all

Monday, November 26, 2012

రుచికరమైన రవ్వ పులిహోర

ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో పులిహోర విరివిగా చేస్తుంటారు. చాలా సింపుల్ గా అతి తక్కువ సమయంలో తయారు చేయగల టిఫ్ బాక్స్ టిఫిన్ రవ్వ పులిహోర ‘పులిహోర'అన్నంతోనే చేయాలా? లేకపోతే అది పులిహోర కాదంటారా? అయో..! పులిహోర అన్నంతో కాకుండా ఉప్మారవ్వ, సేమ్యా, గోధుమరవ్వ, బియ్యంనూక, అటుకులు వగైరా వాటితో కూడా చేసుకోవచ్చు. వెరయిటీగా ఉంటుంది. రుచిగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఉప్మారవ్వ లేదా బొంబాయి రవ్వతో పులిహోర చేసే విధానం తెలుసుకుందాం. కొంచెం జాగ్రత్తగా చేస్తే అన్నంలాగే పొడి పొడిగా రవ్వ పులిహోర చేసుకోవచ్చు.
కావలసిన వస్తువులు:
రవ్వ: 2cups
నిమ్మకాయ: 1
ఉల్లిపాయ: 1(అవసరమైతే)
ఎండుమిరపకాయలు: 3
పచ్చిమిర్చి: 4
ఆవాలు: 1 tsp
జీలకర్ర: 1/4 tsp
శెనగపప్పు, మినప్పప్పు: 1 tsp
కరివేపాకు: 2రెబ్బలు
పసుపు: 1/4 tsp
ఉప్పు: తగినంత
నెయ్యి: 2 tbsp
నూనె: 3 tbsp
Easy Tasty Rava Pulihora With Lemon
తయారు చేయు విధానం:
1. ముందుగా స్టౌ మీద పాన్ పెట్టి అందులో ఒక చెంచాడు నెయ్యి వేసి వేడి చేసి చిన్న మంటపై రవ్వను కమ్మటి వాసన వచ్చేవరకు వేయించాలి.
2. తర్వాత రవ్వను తీసి పక్కన పెట్టి అదే ప్యాన్ లో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి, శెనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, వేసి కొద్దిగా రంగు మారేవరకు వేయించాలి.
3. ఇప్పుడు అందులో పసుపు వేసి రెండు కప్పుల రవ్వకు ఒకటిన్నర కప్పు నీళ్లు పోసి తగినంత ఉప్పువేసి మరిగించాలి. మంట తగ్గించి మరుగుతున్న నీళ్లలో రవ్వ మెల్లిగా పొస్తూ ఉండలు కట్టకుండా కలుపుతో ఉండాలి. మూతపెట్టి కొద్దిసేపు మగ్గనివ్వాలి.
4. ఆ తరవాత గరిటతో మొత్తం రవ్వను పొడిపొడిగా చేయాలి. నీళ్లు ఎక్కువగా పోస్తే మెత్తగా ఉప్మాలా అవుతుంది. అందుకే ఇక్కడ జాగ్రత్తపడితే చాలు. ఇందులో నిమ్మరసం పిండి, కొంచెం కొత్తిమిర, నెయ్యివేసి బాగా కలిపి పదినిమిషాల తరవాత వడ్డించాలి. అంతే రవ్వ పులిహోర రెడీ..

No comments: