all

Friday, March 15, 2013

ఆత్మసౌందర్యమే సంస్కృతి-నిత్య సందేశం

 

 
మానవ సంస్కృతి మనిషి భూమిపై జన్మించినప్పటి నుంచీ అనేక మార్పులకు లోనై నేటి దశకు చేరుకొంది. మనిషి భావసంపద పెరిగే కొలదీ నాగరక సంస్కృతులు పెరుగుతూనే ఉంటాయి. కాలానుగుణంగా అవి ప్రభావితమవుతూనే ఉంటాయి. అయితే సంస్కృతికి, నాగరకతకు స్పష్టమైన భేదం ఉంది.

నాగరకత అంటే నగర ప్రజల జీవన విధానం అని అర్థం. నాగరకత కలవారందరూ సంస్కృతీపరులు కాకపోవచ్చు. నాగరకత వేషభాషలకు, ఆచారవ్యవహారాలకు చెందినది. సంస్కృతి మనోవికాసానికి, హృదయ సౌందర్యానికి, ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించినది. నాగరకత బాహ్య జీవితం అయితే సంస్కృతి అంతరజీవితం. నాగరకత దేహధర్మమైతే సంస్కృతి ఆత్మధర్మం. విభిన్న జాతులకు నాగరకతలోను, సంస్కృతిలోను భేదాలు ఉంటాయి.

తొలి మానవుడు వేటనే వృత్తిగా స్వీకరించి సంచార జీవితం గడిపాడు. తరువాత స్థిరనివాసం ఏర్పరుచుకొని వ్యవసాయం ప్రారంభించాడు. తాను వాడుకున్న వస్తువులను అందంగా తీర్చిదిద్దుకున్నాడు. క్రమంగా రాజ్యాలు, ప్రభుత్వాలు అవతరించాయి. భాష, లలితకళలూ అభివృద్ధి చెందాయి. ఈ విధంగా మనిషి ఎప్పటికప్పుడు తన భావాలను సంస్కరించుకుంటూ, భావసంపదను పెంపొందించుకుంటూ పురోగమిస్తున్నాడు. నిజానికి సంస్కృతి సంఘంలోని అధిక సంఖ్యాకుల జీవనవిధానమే తప్ప వ్యక్తిగతమైన వారసత్వం కాదు. అది భూతకాలపు ప్రతిబింబం. ఆచార వ్యవహారాల ద్వారా ఒక తరం నుండి మరొక తరానికి సంక్రమిస్తుంది. సమాజ సాంఘిక, నైతిక అవసరాలను తీర్చుతూ ఒక క్రమపద్ధతికి లోబడి ఉంటుంది.

మన భారతీయ సంస్కృతి ప్రధానంగా ఆధ్యాత్మిక సంస్కృతి. అమెరికా వారిది లౌకిక సంస్కృతి. సంస్కృతుల మధ్య ఈ విధమైన వైవిధ్యం ఉంటుంది. ఏదో ఒక ప్రత్యేకత లేనిదే ఏదీ సంస్కృతి కాజాలదు. మానవుని కనీసావసరాలు తీర్చుకునే పద్ధతుల్లో అన్ని సంస్కృతులకు పరస్పర పోలికలు ఉంటాయి. ప్రతి సంస్కృతిలోనూ దేశరక్షణ, కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ, శాస్త్రవిజ్ఞానం తప్పనిసరి అవుతాయి.

వ్యక్తిగతంగా కూడా సంస్కృతి అమూల్యమైనది. సాంఘిక జీవితంలో అది ప్రధానపాత్ర వహిస్తుంది. సామాజిక సంబంధాలను పదిలంగా ఉంచుతుంది. వ్యక్తిగతమైన కోర్కెలను అదుపులో ఉంచి, వ్యక్తిని సంపూర్ణ మానవునిగా తీర్చిదిద్దుతుంది. సంఘజీవితానికి సిద్ధం చేస్తుంది. వ్యక్తుల మధ్య పరస్పర సహకారం పెంపొందే సామాజిక దృక్పథం పెంచుతుంది.

కుటుంబం, దేశం, జాతి మొదలైన వానిలో సభ్యునిగా మనిషి తన ధర్మం నెరవేర్చడానికీ, అతడి యదార్థ జీవన వికాసానికి సంస్కృతి తోడ్పడుతుంది. విభిన్న సంస్కృతుల మధ్య సహనాన్ని పెంపొందిస్తుంది. మానవజాతి అభ్యుదయానికీ, ఆధ్యాత్మిక పురోగమనానికీ దోహదం చేస్తుంది. ఒక్కమాటలో చెప్పాలంటే సంస్కృతి సమాజంలోని సర్వాంశాల సముదాయం. మన పూర్వులు సహనం... సంస్కృతి యొక్క ప్రథమ లక్షణమని, ఆత్మసౌందర్యమే సంస్కృతి అని అభివర్ణించారు.

- చోడిశెట్టి శ్రీనివాసరావు
 

No comments: