all

Friday, March 15, 2013

మహిళ చేతుల్లో, చేతల్లోనే అభ్యుదయం

 

 
NewsListandDetailsనాడు, నేడు, ఏనాడు మహిళ మహోన్నత పాత్ర వహిస్తుంది. కాని కాలవైపరీత్యం వల్ల పాలనా (గృహ, సమాజపాలన)లోపాల వలన మహిళలు తీవ్ర అన్యాయానికి బలౌతున్నారు.
ఇందుకు మగవారు, మహిళలు, పెద్దలు, అందరూ పూనుకుని పరిస్థితులను చక్కదిద్దాలి. కేవలం చట్టాలు చేసి చేతులు దులుపుకొనడం సరికాదు. రాజారామ్మోహన్‌రాయ్, విలియం బెంటిక్స్‌, మహాత్మాగాంధీ, అంబేద్కర్‌, కందుకూరి వీరేశలింగం గారు వంటి ఎందరో మహానుభావులు, దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ వంటి మహిళామణులు, మహిళల్ని చైతన్య పరచారు.
కాని నేటి మహిళలు చాలా మంది అమాయకులు, విద్యావంతులు కూడా ఒకే రీతిగా, తమ స్వాతంత్య్రాన్ని తామే వినియోగించుకునే సామర్థ్యాన్ని గుర్తించుకోవడం లేదు. కారం పొట్లాలు, కరాటే వంటివి స్వీయరక్షణ పద్ధతులను సూచించడం కంటే ముందుగా వారి ఆలోచనల్ని, ధైర్య మనస్తత్వాన్ని ప్రోది చేసి, ప్రోత్సాహించాలి.


 ఉదాహరణకు రాష్ట్ర ఆర్‌టిసి బస్సులలో ముఖ్యంగా విశాఖ, శ్రీకాకుళం వంటి ప్రాంతాల్లో స్త్రీలకు కేటాయించిన సీట్లను పురుషులు ఆక్రమించి, స్త్రీలు, పసిపిల్లల్ని ఎత్తుకుని నిలబడినా, వారి సీట్లను వారికివ్వరు. ఈ స్త్రీలు కూడా కనీసం మాట వరసకైనా అడగరు. ఒకవేళ ఎవరైనా అడిగితే కండక్టర్లు కూడా ఖాతరు చేయడం లేదు. సాటి మహిళలు కూడా ప్రశ్నించిన స్త్రీని విపరీతంగా భావిస్తున్నారు కాని, తెలిసి కూడా మాటసాయం చేయరు. కొంతమంది మహిళలు తమకు సంబంధించిన పురుషులను స్త్రీలకు కేటాయించిన సీట్లలో కూర్చుని, ఫ్యామిలీ కదండి అంటారు. గంటల తరబడి, తమ హక్కైన సీటు వదులుకుని పిల్లలతో వేళ్లాడుతూ ఒరుగుతూ ప్రయాణిస్తారు తప్ప నోరు మెదపరు.


ఇంత ఒదిగి ఉండాల్సిన అవసరం లేదు. తలవంచి హక్కులను వదలుకొనే మనస్తత్వం మార్చుకోవాలి. ''స్వాతంత్య్రం నా జన్మ హక్కు" అని నినదించిన దేశంలో స్త్రీలు స్వచ్ఛందంగా కూడా హక్కులను వదులుకుంటున్నారు.
బస్సుల్లో-టిక్కెట్టు లేని ప్రయాణం నేరం అందుకు జరిమానా 500రూ. అని ఖచ్చితంగా వ్రాస్తారు. స్త్రీలను గౌరవించడం మన సంప్రదాయం, వారికి కేటాయించిన సీట్లలో వారినే కూర్చొనిద్దాం అని ఉంటుంది.
మహిళలూ మీ సీటు మీ హక్కు ఉల్లంఘిస్తే వారికి శిక్ష జరిమానా అని ఎందుకు వ్రాయరు.
మహిళలు చిన్న విషయాల్లో సైతం ఉదాసీనంగా చైతన్యరహితంగా ఏదో పోనీయమనే ధోరణిని విడనాడి, తమ ఆలోచనావిధానాన్ని హక్కుల పరిరక్షణకై కేంద్రీకరిస్తే ఆ ధైర్య స్థైర్యాలతో మహిళాభ్యుదయం మహిళల మానసికా సామర్థ్యంతో, మహిళ చేతుల్లో, చేతల్లో చైతన్యంలో ప్రకాశింపగలదని విశ్వసిస్తున్నాను.

- అద్దేపల్లి విద్యావతీ దేవి

No comments: