచడంతో పాటు రక్తప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తాయి. ఈ అంశం కూడా గుండెకు మేలు చేసేదే.

హెల్తీ బేబీ కావాలా? ఈ పనులు వద్దు (ప్రెగ్నెన్సీ ప్లానింగ్)



ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న తర్వాత మహిళలు అంతకుమునుపు ఆహారం ఎలా తీసుకున్నా అప్పట్నుంచి మాత్రం తినే పదార్థాల్లో ఉప్పు, చక్కెర, మసాలాలు, నూనెలు తక్కువగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.

ప్లానింగ్ టైమ్‌లో పురుషులు లాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకుని పనిచేయడం లేదా మొబైల్‌ను ప్యాంట్‌జేబులో ఉంచుకోవడం చేయకూడదు. (ఇవి స్పెర్మ్ నాణ్యతను దెబ్బతీస్తాయనే అంశం ఇంకా నిర్ధారణ కాలేదు. కాబట్టి ఆ విషయంలో ఆందోళన వద్దు. అయితే స్పెర్మ్ నాణ్యత బాగుండటం కోసం ప్రకృతి శుక్రకణాల ఉత్పత్తి జరిగే చోటుని శరీర ఉష్ణోగ్రతకు దూరంగా ఉంచడం కోసం శరీరం నుంచి దూరంగా వృషణాల సంచిలో ఉంచింది. అక్కడ ఉష్ణోగ్రత పెరిగేలా ల్యాప్‌టాప్‌తో పనిచేయడం వల్ల వీర్యకణాల ఉత్పత్తి తగ్గిపోవడం లేదా అవి మందకొడిగా మారే అవకాశం ఉంటుంది కాబట్టే ఈ జాగ్రత్త).

గర్భధారణ వేగంగా జరగడానికి అంటూ పల్లెటూళ్లలో ఇచ్చే నాటుమందులనూ, హెర్బల్ మందులంటూ లభ్యమయ్యే పొడుల వంటి వాటిని ఎట్టిపరిస్థితుల్లోనూ వాడకూడదు. ఇలాంటివి ప్రత్యుత్పత్తి వ్యవస్థను దెబ్బతీయవచ్చు.

సోయా ఉత్పాదనలు, టోఫూ వంటి వాటిని ఎక్కువగా తీసుకోకూడదు.

ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న తర్వాత దంపతుల్దిరూ మద్యపానం, పొగతాగడం వంటి అలవాట్లకు పూర్తిగా దూరంగా ఉండాలి. టీ, కాఫీ వంటి పానీయాలను పరిమితంగా తీసుకోవాలి.

ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న తర్వాత తొలినాళ్లలోనే గర్భధారణ జరగకపోతే అంతలోనే నిరాశ వద్దు. కనీసం ఏడాదిపాటైనా ప్రయత్నించాక కూడా గర్భం రాకపోతే అప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి. 

భర్తకు ఆమె... తోడు - నీడ(పురాణ స్త్రీలు - ఛాయ)



ఛాయ నడవడిక సూర్యుణ్ణి ఆకట్టుకుంటుంది. తల్లి, భార్య, గృహిణి బాధ్యతలను ఆమె నిర్వర్తిస్తున్న తీరుకు మురిసిపోతాడు. తాను ఆస్తమించిన నిశివేళ లోకపాలన వ్యవహారాలను ఛాయకే అప్పగిస్తాడు. 

ఈ భూమ్మీద జన్మించాలని ఆమె ఎన్నడూ కోరుకోలేదు. జన్మిస్తానని భావించనూ లేదు. ప్రచండ పురుషుడు సూర్యభగవానుని జీవితభాగస్వామిగా బతుకు గడపాల్సి వస్తుందని ఊహించనూ లేదు. అంతా కాకతాళీయంగా జరిగింది. అయినప్పటికీ సంసారధర్మాన్ని మీరలేదు ఛాయ. భర్త, పిల్లలు అకారణంగా మెడకు చుట్టుకున్నారన్న వితర్కానికి దిగలేదు. తన జన్మకు కారణమైన సంజ్ఞాదేవిపై ఆగ్రహం చూపించలేదు. దైవవశాత్తూ ఎదురైన ఘటనలన్నింటినీ ధర్మయుక్తంగానే పరిష్కరించుకున్నది ఛాయ.

చండభానుడి తొలిభార్య సంజ్ఞాదేవి. భాస్కరునితో కాపురం నిప్పులతో సహవాసమే. కొలిమిలాంటి పెనిమిటితో యముడు, యమునలను కన్నది. ఇక తాళలేక ఆయనకుదూరంగా జరిగిపోవాలని నిర్ణయించుకుంది. ఇందుకుగాను కట్టుదిట్టంగా పథకం రూపొందించింది. తన ఛాయను నిలువెత్తు ప్రతిమగా తీర్చింది. ఆ నీడ బొమ్మ అచ్చం తనలాగే ఉండేలా చూసుకుంది. దానికి ప్రాణం పోసింది. అలా ఛాయాదేవి అయోనిజగా, అసహజంగా జన్మనెత్తింది. ఛాయకు తన వృత్తాంతమంతా చెప్పి సూర్యునితో కాపురానికి పంపింది సంజ్ఞాదేవి. ఈ రహస్యాన్ని అప్పుడే బట్టబయలు కానివ్వవద్దని బతిమాలి, తనదోవన తాను వెళ్లిపోయింది.

ఛాయ పరిస్థితి అగమ్యగోచరమైంది. భగభగమండే భర్తను భరించలేక వెళ్లిపోయిన ఒకానొక భార్య స్థానంలో విధులు నిర్వహించాలి. సంజ్ఞ బిడ్డలిద్దరినీ తన బిడ్డలుగా చూసుకోవాలి. అలా ఆ సంసారాన్ని లాక్కురావాలన్నమాట. ఇదంతా లలాటలిఖితమని మొక్కవోని ధైర్యంతోముందుకు నడిచింది. సంజ్ఞాదేవిస్థానంలో మసలుతూవచ్చింది.

సవిత్రునికి ఇవేమీ తెలియవు. ఛాయతో వైవాహిక జీవితాన్ని పంచుకున్నాడు. వారికి శని, సావర్ణి పుట్టారు. ఒకవైపు స్వంతబిడ్డలు, మరోవైపు సంజ్ఞ పిల్లలు యముడు, యమునల పెంపకం ఛాయమీదనే పడ్డాయి. తరతమ భేదాల్లేకుండా నలుగురు బిడ్డలనూ సాకుతూ వచ్చింది. సంజ్ఞాదేవికి ఇచ్చిన మాట ప్రకారం తను ఛాయ అనే సంగతిని ఆదిత్యునికి తెలియనివ్వకుండా గృహస్థాశ్రమాన్ని నిర్వహిస్తూ వచ్చింది. ఇంటిని నడపగల ఇల్లాలు ప్రపంచాన్నీ నడిపించగలదన్న నమ్మకంతో ఉంటాడు సూర్యుడు.

ఇలాంటి వేళ అనుకోని అవాంతరం వచ్చిపడుతుంది. సంజ్ఞాసుతుడు యముడు ఛాయపై ద్వేషం పెంచుకుంటాడు. ఆమె తనను తక్కువగా చూస్తోందని జనకునికి విన్నవిస్తాడు. సూర్యుడు ఈ పిల్లాడి మాటలను పట్టించుకోడు. కోపోద్రిక్తుడైన యముడు ఛాయను పాదంతో తన్నబోతాడు. మాతృబంధానికి మచ్చ తెచ్చేలా ప్రవర్తిస్తాడు. వెనువెంటనే ఆతని కాలు ఊడి కింద పడుతుంది. యముని ధర్మాధర్మాలనూ విచారించగల ధర్మమూర్తిగా ఛాయ ఆ సమయాన లోకపూజిత అవుతుంది. సూర్యుడు కుమారరత్నాన్ని ఊరడించి సమస్యకు పరిష్కారంగా పాదం శిధిలమయ్యాక కొత్తది పుట్టుకువస్తుందని భరోసాఇస్తాడు.

అప్పుడు ఛాయాదేవి నిజానిజాలను వెల్లడిస్తుంది. ఏ విషయాన్నయినా ఎప్పుడు గోప్యంగా ఉంచాలో, మరెప్పుడు బహిర్గతం చేయాలో తెలిసిన ప్రాప్తకాలజ్ఞత ఆమెకే సొంతం. ఛాయాదేవి అసలు కథ తెలుసుకున్న భాస్కరుడు తెప్పరిల్లుతాడు. ఆమెకు కృతజ్ఞతలు చెబుతాడు. సంజ్ఞాదేవి కోసం వెతుకులాడి ఆమెను తిరిగి తనదానిగా చేసుకుంటాడు. సంజ్ఞాపుత్రుడు యముడు ఛాయమ్మ ఔదార్యాన్ని, సహృదయాన్ని అర్థం చేసుకుంటాడు. ఫలితంగా ఒకానొక గొప్ప అధికారాన్ని ఆమెకు కట్టబెడతాడు. ప్రాణికోటి నిదురించేవేళ ఛాయ కనబడదు. పరుండిన వారిని వెన్నంటి నీడ నిలువలేదు. ఆ సమయంలో ప్రాణుల పాపకర్మలను స్వయంగా తనకు తెలియజేసే మహదవకాశాన్ని ఛాయకు కల్పిస్తాడు. సకల ప్రాణుల కర్మఫలాలను నిర్ణయించే శనిదేవుని తల్లిగా, భావి మనువుగా ఎందరో పెద్దలు గణన చేసిన సావర్ణి మాతృదేవతగా ఛాయ వినుతికెక్కుతుంది.

- డా. చింతకింది శ్రీనివాసరావు

హెల్దీ థర్టీన్...


కొత్త ఏడాది అనగానే ఎన్నో నిర్ణయాలు. ‘న్యూ ఇయర్ రెజల్యూషన్స్’గా ఎన్నో ఆరోగ్యకరమైన అలవాట్లకు శ్రీకారాలు. మరెన్నో అనారోగ్య కారకాలకు తిలోదకాలు. ఇది సహజం. ఈ కొత్త సంవత్సరం 2013లో ఎలాంటి నిర్ణయాలు ఆరోగ్యాన్నిస్తాయో తెలియజేయడం కోసం ఉపయోగపడే ఈ కథనంలో ‘పదమూడు’ ఆరోగ్యకరమైన అంశాలను పొందుపరుస్తున్నాం. వాటిని పాటించిన ఏ కొందరైనా ఏడాది చివరివరకూ కొనసాగిస్తే... అంతకంటే ఆరోగ్యమేముంది!



1)
మంచి ఆహారమే తీసుకోండి...
ఆహారంలో ఆరోగ్యానికి మేలు చేసేవి ఎక్కువగా తీసుకుంటూ, అనారోగ్యానికి దోహదం చేసేవాటిని పరిమితంగా తీసుకుంటూ ఉండటం మంచిది. మన ప్రధాన ఆహారమైన బియ్యం విషయానికి వస్తే దంపుడుబియ్యం, ఇతర ధాన్యాల్లో పొట్టుతీయని ముడి ధాన్యాలు తీసుకోవాలి. అలాగే కూరల విషయంలో ఆకుపచ్చగా ఉండే ఆకుకూరలు (గ్రీన్ లీఫీ వెజిటబుల్స్) మంచివి. ఇక మాంసాహారంలో చేపలు చాలా మంచి ఆహారం.

అయితే మాంసాహారం తీసుకునేవారు ప్రోటీన్‌ల కోసం రెడ్ మీట్ కంటే కొవ్వు తక్కువగా ఉండే చికెన్ వంటి వైట్ మీట్ తీసుకోవడం మంచిదని గుర్తుంచుకోండి. అరటి, నారింజ వంటి అన్నిరకాల తాజా పండ్లలో అన్నిరకాల విటమిన్లతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. వాటితో పాటు పీచు ఎక్కువగా ఉండే జామ, బొప్పాయి, పుచ్చకాయ వంటి పండ్లు, బాదం వంటి డ్రైఫ్రూట్స్ తీసుకోవాలని నిర్ణయించుకోండి.

మేలు చేయనివి: కాఫీ, టీ, శీతలపానీయాలు, కోలా డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్... వీటిల్లో కెఫిన్ పాళ్లు ఎక్కువ. చాక్లెట్లు, సోడా డ్రింక్స్ వంటి వాటిల్లో హానికరమైన చక్కెరపాళ్లు ఎక్కువ. అలాగే బేకరీ ఫుడ్స్, పిజ్జా, బర్గర్‌ల వంటి ప్రాసెస్‌డ్ ఆహారాల్లో పోషకాలు తక్కువ, హానికరమైన అంశాలు ఎక్కువ. నూనె పదార్థాలు, వేపుళ్లు, చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు ఉపయోగించే మార్జరిన్ నూనెల్లో ట్రాన్స్-ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ. ఇవి రక్తంలో కొవ్వుపాళ్లను పెంచుతాయి. చర్మంపై మొటిమలు వచ్చేలా చేస్తాయి. కాబట్టి వీటిని పరిహరించాలి. వాటిని పూర్తిగా మానివేయడం సాధ్యం కాకపోతే చాలా పరిమితంగానే తీసుకోవాలి.


2)
నిద్ర విషయంలో...
కొత్త ఏడాది పార్టీలతో వచ్చే అనర్థాల్లో మరో ముఖ్యమైనది నిద్రలేమి. వేడుకలు, విందు వినోదాల్లో భాగంగా అర్ధరాత్రి వరకు మెలకువతో ఉండటం వల్ల శరీరానికి అవసరమైన నిద్ర సమకూరదు. దాంతో అనేక సమస్యలు వస్తాయి.

నిద్రలేమి వల్ల... మతిమరపు మెదడు ఎదుగుదలలో లోపం సాధారణ ఎదుగుదలలో లోపం అధిక రక్తపోటు గుండెజబ్బులు స్థూలకాయం డయాబెటిస్ జీర్ణకోశ సమస్యలు రోగనిరోధక శక్తి తగ్గడం గాయాలు మానే ప్రక్రియ ఆలస్యం కావడం వంటి అనేక అనర్థాలతో పాటు శరీరంలోని అన్ని వ్యవస్థలూ దెబ్బతింటాయి. ఇవేగాక నిద్రలేమి వల్ల గుండెజబ్బులు వచ్చే అవకాశాలు 80 శాతం పెరుగుతాయని కొన్ని అధ్యయనాలలో తేలింది.

కాబట్టి ఈ కొత్త ఏడాదిలో వేళకు నిద్రపోవడం, పెందరాళే నిద్రలేవడం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లు చేసుకుంటే అనేక అనారోగ్యాలను ముందు నుంచే నివారించవచ్చు.




3)
ఆరుబయట సూర్యకాంతిలో...
మన లేట్‌నైట్ పార్టీ వేడుకల వల్ల జరిగే అనర్థాలలో మరో ముఖ్యమైనది పెందరాళే నిద్రలేవలేకపోవడం. దాంతో మనం అందమైన సూర్యోదయాలను మిస్ అవుతాం. శరీరానికి సూర్యరశ్మి తగలకపోవడం వల్ల ఎంతో విలువైన విటమిన్-డిని కోల్పోతాం. దాంతో ఎముకల వ్యాధులైన... రికెట్స్, ఆస్టోమలేసియా వంటివి రావచ్చు. ఈ వైటమిన్ లోపం పారాథైరాయిడ్ గ్రంథి సక్రమంగా పనిచేయకపోతే ఒక్కోసారి ఫిట్స్/కన్వల్షన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. అందుకే కొత్త ఏడాది నిర్ణయాలలో పెందరాళే నిద్రలేచి ఆరుబయట సూర్యకాంతిలో నడవాలనే అంశానికి తగినంత ప్రాధాన్యం ఇవ్వండి.




4)
ఐరన్‌పాళ్లు పెంచుకోండి
మన దేశంలో 85 శాతం మహిళలకు రక్తహీనత ఉంటుందని అంచనా. అందువల్ల మన ఆహారంలో ఐరన్ ఎక్కువగా ఉండే పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవడం ఈ ఏడాది నిర్ణయాలలో ఉండాల్సిందే. మీరు మహిళ అయితే ఈ తీర్మానం తప్పనిసరి.

మనలో ఐరన్‌పాళ్లు పెరగాలంటే మాంసాహారులైతే చికెన్, వేటవూంసం, చేపలు, వూంసాహారంలోని లివర్ తీసుకోవాలి. శాకాహారులైతే తాజా ఆకుపచ్చటి ఆకుకూరలు(గ్రీన్ లీఫీ వెజిటబుల్స్), ఎండుఖర్జూరం, గసగసాలు, అటుకులు వంటి పదార్థాలు తీసుకోవడం వల్ల శరీరానికి కావలసిన ఐరన్ దొరుకుతుందని గుర్తుంచుకోండి.



5)
గుండె పదిలంగా ఉండాలంటే
మన గుండె ఆరోగ్యం పదిలంగా ఉంచుకోడానికి చేసే ప్రయత్నాలన్నీ మన సాధారణ ఆరోగ్యం (జనరల్ హెల్త్) కోసం కూడా ఉపయోగపడతాయి. అవి.. రోజూ ఆటలాడటం... దీనివల్ల మనలో సంతోషం కలిగించే ఎండార్ఫిన్స్ వంటి రసాయనాలు స్రవించి అవి ఆరోగ్యంగా ఉంచుతాయి రక్తదానం... మీకు రక్తదానం చేసే అలవాటు ఉంటే... ప్రతి మూడు నుంచి ఆరు నెలలకోమారు ఆ మంచిపని చేస్తే అది గుండెకు ఎంతో మంచిది.

వ్యాయామం గుండెకు మేలు చేస్తుందని గుర్తుంచుకోండి. వ్యాయామాలన్నింటిలోనూ నడక మంచిది. మొదటి రోజున 20 నిమిషాలతో మొదలు పెట్టి, ఆ వ్యవధిని క్రమంగా పెంచుకుంటూపోతూ రోజూ కనీసం 45 నిమిషాలు బ్రిస్క్ వాకింగ్ చేసే స్థాయికి చేరుకోవాలి. ఇలా వారంలో కనీసం 5 రోజులైనా వాకింగ్ చేయడం గుండెకు మేలు చేస్తుందనే విషయాన్ని మరచిపోకండి. కాబట్టి కొత్త ఏడాది నిర్ణయంగా ఈ రోజే వాకింగ్ మొదలుపెట్టండి.



6)
హైపర్ టెన్షన్‌తో జాగ్రత్త
ప్రవహించాల్సిన వేగం కంటే ఎక్కువ ఒత్తిడితో రక్తం ప్రవహించడాన్ని రక్తపోటు /హైబీపీ/ హైపర్‌టెన్షన్ అని చెప్పవచ్చు. సాధారణ రక్తపోటు 120-130 / 70-90 ఎంఎం హెచ్‌జిగా ఉండాలి. ఇంతకు మించి ఉంటే ప్రమాదం అని గుర్తించాలి. రక్తపోటు కారణంగా కళ్లు, మెదడు, గుండె, మూత్రపిండాలు... ఇలా శరీరంలోని ఏ భాగమైనా దెబ్బతినవచ్చు. ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితులను నివారించడం కోసం ఆహారంలో ఉప్పు తగ్గించుకోవడం, పొటాషియం ఎక్కువగా ఉండే అరటి పండు వంటివి తినడం లాంటి మంచి అలవాట్లు చేసుకోండి.




7)
డయాబెటిస్ ఉంటే పరాకు వద్దు
శరీరంలోని ఏ అవయవాన్నైనా దెబ్బతీసి ప్రమాదకరమైన పరిస్థితిలోకి నెట్టే జబ్బు డయాబెటిస్. ఒక్క డయాబెటిస్ ఉందంటే అది పది రోగాల పెట్టు అని గుర్తెరిగి జాగ్రత్త వహించండి. గతంలో ఎలా ఉన్నా... ఈ ఏడాదిలో ముందు నుంచే ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటిస్తూ, వ్యాయామం చేస్తూ, చక్కెరను ఎప్పుడూ నియంత్రణలో ఉంచుకుంటూ ఉండటం మరవకండి. చక్కెరవ్యాధి ఉన్నవారు ప్రతి మూడు నెలలకు కనీసం ఒకసారి హెచ్‌బీ1 ఏసీ అనే పరీక్ష చేయించుకుంటూ చక్కెరపాళ్లు ఎప్పుడైనా పెరుగుతున్నాయా లేక ఒకేలా ఉంటున్నాయా అన్నది పరీక్షించుకుంటూ ఉండండి.

8)
కొవ్వు పాళ్లు సరిగా ఉన్నాయేమో చూసుకోండి
కొవ్వు వల్ల ఎప్పుడూ హానే జరుగుతుందని మనలో చాలామందికి ఒక అపోహ. కానీ అది వాస్తవం కాదు. నిజానికి మనలోని అనేక జీవక్రియల నిర్వహణకు కొవ్వు కావాల్సిందే. ఎందుకంటే కొన్నిరకాల విటమిన్లు కేవలం కొవ్వులోనే కరుగుతాయి. అందుకే కొవ్వులు తగినంతగా లేకపోవడం కూడా అనారోగ్యాన్ని తెచ్చిపెడుతుంది. ఆరోగ్యస్పృహ ఎక్కువైన కొందరు నూనెలను / కొవ్వులను అదేపనిగా పరిహరిస్తుంటారు. దాంతో కొవ్వు తగ్గడం వల్ల వచ్చే అనర్థాలు ఎదురవుతాయి. ఇలాంటి కండిషన్‌ను ‘డిస్‌లిపిడేమియా’ అంటారు.

డిస్ లిపిడేమియా అంటే శరీరంలో కొవ్వు పాళ్లు ఉండాల్సినంత లేకపోవడం అన్నమాట. కొవ్వులను ఆరోగ్యకరమైన పాళ్లలో తీసుకుంటూనే గుండెపోటును నివారించడానికి తమ రక్తంలో మంచి కొలెస్ట్రాల్ పాళ్లు 40కి పైన, చెడు కొలెస్ట్రాల్ పాళ్లు 80లోపు, ట్రైగ్లిజరైడ్స్ పాళ్లు (టిజిఎల్) 150లోపు ఉండేలా చూసుకోవాలి.



9)
ఒత్తిడి అనర్థాలను అధిగమించండి
మన దైనందిన జీవితంలో ఒత్తిడిని అనుభవించనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్నిసార్లు పరిమితమైన ఒత్తిడి వల్ల కొంత ప్రయోజనం ఉన్నప్పటికీ చాలా సందర్భాల్లో మితిమీరిన ఒత్తిడి వల్ల అనర్థాలే ఎక్కువ. ఆందోళన నుంచి ఉపశమనానికి పొగతాగడం, మద్యం తీసుకోవటం వంటివి చేస్తుంటారు.

ఇది మరింత అనర్థదాయకం. ఒత్తిడిని అధిగమించడం కోసం రోజూ యోగా, ఆటలు, ధ్యానం, ఇష్టమైన వ్యాపకాలు, హాబీలను పెంపొందించుకోవడం... వంటివి చేయాలనే నిర్ణయం తీసుకోండి.



10)
పొగాకును వదిలేయండి
ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మరణాలు పొగతాగడం వల్లనే సంభవిస్తున్నాయనడం అతిశయోక్తి కాదు. పొగాకులో ఉండే విషపదార్థాలు రక్తంలో కలవటమే హార్‌్ణఫెయిల్‌కు ప్రధాన కారణం. పొగతాగేవారు తమకు చేటు చేసుకోవడంతో పాటు పక్కవారి అనారోగ్యానికీ కారణమవుతున్నారు. అందుకే అనేక అనర్థాలకు మూలమైన ఈ అలవాటును ఈ ఏడాది తక్షణం వదిలేయండి. మళ్లీ ఎప్పుడూ మొదలుపెట్టకండి.




11)
మద్యంతో ముప్పే!
చాలా కొద్దిమోతాదుల్లో తీసుకునే ఆల్కహాల్ గుండెకు మంచిదని, అది కొలెస్ట్రాల్‌ను కరిగిస్తుందని చాలామంది అపోహ పడుతుంటారు. కొద్ది మోతాదులో రెడ్ వైన్‌లాంటి డ్రింక్ వల్ల కొంచెం మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) పెరగవచ్చు. కానీ ఆల్కహాల్‌లో ఉండే పదార్థాలు దానికి బానిసయ్యేలా చేస్తాయి.

ఈ కారణంగా మద్యం తాగటం మొదలు పెట్టిన కొన్నాళ్ల తరువాత ఆల్కహాలు మోతాదును పెంచుకుంటూపోతారు. దాంతో అనేక సామాజిక, మానసిక, అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ఆల్కహాల్ అన్నివేళలా ఆరోగ్యానికి అనర్థదాయకమే అని గుర్తుంచుకుని ఈ ఏడాది ఆ అలవాటుకు స్వస్తి చెప్పండి.


12)
పాజిటివ్ దృక్పథంతో ఉండండి
మన రోజువారీ వ్యవహారాల్లో సానుకూల దృక్పథం (పాజిటివ్ ఆటిట్యూడ్)తో ఉండటం వల్ల ఆరోగ్యంపై కూడా మంచి ప్రభావం ఉంటుందన్న విషయం అనేక సందర్భాల్లో తేలిన సత్యం. యువరాజ్‌సింగ్‌కు క్యాన్సర్ నయం కావడానికి సానుకూల దృక్పథం ఎంతగా తోడ్పడిందో మనందరికీ తెలిసిన విషయమేకదా! అందుకే ఈ ఏడాదంతా పాజిటివ్‌గా ఉండండి. పాజిటివ్ ఫలితాలు పొందండి.

13)
బరువు పెరుగుతున్నారా... అప్రమత్తంగా ఉండండి
కొత్త సంవత్సరం వేడుకలలో భాగంగా ఈ నెలంతా పార్టీలు జరుగుతూనే ఉంటాయి. దీనికితోడు ఇటీవల మన ఆహారపు అలవాట్లలోనూ, జీవనశైలిలోనూ పాశ్చాత్యధోరణులు కనిపిస్తున్నాయి. దాంతో బరువు పెరగడం అన్నది చాలా రొటీన్ సమస్యగా మారింది. ఇలా పెరిగే బరువు ఎన్నో అనర్థాలను తెచ్చిపెడుతుంది.

అవి... డయాబెటిస్ పీసీఓడీ (పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్) హైబీపీ ఆర్థరైటిస్ గుండెజబ్బులు సంతానలోపం, అంగస్తంభన లోపాలు హైకొలెస్ట్రాల్ మహిళల్లో హార్మోనల్ మార్పులు రుతుక్రమంలో మార్పులు, ముఖంపై అవాంఛిత రోమాలు, మొటిమలు రావడం జీర్ణక్రియ మందగించడం మానసిక సమస్యలు మూత్ర సంబంధమైన (యూరినరీ ట్రాక్ట్) ఇన్ఫెక్షన్స్ మలబద్దకం గ్యాస్ట్రయిటిస్, అసిడిటీ ఛాతీలో మంటగా ఉండటం వాంతులు కావడం డయేరియా నడుము నొప్పి రావడం.

మనలోని ఒబెసిటీనీ గుర్తించడం ఎలా: మన బరువు మామూలుగానే ఉందా లేక అనారోగ్యాన్ని తెచ్చిపెట్టేంతగా పెరిగిందా అని తెలుసుకునేందుకు ఒక సూచిక అందుబాటులో ఉంది. అదే బాడీ మాస్ ఇండెక్స్.

బీఎంఐ (బాడీ మాస్ ఇండెక్స్) పద్ధతితో కిలోగ్రాముల్లో మీ బరువును తీసుకుని, దాన్ని మీటర్లలో మీ ఎత్తు స్క్వేర్‌తో భాగించండి. వచ్చిన ఆ విలువను బట్టి మీరు ఉండాల్సినంత బరువు ఉన్నారా లేక ఎక్కువగా ఉన్నారా అన్న విషయాన్ని తెలుసుకోవచ్చు. ఆ విలువ 18.5 కంటే తక్కువ ఉంటే మీరు తక్కువ బరువు ఉన్నట్లు 18.5 నుంచి 24.99 ఉంటే మీ ఎత్తుకు తగిన బరువు ఉన్నట్లు.
25 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే మీరు లావుగా ఉన్నట్లే!
25 నుంచి 29 ఉంటే మీరు స్థూలకాయులు (ఒబేస్)
30 నుంచి 34.99 వరకు చాలా స్థూలకాయులు
35 నుంచి 39.99 వరకు అయితే మీలో ఒబేసిటీ పాళ్లు విపరీతమన్నమాట. మీ బీఎంఐ 33 దాటితే సాధారణ వ్యాయామం, ఆహార మార్పుల వంటి జీవనశైలిలో మార్పులతోనే సన్నబడటం కష్టమై, సర్జరీ వరకు వెళ్లాల్సి రావచ్చు. కాబట్టి బీఎంఐ ఆ స్థాయికి చేరకుండా ముందునుంచే జాగ్రత్త వహించాలి.

నిర్వహణ: యాసీన్

జుట్టు రాలుతోంది... ఏం చేయాలి?(డాక్టర్‌ని అడగండి - ప్లాస్టిక్ సర్జరీ)



నా వయసు 32 ఏళ్లు. గత మూడేళ్లుగా జుట్టు ఎక్కువగా రాలిపోతోంది. నా జుట్టు ఎంతగా పలచబడిందంటే తలపై మాడు కూడా కనిపిస్తోంది. మార్కెట్‌లో దొరికేవి, టీవీలో చూపించినవి రకరకాల నూనెలు ప్రయత్నించాను. కానీ ప్రయోజనం లేదు. మళ్లీ మునపటిలా జుట్టు పెరగాలంటే ఏం చేయాలో చెప్పండి.
- ఝాన్సీరాణి, జగ్గయ్యపేట 


ఇటీవల జుట్టు రాలుతోందంటూ ఫిర్యాదులు చాలా ఎక్కువగా వస్తున్నాయి. జుట్టు రాలడానికి అనేక కారణాలుంటాయి. ఉదాహరణకు థైరాయిడ్ సమస్య, రక్తహీనత వంటివి. అందుకే ఇలాంటి ఫిర్యాదు ఉన్నవారి విషయంలో జుట్టు రాలిపోడానికి కారణాలు ఏమిటో తెలుసుకోవడం అవసరం. కాబట్టి ముందుగా మీరు రక్త పరీక్ష చేయించుకోండి. థైరాయిడ్‌కు సంబంధించిన లోపం గానీ, రక్తహీనత (అనీమియా)గాని ఏదైనా ఉందేమో తెలుసుకోండి. ఆ ఫలితాల తర్వాత కారణాన్ని బట్టి జుట్టు రాలడాన్ని అరికట్టడానికి చాలా అవకాశాలు ఉన్నాయి.

మన దేశ మహిళల్లో జుట్టు రాలడానికి థైరాయిడ్ లోపం లేదా అనీమియాలే ప్రధాన కారణాలు. ఇలాంటి సమస్యలు ఏమీ లేకపోతే అప్పుడు వంశపారంపర్యంగానే జుట్టు రాలిపోతుందని అనుకోవచ్చు. కారణాన్ని కనుగొని దాన్ని అనుసరించి చికిత్స ప్రక్రియ నిర్ణయించవచ్చు. ఒకవేళ మీకు ఉన్న జుట్టు మాడు కనిపించేంతగా పలచబారితే అప్పుడు హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అవసరమేమో అని కూడా ఆలోచించాల్సి ఉంటుంది. కాబట్టి ముందుగా మీరు డర్మటాలజిస్ట్‌ను కలిసి మీ విషయంలో సమస్య ఏమిటో తెలుసుకోండి.

నా బరువు 102 కిలోలు. తలవైపున, కాళ్లవైపున సన్నగానూ, మధ్య భాగమంతా చాలా లావుగా ఉండి అందవికారంగా కనిపిస్తుంటాను. ఇది నాలో ఆత్మన్యూనతను కలిగిస్తోంది. లైపోసక్షన్ సహాయంతో నా బరువు తగ్గించుకోవడం సాధ్యమేనా? ఒక్క సెషన్‌లోనే అదనపు బరువంతటినీ తొలగించుకోవచ్చా?
- స్వామి, గుడివాడ 


లైపోసక్షన్ సహాయంతో బరువు తగ్గించుకోవడం సాధ్యమే. అయితే మీ అదనపు బరువునంతా ఒకే సెషన్‌లో తీసేయాలని కోరుకోవడం మంచిది కాదు. ఎప్పుడైనా ఒక సురక్షితమైన స్థాయి వరకు మాత్రమే కొవ్వును తొలగిస్తారు. మిమ్మల్ని పరీక్షించాక మీ ఎత్తును, మీ బరువును బట్టి మీరు అదనంగా ఎంత బరువు ఉన్నారో చూసి... ఆ తర్వాతే మీ అదనపు బరువును తొలగించడానికి ఎన్ని దఫాల చికిత్స అవసరమో నిర్ణయించి, దాని ప్రకారం అవసరమైన ప్రణాళిక రూపొందిస్తారు.

డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం
ప్లాస్టిక్ సర్జన్, 

ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం


నిత్య సందేశం
సూర్యుడు ఉత్తర దిక్కునకు పయనించే కాలాన్ని ఉత్తరాయణం అంటారు. అయనం అంటే గమనం అని అర్థం. ఇప్పటివరకూ దక్షిణ దిక్కుగా సూర్యుడు నడిచిన కాలం గడిచింది. అంతేకాదు. ఈ కాలం ఉత్ + తర + అయనం అని పెద్దలు శ్రేష్ఠమైన కాలంగా దీన్ని గుర్తించారు. భారతంలో భీష్ముడు యుద్ధంలో దక్షిణాయనంలో నేలకు ఒరిగినా, ఉత్తరాయణ కాలం వచ్చేవరకూ ఉండి ప్రాణాలు వదిలినట్లు భారతం చెబుతోంది. దీనిని బట్టి ఈ ఉత్తరాయణ ప్రాశస్త్యం మరింత చెప్పినట్లు అయ్యింది. అంతేకాదు చాంద్రమానానికీ సౌరమానానికీ సంవత్సర సమన్వయం ఈ మకర సంక్రాంతి వల్ల సిద్ధించడం కూడా మరింత ప్రమాణం కలిగిస్తోంది. అందుకే ఎప్పుడూ మకర సంక్రాంతి జనవరి 14న కానీ, 15 న కాని వస్తుంది.

సౌరమానం ప్రకారం మనకి సంవత్సరానికి 12 సంక్రాంతులు వస్తాయి. అనగా సూర్యుడు మేషము, వృషభము మొదలైన 12 రాశులలో ఒక్కొక్క నెల ప్రవేశించడం మూలంగా ఈ సంక్రాంతులు ఏర్పడతాయి. (చంద్రుని వల్ల చైత్రం మొదలైన మాసాలు ఏర్పడి చాంద్రమాన సంవత్సరం సిద్ధిస్తోంది) ఈ పన్నెండు సంక్రాంతుల్లోనూ మొదటిది మేషం ఏడవది తుల. ఈ రెండు మాస సంక్రాంతులూ రాత్రింబవళ్లు సరిసమానంగా ఉండే కాలం. ఈ రెండు సంక్రాంతుల రోజులలోనూ మనం చేసిన పుణ్యపాపాలు లక్షరెట్లు వృద్ధిపొందుతాయి. ఈ సంక్రాంతులకన్నింటికీ నాయకుడు సూర్యుడు. కనుక ఏది ఇచ్చినా సూర్యుడే ఇస్తాడు. నదులకి పన్నెండు రోజులు పుష్కరాలు ఎంత పుణ్యకాలమో కాలానికి ఈ పన్నెండు సంక్రాంతులూ అంతటి మహత్తరమైనవి. అందుకే

సంక్రాంతాయాని దత్తాని, హవ్యకవ్యాని మానవైః
తేషామిష్టాని సర్వాణి దదాత్యర్కః న సంశయః
అంటోంది ఆర్ష వాఙ్మయం. హవ్యం అంటే అగ్నిహోత్రంలో దేవతలకి సమర్పించే హవిస్సు. కవ్యం అంటే పితృదేవతలకి సమర్పించేది. సంక్రాంతినాడు ఎవరు ఏవేవి దానం చేసినా వారికి సూర్యుడు వారివారి అభీష్టాలను నెరవేరుస్తాడు, ఆరోగ్యభాగ్యాలు కలిగిస్తాడు.

చనిపోయిన వారి పేరు మీదుగా ఈ మకర సంక్రాంతినాడు ఏది దానం చేసినా వారికి తప్పక అందుతుందన్నది ప్రముఖమైన విశ్వాసం. అంతే కాదు... ప్రతి ఒక్కరూ ఈ రోజు తలంటుస్నానం చేయాలి. కొత్త బట్టలు ధరించాలి. కొత్త పంట బియ్యంతో సూర్యునికి పాయసం వండి నివేదించాలి. ప్రతి ఇంటి ముందూ రంగవల్లికలు తీర్చిదిద్దాలి. బీదవారికీ, రైతులకీ అన్నదానం చేయాలి. ఏ పుణ్యం చేసినా కోటిరెట్లు ఫలం కలుగుతుందన్నది మహర్షులు చెప్పిన సత్యం. పాపమూ అంతే. పక్షులూ, పశువులూ మున్నగు ప్రాణులకి కూడా ఆహారం కల్పించాలి. మన సంప్రదాయం ఎప్పుడూ మన ఆనందాన్ని పదిమందితో కలిపి పంచుకోవాలని చెప్పింది. గంగిరెద్దుని మన ఇంటి ముందుకి తెచ్చి ఆడించమని చెప్పాలి. బసవన్నకి మన పాత వస్త్రాలు ఇచ్చినా మంచిదే. ఏదో ఒక పండు నోటికందించి బసవన్న చిరుగంటల ఆశీస్సులు మనం పొందాలి. అదే ఈ పండుగ పరమార్థం.

- డా. ధూళిపాళ మహాదేవమణి

ఆయన రియల్ లైఫ్‌లో గొప్ప హీరో!---సందర్భం - జయంతి



చాలామందికి రావు గోపాలరావు ఒక విలక్షణ నటుడిగానే తెలుసు. కానీ ఆయన ఒక విశిష్ట వ్యక్తి కూడా అని చాలామందికి తెలియదు. ఆయన భార్య కమలకుమారి ప్రఖ్యాత హరికథా కళాకారిణి. ఒకరినొకరు పరస్పరం ఇష్టపడి, ప్రేమించుకున్న తీరు, జీవితకాలంలో భార్యని ఎప్పుడూ ఏకవచనంతో సంబోధించని ఆయన వ్యక్తిత్వం, అవకాశం ఉన్నా పిల్లల కోసం ఏమీ చేసుకోని నిస్వార్థగుణం లాంటి ఉదాహరణలతో ఆయన ఔన్నత్యం గురించి ఆమె గుర్తుచేసుకున్న కొన్ని జ్ఞాపకాలు...

గ్రామ్‌ఫోన్‌లో ‘కీర్తిశేషులు’ నాటకం నడుస్తోంది. ‘మురారి’ పాత్ర ధరించిన నటుడు ఏకధాటిగా డైలాగులు చెప్పుకుంటూ పోతున్నాడు. గంభీరమైన స్వరం! భాష మీద ఎవరికోగానీ చిక్కని పట్టు! పదాలు పలకడంలో స్పష్టత! ఓహ్... వింటుంటే ఒళ్లు పులకరించిపోతోంది.

కాసేపటికి నాటకం ముగిసింది. అంతవరకూ తన్మయత్వంలో ఉన్న నేను ఈ లోకంలోకి వచ్చి, అక్కడున్న వారిని అడిగాను... ‘ఆ మురారి పాత్ర వేసిన మహానుభావుడు ఎవరు’ అని. వాళ్లు ఎదురుగా నిలబడి ఉన్న ఒక వ్యక్తిని చూపించారు... ఆయనే అని. తెల్లని దుస్తులు, చక్కని రూపం, ముఖంలో తేజస్సు... చాలా హుందాగా ఉన్నాడాయన. అదే మొదటిసారి... ఒక మగవాడి చూసి ‘ఆహా, ఎంత బాగున్నాడు’ అనుకోవడం. అలా తొలి చూపులోనే నా మనసులోకి అడుగుపెట్టారు రావు గోపాలరావు.

అప్పట్లో నేను హరికథా గానాలతో బిజీగా ఉండేదాన్ని. ఓసారి పిఠాపురంలో హరికథ చెప్పడానికి వెళ్లాను. ఆ రోజు గోపాలరావు గారి శిష్యుడొకరు నా హరికథ విన్నారు. వెంటనే వాళ్ల నాటక అసోసియేషన్‌కు రమ్మంటూ ఆహ్వానించారు. ఆ ఆహ్వానం వెనుక పెద్ద కారణమే ఉంది. రావుగారు పురాణాల్ని నమ్మేవారు కాదు. ఎప్పుడో ఎవరో రాసిన ఈ పురాణాలనే పట్టుకుని వేళ్లాడటం కరెక్ట్ కాదని, వాటన్నిటినీ కుప్పపోసి తగులబెడితేనే గతంలో బతక్కుండా ముందుకు పోగలమనీ అనేవారట. నేను నా హరికథలో పురాణాలను కాల మాన పరిస్థితులకు అనుసంధానించి చెప్పేదాన్ని. నా శైలి నచ్చిన ఆ శిష్యుడు నా హరికథను రావుగారికి వినిపించాలనుకున్నాడు. అయితే ఆయనను తీసుకురావడం కుదరక సన్మానం చేస్తామంటూ నన్నే వాళ్ల అకాడెమీకి ఆహ్వానించారు. అప్పుడే జరిగింది పైన చెప్పిన సంఘటన.

ఆ తర్వాత కొన్నాళ్లకి ఆయన నా హరికథను వినడం జరిగింది. అంతే... పురాణాల పట్ల ఆయనకున్న అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. నేను హరికథను మలిచిన తీరును చాలా మెచ్చుకున్నారు. పురాణాలను వ్యతిరేకించడం మానేశారు. మెల్లగా మా పరిచయం స్నేహంగా మారింది. నిజానికి నేను గడప దాటానంటే, అది హరికథ చెప్పడానికే. ఆడపిల్లగా నాకు చాలా నియమాలు, హద్దులు ఉండేవి. దాంతో పురుషులెవరితోనూ పరిచయాలు లేవు. మొదటిసారి నా మనసును రంజింపజేసిన వ్యక్తి గోపాలరావుగారే. నా హరికథ ఎక్కడున్నా వచ్చేవారు. నాకోసం రకరకాల పుస్తకాలు తెచ్చి ఇచ్చేవారు. ఆధునిక సాహిత్యం గురించి వివరించేవారు. ఆయనెప్పుడూ అనేవారు... ఆధునిక సాహిత్యాన్ని మీ హరికథలకు జోడించండి, ఇంకా అద్భుతంగా ఉంటుంది అని. ఇలా రెండేళ్లు గడిచాయి.

ఓసారి రాజమండ్రిలోని లలిత కళానికేతన్ వాళ్లు ఉత్సవాలకు ఆహ్వానిస్తే వెళ్లాను. రావుగారు కూడా వచ్చారు. అక్కడ ఆయన మిత్రులు పదిహేను మంది వరకూ ఉన్నారు. వాళ్లన్నారు... ‘మీ ఇద్దరూ అద్భుతమైన ప్రతిభ ఉన్నవాళ్లు. ఒకరికొకరు సరితూగుతారు. మీరెందుకు పెళ్లి చేసుకోకూడదు’ అని. అప్పటికే ఎంతో కాలంగా పెళ్లి చేసుకోమంటూ పోరుతున్నా ఆయన ఒప్పుకోవట్లేదట. నన్ను చూసిన తర్వాత, ఆయనకు నేనైతే బాగుంటుందని అనుకుని, నాతో మాట్లాడాలని నిశ్చయించుకున్నారట. కాదనడానికి నా దగ్గర కారణాల్లేవు. అందుకే సరే అన్నారు. అంతే, క్షణం కూడా ఆలస్యం చేయలేదు వాళ్లు. పసుపుతాడు తెచ్చి అక్కడికక్కడే నా మెడలో తాళి కట్టించేశారు. అదృష్టం కొద్దీ... ఇరుపక్షాల వారూ మా పెళ్లిని అంగీకరించారు.

మాటలకు అందని మనిషి...

రావుగారితో నా జీవితం బాగుంటుందని ముందే అనుకున్నాను. కానీ నేను ఆశించినదానికంటే వందరెట్లు అద్భుతంగా ఉంది.

రావుగారి వ్యక్తిత్వాన్ని మాటల్లో చెప్పాలనుకోవడం సాహసమే. సంఘానికి, సమాజానికి ఏమీ చేయని జీవితం వ్యర్థం అనుకుని, పదకొండో యేటే ఇల్లు వదిలి వెళ్లిపోయిన వ్యక్తి ఆయన. నాయకులంతా కష్టపడి స్వాతంత్య్రాన్ని తెచ్చారు, కానీ ఆ స్వాతంత్యాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎవరికీ రావట్లేదు అని ఆవేదన చెందేవారు. తన భావాలను వ్యక్తపరచడానికి నాటకమే సరియైన సాధనమని భావించారు. మూఢాచారాలను, అంధ విశ్వాసాలను తూర్పారబడుతూ నాటకాలు రచించారు, దర్శకత్వం వహించారు, నటించారు. ఎన్నో చోట్ల నాటక అకాడెమీలను స్థాపించారు. ఆయనకు వెయ్యిమందికి పైగా శిష్యులుండేవారు. వాళ్లందరినీ తన సొంత మనుషుల్లా చూసేవారు.

సినిమాల్లోకి కూడా ఇష్టపడి రాలేదాయన. నటుడు ఎస్వీ రంగారావు, దర్శకుడు రామినీడు గార్లకు సన్మానం చేయాలని సంకల్పించారు. ఆ రోజున కీర్తిశేషులు నాటకాన్ని ప్రదర్శిస్తే, గోపాలరావుగారి ప్రతిభను చూసి ముగ్ధులైపోయారు వాళ్లు. తర్వాత రామినీడు గారి నుంచి కబురు వచ్చింది. దానికి కారణం ఎస్వీఆర్. ‘భక్తపోతన’లో ఆయనది శ్రీనాథుడి పాత్ర. శృంగార నైషధాన్ని రాజుకి అంకితమివ్వాలి. ‘ఎవరు పడితే వాడి కాళ్లకు నేను దణ్నం పెట్టను, వాడు పోయి... ఎస్వీఆర్ నా కాళ్లకు దణ్నం పెట్టాడని ఊరంతా చాటింపు వేస్తాడు, గోపాలరావు అర్హుడు కాబట్టి, ఆయన్ను తీసుకురండి’ అన్నారట. అయితే ఈయనకు దర్శకత్వం మీద మక్కువ తప్ప నటన మీద ఆసక్తి లేదు. కానీ ఎస్వీఆర్ మీద అభిమానం కొద్దీ సరే అన్నారు. కాలం గడిచేకొద్దీ నటుడిగా ఎవరూ అందుకోలేని స్థాయికి వెళ్లిపోయారు.

చాలామంది అడుగుతుంటారు... ‘ఆయన విలన్‌గా చేస్తుంటే మీకేమీ అనిపించలేదా’ అని. ఎందుకు అనిపిస్తుంది! నేను కూడా కళాకారిణినే కాబట్టి కళను కళగా చూశాను తప్ప వ్యక్తిగతంగా తీసుకోలేదు. కాకపోతే, హీరో ఆయన్ని కొట్టడం, తరిమి తరిమి చంపడం లాంటి వాటిని చూడలేక కళ్లు మూసేసుకునేదాన్ని.

విలన్ కాదు హీరో

భయంకరమైన విలన్‌గా ఎన్నో సినిమాల్లో చేశారు రావుగారు. కానీ నిజ జీవితంలో ఆయన విలన్ కాదు... హీరో. అందరినీ ప్రేమించడమే ఆయనకు తెలుసు. ఏరోజూ తన నోటితో ఫలానావాడు చెడ్డవాడు అని చెప్పడం నేను వినలేదు. ఎవరైనా ఆయన దగ్గరకు వచ్చి మరెవరి గురించైనా చెడుగా చెప్పినా పట్టించుకునేవారు కాదు. అంతేకాదు... ఆయన చెయ్యి చాలా పెద్దది. ఇంటికి ఎవరొచ్చినా భోంచేసి వెళ్లాల్సిందే. వంద మందికి పైగా వంట చేసి పెట్టిన రోజులున్నాయి. ఇక సినిమా వాళ్లయితే ఎవరో ఒకళ్లు ఇంటికి వస్తూనే ఉండేవారు. అల్లు రామలింగయ్యగారి తోటి, వారి కుటుంబంతోటి మాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది.

రామలింగయ్యగారికైతే ఈయనంటే ఎంతో అభిమానం. రైలులో పొరపాటున వేర్వేరు బోగీల్లో సీట్లు ఇస్తే టీసీతో పోట్లాడి మరీ వీరున్న బోగీలోకి మారిపోయేవారు. మా ఇంటి భోజనం అంటే కూడా అందరికీ ఇష్టం. అందుకే అందరికీ సరిపడా పంపేదాన్ని. రావుగారికైతే చేపల పులుసు, గోంగూర-రొయ్యల కూర చాలా ఇష్టం. నేనేమో బ్రాహ్మిణ్‌ని. అయినా ఆయన కోసం అన్నీ వండటం నేర్చుకున్నాను. బాగా వండుతున్నాననేవారు. ఏది వండినా ఇష్టంగా తినేవారు. చుట్టూ ఉన్నవాళ్లందరితో తినిపించేవారు. తను ఒక ముద్ద తింటే, చుట్టుపక్కల వాళ్లకి పది ముద్దలు పెట్టడం ఆయన నైజం. రాజకీయాల్లోకి వచ్చింది కూడా అందరికీ చేతనైనంత పెట్టాలనే. దానికోసం సినిమాలను కూడా వదిలేసుకున్నారు.

పదవులు, సంపద ఏవీ ఆయన్ను మార్చలేక పోయాయి. ఎంపీ అయినా రావుగారు రావుగారే. ఏ రోజూ ప్రభుత్వ సొమ్మును ఆశించలేదు. ఫోన్ కనెక్షన్ దగ్గర్నుంచి ఫ్లయిట్ టిక్కెట్ వరకూ అంతా సొంత ఖర్చే. ప్రభుత్వం ఏదైనా సౌకర్యాన్ని కల్పిస్తే తన బదులు పేదవాళ్లకి ఇవ్వమనేవారు. రామారావుగారు చాలాసార్లు అన్నారు... ‘మీకు పిల్లలున్నారు, ఏదైనా అవసరమైతే అడగండి’ అని. ‘నాకెందుకండీ... పేదవాళ్లకి ఇవ్వండి’ అనేవారీయన. ఆ మాట అందరూ అనలేరు... గోపాలరావుగారి లాంటి ఏ కొందరో తప్ప!

ఎవరికీ దక్కని అదృష్టం నాకు దక్కింది...

అన్నేళ్ల కాపురంలో భార్యని ‘నువ్వు’ అనని గొప్ప సంస్కారి ఆయన. ‘కుమార్జీ...’ అని పిలిచేవారు తప్ప ఏకవచనం ఉపయోగించేవారు కాదు. స్త్రీకి గౌరవం ఇవ్వాల్సిందే అనేవారు. ఏ ఆడపిల్లకైనా తన కళ్లముందు కష్టం కలిగితే సహించేవారు కాదు. ఎవరైనా అమ్మాయిల్ని కామెంట్ చేస్తే చితక్కొట్టేసేవారు. అంత గొప్ప వ్యక్తికి భార్య కావడం కంటే అదృష్టం ఏముంటుంది!

పిల్లలంటే కూడా ప్రాణం. ఎంత అర్ధరాత్రి వచ్చినా, వాళ్ల పక్కన కూర్చుని వాళ్ల ఒళ్లంతా నిమిరేవారు. పిల్లల్ని ఏనాడూ కోప్పడటం చూడలేదు నేను. పొద్దున్నే కూర్చోబెట్టి తెలుగు పేపర్ చదివి వినిపించమనేవారు. ‘మాతృభాష తల్లితో సమానం. దాన్ని మర్చిపోతే తల్లికి ద్రోహం చేసినట్టే’ అని చెప్పేవారు. పిల్లల్ని ఏదేదో చేయాలని తపించేవారు. కానీ ఏమీ చేయలేకపోయారు. ఆ దురదృష్టకరమైన రోజు అంత త్వరగా వస్తుందని ఊహించలేదు.

చాలా చెడ్డ రోజది...

షూటింగుల కారణంగా టైముకి తిండి, నిద్ర ఉండేవి కాదు. ఇక పాలిటిక్స్‌లోకి వచ్చాక మరీ దారుణం. ఎప్పుడూ సేవ సేవ అంటూ వెళ్లిపోయేవారు. షుగర్ మందులు కూడా వేసుకునేవారు కాదు. దాంతో ఆరోగ్యం బాగా చెడిపోయింది. షుగర్ లెవెల్స్ పెరిగిపోయి కిడ్నీలు దెబ్బతిన్నాయి. దానికి తోడు ధూమపానం ఒకటి. రాయిలా ఉండే మనిషి ఆరు నెలల్లోనే క్షీణించిపోయారు.

ఓరోజు ఉన్నట్టుండి జ్వరం వచ్చింది. సాయంత్రం ఆస్పత్రికి తీసుకెళ్లి చేర్పించాం. రాత్రి ఎప్పటికో నిద్రపోయారు. ఉదయం ఐదవుతుండగా ఒళ్లంతా చెమటతో తడిచిపోయింది. కదిపినా కదల్లేదు. డాక్టర్లు వచ్చి ఏదేదో చేశారు. కానీ ఆయనను మాత్రం కాపాడలేకపోయారు.

ఆ రోజే నాలో సగభాగం చచ్చుబడినట్టయిపోయింది. అంతకు కొన్ని రోజుల ముందు పిల్లల్ని పిలిచి- ‘కుమార్జీని ఏ రోజూ ఇంట్లో సరుకులున్నాయా, డబ్బులున్నాయా అని అడగలేదు. వందమంది వచ్చినా వండిపెట్టేవారు. ఎక్కడి నుంచి తెచ్చి ఖర్చుపెడుతున్నారు అని కూడా కనుక్కోలేదు. ఎలా నెట్టుకొచ్చారో ఏమో. ఆవిడని జాగ్రత్తగా చూసుకోండి’ అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారట. చివరి రోజుల్లో కూడా ఆయన నాగురించే మథన పడ్డారు. ఆయన జ్ఞాపకాలను నెమరేసుకుంటూ నేనిప్పుడు ప్రతిక్షణం మథన పడుతున్నాను. ఈ ప్రపంచానికి ఆయన లేకపోవచ్చు. కానీ నా భర్తగా, ఓ మంచి స్నేహితుడిగా ఆయన ఇప్పటికీ నాతోనే ఉన్నారు, నాలోనే ఉన్నారు!

సంభాషణ: సమీర నేలపూడి

ఇంటికి ఎవరొచ్చినా భోంచేసి వెళ్లాల్సిందే. లేదంటే ఊరుకునేవారు కాదు. డబ్బు మీద వ్యామోహం లేదాయనకి. ఎంత డబ్బుందని లెక్క చూసుకునేవారు కాదు. పదిమందికి భోజనం పెడితే పుణ్యం వస్తుంది, ఇలాంటి మంచి పనులు చేయడానికి దేవుడే దారి చూపిస్తాడు అనేవారు.

ముత్యాలముగ్గు కంటే ఆయన గొప్పగా నటించిన సినిమా ఒకటుంది. అదే... ఇంటిదొంగ. విలన్‌గా క్రౌర్యాని ప్రదర్శించే ఆయన... కంటనీరు పెట్టించారా సినిమాతో. ఆయనకు నూటికి నూరు మార్కులు వేయాల్సొస్తే నేను ఆ సినిమాకే వేస్తాను.

మంచి స్క్రిప్టు ఇచ్చాం- పరుచూరి గోపాలకృష్ణ, విజయలక్ష్మి


ఎవరి జీవితానికి వారే స్క్రిప్ట్ రైటర్లు. అలాగని పిల్లల చేతికి పెన్ ఇచ్చి వదిలేస్తామా! బుడిబుడి ఎపిసోడ్‌లు రాయవలసింది పెద్దలే. అదే పని చేశారు ఈ దంపతులు. ముగ్గురు ఆడపిల్లల్నీ చక్కగా చదివించారు. సంస్కృతీ సంప్రదాయాలను నేర్పించారు. బతుకుదారిని చదును చేసి నడిపించారు. ‘ఆత్మవిశ్వాసం’ అనే థీమ్ దట్టిస్తే చాలు... పిల్లలు తమంతట తామే మిగతా స్క్రిప్ట్ తయారుచేసుకుంటారని చెబుతున్న గోపాలకృష్ణ, విజయలక్ష్మిల పేరెంటింగే ఈవారం ‘అలా పెంచాం’.

‘‘మా పిల్లలకు మేము పెద్ద చదువులు చెప్పించకపోవచ్చు కానీ, చక్కటి క్రమశిక్షణలో పెంచాం. అదే వాళ్లు దేశం కాని దేశంలో కూడా మంచిస్థితికి ఎదిగేందుకు దోహదం చేసింది’’ అంటారు  పరుచూరి గోపాలకృష్ణ, విజయలక్ష్మి దంపతులు. పిల్లల పెంపకం గురించి ఆ దంపతులను కలవడానికి వెళ్లినప్పుడు వాళ్లు చాలా విషయాలు ముచ్చటించారు. 

పట్టుబట్టి పూర్తి చేయించా:‘‘మాకు ముగ్గురు ఆడపిల్లలు. హిమబిందు, నాగసుష్మ, హరిప్రియ. పెద్దమ్మాయి అమెరికాలో రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తోంది. క్రమశిక్షణగల ఉద్యోగిగా ఆమె అక్కడ మంచి పేరు తెచ్చుకుంది. రెండవ అమ్మాయికి, మూడవ అమ్మాయికి డిగ్రీ చదివేటప్పుడే పెళ్లి చేశాం. మూడవ అమ్మాయి పెళ్లయిన తర్వాత బి.ఎఫ్.ఎ.చేసింది. రెండవ అమ్మాయిని ఇటీవలే నేను పంతం పట్టి మరీ డిగ్రీ పూర్తి చేయించాను.

తనని స్క్రిప్ట్ రైటింగ్‌లో నా సహాయకురాలిగా చేసుకోవాలని, నా రచనా వారసత్వం తనకి అప్పగించాలని నా కోరిక. మా ఆవిడకు మాత్రం మా ముగ్గురు పిల్లలకూ తలా వంద నవరుల బంగారం, ఒక ఇల్లు, ఐదెకరాల పొలం ఏర్పాటు చేయాలని ఉంది. ‘సరే నీ ఇష్టం’ అన్నాను. ఆమె తాను అనుకున్నట్టుగా వాళ్లకి అవి సమకూర్చేందుకు ప్రయత్నిస్తోంది... అంటూ గోపాలకృష్ణ సాలోచనగా భార్యవైపు చూశారు.

పెళ్లి నిరాడంబరంగా...: ‘‘మా పిల్లలు ముగ్గురివీ కమ్యూనిస్టు పెళ్లిళ్లే. ముగ్గురివీ నిరాడంబరంగా జరిపించాం. ఆ తర్వాత వాళ్లు చదువుకున్నారు. ఒక అమ్మాయి మాత్రం పెళ్లయిన వెంటనే పిల్లలు పుట్టడంతో వారి పెంపకం బాధ్యతలలో పడి డిగ్రీ పూర్తి చేయలేక పోయింది. ఆమె చేత ఎలాగైనా డిగ్రీ పూర్తి చేయించాలనే పట్టుదలతో ఇటీవలే స్వయంగా కోచింగ్ ఇచ్చి మరీ డిగ్రీ సర్టిఫికెట్ వచ్చేలా చూశాను’’ అని ఆనందంతో చెప్పారు గోపాలకృష్ణ.

పనిపాటలు నేర్పించా: ‘‘మా పిల్లలకు చిన్నప్పటినుంచి పనిపాటలు నేర్పాను, మా బంధుమిత్రులలోనూ, మావారి స్నేహితులలోనూ వంటలు బాగా చేస్తానని నాకెలాగైతే మంచి పేరుందో అలాగే మా పిల్లలకు కూడా అన్ని పదార్థాలూ రుచికరంగా వండుతారని పేరొచ్చేలా చేశాను’’ అని తల్లిగా బాధ్యతల్లో తానేమీ తక్కువ చేయలేదన్నట్టు చెప్పారు విజయలక్ష్మి. అచ్చతెలుగు ఆడపడచులా, సామాన్య గృహిణిగా కనిపించే ఆమె సెన్సార్ బోర్డ్ సభ్యురాలని, ఒక ప్రచురణ సంస్థ బాధ్యతలు చూస్తున్నారనీ తెలిస్తే ఆశ్చర్యపోతాం.

‘‘మా వారు రోజంతా సినిమాలతో బిజీగా ఉండేవారు. ఒక్కోసారి ఉదయాన్నే వె ళ్తే అర్ధరాత్రెప్పుడో ఇంటికి చేరేవారు. పిల్లలకి కాలక్షేపం కోసం టీచర్‌నే ఇంటికి పిలిపించి వాళ్లకి డ్రాయింగ్, మ్యూజిక్ లాంటివి నేర్పించేదాన్ని. దాంతో వాళ్లకి ఫైన్‌ఆర్ట్స్ మీద ఆసక్తి ఏర్పడి డిగ్రీలో అదే గ్రూప్ తీసుకున్నారు’’ అని చెప్పారు విజయలక్ష్మి. ‘‘నేను చిన్నప్పటినుంచి నాస్తికవాదిని.

అయితే మా పెద్దమ్మాయి వైవాహిక జీవితం దెబ్బతింది. దాంతో నేను చాలా బాధపడి, ఎందుకిలా అయిందా అని ఆలోచిస్తుంటే, మా ఆవిడ తెలిసిన వాళ్లెవరికో అమ్మాయి జాతకం చూపించింది. ఆశ్చర్యం! అంతవరకు ఆమె జీవితంలో జరిగిన ప్రతి ఒక్కటీ జ్యోతిషులు చెప్పినట్లుగానే జరిగింది. అప్పటినుంచి నాకు జ్యోతిషం మీద గురి ఏర్పడింది. అంతేకాదు, దేవుడి మీద నమ్మకం కూడా ఏర్పడింది. ఇప్పుడు మా పిల్లలూ మంచి భక్తిపరులు. పూజాపురస్కారాలు బాగా చేస్తున్నారు. అన్నదానాలు చేయడంలో ఆసక్తి చూపిస్తున్నారు. అమెరికాలో ఉంటున్నా, ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలనే పాటిస్తుంటే మేము వారికిచ్చిన తర్ఫీదు వృథాపోలేదని సంతృప్తిగా అనిపిస్తుంది.’’ అంటూ తాను ఆస్తికుడిగా మారిన వైనాన్ని వివరించారు గోపాలకృష్ణ.

ఉన్నదానిలో సర్దుకోవడం నేర్పాం: ‘‘చిన్నప్పటి నుంచి మా పిల్లలకు పొదుపు చేయడం, ఉన్నదానిలో సర్దుకోవడం నేర్పాను. ఎవరి మీదా ఆధారపడకుండా తమ పనులు తాము చేసుకునేలా అలవాటు చేశాను’’ అని విజయలక్ష్మి చెబుతుంటే ‘‘వాళ్ల అమ్మ మాట విని మా పిల్లలు ఎంత బిజీగా ఉన్నా ఇప్పటికీ ఇంటికి కావలసిన సరుకులు వాళ్లే స్వయంగా తెచ్చుకుంటున్నారు. కానీ ఈమె మాత్రం ఆ బాధ్యత నా మీదే పెట్టింది’’ అన్నారు గోపాలకృష్ణ నవ్వుతూ.

చీకటిపడేలోగా ఇల్లు చేరాల్సిందే...‘‘ఇప్పటికీ మా పిల్లలు ఒంటరిగా దూరప్రయాణాలు చేసేందుకు ఇష్టపడను. ఇంటినుంచి బయటికి వెళ్లిన వాళ్లు క్షేమంగా తిరిగి వచ్చేంతవరకు ఫోన్ చేస్తూనే ఉంటాను. అంతేకాదు, అమెరికాలో ఉంటున్న మా మనవరాలిని కూడా చీకటి పడేలోగా ఇంటికి వచ్చేలా చూసుకోమని మా అమ్మాయికి చెబుతుంటాను’’ అని చెప్పిన విజయలక్ష్మిలో సెన్సార్‌బోర్డ్ సభ్యురాలికి బదులు ఓ సాధారణ గృహిణి, కన్నతల్లి కనపడ్డారు.

ఓ కంట కనిపెడుతుండాలి: ‘‘తల్లిదండ్రులు ముందునుంచీ ఆడపిల్లల వస్త్రధారణ మీద, నడవడిక మీద శ్రద్ధ తీసుకోవాలి. వాళ్లు ఎక్కడ ఉన్నారు? ఎటువంటి వారితో స్నేహం చేస్తున్నారు? ఎక్కడికి వెళుతున్నారు? ఇంటికి ఎప్పుడు వస్తున్నారు? వంటివిపట్టించుకోకపోతే మాత్రం వారి జీవితాలు ప్రమాదంలో పడబోతున్నాయని తెలిసీ చూస్తూ ఊరుకున్నట్లే. వారికి స్వేచ్ఛ ఇవ్వాలి. అలాగని పూర్తిగా వదిలేయకూడదు’’ అన్నారు ఈ దంపతులు ముక్తకంఠంతో.

ఆడపిల్లల తల్లిదండ్రులుగా తోటివారికి ఎటువంటి జాగ్రత్తలు చెబుతారు అని అడిగినప్పుడు - ‘‘ఆడపిల్లల్ని ధైర్యవంతులుగా పెంచాలి. వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలి. ఏదైనా ఒక విషయంలో వాళ్లు ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తుంటే, ఏదైనా చెప్పుకోవాలని ప్రయత్నిస్తుంటే మనమే చొరవచూపి ప్రేమగా దగ్గరకు తీసుకోవాలి. వారు చెబుతున్నది శ్రద్ధగా వినాలి. సహనంతో పరిష్కారం చూపాలి’’ అని గోపాలకృష్ణ దంపతులు చెప్పారు. ఆలోచిస్తే వాళ్లు చెప్పినది ప్రతి తల్లీ, తండ్రీ ఆచరించాల్సినవేననిపించింది.

- డి.వి.ఆర్. భాస్కర్