all

Wednesday, November 28, 2012

ఆకుకూరలా మజాకా!

మాంసాహారం మీద మోజు పెంచుకుని ఆకుకూరలను చాలామంది చిన్నచూపు చూస్తుంటారు గాని... వాటితో కలిగే మేలు అంతా ఇంతా కాదు. ఆ ప్రయోజనాల్లో కొన్నింటిని చూద్దాం.

త్వరగా కడుపునిండినట్లు అనిపించడం ఎందుకంటే: భోజనంలోకి మటన్, చికెన్ వంటివి ఉంటే నాలుగు ముద్దలు ఎక్కువగా తినాలనిపిస్తుందని, అలా తిన్నప్పుడు ఆరోగ్యం బాగుంటుందని చాలామంది అనుకుంటారు. నిజానికి అలా ఎందుకు జరుగుతుందో మాత్రం వారికి తెలియదు. ఆకుకూరల భోజనంలో పీచుపదార్థాలు ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు ప్రొటీన్లూ ఎక్కువే. మన జీవక్రియలకు ఎంత ఆహారం కావాలో మెదడుకు తెలుసు. అందుకే మనం ఎంత తినాలనుకుంటే అంతా తినలేం. మనకు సరిపోయినంత కడుపులో పడిందని భావించాక పొట్టకు మెదడు ఒక సంకేతం పంపిస్తుంది.


ఆ సంకేతం తర్వాత పూర్తిసంతృప్తి పొందిన ఫీలింగ్ కలుగుతుంది. ఇంగ్లిష్‌లో దీన్నే సెటైటీ అంటారు. పీచులు -ప్రొటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం కొద్దిగా తీసుకోగానే అది చాలని భావించిన మెదడు సంతృప్తసంకేతం పంపిస్తుంది. దాంతో కడుపు నిండిపోయినట్లవుతుంది. అంటే మనం తీసుకున్న ఆ ఆహారం మనకు చాలన్నమాట. అదే పీచులు లోపించి మాంసం తిన్నామనుకోండి. అందులోని పీచులు మన జీవక్రియలకు సరిపోకపోవడం వల్ల కడుపులో ఉండాల్సిన దాని కన్నా ఎక్కువే ఆహారం ఉన్నప్పటికీ ‘మరికాస్త తినాలి, ఇంకాస్త తినాలి’ అంటూ మన మెదడు కడుపునూ, నోటినీ కోరుతుంటుంది. అంటే సంతృప్త సంకేతం ఒక పట్టాన అందదన్నమాట. అందుకే మాంసాహారం తిన్నప్పుడు మామూలు కంటే ఒకముద్ద ఎక్కువగానే కావాలనిపిస్తుంది.

నిజానికి తగినన్ని పీచుపదార్థాలతో ఉన్న ఆహారంతో త్వరగా కడుపు నిండటమే మంచిది. ఎందుకంటే మనం అవసరానికంటే ఎక్కువగా ఆహారం తీసుకోవడం వల్ల అందులో పీచులు లేకపోవడంతో మన జీర్ణవ్యవస్థలోని చిన్నపేగు, పెద్దపేగు క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఎక్కువ. అదే నిత్యం కూరగాయలు, ఆకుకూరలతో ఆహారం తీసుకునేవారిలో పేగు క్యాన్సర్లు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. పైగా మాంసాహారంతో త్వరగా సంతృప్తస్థాయికి చేరక అదేపనిగా తింటూండటం వల్ల అతిగా తీసుకున్న ఆ ఆహారం కొవ్వురూపంలో శరీరంలో పేరుకోవడం, దాంతో అనేక అనర్థాలు కలగడం మామూలే.

No comments: