all

Friday, November 30, 2012

డాక్టర్‌ని అడగండి - గైనకాలజీ

నాకు వయసు 20. పెళ్లయి ఏడాది అయ్యింది. రెండేళ్ల వరకు పిల్లలు వద్దనుకుంటున్నాం. ప్రస్తుతం గర్భనిరోధక మాత్రలు వాడుతున్నాం. వీటితో సైడ్‌ఎఫెక్ట్స్ ఏమిటి? వీటిని ఎంతకాలం వాడవచ్చు? వివరంగా చెప్పండి.
- ధనలక్ష్మి, పొద్దుటూరు
ఈస్ట్రోజెన్, ప్రోజెస్టిరాన్ అనే రెండు హార్మోన్ల కాంబినేషన్‌లో వాడే కాంట్రాసెప్టివ్ పిల్స్ పీరియడ్స్ సరిగ్గా వచ్చేందుకు, ప్రెగ్నెన్సీ రాకుండా నివారించేందుకు, ఓవర్ బ్లీడింగ్, పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని తగ్గించేందుకు వాడుకలో ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం వీటిని హై డోస్‌లో ఇవ్వడం జరిగేది. వీటిని వాడడం వలన తలనొప్పి, వికారం, వాంతులు, బరువు పెరగడం, మొటిమలు రావడం, శరీరంలో నీరు చేరడం వంటి సైడ్‌ఎఫెక్ట్స్ వచ్చేవి. ప్రస్తుతం ఇవే ట్యాబ్లెట్లను తక్కువ మోతాదులో ఇస్తారు. మోతాదు తగ్గినందు వల్ల వాటి ప్రభావం, పనితీరు హై డోస్ పిల్స్‌కు ఏమాత్రం తగ్గలేదని, సైడ్‌ఎఫెక్ట్స్ ఎదురుకావడం లేదని గమనించారు. వీటిని ఏ ఇతర సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, భవిష్యత్తులో ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా రూపొందించారు. వీటిని రెండు నుంచి రెండున్నర ఏళ్ల వరకు కంటిన్యువస్‌గా వాడవచ్చు. అంతకంటే ఎక్కువ రోజులు వాడాల్సి వస్తే నాలుగు నుంచి ఆరు నెలల వరకు విరామం ఇచ్చి తిరిగి మొదలు పెట్టవచ్చు. వాటికి బదులుగా నేచురల్ మెథడ్స్, కండోమ్స్ వంటివి వాడవచ్చు.

మా వారికి సెమెన్ టెస్ట్ చేసి శుక్రకణాలు లేవని చెప్పారు. అవి పెరగాలంటే ఏం చేయాలి? మా సమస్యకు పరిష్కారం చెప్పండి.
- చంద్రకళ, నిడమనూరు


శుక్రకణాలు లేకపోవడాన్ని అజూస్పెర్మియా అంటారు. ఈ కండిషన్‌కు ముఖ్యమైన కారణాలు రెండు. మొదటిది హార్మోన్‌లలో అసమతుల్యత, హై ఫీవర్ వంటి కారణాల వల్ల శుక్రకణాలు ఏర్పడటంలోనే లోపం ఏర్పడటం. రెండవది శుక్రకణాలు సరిగ్గానే ఏర్పడినా విడుదల అయ్యే మార్గం సక్రమంగా లేకపోవడంతో వచ్చే అజూస్పెర్మియా. ఈ కండిషన్ ఉన్నవారు యూరాలజిస్ట్‌తో పరీక్ష చేయించుకుని, అందుకు కారణాన్ని కనుక్కోవడం ఎంతో ముఖ్యం. హార్మోన్ అసమతుల్యతకి తగిన ట్రీట్‌మెంట్ తీసుకోవడం, వేరికోసిల్ వంటి కండిషన్స్‌లో ఆపరేషన్ ద్వారా సరిచేయించుకోవడం, శుక్రకణాల విడుదల మార్గంలో అడ్డంకులు ఉన్నట్లయితే వాటిని ఆపరేషన్ ద్వారా సరి చేయడం... ప్రస్తుతం అందుబాటులో ఉన్న ట్రీట్‌మెంట్లు. శుక్రకణాలు విడుదల కాకపోయినా, లేదా అవి టెస్టిస్, ఎపిడైడిమిస్, వాస్‌కు పరిమితమైనట్లు గుర్తించినట్లయితే కొన్ని ప్రక్రియల ద్వారా వాటిని సేకరించి ఐవిఎఫ్ పద్ధతి ద్వారా ఫలదీకరణం చేయడం జరుగుతుంది. ఇక్కడ పేర్కొన్న ట్రీట్‌మెంట్ ఎంతో నైపుణ్యంతోనూ, ఖర్చుతోనూ కూడుకున్నది. ఫెర్టిలిటీ సెంటర్లలో ఈ విధానం అందుబాటులో ఉంటుంది. కాబట్టి మీరు డాక్టర్‌ని కలుసుకుని వారి సలహా మేరకు ముందుకెళ్లండి.

No comments: