all

Monday, December 3, 2012

అప్పుడే పుట్టిన శిశువుకు స్నానం ఎప్పుడు ..ఎలా చేయించాలి...?

ఇటీవల కాలంలో చాలా మంది అమ్మలు చిన్నారులకు స్నానం ఎప్పుడు చేయించాలి ? స్నానం తర్వాత ఆయిల్‌తో మసాజ్‌ చేయించవచ్చా? ఇలా ఎన్నో సందేహాలు కలిగి ఉంటారు. గతంలో అమ్మమ్మలు, నానమ్మలు చిన్నారులకు స్నానం చక్కగా చేయించేవారు. ఇప్పుడు అమ్మలకు అమ్మమ్మల, నానమ్మల సహకారం అంతగాలేదు. మరో ముఖ్యమైన విషయమేమంటే ఇప్పటి అమ్మమ్మలకు, చాలా మందికి చిన్నారులకు స్నానం ఎలా చేయించాలో తెలియదు. 'ఏమో... నాకేమి తెలుసు. మా పిల్లలకు అంతా మా మమ్మీనే చూసుకునేది' అని ఇప్పటి అమ్మమ్మలు అంటున్నారు. అందుకే చిన్నారుల స్నానం ఆయాలకు, పని మనుషులకు అప్పజెపుతున్నారు. వారికీ సరిగ్గా తెలియదు. వారికేమి శ్రద్ధ ఉంటుంది? మీ చిన్నారులు వారి చిన్నారులు కాదు కదా? కాగా అద్భుతమైన స్నానాన్ని చిన్నారులు అరకొరగా పొందుతున్నారు. చిన్నారులకు స్నానం మంచి రిలాక్సేషన్‌ ఇస్తుంది. కాబట్టి చిన్నారుల స్నానం గురించి అమ్మలు, అమ్మలూ నేర్చుకుంటే బాగుంటుంది.
baby bath basics parent guide

పుట్టిన వెంటనే చాలా మంది చిన్నారులకు ఎడాపెడా స్నానం చేయిస్తుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. చిన్నారులు అమ్మకడుపు వెచ్చని వాతావరణం నుండి అప్పుడే బయటపడతారు. వారికి ఈ ప్రపంచంలో వెంటనే వెచ్చదనం కలిగించాలి. మెత్తని శుభ్రమైన గుడ్డతో చిన్నారిపైన ఉండే ద్రవాలు మెల్లిగా ఒత్తాలి. రుద్దరాదు. పలుచని పొడి గుడ్డలు, పొరలు పొరలుగా మడిచి చిన్నారులను చుట్టిపెట్టాలి. పుట్టిన వెంటనే స్నానం చేయిస్తే, చిన్నారులు 'హైపోథెర్మియా' అనే ప్రమాదకరమైన వ్యాధికి గురవుతారు. ఈ వ్యాధితో ఎంతో మంది చిన్నారులు మరణిస్తున్నారు.
1. వారం రోజుల వయసు పూర్తయ్యే వరకు చిన్నారులకు స్నానం చేయించవద్దు. మెత్తని గుడ్డను వేడి నీటిలో ముంచి, నీటిని పిండి చిన్నారిని సున్నితంగా శుభ్రం చేయాలి. అప్పుడే పుట్టిన చిన్నారికి శరీరంపైన తెల్లని 'వెర్నిక్స్‌ కేసియోసా' అనే పదార్థం ఉంటుంది. ఈ పదార్థం చిన్నారికి మంచి రక్షణను ఇస్తుంది. అదే నిదానంగా పోతుంది. తీసివేయరాదు.
2. పుట్టిన తర్వాత మొదటి కొన్ని గంటలు చిన్నారులను ఎక్కువగా కదలించరాదు. ఎక్కువ మంది ఎత్తుకోరాదు. శుభ్రమైన పొడి చేతులతో తాకాలి.
3. ఒకవారం వయసు తర్వాత చిన్నారికి స్నానం చేయించడం మొదలుపెట్టాలి. రోజుకోసారి స్నానం చేయిస్తే సరిపోతుంది. చాలా మంది తలస్నానం రోజూ చేయిస్తారు. తల స్నానం వారానికి ఒక రోజు చేయిస్తే చాలు.
4. తరతరాలుగా మన అమ్మమ్మలు చిన్నారులను కాళ్లపై బోర్లాపడుకోబెట్టి స్నానం చేయించడం ఆనవాయితీ. ఇది చాల మంచి పద్ధతి. ఇందువల్ల ప్రమాదాలు జరగవు. చిన్నారులు సొంతంగా కూర్చునేవరకు ఈ పద్ధతి మంచిది. ఈ పద్ధతిలో చిన్నారికి స్నానం అయిన తర్వాత, కాళ్లపైనే చిన్నారులను పూర్తిగా మెత్తని గుడ్డతో తుడిచి, కాళ్లపై నుండి తీసేస్తే మంచిది. సబ్బునీరు, మురికినీరు, ఆయిల్‌తో కలిసిన నీరు చిన్నారుల ముక్కులోకి, నోట్లోకి కళ్లలోకి పోకుండా జాగ్రత్తపడాలి.
5. చిన్నారులకు తొట్టి స్నానం బాగుంటుంది. ఇప్పుడు చాలా మంది చిన్నారులకు తొట్టిస్నానం చేయిస్తున్నారు. అందరికీ అందుబాటులో ఉండే ప్లాస్టిక్‌ తొట్లు లభిస్తున్నాయి. తొట్టిలో 2/3 భాగం నీరు పోయాలి. తొట్టి స్నానంలో చిన్నారులు నీటిలో మునగకుండా చూసుకోవాలి. ముఖం నీటి బయట ఉంచాలి. చిన్నారుల స్నానం తొట్టిలో చిన్న చిన్న ప్లాస్టిక్‌ బొమ్మలు వేయాలి. చిన్నారులను ఆడనివ్వాలి. ఇందువల్ల మంచి రిలాక్సేషన్‌, వ్యాయామం లభిస్తుంది. చిన్నారులు నిలబడే వయసులో తొట్టి స్నానం మొదలు పెట్టాలి.
6. చిన్నారులకు రోజూ ఒకే సమయంలో స్నానం చేయించాలి. పాలుతాపక ముందే స్నానం చేయిస్తే మంచిది. పాలు పట్టిన తర్వాత స్నానం చేయిస్తే, పాలు బయటికి తెస్తారు.
7. చిన్నారుల స్నానానికి వాడే నీరు చల్లగా ఉండరాదు చాలా వేడిగా ఉండరాదు. కొద్దిపాటి వెచ్చగా ఉంటే సరిపోతుంది.
8. ఎలాంటి సబ్బు వాడాలి? మార్కెట్‌లో 'బేబీ సోప్స్‌' అని లభిస్తుంటాయి. పేరును బట్టి ప్రయోజనాలుండవు. ఏ సబ్బు అయినా ఒకటే. గ్లిజరిన్‌ ఎక్కువగా ఉండి, సెంటు వాసన లేని సబ్బులు చర్మానికి మంచిది.
9. చాలా మంది అమ్మలు స్నానం చేయించి, శరీరానికి టాల్కం పౌడర్‌ పూస్తారు. టాల్కం పౌడర్‌ వల్ల పెద్దగా ప్రయోజనాలు ఉండవు. పౌడరు అలెర్జీ కలిగించవచ్చు. చర్మపు మడతలో చేరి ఇబ్బంది కలిగించవచ్చు. మరీ అమ్మలు పౌడర్‌ రాయాలని ముచ్చట పడితే, చాలా కొద్దిగా, తేలికగా రాస్తే సరిపోతుంది.
10. స్నానం అయిన తర్వాత ముక్కు రంధ్రాలు, పై చెవులు పలుచని గుడ్డను ఒత్తిలా చేసి శుభ్రం చేయాలి.
11. చాలా మంది చిన్నారికి స్నానం చేసిన తర్వాత సాంబ్రాణిపొగ వేస్తుంటారు. దీని వల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోగా కంటి జబ్బులు, శ్వాసకోశ జబ్బులు, అలెర్జీ జబ్బులు వచ్చే ప్రమాదముంది.
12. చిన్నారులకు కొందరు కాటుక పెడతారు. కాటుక వల్ల కూడా ప్రయోజనాలు లేకపోగా కంటి జబ్బులు వస్తాయి. చిన్నారులకు చేయించే స్నానం మీకు, మీ చిన్నారికి ఆనందం, ఆరోగ్యం కలిగేలా ఉండాలి. ఇందువల్ల ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా జాగ్రత్తపడాలి. ఈ అంశాలను మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, సహచరులతో పంచుకోండి!

No comments: