కూల్ నేమ్. క్యూట్ ఫేమ్.
షి ఈజ్ మంచు. బట్ వాయిస్ కాల్తుంది! షి ఈజ్ ప్రసన్న. బట్... వ్యూస్ పేల్తాయి! ఫ్రీజ్ ఐపోయినట్లు ఒకేచోట ఉండిపోరు. జలపాతం... నదీ ప్రవాహం... నో రెస్ట్! వై మేడమ్? ‘చచ్చాక కావల్సినంత రెస్ట్’ - ఇదీ సమాధానమ్! జాగ్రత్తగా నడవండి. లోపలింకా చాలా మందుపాతరలున్నాయి! కంగ్రాట్స్ లక్ష్మిగారూ... సక్సెస్ కొట్టేశారు.మంచు లక్ష్మి: థ్యాంక్సండీ... ఈ సక్సెస్ క్రెడిట్ మొత్తం దర్శకుడు కుమార్ నాగేంద్రదే. తను ఈ కథను నమ్మాడు. నేను తనని నమ్మాను. ఈ సినిమా కోసం తను పడ్డ కష్టం అసాధారణమైంది. సంగీత దర్శకునిగా ఇళయరాజాని తీసుకోవాలనే ఆలోచన కూడా తనదే. ఇది 1986 నాటి కథ. ఆ ఫీల్ కావాలి. పైగా పెయిన్ ఉన్న కథ. దానికి ఇళయరాజాగారి సంగీతం బ్యాక్‌బోన్‌గా నిలిచింది. మీరు మాట్లాడే తెలుగులో కూడా అమెరికా ప్రభావం కనిపిస్తుంటుంది. అలాంటిది గోదావరి యాస అలా మాట్లాడేశారేంటి? మంచు లక్ష్మి: అయిబాబోయ్... అక్కడున్నప్పుడూ, గోదారమ్మాయిగా సేత్తన్నప్పుడూ, ఆ మాత్రం మాట్లాడాలి కదండీ.. లేపోతే కష్టమైపోద్దండీ. బైట ఎవరితో మాట్టాడాలన్నా... ఇట్టాగే గోదారి యాసలో మాట్టాడేదాన్నండీ.. లేపోతే సెట్‌లో తేడాలొచ్చేత్తయండీ.. ఆయ్(గోదావరి యాసలో). నా చుట్టూ పనిచేసేవారందరూ కూడా ఎక్కువశాతం గోదావరిజిల్లావాళ్లే. నాతో మాట్లాడేటప్పుడు యాసలోనే మాట్లాడండి అని అందరికీ గట్టిగా చెప్పేశా. మీకో విషయం తెలుసా?.. ముందు గోదావరి యాసలో నేను బూతులు నేర్చుకున్నా(నవ్వుతూ). ఆ తర్వాత మాటలు అవే వచ్చేశాయి. మరో విషయం ఏంటంటే... ఇక్కడ నాకంటే నా వాయిస్ ఫేమస్. ఈ యాసలో మాట్లాడి, అది కుదరక ఉన్న విలువ పోగొట్టుకోవడం ఎందుకని చిన్మయితోనో, యాండ్రియాతోనో డబ్బింగ్ చెప్పించమని చెప్పాను. కానీ మావాళ్లు ఒప్పుకోలేదు. తెలుగమ్మాయి అయ్యుండి మీకు డబ్బింగ్ ఏంటండీ... ఇది అన్యాయం! మంచు లక్ష్మి: మీకో విషయం తెలుసా... నా లైఫ్‌లో ఇంత తెలుగు నేనెప్పుడూ మాట్లాడలేదు. నేను ఇక్కడొకొచ్చి రెండున్నరేళ్లే అయ్యింది. చెన్నయ్‌లో ఉన్నన్నాళ్లూ తమిళంలో మాట్లాడేదాన్ని. ఇంటర్ ఫస్ట్ ఇయర్,సెకండ్ ఇయర్ హైదరాబాద్‌లోనే చేసినా... ఇక్కడ హిందీ, ఇంగ్లిష్ తప్ప తెలుగులో ఎవ్వరూ మాట్లాడరు కదా. తర్వాత అమెరికా వెళ్లిపోయాను. ఇక అక్కడ తెలుగు మాట్లాడే ప్రసక్తేలేదు. అసలు మాట్లాడాలనే ఇంట్రస్ట్ కూడా ఉండేది కాదు. అసలు అమెరికా వెళ్లాల్సిన అవసరం మీకు ఎందుకొచ్చింది? మంచు లక్ష్మి: నాకు నాలా బతకడం ఇష్టమండీ. నా ఆశలను, ఆకాంక్షలనూ చంపుకొని నేను బతకలేను. నేను ఇక్కడే కనుక ఉండుంటే పిల్లల్ని కని, ఇంత లావు అయిపోయి, నాకు ఈ నగ కొనియ్యలేదు, ఆ నగ కొనియ్యలేదు అనుకుంటూ... ఏదో ఒక డిప్రెషన్‌లో ఉండి ఉండేదాన్ని. నాకు చిన్నప్పట్నుంచీ అలా రాజీపడి బతకడం ఇష్టం ఉండేదికాదు. ఏదో సాధించాలనే కసి బాల్యం నుంచీ ఉండేది. ఆ కసే నన్ను అమెరికా వైపు నడిపించింది. అమెరికాలో ఏం చేసేవారు? మంచు లక్ష్మి: అక్కడ నేను చేయని జాబ్ లేదు. పర్‌ఫ్యూమ్ స్టోర్‌లో జాబ్ చేశాను. ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఆఫీస్‌లో పనిచేశాను. ఇలా ఎన్నో ఉద్యోగాలు. మెక్ డోనల్డ్స్ రెస్టారెంట్‌లో డాలర్ 99 ఖర్చుపెడితే చికెనూ, ఫ్రైసూ, కోక్ వచ్చేవి. వాటితో పొట్ట ఫుల్ అయిపోయేది. మూడు పూట్లా అదే తినేదాన్ని. టైమ్ వేస్ట్ అవ్వకుండా కార్లోనే లంచ్, డిన్నర్, బ్రేక్‌ఫాస్ట్ ముగించేసేదాన్ని. అమెరికాలో మా యాక్టింగ్ స్కూల్ పేరు బెవర్లీ హిల్స్ ప్లే హౌస్. ప్రతి మంగళ, బుధవారాలు సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 11గంటల 30 నిమిషాల వరకూ అక్కడ రిహార్సల్స్ చేసేదాన్ని. వారంలో దాదాపు 30 గంటలు యాక్టింగ్ క్లాసులకే కేటాయించేదాన్ని. మిగతా టైమ్‌లో ఆడిషన్స్. ఒక్కోసారి రెండు వారాలకు ఒక్క ఆడిషన్ కూడా రాదు. ఇంకోసారి ఒకేరోజులో నాలుగైదు ఆడిషన్స్ ఉంటాయి. అలా యాక్టింగే జీవితంగా గడిపా. ‘ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటావ్. నువ్ రెస్ట్ తీసుకోవా’ అనేవాళ్లు నా ఫ్రెండ్స్. ‘చచ్చిపోయాక కావల్సినంత టైమ్ ఉంటుంది కదా, రెస్ట్ తీసుకోవడానికి’ అని చెప్పేదాన్ని. అయితే... ఈ విషయాలు నాన్నకు మాత్రం తెలియనిచ్చేదాన్ని కాదు. ఎందుకంటే ఆయనది చాలా సున్నితమైన హృదయం. ఆ కృషి ఏదో ఇక్కడే ఉండి చేయొచ్చుకదా.. అమెరికానే ఎందుకు వెళ్లాలి? మంచు లక్ష్మి: లేదండీ... ఆడవారిని ఇండియాలో ఎంకరేజ్ చేయరు. నేను ఓ లెజండ్ డాటర్‌ని. అలాంటి నాకే ఇక్కడ మొన్నటిదాకా గుర్తింపు లేదు. సెలబ్రిటీల కొడుకులకు ఇచ్చిన ప్రయారిటీ ఇక్కడ కూతుళ్లకు ఇవ్వరు. చివరకు మీడియా కూడా ఇక్కడ అమ్మాయిలను చిన్నచూపు చూస్తుంది. ఒక్క అమ్మాయిని ఎంకరేజ్ చేసిన చరిత్ర కూడా మనకు లేదు. అవకాశం లేని చోట ప్రయత్నాలు చేయడం వేస్ట్. అందుకే అమెరికా వెళ్లిపోయాను. అక్కడ అమ్మాయిలు, అబ్బాయిలు అనే వివక్ష ఉండదు. అక్కడ నేనేం చేసినా అడిగేవాళ్లు లేరు. ఎక్కడ తిరిగినా అడిగేవాళ్లు లేరు. నేను ఎన్నింటికి ఇంటికొచ్చినా అడిగేవాళ్లు లేరు. నేను ఎం చదువుకున్నా అడిగేవాళ్లు లేరు. నేను ఎలాంటి బట్టలేసుకున్నా అడిగేవాళ్లు లేరు. ఇండియాలో నేను ఎప్పుడూ ఇతరుల కోసమే బతికాను కానీ, నాకోసం నేను బతకలేదు. అక్కడికెళ్లాక నేనేంటో నాకు తెలిసింది. అమెరికా వెళతాను అన్నప్పుడు మీ నాన్నగారు ఎలా స్పందించారు? మంచు లక్ష్మి: కొన్నాళ్లపాటు నాతో మాట్లాడలేదు. నాన్నకు మొదట్నుంచీ ఉమ్మడి కుటుంబాలంటే ఇష్టం. ఆయన చుట్టూ అందరూ తిరుగుతూ కనిపించాలి. చిన్నప్పుడు మనోజ్ చిక్‌బల్లాపూర్‌లో ఉండి చదువుకునేవాడు. ఓ రోజు డాడీకి ఫోన్ చేసి ‘నాన్నా... నువ్వు లేని జీవితం’ అంటూ ఓ పాట పాడాడు. అంతే... అమ్మక్కూడా చెప్పకుండా పరిటాల రవి అంకుల్‌ని తీసుకొని వెళ్లి మనోజ్‌ని తెచ్చేసుకున్నారు డాడీ. మమ్మల్ని అస్సలు వదిలి ఉండలేరాయన. అలాంటి మనిషి దగ్గరకు వెళ్లి నేను అమెరికాలో ఉండి చదువుకుంటాను అంటే ఎలా స్పందిస్తారు చెప్పండి? పైగా అప్పటికే నాకు సంబంధాలొస్తున్నాయి. ‘అబ్బాయి బావున్నాడు, మంచి సంబంధం’ అని మాట్లాడుకుంటుంటే నా గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి. ఇక ఇక్కడ ఉండకూడదని నిర్ణయం తీసేసుకున్నా. నాన్నను ఈ విషయంలో బాధ పెట్టిన మాట నిజం. మీకో విషయం తెలుసా? ఇండియాలో ఉన్నప్పుడు నాకు 36 మార్కులొస్తే గుడికెళ్లి వంద కొబ్బరికాయలు కొట్టేదాన్ని. అలాంటిది అమెరికా వెళ్లాక, నాకు అక్కడ ఎదురు డబ్బులిచ్చి(స్కాలర్‌షిప్) తమ కాలేజ్‌లో చదివించుకున్నారు. ఐ వజ్ ది ఫస్ట్ ఇంటర్నేషనల్ ఉమెన్ టు గ్రాడ్యుయేట్ ఫ్రమ్ దట్ స్కూల్ అండ్ లెర్న్ థియేటర్! ఈ విషయంలో నాకు సహకారాన్నీ, ఆత్మస్థైర్యాన్ని అందించింది నా భర్త ఆనందే! మీ ఇద్దరిది ప్రేమ వివాహం అటకదా? మంచు లక్ష్మి: లవ్వా నా తలకాయా... ‘మీ నాన్నతో మాట్లాడి వస్తా’ అని చెప్పి పెళ్లి కుదిర్చేసుకున్నారు. అలాగని ఆయనంటే ఇష్టంలేదని చెప్పను. పెళ్లంటే ఇష్టం లేదు. చిన్నప్పట్నుంచీ నేను అనుభవించిన స్ట్రగుల్స్ అలాంటివి. నేనో ఇండిపెండెంట్ లైఫ్‌కి అలవాటు పడిపోయాను. అసలుపెళ్లిలోనే పారిపోదాం అనుకున్నాను. చేతిలో కొబ్బరికాయ పెట్టి తెస్తున్నారు. ఎలాగైనా పారిపోవాలనేది నా ప్లాన్. చీర చూస్తే హెవీగా ఉంది. ఇక చూడండి నా స్థితి (నవ్వుతూ).. తనంటే ఇష్టమైనప్పుడు పారిపోవడం దేనికి? మంచు లక్ష్మి:యూఎస్‌లో తను నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే. నా పర్మిషన్ తీసుకోకుండా పెళ్లి ఖాయం చేసేసుకున్నారు. అందుకే కాస్త కోపం ఉండేది. పెళ్లికి మూడు నెలల ముందు ఆయనతో చెప్పాను కూడా. ‘‘ఈ పెళ్లీ గిళ్ల్లీ ఎందుకు చెప్పు. హాయిగా ఉన్నాం. అప్పుడప్పుడు కలుసుకుంటున్నాం. ఇంతకంటే జీవితం ఏం ఉంటుంది? పెళ్లయిన వాళ్లందరూ డిప్రెషన్‌లో ఉన్నారు. పెళ్లయిన రెండోరోజే విడాకులు తీసుకుంటున్నారు. అలాంటి పెళ్లి మనకెందుకు? ఇండియాలో ఉంటే మనం ఫ్యామిలీ గురించి, సొసైటీ గురించి, కల్చర్ గురించీ ఆలోచించాలి. మనం అమెరికాలో ఉన్నాం. మనకు ఇండియన్స్‌తో సంబంధం లేదు. ఎందుకు ఇదంతా’’ అని ఎంతో చెప్పి చూశాను. నేను ఇంత చెబితే... ‘‘మనం చేసుకుంటోంది మన కోసం కాదు. మన అమ్మానాన్నల కోసం’ అని ఒక్క మాటతో నా నోటికి తాళం వేసేశారాయన. అంతేకాదు... ‘‘పెళ్లి చేసుకుంటే పెద్ద పార్టీ ఏర్పాటు చేస్తారు. నీకు చాలా నగలు కూడా చేయిస్తారు’’ అని చెప్పడంతో తేలిగ్గా కన్విన్స్ అయిపోయాను(నవ్వుతూ) అసలు మీ ఇద్దరి పరిచయం ఎలా జరిగిందో చెబుతారా? మంచు లక్ష్మి: రేవతి అని నా ఫ్రెండ్ ఉండేది. దాని పెళ్లి. చీరలు కొనడానికి చెన్నయ్ వెళ్లాం. అక్కడ నా ఫ్రెండ్ ఒకతను ఉండటంతో తనకు ఫోన్ చేసి నేను చెన్నయ్‌లో ఉన్నానని చెప్పాను. ‘అమెరికా నుంచి నా ఫ్రెండ్ వచ్చాడు. ముగ్గురం కలిసి ఉడ్‌లాండ్స్ రెస్టారెంట్‌లో దోశె తిందాం’ అన్నాడు తను. ఓకే చెప్పాను. నన్ను కారెక్కించుకొని ఆనంద్ ఉండే చోటుకు తీసుకెళ్లాడు. ఆనంద్‌కి వాళ్ల అమ్మమ్మ అంటే చాలా గౌరవం, భయం. అక్కడకెళ్లి మేం హారన్ మోగిస్తుంటే... ‘‘పై నుంచి మా అమ్మమ్మ చూస్తుంది’’ అంటూ గాభరాగా చెప్పులు కూడా వేసుకోకుండా పరిగెత్తుకొచ్చాడు. తర్వాత షూస్ వేసుకుంటూ నన్ను చూశాడట. అప్పుడే మనసులో అనుకున్నారట. ‘పెళ్లంటూ చేసుకుంటే ఈ అమ్మాయినే’ అని. అది జరిగిన ఏడేళ్లకు, మా నాన్న దీవెనలతో, నేను కూడా ‘ఊ’ అనకుండానే నా మెడలో తాళి కట్టేశారాయన. మరి ఈ దూరం ఇంకెన్నాళ్లూ? మంచు లక్ష్మి: అసలు మేం ఇద్దరం ఇలా దూరంగా ఉంటాం అని అనుకోలేదు. లక్ష్మీ టాక్ షో ఓ రెండు నెలలు చేసి వెనక్కి వెళ్లిపోదాం అనుకున్నాను. ఆ రెండు నెలలు కాస్తా.. రెండున్నరేళ్ళయ్యింది. ‘గుండెల్లో గోదారి’ తర్వాత నేను ఏ సినిమాకీ సైన్ చేయలేదు. ‘జంప్ జిలానీ అమెరికా’ అనుకుంటున్నా. మీకు ఎమోషన్స్ ఎక్కువ అనుకుంటా? మంచు లక్ష్మి: చాలాఎక్కువండీ. ఆనందం వచ్చినా, బాధ అనిపించినా.. ఏదైనా తీవ్రంగానే ఉంటుంది. కంటి ముందు అన్యాయం జరిగితే భరించలేను. వెంటనే ఖండిస్తాను. నాకు డాన్సులేయడం ఇష్టం. అలాగే మూల కూర్చుని ఏడవడం ఇష్టం. తప్పు చేసినోడి దవడ పగలగొట్టడం కూడా ఇష్టమే. ఈ మధ్య కాలంలో మీకు బాగా కోపం తెప్పించిన అంశం ఏదైనా ఉందా? మంచు లక్ష్మి: ఢిల్లీ ఎపిసోడ్. ఆ సంఘటనతో న్యాయవ్యవస్థపై నాకు నమ్మకం పోయింది. మందు తాగి తప్పు చేశారని అంటున్నారట. ఒక్కడు చేస్తే మందు తాగి తప్పు చేశాడనుకోవచ్చు. కానీ ఇది నలుగురు కలిసి కూడబలుక్కుని చేసిన తప్పు. దానికి సీక్వెల్స్‌గా ఇప్పుడు నెంబరాఫ్ దారుణాలు జరుగుతున్నాయి. రీసెంట్‌గా చెన్నయ్‌లో అయిదేళ్ల పాపను ఓ వ్యక్తి రేప్ చేశాడు. ఈ సంఘటనలు చూస్తుంటే దేశం ఎటు వెళుతుందా అనిపిస్తోంది. ఆడపిల్లల్ని పుట్టుకనుంచీ తక్కువగా చూడ్డంవల్లే ఈ దారుణాలని నా ఫీలింగ్. అంటే స్త్రీలపై సమాజంలో ఉన్న వివక్షే ఈ దారుణాలకు కారణం అంటారా? మంచు లక్ష్మి: కచ్చితంగా. ఏ విషయంలో మేం తక్కువండీ? ఆడది కప్పుకునే ఎందుకు తిరగాలి? మగాడిలా ఎందుకు ఫ్రీగా ఉండకూడదు? ఆడపిల్ల బయటకు వెళుతుంటే ‘జాగ్రత్తమ్మా’ అంటారు. మగాళ్లనేమో విచ్చలవిడిగా వదిలేస్తారు. అమ్మాయి బయటికెళ్తున్నప్పుడు.. ఓ వెయ్యి రూపాయిలిచ్చి ‘ఎంజాయ్ చేసిరా’ అని తల్లిదండ్రులు ఎందుకివ్వరు. సొసైటీ ఇలా తయారవ్వడానికి కారణం అమ్మానాన్నలే. ముందు తల్లిదండ్రులు పిల్లల్ని డిఫరెన్స్ లేకుండా పెంచాలి. ఎలాంటి కష్టాలనైనా అధిగమించే ఆత్మస్థైర్యాన్ని ఆడపిల్లల్లో నింపాలి. ఇప్పటికీ నేను కారెక్కుతుంటే నా భర్త డోర్ తెరుస్తారు. ఇంట్లో ఆయనకు నేను సేవ చేస్తాను. అది మనిషికి మనిషి ఇచ్చే గౌరవం. మగాడు ప్రేమిస్తే.. అంతకు మించిన ప్రేమను పంచుతుంది స్త్రీ. మన దేశంలో స్త్రీలకు కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి కదా.... మంచు లక్ష్మి: ఏవండీ... ఒక్కసారి మన పురాణాల్ని గమనించండి. కుంతి అయిదుగురికి పాండవులను కన్నది. ద్రౌపది ఆ అయిదుగురిని భర్తలుగా పొందింది. అప్పటితో పోలిస్తే కట్టుబాట్లు ఇప్పుడే ఎక్కువ అనడానికి ఈ నిదర్శనం చాలదా? ఇలా చెప్పాలంటే ఇంకా చాలా చెప్పగలను. జనరల్లీ... మీరు కాస్త ఘాటుగా మాట్లాడతారు. మొన్నామధ్య ఇలాగే సెక్స్ గురించి మాట్లాడి సంచలనం రేపారు. ఇదంతా అవసరమా? మంచు లక్ష్మి: సంచలనాల కోసం నేను మాట్లాడను. నాకు నిజం అనిపించింది మాట్లాడతాను. అది మీకు నిజం అనిపించాలని నేను అనుకోను. ఆ మధ్య నేను ‘సెక్స్’ గురించి మాట్లాడాను అని మీరు అన్నారు. నేను అప్పుడూ నిజమే మాట్లాడాను. ‘సెక్స్’ అనేది తప్పుకాదు. అజంతా, ఎల్లోరా శిల్పాలు ఓ సారి చూడండి. వాటి ద్వారా సెక్స్‌కి సంబంధించిన చాలా అంశాలు మన పూర్వీకులు చెప్పారు. వాత్సాయన కామసూత్రాలను ప్రపంచానికి అందించింది మనవాళ్లే. సినిమాల్లో కత్తులతో నరుక్కోవడం చూపిస్తే తప్పుకాదు కానీ, ఆడామగా చేయి చేయి పట్టుకొని కాస్త క్లోజ్‌గా మూవ్ అయితే తప్పా? సెక్స్ అనేది పెద్ద బూతు అంటారు. చేయి పట్టుకోవడమే తప్పంటారు. మళ్లీ తెగ పిల్లల్ని కనేసి జనాభాను పెంచేస్తుంటారు. మనకు ఇంత పాపులేషన్ ఎలా వచ్చిందండీ.. చదువు, సంస్కారం వున్న ఎవరూ సెక్స్‌ని ఒక తప్పుగా భావించరు. ప్రపంచ జనాభాలో మన దేశం రెండో స్థానంలో ఉందంటే కారణం మనవాళ్లలో ఎక్కువమంది నిరక్షరాస్యులు కావడమే. పిల్లల్ని కంటే ‘వాళ్ళెళ్లి కూలి పనిచేసుకొచ్చి మమ్మల్ని పోషిస్తారు’ అని చీప్‌గా ఆలోచించి పిల్లల్ని కనేవాళ్లు కూడా మనదేశంలో ఉన్నారు. ఒకరిద్దరు పిల్లలితో సరిపెట్టుకొని వారికే చదువును, సంస్కారాన్ని నేర్పి, వారిని భావిభారత పౌరులుగా తీర్చిదిద్దితే మన దేశం అన్ని దేశాల్లో అగ్రగామి అవుతుంది. మనసులో ఏది ఉంటే అది మాట్లాడేస్తారు. ఈ ఫ్రాంక్‌నెస్ వల్ల మీరు కొందరికి చెడు అయ్యే ప్రమాదం ఉంది... మంచు లక్ష్మి: నా రెంట్ కడుతున్నారా వచ్చి వాళ్లూ... అంతెందుకు ‘నా గుండెల్లో గోదారి’ సినిమా అమ్మడానికి నానా తిప్పలు పడ్డాను. కొనడానికి ఎవరైనా వచ్చారా? సినిమా మొత్తం బయటే అమ్మాను. నా మదిలో ఏది ఉంటే అదే మాట్లాడతాను. ఎవరేం అనుకున్నా ‘డోంట్ కేర్’. మీ నాన్నే అనుకుంటే, ఆయనకంటే రెబల్‌లా ఉన్నారే.. మంచు లక్ష్మి: నాన్న ముక్కుసూటితనమే నాకూ వచ్చింది. నా విషయంలో ఆయన భయపడేది అదే. ‘తల్లీ... నువ్వు చాలా మంచిదానివి. కానీ బయట సొసైటీ అలాలేదు. ఈ ముక్కుసూటితనం కారణంగా నేను లైఫ్‌లో చాలా కోల్పోయాను. మీరు అదే తప్పు చేయొద్దు’ అని చెబుతుంటారు. సరే మళ్లీ సినిమాల్లోకొద్దాం. అన్ని భాషల్లో కలిసి ఓ పది సినిమాలు చేసుంటారా? మంచు లక్ష్మి: పది సినిమాలు చేసుంటానా!? ఒకవేళ చేసినా... రెండు మూడు సినిమాలను మినహాయిస్తే... అన్నీ చిన్న పాత్రలే కదండీ. మరి ‘గుండెల్లో గోదారిలో’ అంత అనుభవం ఉన్న ఆర్టిస్టులా ఎలా చేయగలిగారు? మంచు లక్ష్మి: అమెరికాలో కూడా నా పని నటించడమేగా.. థియేటర్ ఆర్టిస్టును అవ్వడం వల్లే చేయగలిగానేమో. షేక్‌స్పియర్ నాటకాలు కూడా వేసేవారటగా? మంచు లక్ష్మి: ఎస్... ఐ లవ్ షేక్‌స్పియర్. ప్రేమకథలంటే ఆయనవేనండీ. నాకు నాటకాలంటే పిచ్చి. ఒకసారి పరుచూరి గోపాలకృష్ణ అంకుల్‌ని అడిగాను. ‘మీరు ప్రతి ఏడాది పరిషత్ నడుపుతారు కదా. అందులో ఒక అవకాశం ఇవ్వండి’ అని. మొన్నామధ్య హిందూస్థానీ నాటకం ఒకటి హైదరాబాద్‌లోనే లాంగ్వేజ్ నేర్చుకొని మరీ ప్లే చేశాను. దాసరి నారాయణరావు అంకుల్, రాఘవేంద్రరావు అంకుల్ ఆ నాటకాన్ని చూసి మెచ్చుకున్నారు కూడా. నాటకం, సినిమా... ఈ రెండింటిలో నటిగా మీకు సంతృప్తినిచ్చింది ఏది? మంచు లక్ష్మి: నాటకమే! ఒక ప్లే చేసేటప్పుడు చూసే జనాల్లో నుంచి వైబ్రేషన్స్ వచ్చి తగులుతూ ఉంటాయి తెలుసా... సినిమా ఏముందండీ... ఎక్కడో కెమెరా ముందు చేస్తాం. జనాలు థియేటర్‌లో చూస్తారు. బాగుంటే బాగుందంటారు. లేకపోతే ఇక అంతే సంగతులు. నాటకం అలా కాదుకదా.. స్పాట్ జడ్జిమెంట్. థియేటర్ ఆర్టిస్ట్ లక్ష్మి అంటే మీకిష్టమా? లేక సినిమా స్టార్ మంచు లక్ష్మి అంటే మీకిష్టమా? మంచు లక్ష్మి: ‘థియేటర్ ఆర్టిస్ట్‌ని’ అని నేను చెబితే మీకు తెలిసింది. సినిమా అలా కాదు కదండీ. ఈ రోజు ఇంటర్‌వ్యూ ఇచ్చే స్థాయిలో ఉన్నానంటే కారణం సినిమానే కదా. ఒక సినిమాలో నటిస్తే అది తరతరాలకు ఉండిపోతుంది. ‘గుండెల్లో గోదారి’ నాన్నగారు చూసి ఏమన్నారు? మంచు లక్ష్మి: చాలా ఆనందించారు. ‘నువ్వు ఇంత పేరు సంపాదించుకోవడం చాలా ఆనందంగా ఉంది అమ్మడూ. ఇదే నాకు పదివేల కోట్లు. ఇంతకంటే ఒక తండ్రిగా నాకేం అక్కర్లేదు’ అని తెగ ఆనందపడిపోయారు. ‘నాన్న ఎప్పుడూ పొగడరు’ అని మేం బాధపడేవాళ్లం. అలాంటి నాన్న ఇలా ఎమోషన్ అవుతుంటే నేను నమ్మలేకపోయాను. అయితే ‘గుండెల్లో గోదారి’ సినిమా రిలీజయ్యాక నాకు అందిన తొలి అభినందన మాత్రం నాకు మా ఆయన నుంచే. ‘లక్ష్మీ నువ్వు బోర్న్ ఆర్టిస్ట్‌వి. చాలా గొప్పగా నటించావు. గుండెల్లో గోదారి వెరి గుడ్ మూవీ. ప్రతి సన్నివేశం ప్రేమించే విధంగా ఉంది. రెండు క్యూట్ లవ్‌స్టోరీస్ హృదయాలకు హత్తుకునేలా ఉన్నాయి’ అని యూఎస్ నుంచి మెసేజ్ పెట్టారు. ‘గు గో గో’ అని అందరికీ మెసేజ్‌లు కూడా పాస్ చేశారట. ‘గు గో గో’ అంటే ఏంటో చెప్పలేదు కదూ. ‘గుండెల్లో గోదారికి గో’ అనంట(నవ్వుతూ)! ఏది ఏమైనా మోహన్‌బాబుగారికి మాత్రం దేవుడు అన్యాయం చేశాడండీ... మంచు లక్ష్మి: నన్ను ఆడపిల్లగా పుట్టించా? మీరే కాదు. రామ్‌గోపాల్‌వర్మా.. ఇలాగే అన్నారు. ‘ఆడపిల్లగా ఉండే మీరు అనుకుంటున్నది సాధిస్తా..’ అని తనకు చెప్పాను. అబ్బాయిగా పుడితే బావుండని ఎప్పుడైనా అనిపించిందా? మంచు లక్ష్మి: కెరీర్ పరంగా ఎప్పుడూ అనిపించలేదు కానీ, ఫిజికల్‌గా చాలాసార్లు అనిపించింది... ఎందుకు ఆడపిల్లగా పుట్టానా అని! ఆ విషయం మినహా మిగిలిన విషయాల్లో లేడీస్ సూపరండీ. నాకు అందంగా తయారవ్వడం ఇష్టం. రకరకాల డ్రస్‌లు వేసుకోవడం ఇష్టం. మగాళ్ళకు ప్యాంట్, షర్ట్ అంతే కదా(నవ్వుతూ) ఒక స్థితిమంతుల కుటుంబంలో పుట్టిన మీరు.. జీవితం పరంగా ఎన్నో ఒడిదుడుకులను చవిచూశారు. అమెరికాలో సామాన్య జీవితం గడిపారు. ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటే ఎలా అనిపిస్తుంది? మంచు లక్ష్మి: చాలా గర్వంగా అనిపిస్తుంది. ఈ విషయంలో మా నాన్నే నాకు ఇన్‌స్పిరేషన్. నేను నాన్నంత అవుతానో లేదో తెలీదు కానీ, ఆయన్ను చూస్తుంటే అవ్వాలి అనిపిస్తుంది. 2012 సంవత్సరంలో కోటీ యాభై ఏడు లక్షల రూపాయలు ఫ్రీ ఎడ్యుకేషన్‌కి ఖర్చుపెట్టారు నాన్న. మన రాష్ట్రంలో ఉచిత విద్యకు అంత డబ్బు ఖర్చుచేసిన వాళ్ల పేరు ఒక్కటి చెప్పండి. ఆయన్నే ఆదర్శంగా చేసుకున్నాను కాబట్టే ఎన్ని కష్టాలనైనా అధిగమించగలిగాను. సంభాషణ: బుర్రా నరసింహ నేనే ఇలా ఉంటే...నాకు పుట్టేది ఇంకెలా ఉంటుంది! అమ్మ ఎప్పుడవుతావ్? అని చాలామంది అడుగుతున్నారు. ‘పెళ్లయిన రెండేళ్లకే పిల్లలు పుట్టేయాలి... లేకపోతే లేనిపోని సమస్యలొస్తాయి’ అనే అభిప్రాయానికి నేను పూర్తి వ్యతిరేకిని. తల్లిని అవ్వడం నా చేతిలోనే ఉంది. అది నేను ఎప్పుడు అవ్వాలనుకుంటే అప్పుడే అవుతాను. ప్రస్తుతం నేను ఓ కుక్కపిల్లను పెంచుకుంటున్నాను. దానిపేరు జూస్. అమెరికా నుంచి తెచ్చుకున్నాను. నన్ను చూడగానే తోక ఊపుకుంటూ ఎంతో ఆప్యాయంగా దగ్గరకొస్తుంది. అదంటే నాకు చాలా ఇష్టం. ఇక నా మేనకోడళ్లు ఆరియానా, వివియానా ఎలానూ ఉన్నారు. నేను విష్ణుతో అంటుంటాను - ‘వీళ్లు నీ పిల్లలంటే ఎవరూ నమ్మర్రా.. నా పోలికలతో పుట్టేశారు. ఒకరు లక్ష్మి, ఒకరు ప్రసన్న’ అని ఎప్పుడూ అంటుంటాను. వాళ్ల అల్లరి చూస్తే కడుపు నిండిపోతుంటుంది. వాళ్లు ‘అత్త...’ అంటుంటే గుండె జారిపోతున్న ఫీలింగ్. ప్రస్తుతానికి నాకు ఈ ఆనందం చాలు. అసలు నేనే... ఇలా ఉంటే, నాకు పుట్టేది ఇంకెలా ఉంటుంది చెప్పండి. నేను, విష్ణు, మనోజ్ మోహన్‌బాబుగారి బిడ్డలమే అయినా... కూతురిగా నేను మోసే బాధ్యతలకంటే విష్ణు, మనోజ్‌లు మోసే బాధ్యతలకే బరువెక్కువ. ముఖ్యంగా విష్ణు... మోహన్‌బాబు ఫస్ట్ సన్. ‘దేనికైనా రెడీ’ సినిమా విషయంలో తను అనుభవించిన స్ట్రగుల్స్ మాటల్లో చెప్పలేను. నిజంగా హేట్సాఫ్ విష్ణు. పడిన ప్రతిసారీ లేచి నిలబడటానికి తను చేసిన ప్రయత్నాలు ఎవ్వరూ మరిచిపోలేరు. ఓ విధంగా విష్ణు, మనోజ్‌లు ఇచ్చిన ఇన్‌స్పిరేషన్‌తోనే నేను ముందుకెళ్లగలుగుతున్నాను. మీకో విషయం తెలుసా? నేను టీవీ వ్యాఖ్యాత అవ్వడానికి కారకుడు విష్ణునే. తనే నాన్నగారితో ఒప్పించి నన్ను ఫస్ట్ యాంకర్‌ని చేశాడు |
all
-
స్త్రీ తన శరీరంలో మరో జీవికి ప్రాణం పోస్తున్న సమయం, అంటే గర్భవతిగా మారేటప్పుడు రకరకాల మార్పుల్ని శరీరం సూచిస్తుంది. సహజంగా ఈ మార్పులు సున్న...
-
అందం విషయంలో కేశాలు కూడా ప్రదానం. ఎందుకంటే అందమైన జుట్టు వారి అందాన్ని మరింత ఎక్కువగా చూపెడుతుంది. అందమైన అలలులా ఎగసిపడే జుట్టు మరియు పొడవ...
-
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న తర్వాత మహిళలు అంతకుమునుపు ఆహారం ఎలా తీసుకున్నా అప్పట్నుంచి మాత్రం తినే పదార్థాల్లో ఉప్పు, చక్...
-
బ్లడ్ ప్రెషర్(బిపి) అంటే తెలియని వారు ఉండరు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో మారుతున్న జీవిన శెలితో పాటు ఆనారోగ్యాలు కూడా ఎక్కువవుతున్నాయి. అందులో...
-
తల్లిపాలు శిశువుకు అమృతంలాంటివి. తల్లిపాలు శ్రేష్టం, ఎంతో ముఖ్యమైన సంపూర్ణ పౌష్టిక ఆహారం. తల్లికి బిడ్డకు ఆరోగ్యవంతమైనది. ఇద్దరి మధ్య మంచి ...
-
డాక్టర్ని అడగండి నా వయసు 20. మలవిసర్జన సమయంలో మల ద్వారం నుంచి రక్తం పడుతోంది. మలవిసర్జనకు వెళ్లినప్పుడు లోనుంచి చిన్న ...
-
http://www.scribd.com/doc/119728850/DHYANAM-DANI-PADHATULU-SWAMI-VIVEKANANDA-SWAMI
-
తెలుగింటి ఆనవాళ్లు... ఆరుగజాల సొగసు చీరలు. తెలుగింటి కళలు... కమనీయకాంతుల చీరలు. తెలుగింటి సింగారాలు... సిరులొలికించే...
-
పాన్ లో ఉల్లిపాయలు ఎర్రగా వేగుతుంటే కొబ్బరి దానికి జతగా చేరితే పెరుగు ఒక అడుగు పసందుగా వేస్తుంది. మీగడ ఒద్దిగకగా ఒదిగిపోతుంది. ఇలంతా ఘుమ...
-
గైనిక్ కౌన్సెలింగ్ నేను ఇప్పుడు మూడో నెల గర్భవతిని. మా అమ్మమ్మ రోజూ పాలలో కుంకుమపువ్వు క...
Friday, March 15, 2013
అసలు... పెళ్లిలోనే పారిపోదాం అనుకున్నాను...మంచు లక్ష్మి
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment