all

Monday, December 3, 2012

డాక్టర్‌ని అడగండి - ప్లాస్టిక్ సర్జరీ

నా వయసు 28. ఇంత చిన్నవయసులోనే బట్టతల స్పష్టంగా కనిపిస్తోంది. పైగా నాకింకా పెళ్లి కాలేదు. నా వయసు చెప్పినా ఎవరూ నమ్మడం లేదు. మొదట్లో నాకు ఒత్తై జుట్టు ఉండేది. మనోవేదన భరించలేక హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకుందామని నిర్ణయించుకున్నాను. అయితే ఇటీవల నా ఫ్రెండ్స్ ద్వారా ఒక మాట విన్నాను. ట్రాన్స్‌ప్లాంటేషన్‌తో తలచర్మానికి క్యాన్సర్ రావచ్చని వాళ్లు చెబుతున్నారు. ఇది నిజమేనా? ట్రాన్స్‌ప్లాంటేషన్ తర్వాత ఏవైనా మందులు వాడాలా? నా అనుమానాలను నివృత్తి చేయండి.
- కె. శేఖర్‌బాబు, హన్మకొండ
హెయిర్‌ట్రాన్స్‌ప్లాంటేషన్ వల్ల క్యాన్సర్ వస్తుందన్న మాటల్లో ఎలాంటి వాస్తవం లేదు. ఈ ప్రక్రియలో మీ తలపై నాటేందుకు మీ వెంట్రుకలనే ఉపయోగిస్తారు. మన జన్యువులు నిర్దేశించిన విధంగా ఒక వయసు వచ్చాక వెంట్రుకలు రాలడం మొదలవుతుంది. ఇలా రాలడం కూడా యుక్తవయసుకు చేరినప్పటినుంచి సాధారణంగా తల ముందునుంచి ప్రారంభమవుతుంది. దాంతో హెయిర్‌లైన్ క్రమంగా వెనక్కు వెళ్తూ ఉంటుంది. అయితే ముందు భాగంలో ఎలా రాలినా, ఎంతగా రాలినా సాధారణంగా తల వెనకవైపున చెవుల మధ్య భాగంలోని వెంట్రుకలు మాత్రం అంతగా రాలవు. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాల్సి వచ్చినప్పుడు మనం అక్కడి నుంచి వెంట్రుకలను సేకరించి రాలిన భాగంలో అంటే ముందువైపున నాటుతాం. మన వెంట్రుకలే మనకు వాడటం వల్ల అవి పూర్తిగా సురక్షితం. కాబట్టి వాటితో క్యాన్సర్ రావడానికి అవకాశమే లేదు.

ఇక వాటివల్ల ఇతరత్రా సైడ్‌ఎఫెక్ట్స్ కూడా ఉండవు. కాకపోతే ఒకసారి తొలగించాక నాటువేసిన భాగంలో వెంట్రుకలు రావడానికి నాలుగు నుంచి తొమ్మిది నెలలు పట్టవచ్చు. ఒకసారి అవి నార్మల్ అయితే మిగతా నార్మల్ వెంట్రుకల్లాగే వాటినీ స్టైల్ చేసుకోవచ్చు. ఇక మందుల విషయానికి వస్తే హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ తర్వాత తొమ్మిది నెలల వరకు మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లు, ఒక హెయిర్ ఆయిల్ వాడాల్సి ఉంటుంది. కొత్తగా అమర్చిన జుట్టుకు అవసరం లేకపోయినా, మిగతా జుట్టు రాలిపోయే ప్రక్రియ స్వాభావికంగా కొనసాగుతూనే ఉంటుంది కాబట్టి దాన్ని ఆపడానికి మాత్రం కొన్ని మందులు వాడాల్సి ఉంటుంది. మీరు ఒకసారి ప్లాస్టిక్ సర్జన్‌ను సంప్రదించి తగిన సలహా తీసుకోండి.

నేను టీనేజీకి వచ్చినప్పటి నుంచి ముఖంపై చాలా ఎక్కువగా మొటిమలు వస్తున్నాయి. ఆ తర్వాత అక్కడ నల్లటి మచ్చ పడుతోంది. వీటివల్ల ముఖమంతా గుంతలు పడినట్లుగా మారి అసహ్యంగా కనిపిస్తోంది. ఈ విషయమై నాకు మంచి సలహా ఇవ్వండి.
- సుమలత, పాలకొండ


మొటిమ వచ్చిన చోట మచ్చ పడటానికి అనేక అంశాల దోహదపడతాయి. మొటిమ వచ్చిన చోట ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని తెల్లరక్తకణాలు ఎదుర్కొంటాయి. ఒకసారి ఆ ఇన్ఫెక్షన్ తగ్గాక అక్కడ దెబ్బతిన్న చర్మాన్ని నయం (రిపేర్) చేసే ప్రక్రియ మొదలువుతుంది. అందులో భాగంగా అక్కడి కణజాలం నల్లగా మారుతుంది. ఒక్కోసారి ఆ ప్రాంతమంతా ఉబ్బినట్లు కావడమో లేదా గుంతలాగా పడటమో కూడా జరగవచ్చు. అప్పుడది మచ్చలాగానో, గుంతలాగానో మారవచ్చు. ఈ గుంతలను తగ్గించడానికి సర్జికల్ డెర్మాబ్రేషన్ అనే ప్రక్రియ బాగా ఉపయోగపడుతుంది. మీరు ఒకసారి మీకు దగ్గరలోని ప్లాస్టిక్ సర్జన్‌ని కలవండి.


డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం
 

No comments: