all

Friday, March 15, 2013

కర్తవ్యపాలనలో మహిళ.............


 
NewsListandDetails మహిళలు పురాణకాలం నుండి వారి కర్తవ్యాన్ని నిర్వహిస్తూనే ఉన్నారు. కైకేయి దశరథుని వెంట ఉండి ఆయన యుద్ధభూమిలో గాయపడిన తరువాత వేరొక చోటికి తీసుకువెళ్లి సపర్యలు చేసి సేదదీర్చింది.

భర్త విజయానికి కారణం అయ్యింది. శ్రీరామునికి స్వయంగా యుద్ధవిద్యలు నేర్పింది. చంద్రునికి గ్రహణం పట్టినట్లు ఆమె బుద్ధి మంథర వల్ల ప్రేరేపింపబడి, శ్రీరాముని అడవికి పంపడం, భరతుని రాజ్యాభిషేకం వరాలు దశరథుని కోరింది.

కాని శ్రీరాముడు అడవిలో రాక్షసులను సంహరించడం విని సంతోషించింది. తాను అపనిందలు పాలయినా, శ్రీరాముడు లోకరక్షకుడయినందుకు తాను నేర్పిన యుద్ధవిద్యలు లోకకల్యాణానికి కారణం అయినందుకు ఎంతగానో ఆనందపడింది.

మహాభారతంలో కుంతీదేవి తనకొరకు కాక ఇతరులకొరకు మాత్రమే జీవించింది. పెంపుడు తండ్రి కుంతి భోజుడు దుర్వాసుని సేవకు నియోగించగా ఎంతో భక్తిశ్రద్ధలతో ఆయనకు సేవచేసింది. ఆయన వలన ఎంతో విజ్ఞానాన్ని పొందింది. ఆయన సంతోషించి మంత్రాన్ని ఉపదేశించాడు.
ఒంటరిగా ఉన్నప్పుడు బాల్యచాపల్యంతో ఉదయిస్తున్న సూర్యుని చూసి మంత్రాన్ని పఠించింది. ఫలితంగా కర్ణునికి జన్మను ఇచ్చింది. ఈ చిన్న తప్పు ఆమె జీవితాన్ని మార్చివేసింది. పాండురాజుతో వివాహం ఆమెకు బాధ్యతలను మాత్రమే పెంచింది. వంశము కొరకు దేవతలను ఆహ్వానించి, తాను పుత్రులను పొంది, మాద్రి కూడా సంతానయోగం కలగజేసింది.

గాంధారి వివాహము ధృతరాష్ట్రునితో భీష్ముని అధికారము వలన జరిగింది. హస్తినాపురాన్ని ఎదిరించే ధైర్యము గాంధార దేశానికి లేదు. శతపుత్రవతిగా, శంకరుని వరము పొందిన ఆమెను భీష్ముడు ధృతరాష్ట్రునికి ఇచ్చి చెయ్యమని కోరాడు. ఎదిరించే ధైర్యము లేక గాంధారి తండ్రి సుబలుడు అందుకు అంగీకరించాడు.
కాని శకుని గుండెలో జ్వాల మహాభారత యుద్ధానికి కారణం అయింది. భర్త అంధుడని ఆమె కూడా కళ్లకు గంతలు కట్టుకుంది. ఆమె ఏనాడు సత్యాన్ని వీడలేదు. బాధ్యతలను విస్మరించలేదు. హస్తినాపురంలో ఉన్నంతకాలం కుంతిని, పాండవులను ఆదరించింది. దుర్యోధనుని దుష్ప్రవర్తనను గురించి ధృతరాష్ట్రునితో పలుమార్లు చర్చించింది. చివరికి యుద్ధములో ధర్మానికి మాత్రమే విజయము కలగాలని కోరుకుంది.
ఈవిధముగా గాంధారి ఆకాలంలో స్త్రీలకు మార్గదర్శకం అయింది.



ఊర్మిళ లక్ష్మణుని భార్య రామాయణంలో ఈమె ప్రస్తావన చాలా తక్కువగా వస్తుంది. నిజానికి, నిజమైన వనవాసం ఊర్మిళ అనుభవించింది. శ్రీరామునితో లక్ష్మణుడు అరణ్యవాసానికి వెళ్లాడు.
మాండవి భరతునితో శృతకీర్తి శతృఘ్నునితో సుఖముగానే ఉన్నారు. రామునితో సీత అడవికి వెళ్లవచ్చును కాని, ఊర్మిళ లక్ష్మణునితో వెళ్లకూడదా!
ఈ ప్రశ్న ఆమె మనస్సులో నుండి బయటకు రాలేదు. దానికి ఆమె చింతించలేదు. ఊర్మిళ మిథిలానగరంలో రసాయనిక శాస్త్రాన్ని అభ్యసించింది.

దండకారణ్యంలో ఎక్కడెక్కడ, భూమిలో గంధకము పొరలుగా ఉందో నిపుణులను పంపి విషయాన్ని సేకరించింది. వారు చెప్పగా ఎప్పటికప్పుడు ఆ విషయం రామలక్ష్మణులకు తెలియజేసింది. శ్రీరాముని ఆశయం దండకారణ్యం నుండి రాక్షసులను సంహరించడం లేదా, వారిని అక్కడ నుండి తరమికొట్టడము. ఖర-దూషకాదులతో సహా పధ్నాలుగు వేలమంది రాక్షసులు అక్కడ ఉన్నారు.
వారినందరిని శ్రీరాముడు ఒక్కడే సంహరించాడు. వారంతా భూమిలో గంధకము పొరలు ఉన్న ప్రాంతానికి రాగా, ఒక్కసారిగా ఆగ్నేయాస్త్రముతో వారిని అందరిని సంహరించాడు. అనగా గంధకము నుండి వారంతా మాడి మసిఅయ్యారు.
ఈవిధముగా ఊర్మిళ శ్రీరామలక్ష్మణులు దండకారణ్యంలో రాక్షసులను సంహరించడానికి కారణం అయ్యింది.





నేటికాలంలో మహిళలు ఎన్నో రంగాలలో ప్రముఖస్థానాలలో ఉన్నారు.
మేడం క్యూరీ నుండి సునీతా విలియమ్స్‌ వరకు ఖ్యాతిని గడించారు.
మహిళలకు అన్యాయం జరిగినప్పుడు సంఘీభావంతో వారే ఏదోరకంగా ఎదుర్కొంటున్నారు.
కాని ఆత్మరక్షణ కూడా ఎంతో అవసరం.

ఎవరో వచ్చి ఏదో చేస్తారని రక్షిస్తారని ఆశించక, ఆడపిల్లలు కరాటే వంటి మార్షల్‌ ఆర్ట్స్‌ నేర్చుకోవాలి. సామాజిక స్పృహ కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే మహిళలు ముందుకు సాగగలరు. 
  - ర్యాలీ రమాసీత

No comments: