all

Wednesday, November 28, 2012

కంటి పాప లకు కావాలి కాపలా!

కంటిలో ఉండే ఒక రకం ద్రవం తాలూకు ఒత్తిడి పెరగడం వల్ల నరం దెబ్బతిని చూపు కోల్పోయే పరిస్థితిని గ్లకోమా (నీటికాసుల జబ్బు) అంటారన్న విషయం తెలిసిందే. దురదృష్టవశాత్తు దేశవ్యాప్తంగా చిన్నపిల్లల్లో కనిపించే ఈ గ్లకోమా మన రాష్ట్రంలో ఎక్కువ. రాష్ట్రంలో 3,300 ప్రసవాలు జరిగితే అందులో ఒకరికి గ్లకోమా ఉంటోంది. మొత్తం అంధత్వానికి దారితీసే కేసుల్లో గ్ల్లకోమా వల్ల అంధత్వం వచ్చేవారి సంఖ్య 4.2 శాతం. తొలుత చిన్న పిల్లల్లో గ్లకోమాను అరుదైన విషయంగా పరిగణించినా ఇటీవల ఈ కేసులు విపరీతంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితి తరచూ కనిపిస్తున్న నేపథ్యంలో దీనిపై అవగాహన కలిగించడం కోసమే ఈ ప్రత్యేక కథనం.

మన కన్ను ఆరోగ్యంగా ఉండాలంటే కంటిలో ప్రవహించే ‘యాక్వస్ ఫ్లూయిడ్’ అనే ఒక రకం ద్రవం సరైన రీతిలో ఎప్పటికప్పుడు ఒక డ్రైనేజ్ యాంగిల్ ద్వారా బయటకు ప్రవహిస్తూ ఉండాలి. డ్రైనేజ్ యాంగిల్‌లో స్పాంజిలాంటి కణజాలం ఉంటుంది. దీనినే ట్రాబెక్యులార్ మెష్‌వర్క్ అంటారు. కంటిలో ప్రవహించే యాక్వస్ ఫ్లూయిడ్ ఈ ట్రాబెక్యులార్ మెష్‌వర్క్ ద్వారా కంటి నుంచి బయటకు వెళ్తుంది. కొంతమంది చిన్నారులలో యాక్వస్ ఫ్లూయిడ్ ప్రవహించాల్సిన డ్రైనేజీ యాంగిల్ సరిగా అభివృద్ధి కాదు. దాంతో యాక్వస్ ఫ్లూయిడ్ బయటకు ప్రవహించలేక అక్కడే ఉండిపోతుంది.

ఫలితంగా కంటిలో ఉండాల్సిన ద్రవం పరిమాణం పెరిగి కంటిపై ఒత్తిడి పెరుగుతుంది. ఆ ఒత్తిడి ఉండాల్సిన దానికంటే అలా పెరుగుతూ పోతున్నకొద్దీ కంటి నరంపైన ఒత్తిడి పెరిగి కంటి నరం దెబ్బతింటుంది. దానివల్ల చూపుకూడా పోతుంది. ఇలా కోల్పోయిన చూపు శాశ్వత దృష్టి లోపానికి దారితీస్తుంది. కంటిలోని యాక్వస్ ఫ్లూయిడ్ బయటకు వెళ్లలేక ఒత్తిడి పెరిగి చూపు కోల్పోయే పరిస్థితిని ‘కంజెనిటల్ గ్లకోమా’ లేదా చిన్నపిల్లల్లో పుట్టుకతో వచ్చే గ్లకోమా అంటారు.

ఎప్పుడు బయటపడుతుంది?
సాధారణంగా ఇది... పిల్లలు పుట్టిన మూడేళ్ల లోపు బయటపడుతుంది. ఇతర వ్యాధులు లేకుండా కేవలం గ్లకోమా మాత్రమే ఉంటే దాన్ని ‘ప్రైమరీ కంజెనిటల్ గ్లకోమా’ అంటారు. చాలాసందర్భాల్లో గ్లకోమా ఉన్న పిల్లల్లో ప్రైమరీ కంజెనిటల్ గ్లకోమా సాధారణంగా కనిపించే కండిషన్. అరుదైన సందర్భాల్లో మాత్రమే మరికొన్ని కండిషన్లతో పాటు గ్లకోమా ఉండవచ్చు. దీన్ని సెకండరీ కంజెనిటల్ గ్లకోమా అంటారు. చిన్నపిల్లల్లో పుట్టుకతో వచ్చే కొన్ని కేసుల్లో ఇది ఆరునెలల వయసులోనే బయటపడుతుంది. చాలా సందర్భాల్లో ఇది ఏడాది లోపు పిల్లల్లో తెలుస్తుంది.

ఎప్పుడు అనుమానించాలి?
బయటకు కనిపించే కొన్ని లక్షణాలను బట్టి పిల్లల్లో కంజెనిటల్ గ్లకోమా ఉందేమోనని అనుమానించవచ్చు. ఉదాహరణకు పిల్లల కంట్లోంచి ఎక్కువగా నీరు కారుతున్నా, కొద్దిపాటి వెలుతురునే పిల్లలు భరించలేకపోతున్నా లేదా కాంతి పడగానే కనుగుడ్డు గట్టిగా మూయడం, కనుగుడ్డు పెద్దదిగా మారడం, కంట్లోని నల్లపాప మబ్బుగా, మసకగా మారిపోతున్నా పిల్లల్లో కంజెనిటల్ గ్లకోమా ఉందని అనుమానించవచ్చు. ఇలాంటి లక్షణాలు పాటు పిల్లలు అదేపనిగా ఏడుస్తుండటం, వాంతులు చేసుకుంటుండటం, తిన్నవెంటనే ఇలా జరుగుతుంటే చిన్నపిల్లల కంటివైద్యనిపుణుల (పీడియాట్రిక్ ఆఫ్తాల్మాలజిస్ట్)కు చూపించాల్సిన అవసరం ఉంది.

అందుబాటులో ఉన్న చికిత్సలు...
కంజెనిటల్ గ్లకోమా ఉన్నట్లు తేలితే ప్రధానంగా దానికి శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. గ్లకోమా ఉన్నట్లు తేలగానే ఇచ్చే కంట్లో వేసేందుకు ఇచ్చే క్రీములు, పూతమందులు (టాపికల్ యాంటీ గ్లకోమా మందులు) కేవలం తాత్కాలిక ఉపశమనం కోసం మాత్రమే.

ఇవి కంట్లో పెరుగుతున్న ఒత్తిడిని, మబ్బుగా కనిపిస్తున్న పరిస్థితులను తాత్కాలికంగా తగ్గించడానికి మాత్రమే పనిచేస్తాయి. భవిష్యత్తులో చేయబోయే సర్జరీని సులభతరం చేయడానికి ఉపయోగపడతాయంతే. కంట్లో యాక్వియస్ ద్రవం వల్ల పెరుగుతున్న ఒత్తిడి అంతా తొలగిపోయేలా ఆ ద్రవాన్ని బయటకు వెళ్లేలా శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. కంట్లోని ఆ ఒత్తిడి తొలగించడానికి ఒక్కోసారి ఒకటి కంటే ఎక్కువ శస్త్రచికిత్సా విధానాలు (మల్టిపుల్ సర్జికల్ ప్రొసీజర్స్) అవలంబించాల్సి రావచ్చు. చిన్నారిపాపల కళ్ళకు ఏమైనా అయితే మనకే కన్నీళ్లు. అందుకే వారి కళ్ల విషయంలో పూర్తి జాగ్రత్త అవసరం.

కంజెనిటల్ గ్లకోమా నిర్ధారణ ఎలా?
కంజెనిటల్ గ్లకోమా విషయంలో పెద్దలు లేదా పెద్ద పిల్లలకు చేసే పరీక్షలతో పోలిస్తే, చిన్న పిల్లలకు చేయాల్సిన పరీక్షలు కష్టమైనవే అని చెప్పవచ్చు. కాబట్టి చిన్నారులకు చేయాల్సిన ఈ పరీక్షలను ఆపరేషన్ గదిలో అనస్థీషియా (మత్తుమందు) ఇచ్చి చేయాల్సి ఉంటుంది. వారికి నిర్వహించాల్సిన పరీక్షలివే...

కంటిలో ఉండే ఇంట్రా ఆక్యులార్ ప్రెషర్‌ను కొలవడం
కంటిలోని నల్లపాప (కార్నియా) వ్యాసాన్ని కొలవడం
కంటోని నల్లపాప ఎంత స్పష్టంగా ఉందో (కార్నియల్ క్లారిటీ) తెలుసుకోవడం. కనుగుడ్డు మొత్తం వ్యాసాన్ని (యాగ్జియల్ లెంగ్త్) కొలవడం. కంటి నరం, కంటి డిస్క్‌కు జరిగిన నష్టాన్ని (డ్యామేజీని) తెలుసుకోవడం.
కంటిలో దృష్టిలోపాలు (రిఫ్రాక్టివ్ ఎర్రర్స్) ఏవైనా ఉన్నాయేమో తెలుసుకోవడం.
యాక్వియస్ ఫ్లూయిడ్ బయటకు వెళ్లే డ్రైనేజీ యాంగిల్‌ను అంచనా వేయడం కోసం ‘గోనియోస్కోపీ’ పరీక్షను నిర్వహించడం.

ఇది వంశపారంపర్యమా?
తల్లిదండ్రుల్లో గ్లకోమా ఉంటే పిల్లల్లో ఛైల్డ్‌హుడ్ గ్లకోమా వచ్చే అవకాశాలు 10 శాతం ఉంటాయి. ఒకవేళ తలిదండ్రులిద్దరిలో ఒకరికి గ్లకోమా ఉంటే వారి తొలిచూలు, మలిచూలులో పుట్టిన పిల్లల్లో కంజెనిటల్ గ్లకోమా వచ్చే అవకా శాలు 5 శాతం మందిలో ఉంటాయి. ఒకవేళ పుట్టిన తొలిచూలు, మలిచూలు పిల్లల్లో కంజెనిటల్ గ్లకోమా ఉంటే... ఆ తర్వాత పుట్టే పిల్లల్లో గ్లకోమా వచ్చే అవకాశాలు 25 శాతం మేరకు ఉంటాయి.

No comments: