all

Monday, December 3, 2012

మూర్ఛపై అపోహలు తొలగాలి


డాక్టర్‌ గోపాళం శివన్నారాయణ
న్యూరాలజిస్ట్‌
గిరిజ న్యూరోసెంటర్‌
కామయ్యతోపు పెట్రోలు బంకు ఎదురు రోడ్డు, విజయవాడ. ఫోన్‌ : 0866-2586600



రక్తంలో ఏ జబ్బు వచ్చినా బయటికి జ్వరంలాగా వస్తుంది. పేగులకు జబ్బు చేస్తే వాంతులు, చిన్న పేగులకు జబ్బు చేస్తే విరోచనాలు వస్తాయి. ఊపిరితిత్తులకు జబ్బు చేస్తే వచ్చేది దగ్గు. అలాగే మెదడుకు ఏ జబ్బు చేసినా అది బయటికి మూర్ఛలాగా కనిపిస్తుంది. మూర్ఛ వ్యాధిగ్రస్తులను భూతర అని, దయ్యం అని, ఉద్యోగాలకు పనికిరారని, శాపగ్రస్తులని రకరకాల పేర్లు పెట్టారు. పెళ్లి చేసుకోవడానికి పనికిరారని అంటుంటారు. ఇవన్నీ అపోహలే. జనాల్లో ఉన్న అమాయకత్వం, అజ్ఞానం వల్ల మూర్ఛ వచ్చిన వాళ్లను సాంఘికంగా హింసిస్తుంటారు. క్రమం తప్పకుండా మందులు వాడటం వల్ల ఫిట్స్‌ను నియంత్రించొచ్చు. ఈ మందుల వల్ల చెడు ప్రభావాలు చాలా తక్కువేనని అంటున్నారు ప్రముఖ న్యూరాలజిస్ట్‌ డాక్టర్‌ గోపాళం శివన్నారాయణ. ఈ వారం మూర్ఛపై జనాల్లో ఉన్న అపోహలను, చికిత్సను గురించి వివరిస్తున్నారు. ఈ వివరాలు....

అవగాహన లేకే ఈ వివక్ష
మెదడు విద్యుత్‌ ప్రసరణ వల్ల పనిచేస్తుంది. దీంతో మెదడు శరీరంలో ఒక భాగం నుంచి ఇంకో భాగానికి సంకేతాలను చేరవేస్తుంది. మెదడులో జరిగే ప్రతీ చర్యలో విద్యుత్‌ ముఖ్యపాత్ర పోషిస్తుంది. అయితే అకస్మాత్తుగా ఎక్కువ విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది. ఇది మెదడులో ఒక భాగం నుంచి ఇంకో భాగానికి వ్యాపిస్తుంది. ఇలా బయటపడడాన్ని ఫిట్స్‌ లేదా మూర్ఛ అంటారు. జ్వరం వచ్చిన వాళ్లను, వాంతులు వచ్చిన వాళ్లను, దగ్గు, జలుబు వచ్చిన వాళ్లను ఏమనట్లేదు. కానీ మూర్ఛ వచ్చిన వాళ్లను మాత్రమే శాపగ్రస్తులంటున్నారు. మూర్ఛ వచ్చిన వాళ్లను బడికి రానివ్వడం లేదు. పెళ్లి చేసుకోవడానికి వెనకాడుతున్నారు. పెళ్లయినా మూర్ఛ ఉందని వదిలేసిన వాళ్లున్నారు. ఉద్యోగాలు ఇవ్వడం లేదు. ఇవన్నీ అమానుషం. దీనికి ముఖ్యమైన కారణం మూర్ఛ గురించి అవగాహన లేపోవడం, అర్థం చేసుకోలేకపోవడం. వైద్యపరంగా కంటే మూర్ఛకు సాంఘికంగా ఎక్కువ ఇబ్బందులున్నాయి.

గర్భిణులు మందులు వాడొచ్చా ?
మూర్ఛ వ్యాధిగ్రస్తుల్లో అధికంగా మహిళలే తీవ్ర ఇబ్బందులకు గురవుతారు. చిన్న పిల్లలైతే బడికి రానివ్వకపోవడం, పెళ్లీడుకు వచ్చినప్పుడు పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోవడం, గర్భందాల్చినప్పుడు ఏమవుతుందోనని అందోళన చెందడం జరుగుతాయి. మూర్చ వ్యాధి ఉన్నా కూడా పెళ్లి చేసుకుని మందులు వాడవచ్చు. గర్భందాల్చిన తర్వాత కూడా మూర్ఛ మందులు వాడొచ్చు. ఏ మందులు వాడాలో వైద్యులు సూచిస్తారు. గర్భిణిగా ఉన్నప్పుడు మందులు వాడితే పిండానికి ఏమైనా హాని కలుగుతుందా? అనే అనుమానం భార్యభర్తల్లో ఉంటుంది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రమాదం లేదని అనుభవంలో తేలింది. మూర్ఛ ఉన్న గర్భిణులు ఆరోగ్యవంతుడైన బిడ్డకు జన్మనిచ్చారు. డాక్టర్‌ సలహా పాటించి, ఫిట్స్‌ బాగా కంట్రోల్‌ అయినప్పుడు గర్భం దాల్చడం ఒక పద్ధతి.

ముందుగా గుర్తించొచ్చా ?
మూర్ఛను ముందుగా గుర్తించే వీలు లేదు. కొంత మంది చిన్న పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు మూర్ఛ వస్తుంది. వీరిలో కొంత మందిలో రెండు కంటే ఎక్కువ సార్లు మూర్ఛ రావడం, వచ్చి ఎక్కువసేపు బాధపెట్టే వారికి భవిష్యత్తులో రావొచ్చు. తలకు దెబ్బలు తగిలిన వారిలో ఫిట్స్‌ రావడానికి అవకాశముంది. మెదడుకు రక్తప్రసరణ తగ్గి పక్షవాతం వచ్చిన వారిలో రావొచ్చు. కిడ్నీలు, లివర్‌ ఫెయిల్‌ అయినప్పుడు, ఊపిరితిత్తుల్లో తీవ్ర జబ్బులున్నవారిలో, గుండె జబ్బులున్నవారిలో ఫిట్స్‌ రావడానికి అవకాశముంది. మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో షుగర్‌ డౌన్‌ అవ్వడం వల్ల కూడా ఫిట్స్‌ వచ్చే అవకాశముంది.

నిర్ధారణ పరీక్షలు
ఫిట్స్‌ నిర్ధారణకు సీిటి స్కాన్‌ పరీక్ష చాలు. ఈ పరీక్షను ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగా చేస్తున్నారు. ఇదేకాక ఎలక్ట్రోఎన్‌సెఫిలోగ్రాం (ఇఇజి) అనే పరీక్ష చేస్తారు. మందులు ఇస్తున్నా ఫిట్స్‌ నియంత్రణలోకి రానప్పుడు మాత్రమే ఇఇజి పరీక్ష అవసరం. ఫిట్స్‌లో కొన్ని రకాలుంటాయి. అవి ఏ రకమైనవో తెలుసుకోవడానికి ఇఇజి పరీక్ష చేస్తారు. మెదడు వాపు వచ్చినప్పుడు మెదడులో నీరు తీసి పరీక్ష చేయాల్సి ఉంటుంది. ఎక్కువ శాతం జ్వరం వచ్చి, జ్వరం మీద మూర్ఛ వచ్చినప్పుడు అది మెదడువాపు వ్యాధి అవునో? కాదో? నిర్ధారణ చేసుకోవాలి. కిడ్నీలు, కాలేయం బాగున్నాయా? లేదా? రక్తకణాలు బాగున్నాయా? లేవా? షుగర్‌ ఎలా ఉందో? తెలుసుకోవడానికి పరీక్షలు చేస్తారు.

ఆపరేషన్‌ అవసరమా ?
నిజంగా చెప్పాలంటే, చాలా తక్కువ మందికి మాత్రమే ఆపరేషన్‌ అవసరం. నా అభిప్రాయం ప్రకారం 10000 మందిలో కేవలం ఒక్కరికే ఈ ఆపరేషన్‌ అవసరం. రోజుకు రెండు రకాల మందులు తీవ్రస్థాయిలో వాడినా కూడా, రోజుకు రెండు మూడు ఫిట్స్‌ వస్తుంటాయి. ఈ ఫిట్స్‌తో వీరి జీవనం కష్టమవుతుంది. దీన్ని రిఫ్రాక్టివ్‌ ఎపిలెప్సీ అంటారు. అలాంటి వారికే ఆపరేషన్‌ అవసరం.

అపోహలు
మూర్ఛ వచ్చిన వారిని భూతం, దయ్యం, శాపగ్రస్తులని, తెలివితేటలు సరిగ్గా ఉండవని, వీరు చదువుకోకూడదని, పెళ్లీలు చేసుకోకూడదని, ఉద్యోగాలు చేయకూడదనే అపోహలున్నాయి. ఇవన్నీ అవాస్తవాలు. వాస్తవానికి మూర్ఛవ్యాధి ఉన్న వాళ్లు డ్రైవింగ్‌కు పనికిరారు. ఎందుకంటే డ్రైవింగ్‌ చేసేటప్పుడు ఫిట్స్‌ వస్తే ప్రమాదాలు సంభవిస్తాయి. నిప్పు దగ్గర ఉంటే కాలిపోతారు. నీళ్ల దగ్గర ఉంటే మునిగిపోతారు. యంత్రపరికరాల దగ్గర పనిచేసేటప్పుడు ఫిట్స్‌ వస్తే, నలిగిపోవడం జరుగుతుంది. ప్రమాదాలకు గురయ్యే పనులు కాకుండా మిగతా పనులు చేసుకోవచ్చు. మూర్ఛ వ్యాధి వంశపారంపర్యంగా రాదు. వంశపారంపర్యంగా వచ్చే జబ్బుల జాబితాలో ఈ వ్యాధి లేదు.

లక్షణాలు - చికిత్స
మూర్ఛ వచ్చే ముందు తీవ్ర వణుకు, నోటి నుండి చొంగకారడం, మూర్ఛలో నాలుక కొరుక్కోవడం జరుగుతాయి. మళ్లీ కొంత సేపయ్యాక సాధారణ స్థితి నెలకొంటుంది. మూర్ఛ చికిత్సలో అధునాతన పద్ధతులు వచ్చాయి. కానీ వందలో ఒకరిద్దరికి తప్ప ఇవి చాలా మందికి అవసరం లేదు. మిగతా 99 మందికి చాలా సులభమైన పద్ధతుల ద్వారా వైద్యం చేయవచ్చు. మందులతోనే చికిత్స చేయవచ్చు. క్రమ పద్ధతిలో, సరైన డోసులో, డాక్టర్‌ సలహా మేరకు మందులు తీసుకుంటే 99 శాతం మందికి మూర్ఛ నియంత్రణ లో ఉంటుం ది. సాధారణ ంగా మూర్చ వ్యాధిగ్రస్తులు నాలుగేళ్ల నుంచి ఐదేళ్ల వరకు మందులు వాడుతుంటారు. వందలో 5 నుంచి 10 మంది 10 నుంచి 20 ఏళ్లు మందులు వాడాల్సి ఉంటుంది. ఇలా దీర్ఘకాలికంగా మందులు వాడటం వల్ల వచ్చే చెడు ప్రభావాలు తక్కువే. పిల్లలు, గర్భిణులు, పెద్దవాళ్లు అందరూ ఈ మందులు వాడొచ్చు.

ఏం జరుగుతోంది?
వైద్యంలో వ్యాపార ధోరణి ఎక్కువైంది. దీంతో జనం నిజమైన అర్హత ఉన్న వైద్యుల దగ్గరికి వెళ్లడానికి భయపడుతున్నారు. డాక్టర్లలో సామాజిక దృష్టి తగ్గిపోవడం వల్ల వ్యాపార ధోరణి పెరిగింది. ఎంబిబిఎస్‌ డాక్టర్‌ చేయాల్సిన పనిని చేయడం లేదు. మూర్ఛకు ఎంబిబిఎస్‌ డాక్టరు వైద్యం చేయగలరు. కానీ అలా చేయడం లేదు. ప్రతీదానికి సూపర్‌స్పెషాలిటి వైద్యుని దగ్గరికి పంపిస్తున్నారు. ఎంబిబిఎస్‌, ఎండిలు చూడాల్సిన కేసులు నేరుగా సూపర్‌స్పెషాలిటీ డాక్టర్లు చూస్తున్నారు. చిన్న చిన్న సమస్యలన్నీ పెద్ద డాక్టర్‌ దగ్గరికి వెళ్లడంతో అక్కడ విపరీతమైన రద్దీ ఎక్కువైతోంది. దీంతో ఈ డాక్టర్లు రోగులపై శ్రద్ధపెట్టడం మానేస్తున్నారు. డబ్బులపైన శ్రద్ధ ఎక్కువైంది. దీంతో వైద్యం ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది. అశాస్త్రీయ పద్దతులు అధికమయ్యాయయి. దీంతో రూపాయితో చేయాల్సిన వైద్యం ఖర్చు వంద రూపాయలవుతోంది. మూర్ఛ రోగికి వైద్యం చేయడానికి డిఎం కోర్సు చేసిన న్యూరాలజిస్టే అవసరం లేదు. ఎంబిబిఎస్‌ డాక్టరు కూడా మూర్ఛకు వైద్యం చేయగలరు.

కుటుంబ సపోర్టు
మూర్ఛవ్యాధి చికిత్సలో కుటుంబ సభ్యుల మద్దతు చాలా అవసరం. ఫిట్స్‌ వ్యాధి నియంత్రణలో కుటుంబ సభ్యుల పాత్ర కూడా కీలకమే. క్రమం తప్పకుండా వైద్యుని దగ్గరికి తీసుకెళ్లాలి. మందులు రెగ్యులర్‌గా వాడేటట్లు చూడాలి. డ్రైవింగ్‌ చేయనివ్వకూడదు. మహిళలు వంట చేసేటప్పుడు తోడుగా ఒకరుండాలి. వీలైనంత వరకు మూర్ఛ ఉన్న పురుషులను నీళ్ల దగ్గరికి వెళ్లనివ్వకూడదు.


వివిధ ప్రాంతాల్లో మూర్ఛ క్యాంపులు
జనవిజ్ఞాన వేదిక- జిబిఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో, డాక్టర్‌ శివన్నారాయణ పర్యవేక్షణలో 12 ఏళ్ల నుంచి రాష్ట్రవ్యాప్తంగా 16 కేంద్రాల్లో ఫిట్స్‌ క్యాంపులు నిర్వహిస్తున్నారు. నెలకు నాలుగు నుంచి 5 వేల మంది దాకా మూర్ఛ రోగులు వచ్చి క్యాంపులో పాల్గొని మందులు తీసుకెళ్తున్నారు. క్రమశిక్షణతో మందులను వాడటం వల్ల నియంత్రణ సాధ్యమైంది. కొన్నిచోట్ల ఉచితంగా మందులు ఇస్తున్నారు. ఇంకొన్నిచోట్ల చాలా సబ్సిడీపై నెలకు 30, 40, 50, 100 రూపాయలకు కూడా మందులు ఇస్తున్నారు. మందులు వేసుకున్నాకా ఆ మందుల స్ట్రిప్‌ను తీసుకొచ్చి ఇస్తేనే మళ్లీ ఆ నెలలో వాడాల్సిన మందులు ఇస్తారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఫిట్స్‌ క్యాంపులుజరుగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో క్యాంపులు నిర్వహించే నిర్వాహకుల ఫోన్‌నంబర్లు ఇస్తున్నాం. వారిని సంప్రదించి క్యాంపు వివరాలు తెలుసుకోవచ్చు.

దాచేపల్లి - సాంబశివరావు (9885179084),
మిర్యాలగూడ -శ్రీనివాస్‌ (9849626403), బాపట్ల - గోపాళం రవి (9440264365), వెంకట్రావు (9866131348)
పొదిలి- సుబ్బారెడ్డి (9440018382)
చల్లపల్లి - రామారావు (9440375079),
రాయదుర్గం -లక్ష్మినారాయణ (9440413368)
జంగారెడ్డి గూడెం - రామకృష్ణ (9440985066)
ఏలూరు - రామకృష్ణ (9440985066)
రంపచోడవరం - శ్రీనివాస్‌ (9490887583)
రాజమండ్రి - జవహర్‌ (9396678127)
బళ్లారి - విజయకుమార్‌ (09844804537)
అనంతపురం -రామిరెడ్డి (8008509320)
హిందూపురం-డా||రామ్మూర్తి (9440224585)
కదిరి -నరసారెడ్డి (9493359826)
మంగళగిరి -బాలకృష్ణ (9885170202)

No comments: