all

Monday, December 3, 2012

నమ్ము... సహాయపడు... సంతోషం పంచుకో...
ఇవీ భార్యభర్తలు పాటించవలసిన సూత్రాలు.
అవి అదుపుతప్పినప్పుడే భర్త చేతిలో భార్య బాధితురాలవుతుంది...
భార్య వల్ల భర్త బాధితుడవుతాడు.
లాయర్‌గా, నటుడిగా కంటే ‘భార్యాబాధితుల సంఘం’ వ్యవస్థాపకుడిగా సివిఎల్ ప్రసిద్ధుడు.
తీరా ఈయన భార్యాబాధితుడా అంటే ‘ఆ సంఘం పెట్టాలనే ఆలోచనే నాది’ అంటారు ఆయన శ్రీమతి అనురాధ.
రొటీన్‌గా కనిపించని ఈ దంపతుల ముప్పై ఏళ్ల దాంపత్య అనుభవాల సారమే ఈనాటి మన బెటర్‌హాఫ్...


సివిఎల్ నర్సింహారావు ఇంటికి వెళుతున్నప్పుడు ఒక్కక్షణం చిన్న అనుమానం వచ్చింది- ఆయన భార్యాబాధితుడిగా కనిపిస్తాడేమోనని. టీ పెడుతూ, బట్టలుతుకుతూ, తిట్లు తింటూ... కాని సికింద్రాబాద్ పద్మారావునగర్‌లోని వారింటికి వెళ్లినప్పుడు ఆయనా, ఆయన శ్రీమతి అనురాధ ముచ్చటైన జంటగా కనిపించారు. వీరితో మాట్లాడుతుంటే వీరి మధ్య ఉన్న బాంధవ్యమే కాదు, ఇద్దరు లాయర్ల మధ్య పోటీతత్వమూ రాధాగోపాళం సినిమాలోలా కళ్లకు కట్టింది.

అతను - ఆమె

‘చాలామంది పెళ్లిళ్లలాగే మాదీ అనుకోకుండా జరిగింది’ అన్నారు సివిఎల్ మొదలుపెడుతూ. ఆయన స్వస్థలం కృష్ణాజిల్లా. ‘మా అన్నయ్య ఫారిన్ నుంచి వచ్చే టైమ్‌కి నా పెళ్లికి నేనే డేట్ ఫిక్స్ చేసుకున్నాను- ఆయన తిరిగి వెళ్లేలోపల ఆ డేట్‌లో పెళ్లి అయిపోవాలని. ఆ ప్రకారమే హడావుడిగా పెళ్లికూతురిని చూడటం మొదలుపెట్టాను. కజిన్ ద్వారా అనురాధ సంబంధం వచ్చింది. అప్పడు ఈమె ఇంటర్మీడియెట్ చదువుతోంది’ అన్నారు సివిఎల్.

‘పెళ్లి గురించి ఎలాంటి అవగాహన లేని వయసది. అందుకేనేమో ముందే ఈయన ‘మా అమ్మను చూసుకోవడం కోసమే నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను’ అని చెప్పినా సరేనని తలూపాను’ అన్నారు అనురాధ. ఆమె స్వస్థలం గోదావరి జిల్లా. ఇంటర్మీడియట్‌లో ప్రాక్టికల్ రికార్డ్స్ రాసే బాధ తప్పుతుందని కూడా పెళ్లికి ఒప్పుకున్నారట. వీరి వివాహం 1982లో అయింది. ఆ తర్వాత రెండేళ్లకు బాబు, మరో ఐదేళ్లకు పాప పుట్టారు. ‘పెళ్లి నాటికి నేను మైనర్‌నే. ‘లా’ ప్రకారం ఇది నేరం’ అంటూ ఇప్పటికీ భర్తతో వాదించే ఆమె 30 ఏళ్లుగా సంసారాన్ని సరాగంలా మార్చుకున్న వైనాలెన్నో తెలిపారు.

రాధాగోపాళం...

సివిఎల్ లాయర్ మాత్రమే కాదు. మంచి నటుడు కూడా. ఎన్నో సినిమాల్లో నటించారు. స్టేజీ మీద నాటకాలు వేసేవారు. సామాజిక సేవ చేపట్టారు. రాజకీయాల్లోనూ ప్రవేశించారు. అనురాధ గృహిణి మాత్రమే కాదు, లాయర్ కూడా. భర్త నటుడిగా కెమెరా ముందుకు వచ్చారని ఆమే టీవీ షోలలో పాల్గొన్నారు. డాక్యుమెంటరీ ఫిల్మ్స్‌కి దర్శకత్వం వహించారు. వృత్తిలో తన సత్తా నిరూపించుకున్నారు. ఫ్యామిలీ కౌన్సెలర్‌గా ఎన్నో సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఇద్దరికిద్దరు ఏ విషయంలోనూ తీసిపోరు. ఒకే రంగంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు వివాహబంధంలో ఎంతవరకు ఇముడుతారనే విషయం అడగ్గానే -‘నేను ఎంచుకున్న రంగాలలో ప్రవేశించడం వల్లే తను వాటిలోని సాధకబాధకాలు తెలుసుకోగలిగింది. దానివల్లేనేమో నేనెప్పుడైనా కాస్తంత డౌన్ అయినట్టు అనిపించినా ‘నేనున్నాను కదా’ అనే సపోర్ట్ అనురాధ నుంచి లభించింది’ అని తనలోని సగ భాగాన్ని మెచ్చుకుంటూనే, ఆలుమగలు ఒకే రంగంవారైతే కలిగే ప్రయోజనాలనూ తెలియజేశారు సివిఎల్.

‘పెళ్లి వల్ల ఇంటర్మీడియట్‌తో చదువు ఆపేసిన నేను ఈయనకున్న పాపులారిటీ చూసి మొదట్లో కుళ్లుకునేదాన్ని. ఎలాగైనా నేనూ లాయర్ అయి తీరతాను అనేదాన్ని. ఈయన ‘నీవల్లకాదులే’ అన్నట్టు చూసేవారు. ఎందుకు కాదో చూద్దామనే పంతంతో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా డిగ్రీ చేశాను. పిల్లల పరీక్షలు నా పరీక్షలు ఒకే రోజు ఉండేవి. ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయో చూద్దామా అని పిల్లలతో పోటీపడేదాన్ని. ‘లా’ పూర్తయ్యాక ఎవరిదగ్గరో ఎందుకని ఈయన దగ్గరే జూనియర్‌గా చేరాను. భార్య కదా అని ఏ మాత్రం ఫ్రీగా ఉండనిచ్చేవారు కాదు. మిగతా జూనియర్స్‌కన్నా ఎక్కువ పనులే అప్పజెప్పేవారు. ఏ నోటీస్ రాసినా ఓ పట్టాన నచ్చేది కాదు. ‘ఎంతైనా సీనియర్, తప్పదు’ అనుకుంటూ, కోపాన్ని అణచుకునేదాన్ని. ‘ఎప్పటికైనా ఏదో ఒక కేసులో ఈయన మీద గెలిచి తీరాలి... అప్పుడు తెలిసొస్తుంది నేనేంటో’ అనుకునేదాన్ని.అనుకున్నట్టే ఈ మధ్యే ఓ కేసు విషయంలో ఈయన మీదే గెలిచాను. విచిత్రమేమిటంటే నాకన్నా ఈయనే ఎక్కువ సంతోషించారు...’ అని చెబుతున్న అనురాధ వృత్తిపరమైన కోపాలను ఇద్దరం ఇంటికి తెచ్చేవారం కాదనే విషయాలనూ తెలియజేశారు. గృహిణిగా ఇంటికే పరిమితం చేయకుండా సమాజంలో తనకో ఉనికిని కల్పించిన గురువు తన భర్తేనని సివిఎల్‌ను మనసారా అభినందించారు ఆమె.

ఆడుతు పాడుతు పనిచేస్తుంటే...

చదువు, కోర్టు, పిల్లల బాధ్యతలు, ఇంటి పనులు... బ్యాలెన్స్ చేసుకోవడం గురించి చెబుతూ- ‘కోర్టుకు ఇద్దరం పొద్దున్నే వెళ్లిపోవాలి. నేను చపాతీలు చేస్తుంటే ఈయనే కాల్చిస్తారు. ఈయన కూరగాయలు తరుగుతుంటే నేను కూరచేస్తాను...’ అని పాటలా సాగే సంసారనౌకకు ఆలూమగలు ఇంటి పనుల్లోనూ సమానమే అని తెలిపారు ఈ దంపతులు. ‘ఆర్థిక విషయాల్లో నేనే ఎక్కువ చొరవ తీసుకుంటాను. ఎందుకంటే బ్యాంకు ఖాతాలు, చెక్కుబుక్కులు... ఆ వివరాల గురించి ఈయనకు ఏమీ తెలియదు. ఇప్పటివరకు ఈయన ఒక్క చెక్కు కూడా తన చేతుల మీదుగా బ్యాంకులో వేసింది లేదు’ అని అనురాధ చెబుతుంటే సివిఎల్ మందహాసం చేస్తూ కనిపించారు. ఆ నవ్వుల వెనక... ఆర్థిక విషయాల్లో భార్యామణికి స్వేచ్ఛనిస్తే కుటుంబం సాఫీగా నడిచి పోతుందనే మతలబు కనిపించింది. ఇరువైపుల పుట్టింటివారిని, బంధువులను భార్యాభర్తలు ఎలా చూసుకోవాలనే అంశం గురించి ప్రస్తావిస్తే - ‘నాకు ఐదుగురు అక్కచెల్లెళ్లు. 86 ఏళ్ల మా అమ్మ నా దగ్గరే ఉంటుంది. ‘అత్తయ్యగారూ..’ అంటూ ఈయన నోటి నిండుగా పిలుస్తారు. మా నాన్నగారి కర్మకాండలు దగ్గరుండి చేశారు. భార్య పుట్టింటివారిని కూడా తన కుటుంబంగా భావించి, గౌరవమర్యాదలు ఇచ్చే భర్త అంటే ఏ భార్యకైనా అవ్యాజమైన ప్రేమ కలుగుతుంది’ అన్నారు అనురాధ. ‘అది అక్షరాలా నిజమనే విషయం చాలామంది భర్తలకే కాదు భార్యలకూ అర్థం కాదు కనుకనే ఒకరి మనసును ఒకరు ముక్కలు చేస్తుంటారు’ అన్నారు సివిఎల్.

తోడు... నీడ...

సంసారమన్నాక సమస్యలు తప్పవు. వీరి దాంపత్యంలోనూ ఎన్నో సంఘటనలు సమస్యలను సృష్టించాయి. అందులో ఒకటి ‘భార్యాబాధిత సంఘం’. ఈ విషయం గురించి అనురాధ మాట్లాడుతూ- ‘భార్యాబాధిత సంఘం ఆలోచనే నాది. మంచి భార్యలు చెడ్డ భర్తలతో ఎలాగైతే కష్టాలు పడుతున్నారో, మంచి భర్తలు చెడ్డ భార్యలతో అలాగే కష్టాలు పడుతున్నారు. అలాంటివారిని ఎంతోమందిని చూశాను. నిత్యం మా దగ్గరకు భర్త బాధిత మహిళలే కాదు, భార్యా బాధిత భర్తలు కూడా వస్తుంటారు. అలా వచ్చేవారికి సివిఎల్ నేనూ కౌన్సెలింగ్ ఇస్తున్నాం. ‘మంచి భర్త’కు మేలు కలగాలన్న నా ప్రతిపాదన ఓ రోజు ఈయన ముందు ఉంచాను. ఇద్దరం మాట్లాడుకుని ‘భార్యాబాధిత సంఘం’ పెట్టాం. మరుసటిరోజు హైకోర్టు నోటీస్ బోర్డులో ‘సివిఎల్ ... భార్యాబాధితుడు’ అని రాశారు. ఆరోజు చాలా బాధనిపించింది. మంచి చేద్దామనుకుంటే మన గురించి చెడుగా మాట్లాడుకునేవారు ఎక్కువయ్యారని. ఆ రోజే ‘మేం విడిపోలేదు. కలిసే ఉన్నాం’అని ప్రెస్‌మీట్ పెట్టి చెప్పుకునే పరిస్థితి వచ్చింది. అంతేకాదు, మహిళాసంఘాల నేతల నుంచీ వ్యతిరేకత వచ్చింది. ఇక ఈయన ముక్కుసూటితత్వం, నిజాయితీ కొంతమంది ఉన్నతోద్యోగులకు నచ్చేది కాదు. ఫలితంగా ఒకరోజు... రోడ్డుకు దగ్గరగా ఉందని మా ఇల్లు కూలగొట్టారు. తిరిగి ఆ ఇంటిని నిలబెట్టుకునేందుకు మానసికంగా, ఆర్థికంగా ఎంత కష్టపడ్డామో ఎప్పటికీ మర్చిపోలేం’ అన్నారు అనురాధ.

అబద్ధాలైనా అందమే...

‘కత్రినాకైఫ్ నటించిన మల్లీశ్వరి సినిమాలో ఈయనా ఉన్నారు. ఆ హీరోయిన్ అందం గురించి అడిగితే, ‘నువ్వే నా కత్రినా, నువ్వే నా ఐశ్వర్య... నీకన్నా ఎవరూ అందంగా కనిపించరు నాకు’ అన్నారు. అది నిజమేనని అప్పుడు ఎంత మురిసిపోయానో... కాని...’ అని చెప్పుకుపోతున్న శ్రీమతి వాక్ప్రవాహానికి కళ్లెం వేస్తూ ‘కొన్ని సందర్భాల్లో అబద్ధాలు ఆడకపోతే పనులు జరగవోయ్’ అని నవ్వేస్తూ ‘బాంధవ్యం బాగుండాలంటే అబద్ధాలు ఆడినా పర్వాలేదు’ అన్నారు సివిఎల్.

మ్యారేజ్‌ను ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలిసిన లాయర్ సివిఎల్... లోకం తెలియని తన అర్థాంగిలోని ‘పంతాన్ని’గ్రహించారు. ఆమెను చదువుకునేలా ప్రోత్సహించారు. వృత్తిలో ఎదిగి తన కాళ్ల మీద తను నిలబడగలిగే స్వతంత్రను కల్పించారు. కుటుంబాన్ని చక్కదిద్దే నేర్పును కలిగించారు. అయితే వీటన్నింటినీ తెలుసుకుంటూనే తెలివిగా సివిఎల్‌కి సమవుజ్జీగా నిలిచారు అనురాధ. ‘భార్యభర్తలిద్దరూ సమానమే. కాకపోతే భర్తే కాస్త ఎక్కువ సమానం’ అనే శ్రీవారితో ఇప్పటికీ ఆమె ప్రేమగా వాదిస్తూనే ఉన్నారు.
- నిర్మలారెడ్డి

ఎప్పటికైనా ఏదో ఒక కేసులో ఈయన మీద గెలిచి తీరాలి... అప్పుడు తెలిసొస్తుంది నేనేంటో’ అనుకునేదాన్ని. అనుకున్నట్టే ఈ మధ్యే ఓ కేసు విషయంలో ఈయన మీదే గెలిచాను. విచిత్రమేమిటంటే నాకన్నా ఈయనే ఎక్కువ సంతోషించారు.
- అనురాధ

నేను ఎంచుకున్న రంగాలలో ప్రవేశించడం వల్లే తను వాటిలోని సాధకబాధకాలు తెలుసుకోగలిగింది. దానివల్లేనేమో నేనెప్పుడైనా కాస్తంత డౌన్ అయినట్టు అనిపించినా ‘నేనున్నాను కదా’ అనే సపోర్ట్ అనురాధ నుంచి లభించింది
- సివిఎల్

No comments: