అన్ని అవయవాల్లాగే డయాబెటిస్‌వల్ల మెదడుపైనా దుష్ర్పభావం పడుతుంది. ఇది ప్రధానంగా పక్షవాతం రూపంలో ఉంటుంది. డయాబెటిస్ లేకపోతే పక్షవాతం వచ్చే రిస్క్ 21 శాతం తక్కువ. కారణం స్వచ్ఛమైన నీళ్లలో కాస్తంత చక్కెర వేస్తే అది గాఢమైనట్లే... రక్తంలో చక్కెర కలిసినా రక్తప్రవాహమూ చిక్కబడి మామూలు కంటే ఎక్కువ ఒత్తిడితో వెళ్లాల్సి వస్తుంది. రక్తం మెదడుకు వెళ్లే రక్తనాళాల్లో చిక్కబడితే అది బ్రెయిన్‌స్ట్రోక్ (పక్షవాతాని)కి దారితీయవచ్చు. చిక్కటి రక్తం రక్తనాళాల్లో ప్రవహించే సమయంలో సాధారణ రక్తం కంటే మరింత ఒత్తిడితో ప్రవహించాల్సి వస్తుంది. దాంతో రక్తపోటూ పెరుగుతుంది. ఫలితంగా ఒక్కోసారి రక్తనాళాలు చిట్లే ప్రమాదం ఉంది. అంతేకాదు... రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ కణాల అడ్డంకుల వల్ల, రక్తంలో పెరిగిన చక్కెర, కొవ్వుల కారణంగా రక్తనాళం లోపలి గోడలు గరుకుగా మారడం వల్ల కూడా రక్తప్రవాహానికి అవరోధం కలిగే అవకాశం ఉంది. ఈ కారణాలన్నీ బ్రెయిన్‌స్ట్రోక్‌కు దారితీయవచ్చు. ఇలా డయాబెటిస్ అన్నది కేవలం మెదడును మాత్రమే గాక గుండె, మూత్రపిండాలు వంటి అనేక అవయవాలను దెబ్బతీయవచ్చు.
మెదడుపై డయాబెటిస్ ప్రభావం ఎలా: డయాబెటిస్ అన్నది కేవలం రక్తనాళాల్లో రక్తం చిక్కబడటం లేదా రక్తనాళాలను చిట్లేలా చేయడం ద్వారానే గాక... నేరుగా మెదడు కణాలపై కూడా ప్రభావం చూపుతుంది. చక్కెర ఎక్కువగా ఉన్న రక్తం మెదడు కణాలను చేరినప్పుడు ఆ కణాల్లోని జీవక్రియ (సెల్యులార్ మెకానిజం)లో సైతం మార్పులు రావచ్చు. వెరసి ఆ మార్పులన్నీ ముందుచెప్పినట్లుగా పక్షవాతాని (స్ట్రోక్)కి గాని లేదా మతిమరపు (డిమెన్షియా)కి గాని దారితీయవచ్చు.
మెదడుపై మరిన్ని ఇతర ప్రభావాలు.... డయాబెటిస్ వల్ల మెదడుపై పడే ప్రభావాల్లో ముఖ్యమైన పక్షవాతం, మతిమరుపుతో పాటు మిగతావి ఇలా ఉంటాయి. అవి... అయోమయం లక్ష్యాన్ని గుర్తించడంలో లోపం. మనసును లగ్నం చేయడం లేదా మనసును కేంద్రీకరించే శక్తి తగ్గడం. విషయంపై దృష్టి నిలిపేశక్తి తగ్గడం. ఒక నిర్ణయానికి వచ్చే శక్తి లోపించడం.ఇక మతిమరపు విషయానికి వస్తే అది రక్తనాళాల కారణంగా వచ్చే వ్యాస్కులార్ రకం అయి ఉండవచ్చు లేదా ఒక వయసు తర్వాత వచ్చే అల్జైమర్స్ తరహాదీ కావచ్చు.
తక్కువ చక్కెరతోనూ మెదడుపై దుష్ర్పభావం... రక్తంలో చక్కెరపాళ్లు ఎక్కువైనప్పుడు మాత్రమే కాదు... అవి తక్కువ కావడం వల్ల కూడా మెదడుపై ప్రభావం పడుతుంది. రక్తంలో చక్కెరపాళ్లు తగ్గడం వల్ల మెదడు కణాలకు పోషకాలు గాని, ఆక్సిజన్ గాని అందవు. ఒక్కోసారి... చక్కెరను అదుపులో పెట్టాల్సిన మందుల మోతాదు ఎక్కువ కావడం వల్ల ఇలాంటి పరిస్థితి వస్తుంది. చక్కెర రోగులు క్రమం తప్పకుండా ఆహారాన్ని తీసుకోవడం, అదీ సరైన సమయానికి తీసుకోవడం అవసరం. అలా తగినంత ఆహారం తీసుకోకుండా మందులు మాత్రమే తీసుకోవడం వల్ల అవి రక్తంలో ఉన్న చక్కెరపాళ్లను మరింతగా తగ్గిస్తాయి. దాంతో రోగుల ప్రవర్తనలో మార్పులు, అయోమయం, ఎప్పుడూ నిద్రవస్తున్నట్లుగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇలాంటి రోగులకు సరైన సమయంలో చికిత్స అందకపోతే ఒక్కోసారి అది మూర్చ (ఫిట్స్) లేదా పక్షవాతం లేదా కోమాకు దారితీయవచ్చు. ఇలా రక్తంలో చక్కెరపాళ్లు తగ్గడాన్ని హైపోగ్లైసీమియా అంటారు.
తలనొప్పినీ నిర్లక్ష్యం చేయకండి.. డయాబెటిస్ కారణంగా మెదడుకు ట్యూబర్క్యులోసిస్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. డయాబెటిస్ ఉంటే వ్యాధినిరోధకశక్తి క్రమంగా తగ్గుతుంది. ఫలితంగా ఇలాంటి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఎక్కువ. అందుకే మీకు ఒకవేళ డయాబెటిస్ ఉంటే తలనొప్పిని నిర్లక్ష్యం చేయకండి. మీకు తరచూ తలనొప్పి వస్తూ... దాని తీవ్రత క్రమంగా పెరుగుతూ పోతుంటే న్యూరాలజిస్టును సంప్రదించడం అవసరం.
తీసుకోవల్సిన జాగ్రత్తలు: 1. స్థూలకాయం ఉన్నవారు డయాబెటిస్ వచ్చే రిస్క్‌ను తగ్గించుకునేందుకు బరువును అదుపులో పెట్టుకోవడం, వాకింగ్ చేయడం వంటి జాగ్రత్తలు పాటించాలి. పుష్టికరమైన ఆహారం తీసుకోవాలి. రోజూ కనీసం 45 నిమిషాల చొప్పున వారానికి ఐదు రోజులు వాకింగ్ చేయాలి.
2. ఆహారంలో ముదురాకుపచ్చటి ఆకుకూరలు, తాజా పండ్లు ఉండాలి. మంచి ఆహారం అంటే... మనం తీసుకునే ఆహారంలో సగం ఆకుకూరలు, పండ్లు, మిగతా సగంలో ప్రోటీన్లు, ధాన్యాలు ఉండేలా చూసుకోవాలి. దాంతోపాటు రోజూ 250 ఎం.ఎల్. పాలు తాగాలి. ఆహారం తర్వాత ఒక కప్పు పెరుగు తీసుకోవాలి. ఉప్పు, తీపి పదార్థాలు తగ్గించడం కంటే మంచి సూచన మరొకటి లేదు.
3. డయాబెటిస్ ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు వారు సూచించిన మందులు క్రమం తప్పకుండా తీసుకోవాలి.
4. ఒకవేళ డయాబెటిస్ తో పాటు రక్తపోటు లేదా పొగతాగే అలవాటు ఉంటే అలాంటివాళ్లు క్రమం తప్పకుండా డాక్టర్ల సూచనల ప్రకారం యాస్పిరిన్, క్లోపిడోగ్రెల్ వంటి మందులను తీసుకోవాల్సి ఉంటుంది.
5. డయాబెటిస్ ఉన్నవారు క్రమం తప్పకుండా రక్తపరీక్ష, క్రియాటినిన్, యూరిన్ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. గుండె, కెరోటిడ్, కండ్ల, నరాల పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి.
6. ఒకవేళ బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు కనిపిస్తున్నా, వచ్చినా... కనీసం అది వచ్చిన 4 నుంచి 5 గంటలలోపు రోగిని ఆసుపత్రికి చేర్చి టీపీఏ అనే చికిత్స చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల కనీసం 50-60 శాతం రోగులు మునుపటిలా కోలుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత వాళ్లకు అటర్వస్టాటిన్స్ అనే మందులు ఇవ్వడం వల్ల మళ్లీ స్ట్రోక్ రావడానికి, ఒకవేళ వచ్చినా దాని తీవ్రతను తగ్గించడానికి అవకాశం ఉంటుంది.
No comments:
Post a Comment