all

Friday, March 15, 2013

విష్ణురూపాయ నమశ్శివాయ

 

ఇన్నర్‌వ్యూ
శివుడూ, విష్ణువూ వేర్వేరు కాదు. శివుడు పురుషరూపం. విష్ణువు స్త్రీరూపం. ఈ మాటని వినగానే విభేదించాలనే ఆలోచన కలుగవచ్చేమో కానీ, సూక్ష్మంగా పరిశీలిస్తే ఇందులోని అంతరార్థం అవగతమౌతుంది.

లోకంలో కనిపించే ఏ పురాణాన్నైనా ఇతిహాసాన్నైనా కొందరు కేవలం భక్తి పరంగానే చదువుకుంటూ వెళ్లిపోతారు. కొందరు సాహిత్యదృష్టితో చదివేసుకుంటూ పురాణం చివరివరకూ సాగిపోతారు. ఇంకొందరు దానిలో దాగిన వైజ్ఞానిక విశేషాలను వెతుక్కుంటూ కదిలిపోతారు. అయితే ఒకే దృష్టితో చదివినందువల్ల వచ్చే చిక్కుల్ని రెండుమూడింటిని స్థూలంగా అనుకుని అప్పుడు మహాశివరాత్రి పర్వదినం గురించి రెండు మాటలనుకుందాం!

శంకరుడు సుందరుడు, యువకుడూ అని అనుకునేలోగా ఆయన లింగాకారుడంటారు. ఆయన తన తలమీద రాగిజుట్టుని ధరిస్తాడని చెప్పుకునేలోగా ఆయన ఐదుతలలువాడు అని చెప్తారు. ఆయన పరమ ధర్మమూర్తి అని వింటుండగానే బ్రహ్మతలనీ, నలుగు వినాయకుని తలనీ నరికాడంటారు. తన లయకార్యమనే పనిని సక్రమంగా నిర్వహిస్తాడని తెలుసుకునే లోగానే మార్కండేయుణ్ణి మృత్యువు నుండి తప్పించాడంటారు. ఇక అన్నిటినీ మించి ఎక్కడా విననీ చూడనీ రీతిలో ఆయన్ని అర్ధనారీశ్వరుడంటారు. ఇలా ఒకటేమిటి? వింటున్న కొద్దీ సందేహాలే. దీనంతటికీ కారణం పైన అనుకున్నట్టుగా పురాణాన్ని ఒకే ఒక దృష్టితో చూడడమే. అలా కాకుండా ఆధ్యాత్మిక, లౌకిక, వైజ్ఞానిక దృక్కోణాలతో పరమశివుడిని సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి.

అర్ధనారీశ్వరరూపం

ప్రపంచంలో దేనికీ ఏకత్వం లేదు. రెండు కలిసి ఒకటిగా అయినవే. సూర్యోదయం సూర్యాస్తమయం కలిసి పగలు. చంద్రోదయం + చంద్రాస్తమయం కలిసి రాత్రి. పగలు+రాత్రీ కలిసి రోజు. ఉత్తరాయనం+దక్షిణాయనం కలిసి సంవత్సరం. ఈ కాలవిభాగంలో స్త్రీ+పురుషుడూ కలిసి సృష్టి.

ఇలా రెండ్రెండు ఒకటిగా అయ్యే విధానాన్ని పరిశీలించిన మీదట ప్రాచీన ఋషులకి ఓ అద్భుత ఆలోచన కలిగింది. ప్రపంచమనేది ఇలా, ఎవరూ తనకి ఏమీ చెప్పకుండా, ఎవరూ తనని మందలించకుండా, ఎవరూ ఏ సూచనైనా పర్యవేక్షణా చేయకుండా ఎలా ఏర్పడుతోంది? సరైన కాలం ప్రకారం ఎలా నడిచిపోతుంది? అని.

అంతే! అప్పుడు వాళ్లకి అర్థమైంది. ఓ పదార్థం+ దానిలోని చైతన్యం (శక్తి) అనేవే ఈ కదలికలూ మార్పులూ గమనాలూ... అన్నిటికీ కారణమని.

ఆ పదార్థాన్నే శివుడన్నారు. ఆ చైతన్యాన్నే శక్తి అన్నారు. ఇది శాస్త్రం ప్రకారం (భౌతికశాస్త్రం) చెప్పిన మాట అయితే, కేవలం భక్తి ప్రధానంగా దీన్ని భావించిన భాగవతులు శంకరుడూ ఆయన భార్య పార్వతీ ఈ ఇద్దరూ కలిసి ఉండే రూపమే అర్ధనారీశ్వరం అన్నారు. ఈ రూపాన్నే ఇప్పుడు ఆధ్యాత్మిక లౌకిక వైజ్ఞానిక దృష్టితో చూద్దాం!

ఆధ్యాత్మికంగా

శివుడూ, విష్ణువూ వేరు కాదు నిజానికి. శివుడు పురుషరూపం. విష్ణువు స్త్రీరూపం. దేవతలందరిలో మీసాలున్నది శివుడికే. మీసాలుండడం పురుషలక్షణం. ఒయారంగా ఉండడం స్త్రీ లక్షణం. కృష్ణ విగ్రహాన్ని చూస్తే త్రి-భంగి’గా (మెడ దగ్గర ఒక వంపూ, నడుం దగ్గర రెండో వంపూ, పాదాల వద్ద మరో వంపూ... ఇలా మూడు సుందర భంగులతో కన్పించే విగ్రహం) ఉంటుంది. అందుకే ‘శ్రీకృష్ణ శ్యామలాదేవీ’ అంటూ కృష్ణుణ్ణి స్త్రీ దేవతగా శాస్త్రమే అంగీకరించింది.

శివుడు అభిషేక ప్రియుడైతే, నిత్యం ఆభరణాలు పుష్పాలూ వస్త్రాలు నిత్యసేవలూ అన్నిటికీ మించి తన సౌందర్యాన్ని చూసేందుకు వస్తున్న బంధుజనాన్ని చూసి మురిసిపోయే లక్షణం ఆయనలోని స్త్రీ గుణానిది. అందుకని స్త్రీ రూపం విష్ణువే. (కేవలం భక్తి దృష్టితో చూస్తే మరి విష్ణువుకి భార్యలున్నారుగా! అన్పిస్తుంది).

శివుడూ విష్ణువూ ఏక రూపంలో ఉంటారు. ఆ రూపంలో కూడా కుడిభాగం శివుడైతే ఎడమభాగం విష్ణువౌతాడు. ఆ కారణంగానే అనాలోచితంగా శివుడు వరాలనిచ్చేస్తూ ఉంటే విష్ణువు శివుణ్ని రక్షిస్తూ ఒడ్డున పడేస్తూ ఉంటాడు.
శివుడు కుడివైపున ఉంటాడనుకున్నాం కదా! మెదడులోని కుడిభాగం ఆలోచనకి స్థానం. అందుకే సర్వజ్ఞుడు అనే పేరు శంకరునికే ఉంది. ఈ కారణంగానే శిశువుకి అక్షరాభ్యాసం చేయించే వేళలో విద్యలకి అధిష్ఠాత్రి అయిన సరస్వతి పేరుని గాని, కోరిన విద్యలకెల్ల ఒజ్జ (ఉపాధ్యాయుడు) అయిన వినాయకుని పేరుని గాని రాయించకుండా ‘నమశ్శివాయ సిద్ధం నమః’ అనే రాయిస్తారు. (అయితే మనవాళ్లు నమశ్శివాయః అని మాత్రమే రాయిస్తుంటారు. అంటే అక్షరాభ్యాసకాలం నుండే తప్పు రాయిస్తున్నామన్నమాట!).

సరే, విష్ణువుని ఇక్కడ స్త్రీగా చెప్పుకుంటుండడమనేది ఆయనని తక్కువ చేయడానికి కానే కాదు. సీతమ్మ శ్రీమద్రామాయణంలో స్వయంగా విష్ణుతత్త్వాన్ని ప్రతిపాదిస్తూ నర్మగర్భంగా ‘రామచంద్రమూర్తీ! నన్ను అడవులకి తీసుకుపోవడానికి భయపడుతున్నావు.

మా నాన్న నిన్ను పురుషుడనుకుని పెళ్లిచేసాడు నాతో. అవునుమరి! నువ్వు పురుషరూపాన్ని ధరించిన స్త్రీవి (స్త్రీయం పురుష విగ్రహమ్) కదా!’ అంటుంది.

ఇక ఉత్సవాల విషయానికొచ్చినా ఆశ్వీయుజమాసంలో శుద్ధ పాడ్యమి నుండి విజయదశమి వరకూ ఇటు బ్రహ్మోత్సవాలు అటు దశహోరా (నవరాత్రోత్సవాలు) ఉత్సవాలు జరుగుతాయి. ఎప్పుడూ చుట్టాలతో పక్కాలతో పట్టుచీరల రెపరెపలతో బంగారు ఆభరణాల అలంకరణలతో బంధువుల గలగల మాటలలో ఉండడం స్త్రీలకిష్టం కాబట్టే విష్ణువుకి నిత్యోత్సవ పక్షోత్సవ ఆయనోత్సవ సంవత్సరోత్సవాలు సాగుతాయి. ఇంట్లో స్త్రీలందరూ ఉత్సవం చేసుకుంటుంటే పురుషుడు అలా దాదాపు మౌనసాక్షిగా ఉంటాడు కాబట్టే శివాలయాలు భక్తసంఖ్య విషయంలో తక్కువగానే కన్పిస్తాయి.

విష్ణువు స్త్రీ కాబట్టే ఆయన రూపంలో తలమీద శిరోజాలు కన్పిస్తూ, ‘కేశవు’డన్పించుకుంటున్నాడు ఒక అర్థంలో. లోకంలో వరాలనిచ్చేదీ, చనువుతో దగ్గరికి చేర్చుకునేదీ అమ్మ కాబట్టే విష్ణువు వర-ద (వరాల నిచ్చే చేయి) హస్తంతో ఉంటాడు. శివుని రూపాన్ని చూడనూ చూడలేం - ఆయన వరద హస్తాన్ని గమనించనూ గమనించలేం - ఆలయంలో... లింగరూపంలో ఉంటాడు కాబట్టి.

ఇద్దరూ ఒకే శరీరం కలవాళ్లు కాబట్టే ఇద్దరూ శంఖదారులే. ఇద్దరూ గంగమ్మతో బంధం (శంకరుని తలమీద అంది పురాణం. విష్ణువుకి పాదం నుండి అంది పురాణం) కలిగి ఉన్నవాళ్లే. అన్నవర క్షేత్రంలో ఆ ఇద్దరి రూపమూ కన్పిస్తుంది, అదీ ఒకే పీఠం మీద. విష్ణువు, పైగా మీసాలతో (అందుకే శ్రీ ‘వీర’ వెంకటసత్యనారాయణస్వామి అయ్యాడు) వీర లక్షణాన్ని చూపిస్తూ లక్ష్మితో దర్శనమిస్తూ -మా రూపమే ఈ అర్ధనారీశ్వరమంటూ - లింగాకారంలో ప్రాణపట్టంతో కన్పిస్తూ ఇదో తీరు (శివశక్త్యైరూపం) అర్ధనారీశ్వరమని సూచిస్తాడాయన.

లౌకికంగా

పై తీరు అర్ధనారీశ్వర రూపాన్ని కాకుండా సాధారణంగా మనకి కన్పించే పార్వతీ పరమేశ్వరుల్ని అర్ధనారీశ్వర రూపంలో లౌకిక దృష్టితో చూస్తే - ఇటు చుట్ట చుట్టుకుని కేశ సంస్కారం లేని జుట్టుముడి ఉన్న తల శంకరునిదైతే, అటు అమ్మ చక్కని కొప్పూ, చంపక అశోక పున్నాగ సౌగంధిక పుష్పాల అమరికతో కన్పిస్తుంది. ఇటు అయ్య తన కంఠానికి పాముని ధరిస్తే, అటు అమ్మ రత్నాల కంఠహారాన్ని వేసుకుని దర్శనమిస్తుంది. ఇటు అయ్య ఒళ్లంతా భస్మాన్ని పూసుకుంటే, అటు అమ్మ చందనాన్ని (చందన ద్రవ దిగ్ధాంగీ) లేపనంగా (దూదూగ్గా రాసుకోవడమన్నమాట) చేసుకుని సాక్షాత్కరిస్తుంది. అయ్య తాండవం చేస్తే, అమ్మ లాస్యాన్ని చేస్తుంది. అయ్య వ్యాఘ్రచర్మంలో రుద్రరూపంలో భయం కొల్పుతూ ఉంటే, అమ్మ పట్టు వస్త్రంతో (పట్టుచీర) ప్రసన్న ముఖంతో (వక్త్రలక్ష్మీ .... మీనాభలోచనా) చక్కని కన్నులతో అనుగ్రహిస్తూ ఉంటుంది.

ఇక్కడి లౌకిక రహస్యమేమంటే నేనిలా ఉంటే నువ్వు అలా ఉండడం నాకు నచ్చలే దని ఏ ఒకరూ మరొకరితో అనకపోవడం. లోకంలో కూడ మనం చూస్తుంటాం ఆయన ఒకలా ఉంటే ఆమె ఆయనకి పూర్తి విరుద్ధంగా -అలంకార విధానంలో- ఉండడం. ఇలాంటప్పుడు ఎవరి ఇష్టాన్ని వాళ్లు పాటించుకునేలా చేసుకుంటూ ఒకరినొకరు గౌరవించుకోవడం అన్నది దాంపత్య పదానికి చేయాల్సిన వ్యాఖ్యానంలో మొదటి వాక్యమౌతుంది కదా!

ఇక తల అనేది ఆలోచనకి స్థానమైతే, కాలు ఆచరణకి సంకేతం! ఆ ఇద్దరూ తలనుండి కాలి వరకూ అర్ధనారీశ్వరరూపంతో ఉన్నారంటే ఆ జంట ఏ పనిని చేయదలిచినా ఆలోచన నుండి ఆచరణ వరకూ ఒకలానే (ఇద్దరూ కలిసే) చేస్తారని అర్థమన్నమాట! అందుకే ఎక్కడైనా అన్యోన్యంగా జంట కన్పిస్తే పార్వతీ పరమేశ్వరుల్లా, ఆదిదంపతుల్లా ఉన్నారంటాం గానీ సీతారాముల్ని, రాధాకృష్ణుల్నీ ఆ సందర్భంలో స్మరించం. పైగా ఏ నోముల్లో, వ్రతాలలోనైనా దాంపత్యం సరిలేక ఏ స్త్రీయైనా దుఃఖిస్తూ ఉంటే ఆ చేయబడే వ్రతకథలోని మొదటి వాక్యం - ఓసారి పార్వతీ పరమేశ్వరులు నందివాహనమ్మీద వెళ్తూ దుఃఖిస్తూన్న ఓ స్త్రీని చూసారు - అనేదే! ఆ దుఃఖాన్ని తొలగించి నిత్య సంతోషాన్ని అందించడమే వారి లక్ష్యం కాబట్టే ఎప్పుడూ ఈ ఇద్దరే వ్రతకథల్లో తిరుగాడుతూ ఉంటారు.

శంకరునికి భార్యపట్ల ఎంత మక్కువంటే - ఆమెని చూడాలనే తహతహతో వచ్చే తనని... నలుగుపిండి రూపంతో బాలకునిగా ఉన్న ఒకడు అడ్డగిస్తే అతడి తలను ఖండించి మరీ లోపలికి వెళ్లిపోయాడు తప్ప, మరి దేన్నీ ఆలోచించలేదాయన. విషాన్ని మింగవలసిందని పార్వతి ఆజ్ఞాపించిందనేగానే అది తనకి ఏ కష్టాన్ని కల్గిస్తుందోనని ఆలోచించనే ఆలోచించకుండా ‘మ్రింగుమనె సర్వమంగళ’ - ఆమె తాగవలసిందేనంటే అది ప్రజాక్షేమం (తమ సంతానానికి శుభం కలిగించేదే) కోసమే అయ్యుంటుందనే ఆలోచనే శంకరునిది. తాగేసాడు. పార్వతి మాటమీద అంతటి నమ్మకం ఆయనకి. ప్రాణాన్ని తీసే విషం కూడా (తాగమన్నది పార్వతి కాబట్టి) తనకి ప్రాణాన్ని ఇచ్చేదే అయ్యుంటుందనేది శంకరుని విశ్వాసం. దంపతులకి కావల్సిందిదే. తన భార్యకి అవమానం జరిగిందని తెలిసి మామ తలని నరికించడానిక్కూడా వెనుకాడనంతటి ఇష్టం పార్వతి మీద శంకరునికి.

పిల్లలు తమ ఉత్సవానికి ఎక్కడ రానందుకు, రాలేక బాధపడతారోనని గమనించిన ఆ దంపతులు తమంతతామే వాళ్లు రాలేని చిమ్మ చీకటి ఉండే బహుళ చతుర్దశినీ, చలి వణికించే మాఘమాసాన్ని, చలితో పాటు మంచు బాగా కురిసే అర్ధరాత్రి నుండి తెల్లవారు జామువరకూ లింగోద్భవ అభిషేకాన్ని, వివాహన్నీ ఏర్పాటు చేసుకుని, పిల్లలు రాగానే ‘మీరెలా రాగలరురా? అని తమదే తప్పుగా చెప్పుకునే దంపతులు పార్వతీ పరమేశ్వరులు. అందుకే కాళిదాస మహాకవి వాళ్లని ‘పితరౌ’ (నిజమైన తల్లిదండ్రులు మాతా చ పితా చ) అన్నాడు తన శ్లోకంలో. ఇలా ఎంతైనా లౌకిక దృష్టితో చెప్పవచ్చు.

వైజ్ఞానిక దృష్టితో

శివుడు వ్యోమకేశుడు. ఆకాశమే తల జుట్టుగా కలవాడని దీనర్థం. తల జుట్టు ఎంత సూక్ష్మంగానూ అసంఖ్యాకంగానూ ఉంటుందో అలా ఆకాశంలో రహస్యాలు కూడా సూక్ష్మాతి సూక్ష్మబుద్ధితో చూస్తే తప్ప కన్పించనివీ, పైగా ఎంతకాలం పాటు పరిశీలిస్తున్నా ఇంకా లభ్యమౌతూనే ఉండేవీ అని కూడా దీని భావం. ఎన్ని కనుక్కున్నా ఆకాశ రహస్యాలకి అంతులేదంది భగవద్గీత ఇందుకే. (శ్రుత్వా ప్యేనం వేదన దేహ కశ్చిత్).

శివుడు గంగాధరుడు. జ్ఞానాన్ని గంగతో పోలుస్తారు. కాబట్టి జ్ఞానానికంతకీ ఆధారం శిరోభాగం. అందుకే పంచజ్ఞాన ఇంద్రియాలూ తలలోనే కన్పిస్తాయి. ఇంటికి పైనున్న నీటితొట్టెలో శుభ్రమైన నీరుంటే ఇంట్లోకీ అవే నీళ్లొచ్చి ఇంట్లో అందరూ ఆరోగ్యవంతులుగా ఉండగలుగుతారు. అదే తీరుగా తల అనేది సరిగ్గా ఆలోచిస్తే శరీరమంతా (కర్మేంద్రియాలు ఐదూ) సక్రమంగానే పని చేస్తుంది. సర్వస్య గాత్రస్య శరః ప్రధానమ్ (శరీరానికి ప్రధానం తల) అనేది ఇందుకే!

శివుడికి కార్తికమాసం ఇష్టమన్నారంటే దానిక్కారణం కృత్తికా నక్షత్రం ఆకాశంలో నిలిచి ఉన్న తెల్లవారుజామున ఆ నెల పొడుగునా చన్నీటి స్నానాన్ని చేస్తే సంవత్సరమంతా ఆరోగ్యవంతులుగా ఉండవచ్చని తెల్పడమే. ఆయనకి సంబంధించిన నమకంలో మొదటిమంత్రమే ‘నీ కోపానికి నమస్కార’ (సమస్తే రుద్ర మన్యవ ఉతో త ఇషవే నమః) మంటోందంటే దాని ఆంతర్యం- సకాలంలో నీ బాధ్యతని నువ్వెందుకు నిర్వర్తించకుండా ఉంటావు?’ వని ప్రతివ్యక్తీనీ హెచ్చరించడమే. ఇంట్లో తండ్రి తన పిల్లల్ని కోప్పడేది ఇందుకే!

భక్తిపరంగా...

ఇక కేవలం భక్తి భావంతో చూస్తే శంకరుడు చాలా బోళాబోళీతనంతో ఉండే లక్షణమున్నవాడు. ఏమీ అనుకోడు. తిరిగి ఏమీ అనడు కూడా. అందుకే శంకరాచార్యులంతటి గంభీరులు కూడా ఆయన్ని ఆట పట్టిస్తూ ఇలా అన్నారు.

ఆశనం గరలం ఫణీ కలాపః వసనం చర్మ చ వాహనం మహోక్షః
మమ దాస్యసి కిం? కిస్తి శంభో? తవ పాదాంబుజ భక్తి మేవ దేహి’ అని.

‘శంకరా! ఏమైనా తిండి పెడతావేమో ననుకుంటే నువ్వే విషం తిన్నావు! ఆభరణాలనిస్తావేమో ననుకుంటే ఒంటినిండా పాముల్నే ధరిస్తావు! పోనీ తిండీ ఆభరణాల మాటకేం గాని, మంచి బట్టలైనా పెట్టేస్తే వెళ్లి పోదామనుకుంటే పగలు పులిచర్మం, రాత్రి ఏనుగుచర్మం కట్టి కన్పిస్తావు! కనీసం మమ్మల్ని ఈ అడవి చివరి వరకైనా సాగనంపి మా ఊరికెళ్లే తోవ చూపిస్తావేమో ననుకుంటే - నీ వాహనం ఎద్దు. పైగా అది ముసలిది (మహా ఉక్షః) కూడాను. ఔను! ఏమీ అనుకోకు గానీ మాకేం ఇస్తావు? ఇవ్వాలంటే ఏదో ఒకటి ఉండాలిగా! ఏముంది నీ దగ్గర? అసలుందా? (కిమస్తి?)- అని ఇంత వేళాకోళంగా ఆది శంకరులు ఆటపట్టించారు.
చివరి మాటలో ‘సరేలే! మాకు నీ పాదాంబుజాల యెడ భక్తి ప్రసాదించు చాలు’నన్నారు ఆయనే. ఇలా ఉన్న శంకరుణ్ణి ప్రార్థించాలి కూడానా? అన్పిస్తుంది మనకి. కానీ దాని అంతరార్థం ఇదీ: నువ్వే ఆ కాలకూట విషాన్ని స్వీకరించకుండా ఉండి ఉంటే ఆ విషాగ్ని ఈ ప్రపంచాన్నే మండించి వేసేది. మేం ఉండేవాళ్లమే కాదు! మేమున్నామంటే కారణం నీ విషపానమే. నమస్కారం శివా! లోకం నిండా విషబుద్ధులే ఉన్నారు. అలా విషం నిండి ఉన్న పాముల్ని చుట్టాల్లా ఒంటి నిండా తిప్పుకుంటూ విరోధుల్నీ, హాని చేసే వాళ్లనీ కూడా ఎలా లొంగ తీసుకోవాలో తెలుసుకోమంటున్నావా? ఎంత గొప్ప ఉపదేశం! సాష్టాంగం భవా! రజస్తమో గుణాలకి చిహ్నంగా వ్యాఘ్ర గజ చర్మాలని కట్టావా? అప్పుడప్పుడూ బుస్సుమంటూ ఉంటే గాని లోకవ్యవహారం సాగదంటున్నావా? దండాలు హరా! ధర్మానికి సంకేతం ‘ఎద్దు’ కాబట్టి ధర్మ బద్ధంగానే ఉండమంటున్నావా! దొడ్డ దేవరా వందనం! అందుకే కదయ్యా ఇది శివ (శుభాన్నిచ్చే) రాత్రి! - అని.

-డా॥మైలవరపు శ్రీనివాసరావు
 

No comments: