all

Monday, December 3, 2012

మాతృత్వం- చిన్న కథ

ఇలాంటి పరిస్థితి వస్తుందని సంధ్య కలలో కూడా ఊహించలేదు. తన తెలివీ, తన చదువూ, తన సమర్థతా, తన మంచితనం... అన్నీ... అన్నీ.. ఎంత వ్యర్థమో అనిపిస్తోంది ఇప్పుడు! భర్త మూర్ఖుడు అని తెలుసుకానీ, మరీ ఇంత మూర్ఖుడు అని తను ఊహించలేదు.
తన స్నేహితురాళ్ళు చాలా మంది ఇద్దరు ఆడపిల్లలతోనే సరిపుచ్చుకున్నారు కొడుకు కోసం ఆశించకుండా. ఇద్దరు కాదు, ఒక్క ఆడపిల్లతోనే సరిపుచ్చుకున్నవాళ్ళు ఎంత మంది లేరు?
తనకి ఇద్దరు ఆడపిల్లలు. ఇద్దరూ ముత్యాల్లాంటి పిల్లలు. తను ఈ ఇద్దరు పిల్లలతోనే ఎందుకు తృప్తిపడలేదో తలచుకుంటే, తనమీద తనకే రోత పుడుతోంది! చిన్న కూతురు పుట్టినప్పుడు ఆపరేషన్‌ చేయించుకుంటానని భర్తని అడిగింది. ససేమిరా అన్నాడు. కొడుకు కావాలన్నాడు. తనకీ కొడుకు ఉంటే బాగుండు అని మనసులో ఓ మూల ఉందేమో! అందుకే భర్త మాటని గట్టిగా ఎదిరించలేకపోయింది. అప్పుడు ఎదిరిస్తే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు.
ఇప్పుడు తనకి నాలుగో నెల వచ్చి నాలుగు రోజులు అవుతోంది. రాత్రి భర్త మాటలూ, ఘర్షణే తలపుకి వస్తున్నాయి.
''అయితే ప్రెగెన్సీ విషయం ఏమనుకుంటు న్నావు?'' ముందు సున్నితంగానే అడిగాడు.
''నేను ఏమీ అనుకోవడం లేదు'' భర్త ధోరణి తనకి తెలుసు. విషయం ఆయనకి తెలిసినప్పటి నుంచీ ఏదో విధంగా నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ''నా మాట విను సంధ్యా... మళ్ళీ ఆడపిల్ల పుడితే మన పరిస్థితేంటి?''
''ఏమవుతుంది?''
''ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలంటే మాటలా? ముగ్గురు ఆడపిల్లలు అని ఊళ్ళో జనం ఎగతాళి చేస్తారు! అందరిలో తలవంపులు!''
''అదేమిటండీ, అలా మాట్లాడుతున్నారూ? జనం ఎందుకు ఎగతాళి చేస్తారు? ఏం తప్పుపని చేస్తున్నాం? తలవంపులు ఏముంది?''
''ఆడపిల్లలకు గౌరవం ఏం ఉంటుంది? ఈ రోజుల్లో ఆడపిల్లల్ని ఎవరు కోరుకుంటున్నారు? ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారాయె!''
తనకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అంత మూర్ఖమైన మాటలకి తనేం మాట్లాడగలదు?
''హాస్పిటల్‌కి వెళ్ళి టెస్ట్‌ చేయించుకుందాం!''
''అది జరిగే పనికాదు. ఆ ఆలోచన ఏం పెట్టుకోవద్దు!''
మంచిగా మాట్లాడిన అతనే నెమ్మదిగా స్వరం పెంచి వికృత రూపం చూపెట్టడం మొదలు పెట్టాడు. ఘర్షణకు దిగాడు.
''నీకేమే... ఎన్నయినా చెపుతావు? ఇంట్లో కూర్చుని లోకం తెలియడంలా! బయట పరిస్థితులు ఎట్ట వున్నరు? ఆడపిల్లలు అంటే ప్రేమలూ, దోమలూ, మగపిల్లల వేధింపులూ... లేనిపోని సమస్యలూ...''
''అవి అన్నీ చేసేది మగపిల్లలే కదా? అందుకే అలాంటి మగపిల్లలు మనకి వద్దు!''
''అతికి పోవాకు! ఉన్న రెండు దరిద్రాలతోనే చస్తున్నాం! మరో దరిద్రం దాపురిస్తే అవుతుంది మన పని!''
పసిబిడ్డల్ని పట్టుకుని దరిద్రాలంట! ఎంత చీదరమనిషి! ఎంత చీదరమాటలు! ఎంత చీదరబుద్ధులు! బిడ్డల మీద ప్రేమ లేని మనిషి, ఏం మనిషి? పిల్లల్ని ఎత్తుకుని ముద్దు చేస్తుంటాడే! మనసులో నిజంగా ప్రేమ ఉంటే ఇలాంటి మాటలు వస్తాయా?
''పసిబిడ్డల్ని పట్టుకుని కన్న తండ్రి అనవలసిన మాటలేనా అవి? అలా అనడానికి మీకు నోరు ఎలా వచ్చిందండీ?''
''ఆడ పిల్లలు దరిద్రం కాకపోతే ఏమిటి?''
''మీకు దరిద్రాలేమో కానీ, నాకు కాదు. నాకు ధనలక్ష్మిలు! ధాన్యపు రాశులు! బంగారు కొండలు!''
''సరేలే...మాటలకేం కానీ... నాకు మాత్రం అబ్బాయి కావాలి!''
''కావాలంటే ఎలాగ? ఇదేమైనా మార్కెట్లో దొరికే వస్తువా?''
''అందుకే నా మాట విని టెస్ట్‌ చేయించుకో! హాస్పిటల్‌ వాళ్ళ ముఖాన ఎంతోకొంత పారేస్తే ఆడో, మగో చెపుతారు ఆడపిల్ల అయితే అయితే తీసి వేయించుకుందువు!''
''మీరు ఎన్ని అయినా చెప్పండి. అది జరిగే పనికాదు. చూస్తూ చూస్తూ కడుపులో బిడ్డని చంపుకోలేను. నాకు ఎవరైనా ఒకటే!''
''నాకంటే నీకు కడుపులో బిడ్డ ఎక్కువన్నమాట!''
''మీ అర్థం లేని వాదనకి జవాబు చెప్పుకోలేను. మీరు తక్కువా, బిడ్డ ఎక్కువా అని నేను అనలేదు. అన్నీ మీరే అనుకుంటున్నారు. మీ కోసం బిడ్డను బలిచేయలేను. మన ప్రాణం ఎంతో బిడ్డ ప్రాణమూ అంతే!''
''సరే అయితే! నా మాట విననికాడికి నా ఇంట్లో మాత్రం ఎందుకు? నీదారి ఏదో నువ్వు చూసుకోవచ్చు!''
''సంతోషం!'' అంది సంధ్య.
భర్త సుదర్శన్‌ చూపులకి ఎత్తుగా, ఎర్రాగా, బుర్రగా బాగుంటాడు. బుర్రలో మాత్రం ఏం లేదు. మనిషి ఎప్పుడూ టక్‌చేసి, సై ్టల్‌ మెయింటెయిన్‌ చేస్తుంటాడు. పైన పటారం బాపతు!
సంధ్య బిఎస్సీ పాసైంది. చదువులో బాగా చురుకు. తల్లిదండ్రులు పెద్దగా ఉన్న వాళ్ళు కాదు. బిఎస్సీ అయిన వెంటనే తెలిసిన వాళ్ళు చెబితే, మంచి సంబంధం అని ఈ పెళ్ళిచేశారు. తినీ తినకా కూడబెట్టిన డబ్బుతో ఈ అల్లుడ్ని కొనుక్కున్నారు.
అతను గవర్నమెంట్‌ స్కూల్‌ టీచర్‌. గణితం బోధిస్తాడు. ఆ బోధన ఎలా ఉంటుందో!
ఇది ఒక రోజు విషయం కాదు. తను నెల తప్పిన విషయం తెలిసినప్పటినుంచీ అతని మాట తీరులో మార్పు తనకి స్పష్టంగా అర్థం అవుతూనే ఉంది. తనూ ఒక నిర్ణయం తీసుకుంది. భర్త తీరు మారకపోతే తను తీసుకున్న నిర్ణయానికి ఇక తిరుగు ఉండదు.
రాత్రి వాదన తరువాత చివరిగా ''నీ వస్తువులు ఏవైనా ఉంటే తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఇక నీకూ నాకూ కుదరదు!'' అన్నాడు.
ఆ మాట అన్న తరువాత, ఇక అతని చూరు పట్టుకుని వేళ్ళాడటం సిగ్గుమాలిన పని! తనకీ ఆత్మాభిమానం ఉంది. ఆరమో, భారమో... తను వేరేగా ఉండటానికే నిశ్చయించుకుంది. అమ్మ కొద్దికాలం ఆసరాగా ఉంటుంది.
తనూ, ఇద్దరు బిడ్డలూ, కడుపులో బిడ్డ ఎలాగోలా బతకాలి! ముందు ఏదైనా ఒక ఉద్యోగం చూసుకోవాలి.
ఇంటినుంచి బయటపడింది సంధ్య.
బయటికి వచ్చిన ఆరు నెలలకి సంధ్యకి పండులాంటి మగబిడ్డ పుట్టాడు.

No comments: