all

Friday, March 15, 2013

మెచ్చుకోలు పొగడ్తలు

 
NewsListandDetails 





పొగడ్తల స్వభావం ఎప్పుడూ మనం తీసుకునే విధానం బట్టే ఉంటుంది. పూర్తిగా అతిశయోక్తితో ఉండి, పొందుతున్న వారికి వాటివల్ల సమాజంలో మరింత ఒత్తిడి కలుగజేసే పొగడ్తలు కొన్ని ఉంటాయి. వీటినుంచి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఇటువంటివి అభివృద్ధి చెందుతున్న దశలో ఉన్నవారికి చాలా హాని చేస్తాయి. పొగడ్త చాలా తీయగా ఉంటుంది. ఒక అభినందన, మెచ్చుకోలు మనిషికి ఇచ్చే స్ఫూర్తి ఇంతా అంతా అని చెప్పలేము. మనుష్యుల మధ్య అనుబంధ మాలికలు అలవోకగా అల్లగలిగే చాతుర్యం, శక్తి పొగడ్తకి ఉన్నాయి.

మనకున్న ఆప్తుల లిస్టులో తప్పకుండా మనల్ని వెన్నుతట్టి అభినందించిన ఉన్నత హృదయాలు తప్పకుండా ఉంటాయి. ఒక రకంగా ఇది కొన్నిసార్లు ప్రాణవాయువులా పని చేస్తుంది. అయితే ఇన్ని మంచి లక్షణాలు ఉన్న పొగడ్తని పొందినపుడు దానిని యథాతథంగా తీసుకోవటం కొంచెం కష్టంగానే ఉంటుంది. అంత పొగడ్తకి అర్హులమా? అనే అనుమానం, సిగ్గుబిడియాలు మనసులో దూరి నసపెడుతుంటాయి. అపుడు అభినందనని అందుకోవటం కూడా పెద్ద బరువుగానే ఉంటుంది. అటువంటపుడే పొగడ్తలకు ప్రతిస్పందన, పొగిడిన వారిని చిన్నబుచ్చేదిలా కూడా ఉంటుంది.
మరి పొగడ్తల అగడ్తలు ఎలా దాటాలో చెప్పాలంటే...

- ఎవరినుంచైనా పొగడ్తని పొందినపుడు ముందు చేయవలసిన పని వారికి 'థాంక్స్‌' అంటూ కృతజ్ఞత చెప్పడం. ఆ అభినందనని మీరు వ్యతిరేకించదలుచుకున్నా సరే ముందు వారికి కృతజ్ఞతలు తెలపండి.

- వారు చేసిన పొగడ్త పట్ల మనసులోనే ఒక నిర్ణయానికి రండి. మీరు చేస్తున్న కృషికి, సాధిస్తున్న విజయాలకు అది నిజంగా తగినది అనిపిస్తే ఆ ఆనందాన్ని వ్యక్తం చేయండి. 'నేను సాధించిన ఈ చిన్న విజయాన్ని మీరు గుర్తించినందుకు నాకు నిజంగా ఆనందంగా ఉంది' అని గానీ లేదా 'మీ ప్రోత్సాహం నాకు ఇంకా ఉత్సాహాన్ని ఇస్తోంది' అని గానీ వారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పండి.

- ఒకవేళ అవతలి వారి పొగడ్త చాలా ఎక్కువగా ఉన్నట్టు మీకు అనిపిస్తే, అంటే మీకు అంత అర్హతలేదు అనిపిస్తే ముందు కృతజ్ఞతలు చెప్పి తరువాత మీ మనసులో ఉన్నది రెండు రకాలుగా వ్యక్తం చేయవచ్చు. మొదటిది, అవతలివారు మీపై ఉదారంగా పెద్ద మనసుతో పొగడ్తలు కురిపించినట్టు చెప్పండి. అంటే అంతటి అభినందనకి 'నేను తగను' అని పరోక్షంగా చెప్పండి. అలాగే అవతలివారు చేసిన అభినందన స్థాయిని అందుకునేందుకు తప్పకుండా కృషి చేస్తానని వారికి మాట ఇవ్వండి. అలా పరోక్షంగా వారికి మీరు, అంతటి పొగడ్తలు మిమ్మల్ని కొంత బిడియానికి గురి చేస్తున్నట్టు చెప్పినట్టే అవుతుంది.

- అవతలి వారి పొగడ్తలు మరీ శృతి మించితే, అంటే అవి బాగా అతిశయోక్తులు అయితే వాటిని మృదువుగా ఖండించవచ్చు. ఉదాహరణకి- ఒక రచయిత్రి పుస్తకావిష్కరణ సభ జరుగుతోంది. అందులో ఒక వక్త ఆమె గొప్ప రచయిత్రి అనీ ఎన్నో పుస్తకాలు రాశారని శృతిమించే పొగుడుతున్నాడు. ఇవతల ఈవిడకి చాలా సిగ్గుగా ఉంది పరిస్థితి. ఎందుకంటే ఆమె రాసింది ఒకే పుస్తకం మరి. ఆవిడ తాను మాట్లాడే వంతు వచ్చినపుడు ఆ వక్త వ్యక్తం చేసిన అతిశయోక్తులను సరిచేసి తాను రాసింది ఒకే పుస్తకం అనీ, సదరు వక్త పొరబడినట్టు మృదువుగా చెప్పుకుంది. అయితే ఈ సందర్భంలో ఆ పొగిడిన వ్యక్తి కొంత చిన్నబుచ్చుకోవటం మామూలే. అయితే ఇలాంటపుడు ఆ అతిశయోక్తులు ఎవరికీ హాని చేయనివి, మరీ నవ్వులపాలు చేయనివి అయితే వదిలి వేయవచ్చు. లేకపోతే చాలా మృదువుగా, సమయస్ఫూర్తిగా వాటిని ఖండించవలసి ఉంటుంది.

- అసలు పొగడ్తలంటేనే చాలా చిరాకు పడుతుంటారు కొందరు. ఇటువంటి వారు తమని పొగిడేవారంతా తమనుంచి ఏదో ఆశిస్తున్నారు అనే దురభిప్రాయంతో కూడా ఉంటారు. ఇటువంటపుడు కొన్నిసార్లు తమ ప్రగతిని, అభివృద్ధిని సూచిస్తూ వచ్చే మెచ్చుకోళ్ళని కూడా తిరస్కరిస్తుంటారు. ఇది ఏమంత మంచిపని కాదు. ఎందుకంటే వాటిని తిరస్కరించడం అంటే మన పట్ల మనకున్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని కూడా కాదనడం అవుతుంది. ఒక చిన్న ఉదాహరణ- ఒక ఇన్సూరెన్సు ట్రైనింగు క్లాసులో ఆ శిక్షకుడు ఒక అమ్మాయిని నువ్వు చాలా తెలివిగలదానివని పొగిడాడు. నిజంగానే ఆ అమ్మాయికి ఆ పొగడ్తని పొందే అర్హత ఉంది. కానీ దానిని ఆమె సక్రమంగా తీసుకోలేకపోయింది. వెంటనే 'మీరన్నంత కాదు' అంటూ తన వ్యతిరేకతని తెలిపింది. ఆ శిక్షకుడు అక్కడితో ఆగకుండా-

'అదే నిజం అయితే నాకు చాలా బాధగా ఉంది, ఎందుకంటే మనం ఎలా ఆలోచిస్తామో అలాగే రూపుదిద్దుకుంటాము' అన్నాడు. అలా పొగడ్తలను ఖండించే నేపథ్యంలో మనకున్న అర్హతలను తగ్గించుకోవలసిన పరిస్థితులు తెచ్చుకోకూడదు. ఇది మన ఆత్మ విశ్వాసాన్ని తగ్గించుకోవడమే అవుతుంది.

- పొగడ్తలను నిర్ధాక్షిణ్యంగా ఖండించడం అంటే అది ఎల్లప్పుడూ మనలో ఉన్న నిగర్వాన్నే సూచించదు. మనపై మనకి కచ్ఛితమైన అంచనా లేకపోవటం అవుతుంది. మన శక్తి సామర్ధ్యాలను చిన్నబుచ్చుకోవటం కూడా అవుతుంది. అందుకే నిజాయితీగా మనల్ని అభినందించిన వారి నుంచి వాటిని స్వీకరించి కృతజ్ఞతలు చెప్పాలి. అభినందనలో ఉన్న గౌరవాన్ని కాదనడం మూర్ఖత్వం అవుతుంది.

- పొగడ్తలను ఎప్పుడూ మన విజయాలకు మెట్లుగానే తీసుకోవాలి. అంతేకానీ వాటిని బాగా తలకెక్కించుకుని చేసే పనిపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం చేయకూడదు. అంటే పొగడ్తల స్వభావం ఎప్పుడూ మనం తీసుకునే విధానం బట్టే ఉంటుంది. పూర్తిగా అతిశయోక్తితో ఉండి, పొందుతున్న వారికి వాటివల్ల సమాజంలో మరింత ఒత్తిడి కలుగజేసే పొగడ్తలు కొన్ని ఉంటాయి వీటినుంచి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి. గుర్తించకపోతే ఇటువంటివి అభివృద్ధి చెందుతున్న దశలో ఉన్నవారికి చాలా హాని చేస్తాయి.

- పొగడ్తలు మనుషుల వ్యక్తిత్వాలను జీవితాలను నిర్మించగలుగుతాయి. వారిచేత ఎన్నో ఘనకార్యాలు చేయిస్తాయి. అయితే ఇదంతా వాటిని స్వీకరించే వారి మనస్తత్వాలను బట్టే ఉంటుంది. కాబట్టి పొందుతున్న మెప్పుతో భవిష్యత్తుకి ముప్పు మాత్రం తెచ్చుకోకూడదు.

- పొగడ్తలు ఒక్కోసారి మనుషులకు లేని సామర్ధ్యాలు కూడా తెచ్చి పెడతాయి. అందమైన ఆ మాటలు, భావాలు, నలుగురిలో ఆపాదించబడే గొప్పదనం ఇవన్నీ పొందిన వారిని నిద్రపోనివ్వవు. ఒకవేళ ఆ అభినందనలకు అప్పుడు అర్హత లేకపోయినా వాటి కోసం తరువాతైనా కష్టపడటం, తపించడం చేస్తారు. ఇలా కొన్ని సందర్భాల్లో పొందే అర్హతలేని పొగడ్తలు తరువాత కాలంలో ఆ అర్హతని అవే ఇస్తాయి.

- మొత్తం మీద పొగడటం ఒక కళ అయితే వాటిని సవ్యంగా స్వీకరించడం, వాటినుంచి సరైన ఉత్తేజం, ఉత్సాహం పొందటం, ఆ పొగడ్తలు చేసిన వారిని తృప్తి పరచడం అంతకంటే పెద్ద కళ. మనం పొందిన మెప్పుకి అర్హత ఉన్నవారమైతే వాటిని చక్కని కృతజ్ఞతా భావంతో స్వీకరించడం, లేకపోతే ఆ స్థాయికి చేరేందుకు కృషి చేస్తామని మరింత సున్నితంగా అవతలివారికి మీ సంతోషాన్ని, కృతజ్ఞతని వ్యక్తం చేయటం ముఖ్యం.     

No comments: