all

Thursday, November 22, 2012

అధిక పరిమళం..ఎక్కువ పూలు...!

మొక్కలు పెంచడంలో చాలా మందికి అవగాహన వుండదు. అయితే వారికి మొక్కలు పెంచుకోవాలనే ఆసక్తి మాత్రం ఉంటుంది. అలాంటి వారు ఇంటి దగ్గర కుండీలలో ఎటువంటి మొక్కలు పెరుగుతాయి. పెరడులో, భూమిలో నాటే మొక్కలు ఎలా పెరుగుతాయనే వాటి మీద పూర్తి అవగాహన చేసుకొన్న తర్వాత మొక్కలు పెంచుకోవడం మంచిది. కొన్ని మొక్కలకు నీరు మితంగా కావాలి. మరికొన్ని మొక్కలకు ఎండ మితంగా కావాలి. మరికొన్ని మొక్కలు నీరు, సూర్య రశ్మి రెండు అవసరం. ఇలా ఎన్నో రకాలుగా మొక్కలు ఆధార పడి పెగుతుంటాయి. కాబట్టి వాటి గురించి తెలుసుకొని తర్వాత మొక్కలు తెచ్చుకొని పెంచుకోవాల్సి ఉంటుంది.
ఇంటి దగ్గర పెంచుకొనే పూల మొక్కలు చాలా ఉన్నా.. కుండీల్లో పెంచుకొనే మొక్కలు పెరిగే విధానం.. భూమిలో నాటినటువంటి మొక్కలు పెరిగే విధానంలో చాలా వత్యాసం వుంటుంది. ఏ మొక్కకు అయినా ప్రతి రోజూ నాలుగైదు గంట సేపు సూర్య రశ్మి అవసరం అవుతుంది. ముఖ్యంగా మొక్కలకు ఉదయం పడే ఎండ చాలా మంచిది. సాయంత్రం అయినా సరే. ముఖ్యంగా ఎండ తగలాల్సింది ఆకులకు, కాబట్టి ఇట్లో పెంచుకొనే సన్నజాజి వంటి తీగ మొక్కకు కుండీ ఎక్కడ పెట్టినా ఇబ్బంది ఉండదు.

How Grow Indoor Jasmine Plant
సన్నజాజి తీగ పెంచడానికి పెద్దకుండీలో 10-15 కిలోల పాట్ మిక్చర్ (ఒక భాగం మట్టి, ఒక భాగం వర్మీ కంపోస్ట్ లేదా కంపోస్ట్ ఒక భాగం లీఫ్ మోల్డ్ మిశ్రమం) నింపి మొక్క నాటాలి. మొక్క ఎదిగే కొద్దీ పైకి అల్లుకోవడానికి వీలుగా చైన్ లింక్స్ కట్టాలి. తీగను గోడకు లేదా కిటికీకి అల్లించుకోవచ్చు. అల్లించాల్సిన చోట ఇనుప రాడ్ తో గట్టి ఫ్రేమ్ ఏర్పాటు చేసి చైన్ లింక్స్ లేదా జాలీ అమర్చాలి. దీనిని వర్టికల్ గార్డెన్ అంటారు. సాధారణంగా ఎండ దక్షిణం, పడమర దిక్కుల్లో పడుతుంది. కాబట్టి ఇంటికి ఈ దిక్కుల్లోనే ఇలాంటి తీగలను పెంచుకుంటే చెట్టు బాగా పెరుగుతుంది, ఇంటికి ఎండ తాకిడి తగ్గుతుంది కూడ.
మొక్కలను ఎంతగా కత్తిరించినా మొక్కకు నష్టం ఉండదు. అయితే కత్తిరించిన తర్వాత పేడ నీరు, ఆకుల కషాయం, వేపనూనె కలిపిన నీరు... వీటిలో ఏదో ఒక దానిని స్ప్రే చేయాలి. సాధారణంగా గులాబీ వంటి కాండం గట్టిగా ఉన్న మొక్కలకు ప్రూనింగ్(కత్తిరించడం) చేసినప్పుడు కత్తిరించిన చోట పేడనీటిని రాయడం లేదా చిన్న పేడ ముద్దను అద్దడం చేస్తాం. సన్నజాజి వంటి చెట్ల కొమ్మలు సన్నగా ఎక్కువ మోతాదులో ఉంటాయి కాబట్టి ప్రతి కొమ్మకూ పేడనీటిని రాయడం సాధ్యం కాదు. అందుకే మిశ్రమాన్ని స్ప్రేయర్‌లో పోసి స్ప్రే చేయాలి.
సన్నజాజికి సీజన్‌తో సంబంధం లేదు. ఎప్పుడైనా నాటవచ్చు. వారానికోసారి లేదా రెండు వారాలకోసారి మల్చింగ్(మల్చింగ్ అంటే మట్టిపై పొరను గుల్లబరచడం, ఈ క్రమంలో మట్టి గుల్లబారడం, పోషకాలు మొక్కకు బాగా పట్టడంతో పాటు కలుపు మొక్కలు నశిస్తాయి. సాధారణంగా కలుపుమొక్కలు మట్టిలోని పోషకాలను పీల్చుకుని పెరుగుతాయి. మట్టిని కలబెట్టినప్పుడు అవి మట్టిలో కలిసిపోయి తిరిగి మొక్కకు పోషకంగా మారుతాయి) చేస్తే మంచిది. ఎంతగా మల్చింగ్ చేస్తే మొక్క అంత ఆరోగ్యంగా ఉంటుంది.

No comments: