all

Monday, December 3, 2012

డబ్బు విషయంలో మన దుర్లక్షణాలు

‘డబ్బున్న ఉన్నవారికే డబ్బు వస్తుంది.. మనలాంటి వారికి ఎక్కడొస్తుంది’ అనే సనాతన, పురాతన, సంప్రదాయ ఆలోచనలు ఏవైనా మీకుంటే వెంటనే వాటిని బుర్రలోంచి తొలగించండి. అసలు మీకు సంపద రాకుండా చేస్తున్నది ఇలాంటి ఆలోచనలే. చాలామందిలో కనిపించే కొన్ని ఆర్థిక దుర్లక్షణాలు మీకోసం. వెంటనే వదిలించేసుకోండి.

జీతంలో కోతేసుకోవద్దు: వినోదం కోసం, విహారయాత్ర కోసం, వృథా చిల్లర ఖర్చుల ఒత్తిడి నుంచి తప్పించుకోవడం కోసం మీరు అప్పులు చేస్తున్నారంటే మీది భస్మాసుర హస్తమే. అంటే మిమ్మల్ని మీరే నాశనం చేసుకునే వర్గం అని. ప్రతి దానికీ ఏదో ఒక లోను తీసుకుని ఏళ్లకు ఏళ్లు బాధపడటం మొదట ఆపేయండి. అత్యవసర ఖర్చులకు తప్ప మరి దేనికీ రుణం తీసుకోవద్దు. కేవలం 50 వేలు లోను తీసుకుంటే రెండు మూడేళ్లు మీ జీతం రెండు మూడు వేలు తగ్గినట్టే.

డబ్బును గౌరవించండి: ప్రతి దానికీ మీ పేదరికాన్ని తిట్టుకోకండి. ప్రతికూలంగా ఆలోచించకండి. ఆర్థిక సూత్రాలు తెలుసుకుని వాటి నుంచి బయటపడే మార్గాలు ఆలోచించండి. అది మానేసి కేవలం డబ్బు కష్టాల గురించి ఆలోచిస్తూంటే అదీ తీరదు, పైగా ఆరోగ్య నష్టం అదనం.

ఖర్చులు తెలుసుకోండి : చాలామంది ఆదాయానికి ఖర్చులకు పొంతన ఉండదు. దీనికి కారణం వారు దాన్ని ఒకమార్గంలో పెట్టకపోవడం వల్లే. తినే తిండి సమయానికి తినకపోతే దేహం ఎలా ఇబ్బంది పడుతుందో, పెట్టే ఖర్చు పెట్టాల్సినపుడు, పెట్టాల్సిన చోట కాకుండా మరోచోట పెడితే మనం అంతే ఇబ్బంది పడతాం. మీ ఖర్చులు తెలుసుకోవడం వల్ల మీకెంతో ఆర్థిక జ్ఞానం వస్తుంది. కావాలంటే ఓ రెండు నెలలు ట్రై చేయండి చాలు.

స్థాయికి మించి బతకొద్దు : మీ ఖర్చు ఎప్పుడూ మీకు సంతృప్తి ఇవ్వాలి గాని ఎదుటి వారికి ఆశ్చర్యాన్ని ఇవ్వకూడదు. అంటే ఇతరుల మెప్పుకోసం బతకొద్దు. ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి. ‘మీ ఖరీదైన ఫోను అంత ధర పలకడానికి కారణం అందులోని ఫీచర్లు. మరి వాటన్నిటినీ మీరు వాడుతున్నారా?’ ఇలాగే ఉంటాయి మనఖ ర్చులన్నీ. మనకు ప్రస్తుతం ఉపయోగపడేదే కొనాలి అది ఏవస్తువైనా! కష్టాలొస్తే ఎవ్వరూ చిల్లిగవ్వ కూడా ఇవ్వరు కాబట్టి ఇంకొకరి మెప్పు కోసం విలాసంగా బతకకండి. మీకా స్థాయి ఉంటే ఓకే.

No comments: