విపరీతమైన దగ్గు, గ్యాస్... గొంతు మారుతోంది...
.
నా వయసు 36. ఉద్యోగరీత్యా తరచూ దూరప్రాంతాలకు వెళ్లాల్సిన జాబ్‌లో ఉన్నాను. రోజూ సరైన వేళకు తినే అవకాశం ఉండదు. ఒక్కోసారి వేరే రాష్ట్రాలకూ వెళ్లాల్సి ఉండటంతో నేను తినే ఆహారాలూ మారుతుంటాయి. నాకు గ్యాస్ ట్రబుల్ సమస్య కూడా ఉంది. దగ్గు, గ్యాస్ సమస్యలతో ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను. స్వరం బొంగురుగా మారుతోంది. నా సమస్యకు సరైన సలహా ఇవ్వండి.
- ఎం.డి. అన్వర్‌ఖాన్, హైదరాబాద్ మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీరు గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా మన కడుపులో కొన్ని ఆసిడ్స్ తయారవుతూంటాయి. ఇవి ఆహారం జీర్ణమయ్యేందుకు ఉపయోగపడుతుంటాయి. అయితే మనం ఆహారం సరిగా తీసుకోకపోయినా, సరైనవేళకు తినకపోయినా ఈ ఆసిడ్స్ తేన్పుల రూపంలో పైకి వస్తాయి. ఇవి మొదట స్వరపేటికలోని వోకల్ ఫోల్డ్స్, గొంతులోని ఇతరభాగాలపై ప్రభావం చూపుతాయి. దాంతో దగ్గు వస్తుంది. స్వరం మారుతుంది. ఎప్పుడూ గొంతు సరిచేసుకోవాలనిపిస్తుంది. దగ్గు ఎక్కువ కావడం, స్వరం మారడం, చెవిలో నొప్పి, ఇతర సమస్యలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. మీరు వెంటనే మీకు దగ్గరలోని ఈఎన్‌టీ నిపుణులు, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌లను సంప్రదించి, ఎండోస్కోపీ వంటి అవసరమైన పరీక్షలు జరిపించి సమస్య ఏమిటన్నది నిర్ధారణ అయిన తర్వాత దాన్నిబట్టి మందులు వాడాల్సి ఉంటుంది. మందులతో పాటు మీ సమస్యకు అసలు కారణాలైన జీవనశైలిలో మార్పులు చేసుకోవడం అవసరం. నా వయసు 20. మాట్లాడుతుంటే నత్తివస్తోంది. ఈ పోటీ యుగంలో నెగ్గుకురావడం ఎలా అన్నది ఆలోచిస్తే ఆందోళన కలుగుతోంది. ఈ విషయంలో తగిన సలహా ఇవ్వండి. - అఖిలేష్, విజయవాడ మీ సమస్యను వైద్య పరిభాషలో స్టట్టరింగ్ అంటారు. మొదట మీరు... మీ సమస్య తీవ్రత ఎంత, ఏయే సందర్భాల్లో నత్తి వస్తోంది అన్న అంశాలు తెలుసుకోడానికి అనుభవజ్ఞులైన స్పీచ్ థెరపిస్ట్‌లను సంప్రదించండి. కొన్నిసార్లు అవసరమైతే సైకాలజిస్ట్‌ను కూడా సంప్రదించాల్సి ఉంటుంది. మీరు దీని గురించి మానసికంగా బాధపడిన కొద్దీ ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. మీకు అవకాశాలు వచ్చినప్పుడల్లా ప్రయత్నపూర్వకంగా మాట్లాడండి. దిగులు పడకుండా ధైర్యంగా సంభాషిస్తూనే ఉండండి. స్పీచ్ థెరపిస్ట్, సైకాలజిస్ట్‌ల కౌన్సెలింగ్ తీసుకుంటూ వారు చెప్పినవి ఇంటిదగ్గర ప్రాక్టీస్ చేస్తే ఈ సమస్యను చాలావరకు అధిగమించవచ్చు. |
No comments:
Post a Comment