అది పరుగు కాని పరుగు. ప్రాణాలను పందెంగా కాసే పోటీ పరుగు. అల్లంత దూరంలో జీవనోపాధి కళ్లకు కనిపిస్తూ ఊరిస్తూ ఉండగా ఉరికే పరుగు. ఆశగా ఉద్యోగాన్ని అందుకోబోతున్న సమయంలో అశనిపాతంలా మారే పరుగు. అభ్యర్థిని నేలకు ఒరగదీసే పరుగు. ఉద్యోగం అల్లంత దూరంలో కనిపిస్తుండగా గుండె మెలిపెట్టినట్టు అవుతుంది. మెలిపెట్టిన గుండె కాళ్లలో మెలికవుతుంది. నేల మీద మొదలైన పరుగు కాస్తా ఉద్యోగస్థానం వద్ద ఆగక... నేరుగా పరలోకానికే దారితీస్తుంది. ప్రాణాన్నీ తీస్తుంది. ఎస్సై, కానిస్టేబుల్, ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాల కోసం నిర్వహిస్తున్న అనేక పరుగుల పోటీల్లో జరిగేది ప్రమాదం లేని పరుగులా కాకుండా... వెనక మృత్యువు తరుముకొస్తుండగా ఉరికే పరుగులా సాగుతున్న నేపథ్యంలో ఆ సమస్యలను ఎలా అధిగమించవచ్చో, అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటో సూచించేందుకే ఈ కథనం.
మొన్నటికి మొన్న సోమవారంనాడు ఎక్సైజ్ కానిస్టేబుళ్ల ఉద్యోగ నియామకాల కోసం నిర్వహిస్తున్న పరుగులపోటీలో ఏకబిగిన 4 కి.మీ. పరుగెత్తలేక ఒకరు మృత్యువాత పడ్డారు. సరిగ్గా సగం దూరం పరుగెత్తాక గుండెపట్టుకుపోయి కుప్పకూలిపోయి సంజీవ అనే యువకుడు విగతజీవుడయ్యాడు. ఇది కేవలం సంజీవకే పరిమితం కాదు. ఇటీవల పోలీస్ నియామకాల కోసం నిర్వహిస్తున్న ఎన్నో పరుగుల పోటీల్లో ఇదే సంఘటన పునరావృతమవుతోంది. ఇలా పరుగుల పోటీలో పాల్గొని మరణించినవారెవరూ రోగులు కాదు. అంతకు ముందు షుగరూ, బీపీ, గుండెపోటులాంటి వ్యాధులు ఉన్న దాఖలాలు లేవు. అంతా యుక్తవయస్కులే. ఆ వయసులో మరణిస్తారని ఆశించడానికీ వీల్లేనివారే. అయినా ఇలా ఎందుకు జరుగుతోందో
తెలుసుకుందాం...
మృత్యుప్రమాదాలు ఎవరెవరిలో...
సాధారణంగా ఉద్యోగ నియామకాల కోసం పోటీలో పాల్గొనే 20 - 25 ఏళ్ల వయసున్నవారు ఒక వర్గం కాగా... ఆరోగ్యాన్ని కాపాడుకునే ఉద్దేశంతో వ్యాయామంలో భాగంగా ఉదయాన్నే లేదా సాయంత్రాన పరుగులు తీసే 35 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్యవయస్కులు మరో వర్గం. ఇలాంటి మరణాలకు గురైన వారిని పరిశీలిస్తే 95 శాతం పురుషులే ఉంటారు.
తీవ్ర వ్యాయామం కొందరిలో ప్రమాదకరం...
ఆరోగ్యం కోసం చేసే వ్యాయామం చాలా తక్కువమందిలో ఒక్కోసారి వికటించి ప్రమాదకరమైన పరిస్థితికి దారి తీయవచ్చు. సాధారణంగా తీవ్రంగా పరుగెత్తుతూ శ్రమించాల్సిన రన్నింగ్, ఫుట్‌బాల్ క్రీడలలో ఈ తరహా ప్రమాదాలు ఎక్కువ. దీనికి కారణం... అలవాటు లేకుండా ఒకేసారి ఒళ్లు తట్టుకోలేనంతటి తీవ్రంగా శ్రమ చేయాల్సి రావడమే. అందుకే ఇలాంటి పోటీల్లో పాల్గొనేవారు క్రమబద్ధమైన పద్ధతిలో క్రమంగా తాము పరుగుతీసే దూరాన్ని, వేగాన్ని దీర్ఘకాల వ్యవధిలో... కొద్దికొద్దిగా మాత్రమే పెంచుకుంటూ పోవాలి. స్వల్పవ్యవధిలోనే ఎక్కువ లక్ష్యాలను నిర్ణయించుకోవడం సరికాదని గుర్తుంచుకోవాలి.
లోపల జబ్బులు ఉండవచ్చా?
ఇలా మృతిచెందేవారి వివరాలను పరిశీలిస్తే... ఈ అభ్యర్థులకు వాళ్లకు తెలియకుండానే అంతర్గతంగా జబ్బులుండే అవకాశాలున్నాయేమోనని చూస్తే... దాదాపు 40 శాతం మందిలో ఎలాంటి వ్యాధులు ఉండటానికి ఆస్కారం లేదని తెలుస్తోంది. అయితే పది శాతం మందిలో మాత్రం గుండెకండరం పెరిగే హైపర్‌ట్రాఫిక్ కార్డియోమయోపతి అనే వ్యాధి ఉండేందుకు అవకాశం ఉంది. మిగతా సగం మందిలో కొద్దిమందిలో హార్ట్‌ఎటాక్ ఉండే అవకాశాలున్నా వారి శాతం స్వల్పం. అయితే 35 నుంచి 50 ఏళ్ల మధ్యనున్న వారిలో చూస్తే 20 శాతం మందిలో మాత్రం గుండెలో ఏర్పడ్డ రక్తనాళాల్లో ఏర్పడ్డ అడ్డంకుల వల్ల హార్ట్‌ఎటాక్ సంభవించి మృతిచెందే అవకాశం ఉంది. ఇక మిగతావారిలోనూ కొందరిలో గుండె విద్యుత్ ప్రసరణలో మార్పులు ఉండవచ్చు. ఇవన్నీ మరణించిన వారిని పరిశీలించగా తేలిన ఉజ్జాయింపు అంచనాలు మాత్రమే. కానీ... పరుగులో పాల్గొనే 80 శాతం మందిలో మాత్రం ఎలాంటి జబ్బులూ, వ్యాధులూ ఉండేందుకు అవకాశం లేదు.
అభ్యర్థుల ప్రాణాలను కాపాడేదెలా?
క్రీడాప్రాంగణంలో పరుగు పోటీలో పాల్గొనే అభ్యర్థి అకస్మాత్తుగా కుప్పకూలినప్పుడు వెనువెంటనే అతడికి ఎలక్ట్రిక్ షాక్ ద్వారా గుండెను మళ్లీ మామూలుగా కొట్టుకునేలా చేసే ఉపకరణాలను ఉపయోగిస్తే చాలావరకు ప్రాణాలను కాపాడేందుకు అవకాశం ఉంది. కానీ దురదృష్టవశాత్తూ మనదేశంలోని దాదాపు అన్ని క్రీడాప్రాంగణాలలో ఇలాంటి పరికరాలు ఉండేందుకు అవకాశమే లేదు.
ఒకవేళ ఈ పరికరాలు ఉంచితే వాటిని ఎలా ఉపయోగించాలన్న అవగాహన ఉన్న సిబ్బందిని కూడా ఏర్పాటు చేయాలి. అందుకే ఈ తరహా ఉపకరణాలను అందుబాటులో ఉంచడం అవసరం. ఈ ఉపకరణాలను అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న అంబులెన్స్‌లో ఉంచితే... ఒకవైపు ప్రథమచికిత్సతో పాటు షాక్‌చికిత్స చేస్తూనే ఆసుపత్రికి తరలించవచ్చు.
స్పోర్ట్స్ కార్డియాలజిస్టుల సూచనలేమిటి?
క్లిష్టమైన పరుగుల పోటీల్లో పాల్గొనే ముందు అభ్యర్థులందరికీ ఈసీజీ తప్పనిసరి
ఈసీజీ పరీక్షలో ఎలాంటి లోపాలను కనుగొన్నా ఎకో, ఎమ్మారై పరీక్షలు తప్పనిసరి
పోటీలో పాల్గొనే అభ్యర్థుల కుటుంబాల్లో ఎవరైనా చిన్న వయసులోనే అకస్మాత్తుగా మరణించిన కుటుంబచరిత్ర ఉంటే... ఆ అభ్యర్థులు ఈ విషయాన్ని తప్పనిసరిగా వైద్యులకు తెలియజేసి తమ ‘జన్యుపరీక్ష’ నిర్వహించాకే పోటీలో పాల్గొనాలి
శరీరదారుఢ్య పరీక్షలు జరిపే స్థలంలో గుండెపట్టేసి కుప్పకూలే అభ్యర్థులకు ఎలక్ట్రిక్ షాక్ ఇవ్వడానికి ‘డీ-ఫిబ్రిలేటర్’ అనే ఉపకరణాన్ని సిద్ధంగా ఉంచాలి. దానిని ఉపయోగించేవారు సైతం ప్రత్యేక తర్ఫీదు పొంది, నిపుణులైన వారు ఉండాలి.
ఇతర దేశాల్లోని మార్గదర్శకాలేమిటి?
అభివృద్ధి చెందిన చాలా దేశాల్లో శరీరదారుఢ్య పరీక్షలు నిర్వహించడానికి ముందు తప్పనిసరిగా ఈసీజీ నిర్వహిస్తారు. ప్రపంచ ఒలింపిక్ సంస్థ సైతం ఈసీజీ పరీక్ష చేయించకుండా అభ్యర్థులను పోటీలో పాల్గొననివ్వబోమంటూ ఇటీవలే తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో మన దేశంలోనూ ఇలాంటి నిబంధనలే పాటించడం వల్ల ఇలాంటి ప్రమాదాలను చాలావరకు నివారించవచ్చు.
అభ్యర్థులే ప్రమాదాలను నివారించుకోవచ్చా?
తప్పకుండా! ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిందేమిటంటే... కొన్ని ఉద్యోగాలకు శరీరదారుఢ్యం అవసరం. దాన్ని తెలుసుకోడం కోసమే ఈ తరహా పరీక్ష. అందుకే ఈ తరహా పరీక్షల్లో పాల్గొనేవారు క్రమంగా సామర్థ్యం పెంచుకోవాలి. వీళ్లంతా నేరుగా పోటీలో పాల్గొనేలా చేయడానికి బదులుగా... ముందుగా వీళ్లకు ఒకసారి ఈసీజీ తీయించి, నిపుణుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే పోటీలో పాల్గొననివ్వాలి.
ఈసీజీలో అత్యంత సూక్ష్మమైన మార్పులు నమోదవుతాయి కాబట్టి చాలామేరకు ఇలాంటి ప్రమాదం ఉండే అవకాశాలున్నవారిని ముందుగానే గుర్తించి, పోటీకి దూరంగా ఉంచడం సాధ్యపడుతుంది. కొన్నిచోట్ల ఇలాంటి ప్రమాదం ఉన్న అభ్యర్థులను కనుగొనేందుకు ఇటీవల ‘స్పోర్ట్స్ కార్డియాలజీ’ అనే ఉపవిభాగం ఆవిర్భవించింది. కానీ ఇది అందుబాటులో ఉన్న కేంద్రాలు తక్కువ. ఇక ఈసీజీ లో మార్పులు ఉన్నట్లు గమనిస్తే వెంటనే సదరు అభ్యర్థికి తదుపరి ఎకో పరీక్షను నిర్వహించాలి. ఆ తర్వాత దశలో చాలా కొద్దిమందిలో గుండెకు ఎమ్మారై పరీక్షలు, చివరగా జన్యుపరీక్షలు చేయించాల్సి రావచ్చు.
2 comments:
శరీర బరువు పెంచుకోవటం ఎలా ?
http://ammathanam.blogspot.ca/2013/05/blog-post_8508.html
Post a Comment