all

Friday, November 30, 2012

అమ్మంటే...



సృష్టికర్త ఒక బ్రహ్మ... అతనిని సృష్టించినదొక అమ్మ' అన్నాడో కవి. సృష్టికి మూలం ఖచ్ఛితంగా అమ్మే! కడుపులో పిండం తయారైంది మొదలు తన ఆహారపు అలవాట్లను, జీవన విధానాన్ని ఒక క్రమ పద్ధతిలో మార్చుకుని పిండం పెరుగుదలకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుంది. స్త్రీ. ప్రసవం స్త్రీకి పునర్జన్మతో సమానమంటారు పెద్దలు. కానీ, 'అమ్మా' అని పిలిపించుకోడానికి తన ప్రాణాన్ని సైతం ఫణంగా పెట్టి బిడ్డకు జన్మనిస్తుంది స్త్రీ. కడుపులోని పిండం తన చిట్టి పాదాలతో తన్నుతుంటే ఆ కదలికను తనివితీరా ఆస్వాదిస్తుంది. బిడ్డ పుట్టిన తరువాత తన రక్తాన్ని పాలుగా మార్చి ఆ బిడ్డకు తొలి రుచిని చూపించేది అమ్మ. ఆ బిడ్డ మాటలు నేర్చి 'అమ్మా' అని పిలిస్తే ఆ పిలుపుకు లోకాన్నే మరిచిపోతుంది. బిడ్డకు చిన్న నలత చేసినా తల్లడిల్లిపోయి తిరిగి కోలుకునేవరకూ తన మనసు కుదురుపడదు. పాపాయి బుడిబుడి అడుగులు వేస్తుంటే తన చేతిని ఆలంబన చేసి బిడ్డకు అడుగులు నేర్పించేది, విద్యాబుద్ధులు నేర్పేది అమ్మే. తన బిడ్డ పెరిగి పెద్దవాడై జీవితంలో తప్పటడుగులు వేస్తుంటే మంచిచెడ్డలు చెప్పి సరైన మార్గంలో నడిపి, వారి భవిష్యత్తుకు తన శక్తికి మించి శ్రమిస్తుంది అమ్మ. బిడ్డలు పుట్టేవరకూ భర్తే లోకమని అనుకునే స్త్రీ తను మాతృమూర్తి అయినాక బిడ్డలే తన లోకం అన్నట్లుగా ఉంటుంది. 'పిల్లలు పుట్టిన తరువాత నీకు నామీద ప్రేమ తగ్గిపోయిందనీ, నన్ను నిర్లక్ష్యం చేస్తున్నావనీ' కినుక వహించే భర్తలు పరిపాటి. కానీ, స్త్రీ భార్యగా, తల్లిగా రెండు పాత్రలను అవలీలగా పోషించి మెప్పిస్తుంది. ఇది స్త్రీకి మాత్రమే సాధ్యమంటే అతిశయోక్తి కాదు. ఈ ఆధునిక కాలంలో ఉద్యోగిగానే కాదు, ఎన్నో రకాలుగా అష్టావధానం, శతావధానం చేస్తోంది నేటి వనిత. అవనిలోనే కాదు, ఆకాశంలో కూడా(వ్యోమగాములుగా, క్షిపణుల తయారీలోనూ) సగం మేమేనని నిరూపిస్తోంది నేటి ఆధునిక మహిళ.
బిడ్డల జీవితంలో తండ్రి పాత్ర పరిమితమని అనలేం. కానీ, తండ్రి కంటే పిల్లలకు తల్లి దగ్గరే సాన్నిహిత్యం ఎక్కువ. అందుకే, తమకు ఏం కావాలన్నా ముందుగా తల్లినే అడుగుతారు. ఇలా ఎన్నో రకాలుగా బిడ్డల ప్రతి పనిలోనూ అమ్మ సహకారం అనంతం. 'మాతృదేవోభవ' అని తల్లికే మొదటి స్థానాన్నిచ్చారు. అటువంటి అమ్మకు ఇవ్వాల్సినంత విలువను పిల్లలు ఇస్తున్నారా అంటే లేదనే అనుకోవాలి. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న వృద్ధాశ్రమాలే దీనికి నిదర్శనం. తమ ఎదుగుదలకు తన జీవితంలో విలువైన కాలాన్ని వెచ్చించి తమ బంగారు భవిష్యత్తుకు బాటలువేసిన అమ్మ స్థానం ఎక్కడీ ఇదంతా ఎందుకంటే బిడ్డల నిరాదరణకు గురైనవాళ్లు ఎక్కువగా అమ్మలే.
'మదర్స్‌ డే'నాడు అమ్మకు బహుమతులు కొనివ్వడమే తమ బాధ్యత అనుకుంటున్నారు పాశ్చాత్య సంస్కృతికి అలవాటుపడినవారు. తప్పతాగడానికి డబ్బు ఇవ్వని కారణంగా తల్లి తలను నరికి సైకిల్‌కు కట్టి ఊరేగాడు ఒక కిరాతకుడు. తల్లిపేరున ఉన్న ఆస్థిని తన పేరున రాయలేదని తల్లికి బలవంతంగా విషం తాగించాడో నికృష్టుడు. ఇలాంటి సంఘటనలకు కొదువలేదు. మద్యానికి బానిసలైనవారు ఈ దుర్మార్గాలకు ఒడిగడుతున్నారు. మద్యం మనిషిని మృగంలా మారుస్తుందనడానికి ఇలాంటి సంఘటనలే కారణం.
నాగరికులమని చెప్పుకునేవారు తమ మాటలతో, చేష్టలతో కన్నవారికి నరకం చూపిస్తుంటారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఇంట్లో ఉండలేక, వృద్ధాశ్రమానికి వెళితే నలుగురిలో తమ బిడ్డలు ఎక్కడ పలచన అయిపోతారోనని మానసికంగా, శారీరకంగా నలిగిపోతుంటారు. బిడ్డల బాగోగులకోసం అహర్నిశలు కష్టపడి, వారిని ఉన్నత స్థానంలో చూడాలని కలలుకన్న అమ్మకు బిడ్డలు ఎంతవరకూ న్యాయం చేస్తున్నారు? అపురూపంగా చూసుకోకపోయినా, కనీసం వారితో ఆప్యాయంగా మాట్లాడుతున్నారా?
డబ్బు వ్యామోహంలో పడి, సంపాదన అనే దీర్ఘకాలిక జ(డ)బ్బు చేసిన బిడ్డలకు ఎలా నయం చేయాలో తెలీక తల్లిదండ్రులు నిస్సహాయంగా నవ్వుకుంటున్నారు. ఆ ఆవేదనను అర్థంచేసుకునేందుకు బిడ్డలు సిద్ధంగా లేరు. అయినా, తన వేదనను ఏమాత్రం బయటకు కనపడనీయక... తన బిడ్డ ఎల్లవేళలా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటుంది అమ్మ. అందుకే ఆమె 'అమ్మ'.

No comments: