వేసవిలో ఇంట్లో మొక్కలు వాడిపోకుండా ఆరోగ్యంగా పెరగాలంటే సహజ ఎరువులను ఎంపిక చేసుకోవాలి. ఇందుకోసం ఇంట్లో వ్యర్థాలనే సహజ ఎరువులుగా వాడవచ్చు. మిగిలిపోయిన కాఫీపొడి మొక్కలకు చక్కటి ఎరువుగా ఉపయోగపడుతుంది. వాడిన కాఫీ పొడికి నాలుగు కప్పుల నీళ్లు చేర్చి, మొక్కలకి పోస్తే ఆరోగ్యంగా ఉంటాయి. నెలకొకసారి చల్లటి టీ డికాషన్‌కు ముప్పావుభాగం నీటిని కలిపి మొక్కల మొదళ్లలో పోసినా మంచి ఫలితం కనిపిస్తుంది.
విరిగి పోయిన పాలను వృధాగా పారబోయకుండా వాటికి నాలుగురెట్లు నీటిని కలిపి చెట్ల వేళ్లు తడిసేలా పోస్తే వాటికి మంచి పోషణ లభిస్తుంది. అయితే తరచుగా ఇలా చేయకుండా ఓ పదిరోజులకొకసారి చేస్తే మంచిది. న్యూస్ పేపర్‌లో కాఫీ గింజలను ఉంచి, పొట్లంలా చుట్టి మొక్కల మొదళ్లవద్ద ఉంచాలి. ఇలా చేస్తే కాఫీ గింజల్లోని రసాయనాలను వేర్లు పీల్చుకున్నాక పేపర్లు ఎండిపోతాయి. అప్పుడు వాటిని తీసేస్తే సరిపోతుంది. కాఫీ గింజలద్వారా మొక్కలకు మెగ్నీషియం, పొటాషియం మెండుగా లభిస్తాయి.
కోడిగుడ్డు పెంకులను కూడా ఎరువుగా వాడుకోవచ్చు. పెంకులను చిదిమి కుండీలలో వేయాలి. ఇలా చేస్తే కోడిగుడ్డు పెంకులోని పొటాషియం, క్యాల్షియం మొక్కలకు పుష్కళంగా అందుతాయి. అలాగే గుప్పెడు పెంకులను ఓ బకెట్ నీటిలో వేసి, ఓ గంటపాటు మరిగించి, ఎనిమిది గంటల తరువాత బాగా చల్లబడ్డాక ఆ నీటిని మొక్కలకు పోస్తే, వాటికి చాలం బలం అందుతుంది.
[ మీ వ్యాఖ్య రాయండి ]