all

Friday, March 15, 2013

కమలా కాదనలేం..!

రంగు, రుచి, చిక్కదనం... మూడు కలగలిసింది త్రీ రోజెస్‌ మాత్రమే కాదు! కమలా కూడా! ఎందుకంటే, నారింజ రంగు వెంటనే ఆకట్టుకునే రంగు. పుల్లపుల్లగా, తియ్యతియ్యగా నోరూరించే రుచి. ఆపై రసం చిక్కగానేగా వుండేది. సో, కమలాను కాదనడం భావ్యంకాదు. ఆపై సుగుణాల మూటకట్టిన ఫలంకూడాను! చైనాలో కమలాపండును శుభాలు కలిగించే ఫలంగా అభివర్ణిస్తారట. ఆ మెప్పుకోళ్లకు కమలా తగినదే అనిపించదూ!
కమలా కాయగానే కాదు, జ్యూస్‌లానూ లాగించెయ్యొచ్చు. అయితే, తొనలుగా తింటేనే మంచిది. ఇక ప్లమ్‌కేక్‌ చేయడానికి కమలారసంలో డ్రైఫ్రూట్స్‌ను నానబెడితే ఆ రుచే వేరు. దానికి కమలా తొక్కల పొడి జోడిస్తే... అబ్బో... ఇక స్వర్గం దిగిరాదూ! అన్నట్లు... కమలాతొక్కలు సౌందర్యానికి వారధులు. చర్మరోగాలకు విరుగుడు. వీటన్నింటికీ ఇందులోని పోషకాలే కారణం. మరవేంటో తెలుసుకుంటే పోలా?


- ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ.
- ఇందులో విటమిన్‌ సి మాత్రమే కాదు. విటమిన్‌ ఎ, బిలు, ఎమినో యాసిడ్లు, బీటా కెరోటిన్‌, పెక్టిన్‌, పొటాషియం, ఫోలిక్‌ యాసిడ్‌, కేల్షియం, అయొడిన్‌, సోడియం, జింక్‌, ఐరన్‌... వగైరా వగైరాలన్నీ కొలువుతీరాయి!
- రక్తనాళాలు సమర్థవంతంగా పనిచేసేలా చేయడంలో ఇది బాగా కృషిచేస్తుందిట!
- కేన్సర్‌ను అధిగమించడంలో కమలా పాత్ర ఎక్కువేనట. కణాలను రక్షించడంలో సమర్థవంతంగా పనిచేస్తుందిట.
- కొలెస్ట్రాల్‌ తగ్గించడానికి కమలా తన శ్రాయశక్తులా ప్రయత్నిస్తుందిట.
- ఇది రక్తాన్ని బాగా శుద్ధి చేస్తుందని వైద్య పరిశోధకులు సెలవిచ్చారు.
ఇందులో పీచు అధికమని అందరికీ తెలుసు. దానివల్ల జీర్ణక్రియ చక్కగా జరుగుతుందని మళ్లీ చెప్పాలా?!
- గుండె సమస్యలూ రాకుండా చేయడంలో కమలాను మించింది లేదట.
- కమలా రోగనిరోధకశక్తిని పెంచే సాధనం.
- కమలాకు మారుపేరు సౌందర్యం. చర్మానికి మేలుచేసే సుగుణాలెన్నో దీనిలో వున్నాయి.
- కిడ్నీలో రాళ్లు రాకుండా కాపాడే వనరు కమలా.
- ఇందులోని విటమిన్‌ సి పెప్టిక్‌ అల్సర్‌ను నివారిస్తుంది. తద్వారా కేన్సర్‌ రాకుండా చూస్తుందిట.
- వైరల్‌ ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో కమలాఫలం సఫలం.
అదీ కమలా చరిత్ర. రుజువైన వాస్తవాల చరిత్ర. అంటే, కమలా ఆరోగ్యానికి సోపానమనేగా అర్థం!

No comments: